సిగతరగ

27 May, 2018 00:34 IST|Sakshi

మే 31–నో టొబాకో డే

చాలా మంది సిగరెట్‌ మానేస్తున్నారు... మరి మీ సంగతి...?

ప్రపంచవ్యాప్తంగా ధూమపానం తగ్గుముఖం పడుతోంది. ఇదొక ఆశాజనకమైన పరిణామం. ధూమపానం, పొగాకు వాడకం కనుమరుగవలేదు గాని, ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గింది. గడచిన దశాబ్ద కాలంలో దాదాపు అన్ని దేశాల్లోనూ పొగరాయుళ్ల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్లు దాదాపు వంద కోట్ల వరకు ఉన్నారు. పొగరాయుళ్లలో 80 శాతం మంది అల్పాదాయ దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంటున్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు...


పొగాకుతో ‘చుట్ట’రికం
పొగాకుతో ‘చుట్ట’రికం క్రీస్తుపూర్వం 1400 ఏళ్ల నాడే మొదలైంది. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లోని స్థానిక తెగల వారు పొగాకును దేవుని కానుకగా పరిగణించేవారు. వేడుకల్లో పొగతాగేవారు. పొగ చుట్టల నుంచి వెలువడే ధూమమేఘాల ద్వారా తమ ప్రార్థనలు భగవంతుని చేరుకుంటాయని వారు నమ్మేవారు. యూరోపియన్లు అమెరికాలో అడుగుపెట్టడం ప్రారంభమయ్యాక క్రీస్తుశకం 16వ శతాబ్దం నాటికి పొగాకు క్రమంగా యూరోపియన్‌ దేశాలకు, ఆ తర్వాత శరవేగంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. బ్రిటిష్‌ వారి ద్వారా పొగాకు భారతదేశానికి చేరుకుంది. పొగాకు పరిచయం కావడానికి ముందు భారతదేశంలో ఎక్కువగా గంజాయితోనే పొగతాగేవారు. ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో పొగాకును ఔషధంగా పరిగణించేవారు. సిగరెట్ల కంపెనీలు వైద్యులతో వ్యాపార ప్రకటనలు ప్రచారం చేసుకునేవి. ఇరవయ్యో శతాబ్దిలో సగానికి సగం కాలం ఇలాగే గడిచింది. పొగాకు వల్ల క్యాన్సర్‌ వంటి అనర్థాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. పలు ప్రభుత్వాలు కూడా పొగాకు వాడకంపై ఆంక్షలు అమలులోకి తెచ్చాయి. 

పొగాకు ఉత్పాదనలో టాప్‌–10

►చైనా 29,95,400

►భారత్‌  7,20,725

►ఇండోనేసియా  1,96,300

►మలావి 1,26,348 

►జాంబియా 1,12,049

► బ్రెజిల్‌  8,62,396

►అమెరికా  3,97,535  

►పాకిస్తాన్‌ 1,29,878

►అర్జెంటీనా  1,19,434

►మొజాంబిక్‌ 97,075

పొగ తక్కువ  దేశాల్లో టాప్‌–10
దేశం –  జనాభాలో  పొగరాయుళ్ల శాతం

►స్వీడన్‌  14.5

►అమెరికా 15.4

►ఆస్ట్రేలియా 16.6

►కెనడా  17.7

►న్యూజిలాండ్‌  18.1

►బ్రెజిల్‌  18.3

►దక్షిణాఫ్రికా 18.6

►లగ్జెంబర్గ్‌ 18.8

►ఐస్‌లాండ్‌ 19.0

►భారత్‌ 19.5 

మరిన్ని వార్తలు