వందే గురు పరంపరామ్

31 Aug, 2014 00:27 IST|Sakshi
వందే గురు పరంపరామ్

వివరం: యుగయుగాలుగా వర్ధిల్లుతున్న భారతీయ సంస్కృతిలో గురుస్థానం చాలా ప్రధానమైనది. ‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ’ అనే వేద వాక్యం క్రమ పరిణామ దశలో బుద్ధి వికసించే సమయానికి ఆచార్యుడే దేవుడౌతున్నాడు. ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు, బోధకుడు, శిక్షకుడు మొదలైనవి పర్యాయపదాలుగా కనపడినప్పటికీ వాటికి వేరువేరు అర్థాలు ఉన్నాయి. దగ్గర కూర్చోబెట్టుకొని చదువు చెప్పేవారిని ఉపాధ్యాయుడు అంటారు.
 
గురు శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంది. చదువు చెప్పేవారే కాక, తల్లిదండ్రులు, పెద్దలు, పూజనీయులు, హితం చెప్పేవారు... అందరినీ గురు శబ్దంతో గౌరవించాలి. సక్రమంగా చేయవలసిన విధివిధానాలను, ఆచారాలను శాసించి ఆచరింపజేసేవారు ఆచార్యులు. బోధ చేసేవాడు బోధకుడు. శిక్షణ ఇచ్చేవారు శిక్షకుడు. వీరందరినీ సమానంగా సూచించే పదం గురువు. భారతీయ సంస్కృతికి ప్రధాన గ్రంథాలైన భారత, భాగవత, రామాయణాలను పరిశీలిస్తే, ప్రసిద్ధులైన గురువులు, వారి నుంచి మనం తెలుసుకోవలసిన వ్యక్తిత్వ వికాస లక్షణాలు ఎన్నో ఈ తరానికి ఉపయోగపడతాయి.
 
రామాయణ గురువులు
 త్రేతాయుగం నాటి రామాయణం మనకు ఆదికావ్యం. రామాయణం పేరు వినగానే గుర్తొచ్చే గురువు వశిష్ఠుడు. ఈయన ఇక్ష్వాకు వంశానికి తరతరాలుగా గురువు. రామ, లక్ష్మణ, భరత, శతృఘు్నలకు నామకరణం చేసి, విద్యాబుద్ధులు నేర్పించి, వేదాలు, శాస్త్రాలు ఆయన నేర్పిస్తే, ధనుర్వేదం మొదలైన యుద్ధ విద్యలను దశరథ మహారాజు పర్యవేక్షణలో నేర్చుకున్నారు. రామావతారం ఆరంభం నుంచి పరిసమాప్తి వరకు వశిష్ఠుడు గురు స్థానంలో ఉన్నాడు. ఏనాడూ ఆయన వారి నుంచి దక్షిణలు ఆశించలేదు. విద్యాబుద్ధులతో, వినయ విధేయతలతో సర్వజన హితంగా, సద్గుణాలతో మానవ జీవితం ఎలా వికసించాలో శ్రీరాముని ద్వారా లోకానికి చాటిచెప్పిన గురువు వశిష్ఠుడు. విద్యార్థికి మరొక పేరు శిష్యుడు. అనగా గురువు చేత శాసింపదగిన వాడు. విద్యార్థి గురువు చెప్పినది భక్తిశ్రద్ధలతో విని, చెప్పినది చేయాలి. గురువు యందు పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి.
 
శ్రీరాముని పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించినవాడు వశిష్ఠుడే. కానీ ఆ ముహూర్తానికి రాముడు అరణ్యవాసానికి వెళ్లవలసి వచ్చింది. అంతమాత్రంతో వశిష్ఠుణ్ని తక్కువగా భావించలేదు. రాక్షస సంహారం రామావతార ప్రయోజనం కనుక, రాముణ్ని అరణ్యవాసానికి పంపటానికే బ్రహ్మర్షి వశిష్ఠుడు ఆ ముహూర్తం పెట్టాడని రాముడికి తెలుసు. అరణ్యవాసంలో అరుంధతీ వశిష్ఠుల సత్కారాలను, హితబోధనలను సీతారామలక్ష్మణులు పొందారు. యోగవాసిష్ఠంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వశిష్ఠ మహర్షి రామునికి బోధించాడు. చివరకు పట్టాభిషేకం కూడా జరిపించాడు. అభిప్రాయ భేదాలు లేని గురుశిష్య సంబంధానికి వశిష్ఠుని గురుత్వం ఆదర్శం.
 
