సమీక్షణం : మానసిక సంస్కారం నేర్పే నవల

17 Nov, 2013 03:47 IST|Sakshi
సమీక్షణం : మానసిక సంస్కారం నేర్పే నవల

 పుస్తకం    :    పున్నాగపూలు (నవల)
 రచన    :    జలంధర
 విషయం:    సామాజిక జీవితంలో నెలకొని ఉన్న అనేక అంతరాలను సమర్థంగా పూడ్చుకోగల పరిష్కారాలు తెల్సిన రచయిత్రి జలంధర. లోకం పోకడ తెలీని ‘రాధ’  చుట్టూ విస్తరించిన వేర్వేరు హోదాలకు, స్థోమతలకు చెందిన జీవితాల వెనకటి గోత్రాలను విప్పిచెప్పిన నవల ఈ ‘పున్నాగపూలు’.  ఎంతోమంది ప్రముఖ ఆంగ్ల, తెలుగు రచయితల, తాత్వికుల, వేదాంతుల మాటలను ఉదాహరిస్తూ మనిషిని ఉన్నతవంతం చేయాలనే తపన నవలంతా అండర్ కరెంట్‌గా కనబడుతుంది.
 విక్టిమైజ్డ్ రోల్ రాధ నుంచి, డ్రగ్ ఎడిక్ట్ స్వప్న, జీవితాన్ని చేజార్చుకున్న రాణి, అన్నీ ఉండీ, ఏమీ లేనిదానిగా అయిపోతున్న మంత్రి భిక్షపతి భార్య లక్ష్మీకాంతం, జీవితాన్ని కక్షతో ఎంజాయ్ చేేన  రాధ తల్లి లావణ్య, కమలిని, శ్రీదేవి, ఆరాధన, కళ్యాణి, నర్సులు పరిమళ, గౌరి వంటి ఎందరో స్త్రీల మానసిక లోకాన్ని పరిచితం చేయటం ద్వారా పఠిత మనోలోకాల తలుపులు తెరచుకుంటాయి. అపురూప ఓ స్టన్నింగ్ క్యారెక్టర్. వ్యసనపరుడు రాజారావు, వికాసవంతుడు రఘు, జర్నలిస్టు విరించి, తనకన్నీ తెలుసుననుకునే రామకృష్ణ. వీళ్లందరి సమస్యలనూ ఓపికగా పరిష్కరిస్తూ ‘వైద్యం మనస్సు’ తెలుసుకున్న డాక్టర్ కృష్ణ, షీలా మేడం, డాక్టర్ పిళ్లై.
 
 ఆంధ్ర దేశంలోని కొద్దిమంది డాక్టర్లైనా ఈ నవల చదివితే వైద్యవృత్తికి మరింత పేరువచ్చే అవకాశాలున్నాయి. సన్నటి పూలతీగల సువాసనలతో, పుష్ప బంధాలతో కట్టి పడేస్తూ మానసిక సంస్కారం నేర్పే నవలిది.
 - డాక్టర్ నూకతోటి రవికుమార్
 
 చర్చకు తావిచ్చే ఆలోచనలు
 
 పుస్తకం    :    ఆలోచనలు-అనుభూతులు                 (వ్యాసాలు)
 రచన    :    }పతి పండితారాధ్యుల పార్వతీశం
 విషయం    : పార్వతీశం పద్య, వచన కవిత్వపు లోతులెరిగిన పండిత కవి. సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంతో పరిశీలించడం పొరపాటు, తాత్వికంగా అనేక కోణాల నుండి పరిశీలించాలనేది వీరి ఉద్దేశం. కవిత్వం రసాత్మకమైనదిగా ఉండాలే గాని, రభసాత్మకంగా ఉండకూడదంటారు. సాహిత్యం సందేశాత్మకంగా, చైతన్యవంతంగా చలుపరించే గాయాల్ని మాన్పించే అద్వితీయమైన అమూర్త ఔషదంగా ఉండాలనేది వీరి భావన. ఆత్మానందంగా జీవికలోంచి తొంగిచూసే ఓ కొత్త వెలుగులాగ కవిత్వం ఉండాలంటారు.
 
