కరెంటు పోయిందని..! 

19 Aug, 2018 01:20 IST|Sakshi

ఇది మీ పేజీ

కాసేపటికి కరెంటు వచ్చింది. వెలుగుని తెచ్చింది. చూస్తే నిజంగానే అతనికి మెడకింద భాగం నుంచి ఛాతీభాగం వరకూ చొక్కామీద దుమ్ము. అతను దులుపుకుంటూ గొణుక్కుంటున్నాడు – ‘ఎవడ్రా పోసింది! ఏమిటీ కోతిపని’.


ప్రతిమనిషి జీవితంలో ఎన్నో అనుభవాలు. ఎన్నో జ్ఞాపకాలు. సంతోషపెట్టేవి కొన్ని, బాధపెట్టేవి కొన్ని, నవ్వుకునేవి కొన్ని, ఆలోచిస్తే కాని అర్థం కానివి కొన్ని, అర్థమయ్యేవి కొన్ని, అర్థం వెతకాల్సినవి కొన్ని.. ఇలా ఎన్నో...ఇక నా విషయానికొస్తేస్కూల్‌లో ఉండగా పరీక్షలు దగ్గర పడుతున్నపుడు ఒక్కోసారి, ఇప్పుడు తలుచుకుంటే అంత వెర్రితనం ఏమిటా అనుకునే పని చేసేవాడిని. మూడురాళ్లు తీసుకొని ఒక స్థంభానికి కొంచెం దూరంగా నిలబడి దానికి గురి చూసి కొట్టేవాడిని. వాటిలో ఒక్కటి తగిలినా నేను పరీక్షలు పాసవుతాను అనుకొని. ఒకటి తగలడంతోనే ఆనందించేవాడిని. అది నాకు తెలియకుండానే నాకు నేను ఇచ్చుకునే బలమేమో తెలియదు మరి! అయితే ఇందులో మరో మతలబు ఉంది. ఒకవేళ మూడూ తగలకపోయినా నిరుత్సాహపడేవాడిని కాదు. మళ్లీ మూడు తీసుకుని ‘ఇప్పుడు అసలు మొదలు’ అనుకునేవాడిని. ఈ ‘అసలు మొదలు’ ఒక రాయి తగిలేవరకూ కొనసాగేది.ఒక విషయం ఒకరికి మామూలుగా, ఇంకొకరికి కిందపడి నవ్వేలా ఎందుకు చేస్తుందో నాకెప్పటికీ ఆశ్చర్యమే. కాలేజీలో చదివే రోజుల్లోదీ జ్ఞాపకం. ముళ్లపూడి వెంకటరమణ గారి కథ ‘ఆకలి ఆనందరావు’ చదివాను. బాగుందనిపించింది. చాలా బాగుందనిపించింది. బాధనిపించింది కూడా ఆనందరావు స్థితికి. అలా అనేం చెప్పలేదు కాని ఈ కథ బాగుంది చదవమని నా రూమ్‌మేట్‌ ఒకతనికిచ్చాను. కథ చదువుతూ మధ్యలో ఆపి కిందపడి నవ్వడం మొదలెట్టాడు. ఇంతకీ ఆ సందర్భం ఏమిటంటే, ఆ కథలో ఆనందరావు ఒక చెట్టుకింద నిలబడి ఉంటాడు. అతని భుజం మీద ఒక కాకి రెట్టేస్తుంది. దాని పక్కనున్న కాకికి ఈ విషయం చెప్పి సంబరపడుతుంది. ఆనందరావు ఏం మాట్లాడకుండా వెళ్లి కడుక్కొచ్చుకొని అదే చెట్టుకింద నిలబడతాడు. అదే కాకి మళ్లీ రెట్టేస్తుంది. అప్పుడు కూడా అతను పైకి చూడకుండా అలా కడుక్కోవడానికి వెళుతుంటాడు. అప్పుడు ఆ కాకి, పక్కనున్న కాకితో, ‘ఎంత టెక్కో చూడతనికి. పైకి చూడనేలేదసలు’ అంటుంది.  ఈ కథలోని ఈ సన్నివేశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అతని నవ్వుని ఆపడం కష్టమయ్యేది. ఇంతకీ ఈ విషయాలన్నీ నేను చెప్పదలుచుకున్న ఒక జ్ఞాపకానికి స్టార్టర్లు. 

అదేమిటంటే... 
మా ఊళ్లో లైబ్రరీ కమ్‌ పంచాయతీ ఆఫీసులో ఒక రేడియో ఉండేది. స్పీకర్లు బయటికి ఉండేవి. కొన్ని నియమిత సమయాల్లో రేడియో పెట్టేవాడు ఉద్యోగి. ముఖ్యంగా సాయంత్రాలు. వ్యవసాయదారులకు ప్రత్యేకంగా వార్తలు కూడా ఉండేవి. ఇంకా పాటలు వగైరా. ఆ స్పీకరు కింద పెద్ద అరుగు. ఆ అరుగుమీద కొంతమంది కూర్చునీ, కొందరు నిలబడీ పిచ్చాపాటీ మాటలు సాగుతుండేవి. రేడియో ప్రసారాలు అయ్యాక కూడా మా మధ్య ఒకసారి అలాగే మాటలు సాగుతుండగా కరెంటు పోయింది. అమావాస్య అనుకుంటాను. కటిక చీకటి. నిలబడి ఉన్న వాళ్లలో ఒక మిత్రుడు ‘రేయ్‌! నా మీద దుమ్ము పోసాడ్రా ఎవడో’ అన్నాడు ఆ చీకటి నిశ్శబ్దంలోంచి.కాసేపటికి కరెంటు వచ్చింది. వెలుగుని తెచ్చింది. చూస్తే నిజంగానే అతనికి మెడకింద భాగం నుంచి ఛాతీభాగం వరకూ చొక్కామీద దుమ్ము. అతను దులుపుకుంటూ గొణుక్కుంటున్నాడు – ‘ఎవడ్రా పోసింది! ఏమిటీ కోతిపని’ అంటూ కోపంగా, చిరాగ్గా. ఎవరూ మాట్లాడలేదు. అతను దుమ్ము దులుపుకున్నాడు. మళ్లీ మామూలుగా మాటల్లో పడ్డాం. కాసేపటికి మళ్లీ కరెంటు పోయింది. అదే వ్యక్తి ఇందాక అరిచినట్టే మళ్లీ అరిచాడు – ‘రేయ్‌! నా మీద దుమ్ము పోసాడ్రా ఎవడో’. మళ్లీ తిట్టుకుంటూ దులుపుకున్నాడతను. ఎవరిలా చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఆలోచిస్తూనే ఉన్నాం. ఉన్నట్టుండి ఒక మిత్రుడు ‘అది నేనే పోశా’ అన్నాడు. అందరం ఆశ్చర్యంగా చూశాం అతనివంక. మరో మిత్రుడు అడిగాడు – ‘మీ మధ్య గొడవలు కూడా ఏం లేవు కదరా! ఎందుకు పోశావు?’ అని.ఆ మిత్రుడు చాలా సాదాసీదాగా, ‘కరెంటు పోయిందిగా!’ అన్నాడు నవ్వేస్తూ.
– వేమూరి సత్యనారాయణ, హైదరాబాద్‌.  

మరిన్ని వార్తలు