రామాయణంలో మరొక గురువు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. రామునికి పద్నాలుగు, పదిహేనేళ్ల వయసులో యాగ సంర క్షణ పేరుతో దశరథుని అనుమతితో రామలక్ష్మణులను విశ్వామిత్రుడు వెంటబెట్టుకొని అడవికి తీసుకెళ్లాడు. సంచార విద్యాబోధన పద్ధతిలో ఆయా ప్రదేశాలను, ఆశ్రమాలను చూపిస్తూ, వాటి వృత్తాంతాలన్నీ వివరించాడు. తరగతి గదుల్లో పుస్తక పరిజ్ఞానం వస్తే, పర్యటనతో ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. దేశాన్ని పరిపాలించబోయేవాడు దేశం నలుమూలలా ఎక్కడ ఏముందో తిరిగి తెలుసుకోవాలి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు రాజభవనం లో కాక, ప్రజల్లో తిరిగి పరిశీలించాలి. యుద్ధవిద్యలు అభ్యాసం చెయ్యటమే కాక, అనుభవంలోకి రావాలి.

గతంలో పరిపాలనానుభవం ఉన్న రాజర్షిగా విశ్వామిత్రుడు ఇన్ని కోణాలలో రామునికి గురువైనాడు. స్త్రీ సంహారం అధర్మమైనా, తాటకి వంటి దుష్ట స్త్రీలను శిక్షించడం తప్పుకాదని వివరించాడు. అహల్య వంటి ఆర్తులను ఆదుకోవటం పర్యటనలోనే సాధ్యమని చూపించాడు. తన పూర్వజీవితంలోని తప్పొప్పులను దాచకుండా చెప్పటం ద్వారా దాపరికం లేని వ్యక్తిత్వ వికాసాన్ని బోధించాడు. ముందుగా చెప్పి మానసికంగా ఒత్తిడి పెట్టకుండా, మిథిలా నగరానికి చుట్టపు చూపుగా తీసుకువెళ్లి, శివధనుర్భంగం చేయించి, సీతారాములను కలిపాడు. అప్పటివరకు తెలియని ఎన్నో అస్త్ర విద్యలను రామునికి బోధించాడు. రామాయణంలో విశ్వామిత్రుడు ఉపాధ్యాయుడు, గురువు, ఆచార్యుడు, బోధకుడు, శిక్షకుడు అన్నీ తానే అయి, రాక్షస సంహారానికి రంగం సిద్ధం చేసిన ఆదర్శగురువు.
 
 రామాయణంలో మరొక గురువు సూర్యభగవానుడు. ఇక్ష్వాకు వంశానికి మూలపురుషుడు, కర్మసాక్షి, గ్రహాధిపతి అయిన సూర్యుడు... తన కర్తవ్యాన్ని తాను ఆచరిస్తూనే, తనతో తిప్పుకుంటూ విద్యలు బోధించిన ఉత్తమ ఉపాధ్యాయుడు. చిన్ననాడే పండు అనుకొని, తనను మింగటానికి వచ్చి నోరు కాల్చుకున్న చిలిపి హనుమంతుని కృషి, పట్టుదల, కార్యదీక్ష గమనించిన సూర్యుడు... ఉదయం నుంచి అస్తమయం వరకు తనతో ఎగిరే శక్తిశాలి అయిన ఆంజనేయుణ్ని, ఎన్నో వ్యాకరణాలు నేర్చిన బుద్ధిశాలిగా తీర్చిదిద్దాడు. మంచి వక్తగా, పరిశీలనా దక్షునిగా, కార్యసాధకునిగా ఒక విద్యార్థిని సానబెట్టిన ఘనత సూర్యునికే చెల్లుతుంది.
 
