మానసిక ఒత్తిడి మాయే!

15 Nov, 2015 00:39 IST|Sakshi
మానసిక ఒత్తిడి మాయే!

ఆత్మబంధువు
ఆనంద్ ఆఫీసునుంచి వచ్చాడు. కానీ రేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. కాఫీ ఇస్తే ఏదో అలా తాగేశాడు. పిల్లలు దగ్గరకు వచ్చినా పట్టించుకోలేదు. అతను ఏదో ఒత్తిడిలో ఉన్నాడని రేఖకు అర్థమైంది. అదే విషయం అడిగింది.
 ‘‘అలాంటిదేం లేదోయ్’’ అన్నాడు.
 ‘‘మరి అలా ఎందుకున్నారు?’’
 ‘‘ఎలా ఉన్నాను? బానే ఉన్నాగా?’’
 
‘‘మీరు మామూలుగా లేరు. ఆఫీసులో ఏదైనా ఒత్తిడా?’’
 ‘‘అలాంటిదేం లేదు. నేను బాగానే ఉన్నా. ఆఫీసులో కూడా బాగానే  ఉంది. ఏదో చిన్న ఒత్తిడి. అంతే. ఉద్యోగం అన్న తర్వాత అవన్నీ తప్పవుగా.’’
 ‘‘చిన్న ఒత్తిడి అని వదిలేస్తే పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది ఆనంద్.’’
 ‘‘అలాంటిదేం లేదులే. అది చాలా చిన్న సమస్య. ఐ కెన్ మేనేజ్.’’
 ఆనంద్ అలా చెప్తున్నా... ఆ సమస్యను మేనేజ్ చేయలేకనే ఒత్తిడి ఫీల్ అవుతున్నాడని రేఖకు అర్థమైంది. ఆ విషయం అతనికి ప్రాక్టికల్‌గా చెప్పాలనుకుంది.
   
‘‘ఆనంద్... ఓ చిన్న పని చేయ గలవా?’’ మర్నాడు అడిగింది రేఖ.
 ‘‘హా.. చెప్పు’’ అన్నాడు ఆనంద్.
 ‘‘కొంచెం ఈ కప్పు పట్టుకోవా?’’ అని చిన్న కప్పు చేతికిచ్చింది.
 ‘‘ఆ మాత్రం దానికేనా?’’ అంటూ కప్పు అందుకున్నాడు.
 ‘‘నేను చెప్పేంతవరకూ ఆ కప్పు కింద పెట్టకూడదు’’ అంది రేఖ.
 ‘‘ఒహ్హో... ఈ చిన్న కప్పును పట్టుకోలేనా?’’
 ‘‘పట్టుకోండి సార్ చూద్దాం.’’
 
ఆనంద్ ఆ కప్పును అలా పట్టుకుని నిల్చున్నాడు. రేఖ వంట చేసుకుంటోంది. పది నిమిషాలకు కప్పు బరువుగా అనిపించింది ఆనంద్‌కి. పావు గంటకు చెయ్యి గుంజడం మొదలెట్టింది. అరగంట తర్వాత ఇక భరించలేననుకున్నాడు. కప్పును చేయి మార్చుకోవడానికి ప్రయత్నించాడు.
 ‘‘హలో మిస్టర్ ఆనంద్... మీరు అదే చేత్తో పట్టుకోవాలి. చేయి మార్చుకోవడం కుదరదు’’ అంది రేఖ.
 ‘‘అరగంట పట్టుకునేసరికి చేయి గుంజుతుందోయ్’’ చెప్పాడు ఆనంద్.
 ‘‘కదా... అలాగే చిన్న ఒత్తిడిని ఎక్కువకాలం భరించినా ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది సర్’’ అంది నవ్వుతూ.
 
‘‘ఓహ్... నిన్న నేనన్న మాటలకు రిటార్డా?’’ అంటూ కప్పు కింద పెట్టాడు.
 ‘‘రిటార్డేం కాదు. చిన్న ఒత్తిడని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పాలనీ...’’
 ‘‘చెప్పాలనుకుంటే డెరైక్ట్‌గా చెప్పొచ్చుగా... ఇలా ఎందుకు?’’
 ‘‘డెరైక్ట్‌గా చెప్తే తమరికి నచ్చదుగా. అందుకే ప్రాక్టికల్‌గా చూపిద్దామనీ...’’
 ‘‘అబ్బో... స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టిప్స్ కూడా చెప్తావా ఏంటీ?’’
 ‘‘ఏం... చెప్పకూడదా ఏంటీ?’’
 
‘‘నాకు తెలియని టిప్స్ నువ్వేం చెప్తావోయ్?’’
 ‘‘మీకు తెలిసిన టిప్స్ ఏంటో చెప్పండి ముందు.’’
 ‘‘రోజూ పొద్దుటే వాకింగ్, యోగా, మెడిటేషన్ చేసాను కదా! అలాగే మా ఆఫీసులో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ మీద ఎక్స్‌పర్ట్స్‌తో క్లాసులు కూడా చెప్పిస్తుంటారు. వాళ్లు రిలాక్సేషన్ ఎక్సర్‌సైజ్ చేయమని చెప్పారు.’’
 ‘‘మరి చేస్తున్నారా?’’
 ‘‘అప్పుడప్పుడూ. అంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చేస్తున్నా.’’
 ‘‘మరి తగ్గుతుందా?’’
 
‘‘తగ్గుతుంది... మళ్లీ వస్తుంది.’’
 ‘‘కదా... మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... అసలది లేదనే విషయం తెలుసుకోవాలి.’’
 ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. ‘‘ఏంటీ... మానసిక ఒత్తిడనేది లేదా? ఎవరైనా వింటే జనాలు నవ్వుతారు. ఒత్తిడి తట్టుకోలేక లక్షలాదిమంది బాధపడు తుంటే నువ్వు ఒత్తిడనేదే లేదంటావేం?’’
 
‘‘సరే ఉంది. కానీ ఆ ఒత్తిడి సృష్టిస్తున్నది ఎవరు?’’
 ‘‘ఎవరంటే... దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలా చెప్పడం?’’
 ‘‘మీరెన్ని కారణాలు చెప్పినా అవి సెకెండరీ. మీరెన్ని టిప్స్ పాటించినా అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు. ఒత్తిడి నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే... దాని మూలం తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ కొన్ని సామర్థ్యాలూ, అంచనాలూ ఉంటాయి.

అంచనాలకు, ఆశయాలకూ తగ్గ సామర్థ్యా లున్నప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. అంచనాలకూ సామర్థ్యాలకూ మధ్య దూరం పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ‘‘అందుకే ఒత్తిడి తగ్గించుకోవాలంటే అంచనాలు తగ్గించుకోవాలి, లేదంటే అంచనాలకు అందుకోగల సామర్థ్యాలను పెంచుకోవాలి. అంతే తప్ప మరేం చేసినా అవి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే.’’
 ‘‘నువ్వు చెప్పింది నిజమేనోయ్. థ్యాంక్స్.’’ అంటూ ముద్దిచ్చాడు ఆనంద్.
- డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

మరిన్ని వార్తలు