 వీరు రాసిన ‘ఆలోచనలు - అనుభూతులు’ సంకలనాన్ని ఆరు ప్రధాన శీర్షికలుగా విభజించి, ప్రాచీన, ఆధునిక, ఆధునికానంతర వాదాల వరకు సూచన ప్రాయంగా, విమర్శనాత్మకంగా విశ్లేషించారు. వచన కవిత్వంలో చోటుచేసుకున్న ఆధునిక, ఆధునికానంతర ధోరణులు పాఠకులకు అర్థం కాకుండా పోవడాన్ని ‘ఆధునిక కవిత్వ అసంతృప్తి కారకాలు’ శీర్షికలో వ్యంగ్యంగా వ్యక్తీకరించారు. ఇటువంటి భావన ఛందోబద్దంగా రాసే కవులకు కూడా వర్తిస్తుందనేది ఈ రచయిత గమనించాల్సి ఉంది. ఛందస్సులో నింపినంత మాత్రాన పద్యం భావయుక్తంగా భాషాపటిమతో విరాజిల్లుతుందనుకోవడం పక్షపాతమే అవుతుంది. ఏ ప్రక్రియలో రాసినా కవిత్వంలో కవిత్వం ఉండాలి. ప్రాచీన ఆధునిక కవితారీతుల నిర్మొహమాటమైన విశ్లేషణలు తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి.
 - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
 
 జ్ఞాపకాల కన్నీటి వెల్తురు
 పుస్తకం    :    శతాబ్ది వెన్నెల (కవిత్వం)
 రచన    :    కె.గీత
 విషయం:    మంచు తెరలు, పుట్టినూరు, అభిరుచులు, అమెరికా జీవితం, డాలర్ దాడి, కంప్యూటర్లు... వెరసి ‘గీత’ కవితా సారాంశం. ద్రవభాష, శీతసుమాలు తర్వాత ఆమె తెరిచిన మూడో కవితానేత్రం ‘శతాబ్ది వెన్నెల’.
 
 ఈ కవిత్వం నిండా తాను కోల్పోయిన, కోల్పోతున్న జ్ఞాపకాలు ఉడుతల్లా పరిగెడుతుంటాయి. కవితలన్నీ ‘గలగలా గాలి రాల్చి’  సాదరంగా ఆహ్వానిస్తాయి. ఏనుగంత గడ్డిలో ఏనుగెక్కి సవారీ చేస్తూ, నిశ్శబ్ద కుంజర గమనాన్ని స్వప్నిస్తుంటాయి. అక్షరాల మధ్య ప్రేమ ప్రవాహమయ్యే నిశ్శబ్దం వినిపిస్తుంది.
 
 గీత కవిత్వం నిండా ‘కంట్లో గుచ్చుకునే అయిదు పైసల పుల్లయిసు’లుంటాయి. ‘వంటింటి నుంచి మొదలై వంటింట్లో అంతమయ్యే రోజు’లుంటాయి. ‘ఎటు ఒత్తిగిలినా గుచ్చుకునే వాస్తవా’లుంటాయి. వీటన్నిటికీ గీత ‘బయటి లోకపు ద్వారపాలకురాలు’. కవయిత్రి తన అమెరికా జీవితాన్ని  ఆవిష్కరించారు. వెన్నెల వెనక విషాద ఛాయల్నీ అక్షరీకరించారు. ప్రతి కవితలోనూ తనదైన కవితాసామగ్రిని సమకూర్చుకోవడంలో కృషి కనిపిస్తుంది. ‘బడివాన’, ‘ఇంటూ నలభై’, ‘ఎగిరొచ్చిన ఇల్లు’, ‘గోడకివతల’ వంటి శీర్షికలు పెట్టడం; జలశరాలు, వణుకు కెరటాలు, కన్నీటి వెల్తురు, ఇంటర్వ్యూల పాములు, కన్నీళ్ల పిడిగుద్దులు, అపజయాల దిగుడుబావి, లోహపు దంతాలు వంటి పద బంధాలు సృష్టించడమే అందుకు నిదర్శనం.
 - ఎమ్వీ రామిరెడ్డి

మరిన్ని వార్తలు