 గురువుగారితో తూర్పు నుండి పడమరకు ఆగకుండా తిరిగిన సామర్థ్యంతోనే హనుమ సముద్రం దాటి, లంకకు వెళ్లగలిగాడు. చిన్ననాటి గురువుల ప్రభావం విద్యార్థుల భావి జీవితంపై తప్పకుండా ఉంటుందనటానికి ఈ గురుశిష్యులు ఉదాహరణ. రామాయణంలో ఇంకొక సుప్రసిద్ధ గురువు వాల్మీకి మహర్షి. తన ఆశ్రమంలో పుట్టి పెరిగిన లవకుశులకు అమిత వాత్సల్యంతో విద్యాబుద్ధులు నేర్పటమే కాక, సంగీత సాహిత్యాది కళాభినివేశం కూడా కలిగించాడు. దానివల్లనే వారు అయోధ్యకు వెళ్లి, తండ్రిని చూసి, మాట్లాడటం వీలైంది. తల్లిని అడవిలో వదిలిన తండ్రిపై వారికి పగ, ద్వేషం పెరగకుండా లలిత కళలతో వారి వ్యక్తిత్వాన్ని మలచిన వాల్మీకి మహర్షి... నేటి ఉపాధ్యాయ లోకానికి, విద్యాప్రణాళికకు ఆదర్శప్రాయుడు.
 
మహాభారత గురువులు
 పద్దెనిమిది పర్వాలు, లక్షా పాతికవేల శ్లోకాల మహాభారతంలో లోకం అంతా ఉంది. గురువు ఎట్లా ఉండాలో, శిష్యుడు ఎట్లా ఉండాలో, ఎట్లా ఉండకూడదో చెప్పే ఎన్నో ఉదాహరణలకు ఆలవాలం మహాభారతం. ఉదంకోపాఖ్యానమే గురు శిష్య అనుబంధానికి పరిపూర్ణోదాహరణ. పైల మహర్షి దగ్గర ఉదంకుడు విద్యాభ్యాసాన్ని పూర్తిచేశాడు. గురుదక్షిణ ఇచ్చి వెళ్లాలి. చదువు అయిపోయిందని దక్షిణ ఇవ్వకుండా వెళ్లే శిష్యుడు, ఇస్తానన్నాడని ఎక్కువగా అడిగే గురువు ఇద్దరూ నశించిపోతారని భారత సూక్తి. ఉదంకుడు గురువుగారితో దక్షిణ గురించి ప్రస్తావించాడు. ‘నువ్వు నాకు చాలా సేవ చేశావు. ఏమీ ఇవ్వద్దు. పో’ అన్నాడు గురువు. ‘కాదు కాదు. ఏదో ఒకటి అడగండి’ అన్నాడు ఉదంకుడు. ‘నాకేమీ అక్కర్లేదు. గురుపత్ని ఏవి అడిగితే అవి తెచ్చిపెట్టు’ అన్నాడు గురువు.
 
 ఉదంకుడు గురుపత్నికి ఈ సంగతి చెప్పాడు. ఆమె ‘ఈ దేశపు రాజుగారి భార్య కర్ణాభరణాలు చాలా గొప్పవి. నాలుగు రోజుల్లో మనింట్లో ఒక ఉత్సవం ఉంది. అప్పుడు నేను అవి పెట్టుకోవాలనుకుంటున్నాను. వెళ్లి త్వరగా తెచ్చిపెట్టు’ అంది. ఉదంకుడు రాజధానికి బయలుదేరాడు. దారిలో ఎన్నో వింతలు విశేషాలు జరిగాయి. పౌష్య మహారాజు దగ్గరకు వెళ్లాడు. ఆయన ‘రాణిగారిని అడిగి తీసుకుపో’ అన్నాడు. అపరిశుభ్రంగా ఉన్న ఉదంకుడికి ఆమె కనపడలేదు. శుచి అయిన తరువాత కనపడి, కుండలాలు ఇచ్చింది.
 
