మైకేల్‌ జాక్సనా...  మానధన సుయోధనా!

18 Feb, 2018 00:35 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

రవీంద్రభారతి రసజ్ఞులైన ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ప్రఖ్యాత అవధాని డప్పుల అప్పలాచార్య ఆరోజు ‘నిర్దిష్టకథాక్షరి’ చేస్తున్నారు. ‘నిర్దిష్టకథాక్షరి’ అంటే పృచ్ఛకుడు రెండో, మూడో పదాలు నోటికొచ్చినవి  చెబుతాడు. అవధాని అప్పటికప్పుడు ఆ పదాలతో కథ అల్లేయాలి.ఆరోజు పృచ్ఛకుడు అవధానికి ఇచ్చిన సమస్య...‘మైకేల్‌ జాక్సన్‌’ ‘మానధనసుయోధనుడు’ ‘ఐశ్వర్యరాయ్‌’  ఇది విని ప్రేక్షకులు ఘెల్లుమని నవ్వారు. ఎందుకుంటే మైకేల్‌ జాక్సన్, దుర్యోధనుడు, ఐశ్వర్యరాయ్‌... ఒకదానికొకటి సంబంధం లేని పేర్లు. ‘ఈ దెబ్బతో అవధానిగారి ఆటకట్టు!’ అనుకున్నారు ప్రేక్షకుల్లో సగం మంది. కానీ మన అవధాని డప్పుల అప్పలాచార్యగారు ఆ పేర్లు విన్న వింటనే  ఇలా ఆశువుగా  కథ చెప్పడం మొదలు పెట్టారు.

‘‘రాజసూయయాగం తలపెట్టాం. నువ్వు తప్పక రావాలి బ్రదర్‌’’ అని ధర్మరాజు దుర్యోధనుడిని ఆహ్వానించాడు. ‘‘వెళ్లాలా వద్దా?’’ అని తెగ ఆలోచిస్తున్న దుర్యోధనుడి దగ్గరికి అంకుల్‌ శకుని వచ్చి...‘‘నువ్వు వెళితేనే మంచిది అల్లుడూ’’ అని సలహా  ఇచ్చాడు. అలా దుర్యోధన సార్వభౌముడు ధర్మరాజు ఆహ్వానం మేరకు ఇంద్రప్రస్థానికి వెళ్లాడు. దుర్యోధునుడి చూసి ధర్మరాజు తెగ సంతోషించాడు.‘‘బ్రదరా భీమసేనా... కురుసార్వభౌముడికి మయసభలో విడిది ఏర్పాటు చేయండి’’ అని  భీముడిని ఆదేశించాడు ధర్మరాజు. ‘‘అలాగే అన్నా’’ అంటూ దుర్యోధనుడిని  సగౌరవంగా మయసభకు తీసుకెళ్లి  తిరిగి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు భీముడు.‘‘భీమా... ఒక విషయం చెప్పడం మరిచాను. ‘భవిష్యత్‌ సాంకేతిక పరిజ్ఞానం’తో మయసభను మయుడు తీర్చిదిద్దాడని దుర్యోధనుడికి చెప్పి  ఉంటే బాగుండేది. లేకపోతే మయసభలోకి అడుగు పెట్టిన దుర్యోధనుడు పరేషాన్‌ కాగలడు’’ అన్నాడు ధర్మరాజు.‘‘దాని గురించి దుర్యోధునుడికి చాలా వివరంగా  చెప్పాను అన్నా... ఎలాంటి సమస్యా లేదు...’’ అని అబద్ధం ఆడాడు భీముడు. నిజానికి భీముడు ‘మయసభ’ గురించి ఒక ముక్క కూడా దుర్యోధనుడికి  చెప్పలేదు. ఇక అక్కడ దుర్యోధనుడి పరిస్థితి  ఎలా ఉందో తెలుసుకుందాం... కురుసార్వభౌముడు దుర్యోధనుడు మయసభలోకి అడుగు పెట్టాడు. కొద్ది దూరం వెళ్లగానే ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగ్‌... ‘‘ఆహా! ఏమి ఈ సుందరి సౌందర్యరహస్యం.

