శ్రీవారి సాక్షిగా... కల్యాణమస్తు!

6 Oct, 2013 02:26 IST|Sakshi
శ్రీవారి సాక్షిగా... కల్యాణమస్తు!

భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరి వంటిది వివాహ వ్యవస్థ. పవిత్రమైన ఈ వివాహ బంధం పటిష్టతకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టి పునాదులు వేసింది. పెళ్లి వేడుకల వల్ల పేద కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఏడుకొండల వాడి ఆశీస్సులతో ఇప్పటివరకూ ఏడడుగులు వేసిన జంటలు వేలల్లో ఉన్నాయి.
 
 సనాతన హైందవ ధర్మాలను విస్తృతం చేయటమే తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యం. ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలను ఆరంభించి... ధర్మప్రచారం, శ్రీనివాసుని వైభవం, భక్తితత్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటంలో టీటీడీ సఫలీకృతమవుతోంది. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా హిందూ వివాహ వ్యవస్థకు గట్టి పునాది వేసింది. పెళ్లి వేడుకల పేరుతో పేద కుటుంబాలు ఆర్థికంగా మరింత కుంగిపోకూడదని భావించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి... రాష్ట్రంలోని పేదల్ని వివాహ బంధంతో ఒక్కటి చేయాలని సూచన చేశారు. దాంతో అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 
 శ్రీవారి సాక్షిగా కలసిన బంధాలు!
 శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యాశీస్సులతో 2007 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఆరు విడతల్లో  45,209 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. 10 తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా 21,198 మంది ఒక్కటవగా, తొమ్మిది జిల్లాలు కలిగిన కోస్తాంధ్రలో  17,307 జంటలు, రాయలసీమ ప్రాంతంలో మొత్తం 6,704 జంటలు వివాహం చేసుకున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 7 వేల వివాహాలు జరిగాయి. సామూహికంగా నిర్వహించిన ఈ కల్యాణమస్తులో ఒక్కో వివాహానికి టీటీడీ రూ.7 వేలు ఖర్చు చేసింది.
 
 పెళ్లికి అవసరమైన పూజా సామగ్రి నుంచి పసందైన విందు భోజనం వరకు అన్నీ ధార్మిక సంస్థే ఉచితంగా అందజేసింది. నూతన వధూవరులకు ఇచ్చిన బంగారు తాళిబొట్లు, వెండి మట్టెలు, కంకణాలు,  వధూవరులకు నూతన వస్రాలు, పూజా సామగ్రి, ధార్మిక స్తోత్ర పుస్తకాలకు తిరుమల ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద, ఆ తర్వాత లోకమాత తిరుచానూరు అలమేలుమంగమ్మ పాద పద్మాల చెంత పూజలు చేసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని టీటీడీ కల్యాణమండపాల్లోనూ, ఆలయాల్లోనూ వివాహ తంతును వేడుకగా నిర్వహించారు. వధూవరుల బంధువులకు ఉచిత విందు భోజనాన్ని స్వామి ప్రసాదంగా టీటీడీ సమకూర్చింది. తర్వాత వధూవరులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించి  ఆశీస్సులు అందించింది.  
 
 పేద కుటుంబాల్లో ఆనందోత్సాహం
 పేదల పక్షపాతి అయిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరణ, తిరుమలేశుని ఆశీస్సులతో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ కల్యాణమస్తు ద్వారా ఒక్కటైన పేద కుటుంబాలు నేడు పిల్లాపాపలతో కళకళలాడుతున్నాయి. సంతానం, సౌభాగ్యం, ఆనందోత్సాహాలతో వారి జీవితాలు వర్థిల్లుతున్నాయి. శ్రీనివాసస్వామి, పద్మావతి అమ్మవారి దీవెనలతో పెళ్లి కావటం వల్ల తమకు పుట్టిన సంతానానికి శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, మహాలక్ష్మి, పద్మావతి అంటూ వారి పేర్లు పెట్టుకుని మురిసిపోతున్నారు. మరికొందరైతే రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో తమ కొడుకులకు ఆయన పేరు పెట్టుకున్నామని ఆనంద వ్యక్తం చేస్తున్నారు.
 
 ‘‘ఏడుకొండలవాడి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నాం. స్వామి పాదాల వద్ద ఉంచిన తాళిబొట్లు, మట్టెలు, బట్టలు కానుకగా అందాయి. మాకిప్పుడు ఇద్దరు పిల్లలు... షర్మిల, శ్రావణి’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు పశ్చిమగోదావరి జిల్లా కాపవరంలో పేద వర్గానికి చెందిన వీర్రాజు, స్వాతి. ‘‘రాజన్న చల్లని దీవెనలతో మా పెళ్లి  విశాఖపట్నం టీటీడీ కల్యాణమండపంలో జరిగింది. మాలాంటి వారు ఇబ్బంది పడకూడదనే రాజశేఖరరెడ్డిగారు ఈ కార్యక్రమాన్ని పెట్టించారు. మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయనకు, ఏడుకొండలవాడికి రుణపడి ఉన్నాం’’ అన్నారు కొత్త పరదేశిపాళెం నివాసి, ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌లో క్యూరేటర్‌గా పనిచేస్తున్న కృష్ణారావు, ఆయన భార్య రామలక్ష్మి.
 
 వీళ్లు మాత్రమే కాదు... కళ్యాణమస్తు ద్వారా వైవాహిక బంధాన్ని ముడి వేసుకున్నవారు ఎందరో ఉన్నారు. వారందరూ చెప్పేది ఒక్కటే. ఏడుకొండలవాడి ఆశీర్వాదం, రాజన్న అండ లేకుంటే మేమిలా ఉండేవాళ్లం కాదు అని!
 శుభమస్తు... కళ్యాణమస్తు..!
 
 ఆరువిడతల్లో జరిగిన  కల్యాణమస్తు వివరాలివి
 
 1.    2007, ఫిబ్రవరి 22న    4658
 2.    2007, ఆగస్టు 26న    8113
 3.    2008, మార్చి 9న    6373
 4.    2008, నవంబరు2న    7090
 5.    2009- అక్టోబరు 28న    7724
 6.    2011 మే 20న    11,251
      మొత్తం    45,209

మరిన్ని వార్తలు