 దారిలో వాటిని తక్షకుడనే సర్పరాజు ఎత్తుకుపోయి, పాతాళంలో దాచిపెట్టాడు. వాటికోసం ఉదంకుడు నేల తవ్వుకొని, పాతాళానికి వెళ్లి, అక్కడ ఎన్నో వింతలు చూశాడు. ఒక కొత్త వ్యక్తి సహాయంతో తక్షకుణ్ని భయపెట్టి, కుండలాలు తీసుకొని సమయానికి తెచ్చి గురుపత్నికి ఇచ్చి, ఆమె ఆశీస్సులు పొందాడు. అప్పుడు గురువుగారికి తాను చూసిన వింతలు విశేషాలు చెప్పి, వాటి అర్థాలు అడిగాడు. గురువుగారు అన్నీ వివరించాడు. నీకు సహాయం చేసిన వ్యక్తి ఇంద్రుడు. అతడు నా స్నేహితుడు. అందుకే నీకు సహాయం చేశాడు... అని చెప్పాడు. ఈ కథలో విద్యార్థి ఉదంకుడికి వ్యక్తిత్వ వికాసం, కార్యసాధకత మొదలైన అంశాల శిక్షణ ప్రయోగాత్మకంగా జరిగింది. గురువు వెనుక నుండి గమనిస్తూ, తోడ్పడుతూ సొంతగా, ధైర్యంగా పని సాధించే ఆత్మస్థైర్యాన్ని కలిగించాడు.
 
 మహాభారతంలోని మరొక ప్రసిద్ధ సన్నివేశం ‘కచదేవయానుల కథ’. ఈ కథలో గురువు... దేవయాని తండ్రి శుక్రుడు. శిష్యుడు బృహస్పతి కొడుకు కచుడు. మృత సంజీవనీ విద్య కోసం శుక్రుని దగ్గరకు వచ్చిన కచుడు, ‘ఉత్తమ విద్యార్థి పక్కదారులు పట్టకుండా తన లక్ష్యాన్నిఎలా సాధించాలో’ మనకు చూపించాడు. తన సేవలతో, వినయ విధేయతలతో గురువుకు, గురువుగారి అమ్మాయికి ఆత్మీయుడైనాడు. గురువుగారికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి పుత్రికా వ్యామోహం. రెండు మద్యపాన వ్యసనం. ఈ రెండూ కచుడికి లాభదాయకమైనాయి. లేకపోతే శత్రువర్గంవాడైన కచుడికి మృతసంజీవనీ విద్యను శుక్రాచార్యుడు చెప్పేవాడు కాదు. ఈ కథ ఉత్తమ ఉపాధ్యాయునికి బలహీనతలు, వ్యసనాలు, వ్యామోహాలు ఉండకూడదనే సందేశాన్ని ఇస్తోంది. స్వయంగా శుక్రుడే ‘ఇక ఎవ్వరూ మద్యపానం చెయ్యకండి’ అని చెప్పాడు. ఇది లోకానికి పాఠం. అటువంటి గురువులకు గుణపాఠం.
 
 ప్రధాన భారత కథలో ప్రసిద్ధుడైన కౌరవ పాండవ గురువు ద్రోణాచార్యుడు. గురువులో ఉండవలసిన ప్రధాన గుణం శిష్య వాత్సల్యం. అది లేకుండా ఏ గురువూ సరిగా పాఠం చెప్పలేడు. ఆసక్తి, శక్తి ఉన్న విద్యార్థిని ఉపాధ్యాయుడు కన్నకొడుకు కంటే అధికంగా ప్రేమిస్తాడు, ప్రేమించాలి అని ద్రోణార్జున బంధం చెబుతోంది. అందరి కంటె నిన్ను గొప్పవాడిని చేస్తానని ద్రోణుడు అర్జునునికి మాట ఇచ్చాడు.
 