సకల కళా ప్రపూర్ణుడై వివిధ కళా వినోదిౖయెన రారాజు ప్రశంసలుఅందుకున్న అందాల సుందరీమణి.... నీ పేరేమి?.... ఏమా మౌనము? పేరు చెబితే నోటి నుంచి  డైమండ్స్‌ రాలిపడునని నీ డౌటా?  ఈ కురుసార్యభౌముడికేల నీ డైమండ్‌లు!!’’ అని పెద్దగా నవ్వి...‘‘సుందరీ ఇప్పుడైనా నీ పేరేమిటో చెబుదువా?’’ మృదువుగా ఆమె భుజం మీద చేయి వేసి  అడిగాడు దుర్యోధనుడు. వెంటనే ఆకాశవాణి గర్జించింది...‘‘ఓరీ మూర్ఖ దుర్యోధన.... నీవు మాటలాడునది అందమైన అమ్మాయితో కాదు...భవిష్యత్‌ తార ఐశ్వర్యరాయ్‌ లైఫ్‌ సైజ్‌ వాక్స్‌ స్టాచ్యూతో.... అనగా  ఐశ్వర్యరాయ్‌ నిలువెత్తు మైనపు బొమ్మతో’’
‘‘పరువు పోయిందే’’ అని నాలుక కర్చుకొని చుట్టూ చూశాడు దుర్యోధనుడు. ‘‘హమ్మయ్య... ఎవరూ చూడలేదు’’ అని తృప్తి పడ్డాడు. కొంత దూరం నడిచాక.....‘‘అడవిలో తిరగాల్సిన పులికి   ఇక్కడేం పని? అది నా వైపే వచ్చుచున్నది. భీకరంగా గాండ్రించుచున్నది. దీనికి తగిన శాస్తి చేసేదా’’ అని తన చేతిలోని గదతో ఒక్కటిచ్చుకున్నాడు. పెద్దగా సౌండ్‌ వినిపించింది.‘‘ఎంత పని చేశావు దుర్యోధన! అది పులి కాదు... హోమ్‌థియేటర్‌లోని చిత్రం’’ అని పలికింది ఆకాశవాణి.‘‘హోమ్‌థియేటర్‌  అనగా ఏమి?’’ అని అడుగుదామనుకున్నాడుగాని అహం అడ్డు వచ్చింది. నాలుగు అడుగులు వేశాక...‘నీ కళ్లూ పేలి పోను చూడవే... మేరే హాయ్‌’ అని వినిపించింది. దుర్యోధనుడికి పట్టలేనంత  కోపం వచ్చింది.

‘‘ఏమా అహంకారం! నా కళ్లు పేలిపోవాలా? ఓరీ అహంకారి ఎక్కడో దాక్కుని  అరవడం కాదు...దమ్ముంటే నా ముందు వచ్చి నిల్చో’’ అని దుర్యోధనుడు అన్నాడో లేదో ఆకాశవాణి గర్జించింది. ‘‘ఓయి మతిచెడిన దుర్యోధన... అది అరుపు కాదు. ఎఫ్‌ఎంరేడియో. నువ్వు విన్నది ఇడియట్‌ అను చలనచిత్రంలోని పాటలోని చరణం’’మళ్లీ నాలుక కర్చుకున్నాడు దుర్యోధనుడు.‘బాగా దాహంగా యున్నది. నీళ్లు ఎచట యున్నవి?’’ అని చుట్టూ చూశాడు. కిటికీ దగ్గర టేబుల్‌ మీద బాటిల్‌ కనిపించింది. ‘హమ్మయ్య! అనుకొని ఆ బాటిల్‌ మూత తీసి గటగటా తాగాడు. ఆకాశవాణి ఆందోళనగా పలికింది...‘‘ఫూల్‌ దుర్యోధనా!  నువ్వు తాగింది నీళ్లు కాదు...నీళ్లలాగే కనిపించే వోడ్కా అను సురపానీయం. ఇప్పుడు నీకు  జింతాక జితా జితా’’దుర్యోధనుడిని మత్తు కమ్ముకుంది. అడుగులు భారంగా పడుతున్నాయి. అక్కడ ఒ పక్కన సోనీ టీవి కనిపించింది. అందులో మైకేల్‌జాక్సన్‌ ‘ఆర్‌ యూ ఓకే అని... ఆర్‌ యూ ఓకే’ అంటూ మూన్‌వాక్‌ డ్యాన్స్‌ చేస్తున్నాడు. ఆ డ్యాన్స్‌ దుర్యోధనుడికి విపరీతంగా నచ్చింది.‘‘ఈ నృత్యం నేను కూడా చేస్తాను’’ అనుకుంటూ టీవీ చూస్తూ నాలుగు స్టెప్పులు వేశాడో లేదో కుప్ప కూలిపోయాడు దుర్యోధనుడు. సరిగ్గా అప్పుడే ‘హాహాహా’ అని పెద్దగా నవ్వు వినిపించింది. అవమానభారంతో అటువైపు చూశాడు దుర్యోధనుడు... అంతే... ఎక్కడలేని కోపం వచ్చింది.‘పాంచాలీ పంచభర్తృకా! నీవా నన్ను పరిహసించునది... సకల మహీపాల మకుట మాణిక్య శోభా విరాజితుడైన రారాజును నేడు ఒక అబల అపహసించుటయా! అభిమానధనుడైన సుయోధునుడు అది విని సహించుటయా? బొమ్మను చూసి అమ్మాయి అని  ఏల భ్రమపడవలె! పడితినిపో... మంచినీళ్లనుకొని మందేలా తాగవలె..తాగితి పో... మామాకీ  కిరికిరి మైకేలు జాక్సన్‌ను ఎందుకు చూడవలే... చూసితిపో ఏల నృత్యం చేయవలే... చేసితిపో బొక్కబోర్ల ఏల పడవలే’’....  ఆపకుండా డైలాగ్‌లు కొడుతూనే ఉన్నాడు దుర్యోధనుడు. కథ పూర్తయింది.  చప్పట్లతో హాలు  దద్దరిల్లింది.
– యాకుబ్‌ పాషా 

మరిన్ని వార్తలు