భౌతికాతీత కోణాన్ని సజీవం చేయడమే యోగ

26 Apr, 2015 01:04 IST|Sakshi
భౌతికాతీత కోణాన్ని సజీవం చేయడమే యోగ

యోగా
యోగా అంటే బరువు తగ్గటం కోసమో, సన్నబడటం కోసమో, నడుమునొప్పి, తలనొప్పి తగ్గటం కోసమో చేసేది కాదు. యోగా చేస్తే అవన్నీ ఎలాగూ జరుగుతాయి - మీరు ఎలాగూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ప్రేమగా, సున్నితంగా తయారవుతారు. కానీ అవన్నీ యోగా వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. అవి యోగా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. మీరు బరువు తగ్గటానికి యోగా చేయనవసరం లేదు. అందుకోసం మీరు కొంచెం వివేకంతో తింటే, టెన్నిస్ ఆడితే లేదా ఈత కొడితే సరిపోతుంది.

భౌతికాతీతమైన కోణాన్ని మీలో సజీవం చేయటమే యోగ యొక్క ముఖ్య ఉద్దేశం. అది సజీవమైనప్పుడు మాత్రమే ఈ సృష్టి మెల్లిగా అనేక విధాలుగా మీకు అందుబాటులోకి వస్తుంది. భౌతికాతీతమైన కోణం మీలో సజీవం అవ్వటం వల్ల మీరెప్పుడూ ఊహించనటువంటి విషయాలు కూడా మీ జీవితంలో యథార్థాలుగా మారతాయి.
 
మీరు యోగ చేస్తుంటే, అధికంగా ఉన్న బరువు కచ్చితంగా తగ్గుతుంది. ఉదాహరణకు, కొందరు క్రియ యోగా మొదలుపెట్టినప్పుడు బరువు తగ్గుతారు, మరికొందరు బరువు పెరగటం మొదలుపెడతారు. మీ జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, మీరు క్రియలు చేయడం మొదలుపెట్టినప్పుడు... మీ జీర్ణ శక్తి ఉత్తేజితం అవుతుంది. మీ జీర్ణశక్తి మెరుగవటం వల్ల, ఆహారం మాంసంగా మారటం మరింత సమర్థవంతంగా జరుగుతుంది. అందువల్ల మీరు బరువు పెరగటం మొదలు అవుతుంది.

మీ జీర్ణశక్తి ముందే బాగుండి, మీరు క్రియలు చేయటం మొదలుపెడితే, అప్పుడు కూడా ఆహారాన్ని ఉపయోగించుకునే మీ సామర్థ్యం మరింత మెరుగవుతుంది. కానీ ఆహారం అప్పుడు మాంసంగా కాకుండా, ఒక సూక్ష్మమైన శక్తిగా మార్చబడుతుంది. అప్పుడు మీరు ఎంత తిన్నా మీ బరువు తగ్గుతూనే ఉండటమే మీరు గమనిస్తారు.అదే మరోవిధంగా కూడా జరగవచ్చు. మీరు తీసుకునే ఆహారం నాటకీయంగా తగ్గిపోవచ్చు. కానీ మీరు బరువు తగ్గకపోవచ్చు. మనలో ఆహారం రూపాంతరం చెందే నిష్పత్తి మారటం వల్లే ఇలా జరుగుతుంది.
 
యోగా మీ వ్యవస్థను పునరుత్తేజితం చేసి, మీ విజ్ఞతను పెంపొందిస్తుంది. అందువల్ల మీరు అతిగా తినరు. మీ శరీరంలో కొంత స్థాయి అవగాహన రాగానే, దానికి అవసరమైనంతే తినేటట్లుగా అది మారుతుంది. మీరు మీ జీవితాన్ని నియంత్రించటం వల్లనో లేక ఎవరో మీకు డైటింగ్ చేయమని చెప్పటం వల్లనో ఇది జరగదు. మీరు వ్యాయామం లేక డైటింగ్ చేస్తున్నారంటే, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.

యోగా సాధన చేస్తే, మిమ్మల్ని మీరు నియంత్రించుకునే అవసరం ఉండదు. మీరు కేవలం సాధన చేయండి. ఇది మీ వ్యవస్థను ఎలా చూసుకుంటుంది అంటే అది మిమ్మల్ని మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తిననివ్వదు. యోగా చేయడానికి, బరువు తగ్గటానికి చేసే మిగతా పనులకి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే!
ప్రేమాశీస్సులతో,సద్గురు
- సద్గురు జగ్గీ వాసుదేవ్
 www.sadhguru.org

మరిన్ని వార్తలు