  ఇచ్చినట్లే తన కొడుకు అశ్వత్థామకు కూడా చెప్పని యుద్ధ విద్యా రహస్యాలు, అస్త్రశస్త్రాలను అర్జునుడికి చెప్పాడు. పరోక్షంగా తనను పూజించి ఏకాగ్రతతో, స్వయంకృషితో విద్యాభ్యాసం చేసి అర్జునుని కన్నా మరింత విజ్ఞానాన్ని పొందిన ఏకలవ్యుడు దాన్ని దుర్వినియోగం చేసి, రాజకుమారుల దృష్టిలో పడ్డాడు. కక్షతో వాళ్లు అతణ్ని ఎప్పటికీ చంపకుండా, బొటనవేలు గురుదక్షిణగా తీసుకొని, చెడ్డపేరు తెచ్చుకున్న శిష్య వత్సలుడైన గురువు ద్రోణాచార్యుడు. కక్షలు, కార్పణ్యాలు గల రెండు వర్గాల విద్యార్థులను తన కనుసన్నల్లో క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయించిన నైపుణ్యం గల గురువు ద్రోణాచార్యుడు.
 
 మహాభారతంలో పైతరం భీష్మునికీ, యువతరం కర్ణునికీ యుద్ధవిద్యలు బోధించిన పరశురాముడు గురువులూ శిష్యులూ గుర్తుపెట్టుకోవలసిన విలక్షణ గురువు. భీష్ముడు పరశురాముని దగ్గర మహేంద్ర పర్వతంపై విద్యాభ్యాసం చేసి, ఆయన ప్రియ శిష్యుడైనాడు. అయినా కాశీరాజు కూతురు అంబకు భీష్ముని వలన అన్యా యం జరిగిందని తెలుసుకొన్న పరశురాముడు, శిష్యుడు చెప్పిన మాట వినకపోవటంతో 24 రోజులు భయంకరమైన యుద్ధం చేసి, ప్రత్యేక పరిస్థితుల్లో విరమించాడు.
 
  తప్పు చేసినవాడు తన ప్రియశిష్యుడైనా, క్షమించకుండా పోరాడిన ధర్మగురువు పరశురాముడు. మరికొంత కాలానికి కర్ణుడు అసత్యం చెప్పి, పరశురాముడి దగ్గర విద్యార్థిగా చేరాడు. విద్యాభ్యాసం పూర్తవుతుండగా, ఒక సన్నివేశంలో కర్ణుని అసత్యం గురువుకు తెలిసింది. ఏ విద్య కోసం అతడు అసత్యం చెప్పాడో, అది అతనికి అవసరమైన సమయంలో గుర్తురాదని శపించాడు. విద్య కోసం అసత్యం చెప్పే వక్రబుద్ధి ఉన్నవాడు, అధర్మం కోసమే దానిని ఉపయోగిస్తాడు. అటువంటి శిష్యుల విషయంలో గురువులు జాలిపడకూడదనే సందేశాన్ని అందిస్తున్నాడు. పరశురాముని ధర్మకాఠిన్యం గురువులకు అవసరం.
 
భాగవత గురువులు
 భక్తుల చరిత్రలు, భగవంతుని చరిత్ర చెప్పే మహాభాగవతం గురుత్వాన్ని, గురుతత్వాన్ని కూడా చెబుతోంది. వామన చరిత్రలో బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. తన శిష్యుడు ప్రమాదంలో ఉన్నాడని కనిపెట్టాడు. కష్టకాలంలో మాట తప్పవచ్చునని కొన్ని ధర్మసూక్ష్మాలు చెప్పాడు. ఏది ఏమైనా నేను మాట తప్పనని గురువును ఎదిరించి, బలిచక్రవర్తి మూడడుగులు దానం చేశాడు. పాతాళానికి తొక్కబడినా ఇప్పటికీ పూజలందుకొంటున్నాడు. గురువు అపకీర్తి అలాగే నిలబడింది. గురువుల, తల్లిదండ్రుల వాత్సల్యం, ప్రేమ పిల్లల విద్యాభివృద్ధికి, ఉత్తమ వ్యక్తిత్వానికీ తోడ్పడాలి కానీ, వారు చెడ్డపనులు చేసినా క్షేమంగా ఉండాలని ప్రోత్సహించరాదని భాగవతం బోధిస్తోంది.
 
 ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదునికి ఇద్దరు గురువులను తండ్రి హిరణ్యకశిపుడు ఏర్పాటు చేశాడు. వారు చండామర్కులు. శుక్రాచార్యుని కొడుకులు. తల్లిదండ్రులు గురువులకు పిల్లల్ని అప్పగించేటప్పుడు ఎలా మాట్లాడాలో హిరణ్యకశిపుని మాటల్లో మనకు తెలుస్తుంది. ‘అయ్యా! మీరు గురువులు. కారుణ్య చిత్తులు,  మాకు పెద్దలు. మా పిల్లవాడు ఏమీ తెలియనివాడు, సరిగా మాట్లాడటం కూడా రాదు. బాగా చదివించి నీతి కుశలురుగా చెయ్యండి’ అని ఇంద్రాది దేవతల్ని, విష్ణుమూర్తిని లెక్కచెయ్యనివాడు కూడా తన దగ్గర బతికే గురువుల దగ్గర పిల్లవాడి కోసం వినయంగా మాట్లాడాడు. ఇందులో గురువుల ప్రధాన లక్షణాలు చెప్పాడు.
 
 భాగవతంలో మరొక ప్రసిద్ధ గురువు జగద్గురువైన శ్రీకృష్ణుని గురువు సాందీపని. బలరామకృష్ణులు, కుచేలుడు మొదలైనవారు ఆయన దగ్గర వేదశాస్త్రాది విద్యలు అభ్యసించారు. గురువు బాధ్యత... పుస్తకాల్లో ఉన్నది విద్యార్థుల బుర్రకెక్కించటం మాత్రమే కాదు. ఆయన ప్రతి మాట, కదలిక విద్యార్థుల వ్యక్తిత్వాన్ని వికసింపజేయాలి. పేదవాడైన ద్రోణుడు, రాజకుమారుడైన ద్రుపదుడు ఒక గురువు దగ్గరే సన్నిహితంగా చదువుకున్నారు. కానీ తరువాత ద్రుపదుడు రాజై, ద్రోణుడు కనపడితే, ‘నువ్వెవరో నాకు తెలీదు’ అన్నాడు.
 
  అలాగే సాందీపని దగ్గర పేదవాడైన కుచేలుడు, శ్రీకృష్ణుడు కలిసి చదువుకున్నారు. ఆ స్నేహాన్ని స్వార్థానికి వాడుకోవాలని కుచేలుడు అనుకోలేదు. వచ్చిన కుచేలుణ్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి, బంగారు పళ్లెంలో కాళ్లు కడిగాడు. ఇది విద్యాలయ ప్రభావం. అలాగే తమకు ఇష్టమైన గురువుగారి కోసం విద్యార్థులు ఎంతటి అసాధ్యమైన పనులైనా చేస్తారు. ద్రోణుని కోసం అర్జునుడు ద్రుపదుణ్ని బంధించి తెచ్చాడు. గురువుగారి అబ్బాయి చనిపోతే బలరామకృష్ణులు యమలోకానికి వెళ్లి, యమునితో పోరాడి, పిల్లవాణ్ని తెచ్చి గురువుగారిని సంతోషపెట్టారు. గురుదక్షిణగా సమర్పించారు.
 
సర్వజ్ఞులు, జగద్గురువులు, సంపూర్ణులు అయిన అవతార పురుషులు బలరామకృష్ణులు గురువుగారి దగ్గర చేరి, ఎందుకు చదువుకున్నారు? మానవులెవరైనా గురు సన్నిధానంలో గురు ప్రబోధితులై తీరాలి. లేదంటే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలగదని లోకానికి తెలియజెప్పటానికే వారు సాందీపని వద్ద చదువుకున్నారు... అని భారత సందేశం. రామాయణ భారత భాగవతాల్లోని ప్రసిద్ధ గురువుల పరిచయంతో భారతీయ విద్యావిధానంలో గురువు ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. గురువులను గౌరవించి, వారి ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిద్దాం.
 - డా॥పాలపర్తి శ్యామలానందప్రసాద్

మరిన్ని వార్తలు