మైకే నా ప్రాణం

10 Apr, 2017 12:58 IST|Sakshi
మైకే నా ప్రాణం

కథ
చూడ్డానికి చాలా చిత్రంగా కనిపించవచ్చు. కానీ... కబడ్డీ కూతకు వెళ్లే ముందర బరికి మొక్కినట్టుగానే మెట్లకు మొక్కి మరీ వేదిక మీదికెక్కాడు మా రాంబాబు. మేక మెడకు మోకున్నట్లుగా, కార్పొరేట్ సంస్థలో పనిచేసేవారి మెడల్లో ఐడీకార్డులాగా వాడి మెడలోనూ ఓ తాడుంది. ఆ తాడుకు వేలాడుతూ మైకుంది. వెనక వేదిక బ్యాక్‌డ్రాప్‌గా ఓ ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ ముందర తన విశ్వరూపవిన్యాస ప్రదర్శన చేస్తున్న అపర అవతారమూర్తిలా మా రాంబాబు.
   
‘సభానిర్వహణ’ అనేది గుణాల గురించి రాసినంత ఈజీ కాదు. అదో కళ. అన్ని కళల కంటే క్లిష్టమైన, ఉన్నతమైన కళ. ఆ కళ ఎలా అబ్బిందో మా రాంబాబుకు అబ్బింది. ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఒక రోజంతా గుక్క తిప్పుకోకుండా మాట్లాడగల మొనగాడు. పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకతలు వస్తాయన్న వాదాన్ని నేను నమ్మను గాని, అనుకరణ, కృషి ద్వారా ఉద్దండులైన చాలామంది ఉపన్యాసకుల్లో లేని ప్రత్యేకత ఏదో  రాంబాబులో ఉంది.

‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనే సిద్ధాంతం మీద మా రాంబాబుకు అపార నమ్మకం. తన ఉపన్యాస కళను ప్రజలకు పంచడం కోసం ‘పరదా’అనే సాంస్కృతిక సంస్థను స్థాపించాడు. ‘పరదా’ కోసం తన జీవితాన్నే ధారపోశాడు. గత రెండు దశాబ్దాలుగా ‘పరదా’ను విజయవంతంగా నడుపుతున్నాడు. ‘పరదా’ నిర్వహించే కార్యక్రమాలకి జనం తండోపతండాలుగా వస్తారు. వచ్చినవారికి పరదా వెనుక తలా ఒక బిర్యానీ పొట్లం ఇస్తారు అన్నంత ఇదిగా వస్తారు.

జనాన్ని కడుపుబ్బ నవ్వించడమే ‘పర దా’కు సరదా. ప్రతి సంవత్సరం ఓ ఘటికుణ్ని దొరకబుచ్చుకొని ‘పర్సన్ ఆఫ్ ద పరదా’ అనే అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరిస్తుంది. ఈనాడు అలాంటి ఓ బ్రహ్మాండమైన సభకు మనం వెళుతున్నాం.
 
విశాలమైన ఆడిటోరియం జనాలతో నిండిపోయింది. మైకబ్బాయి చివరిసారిగా మైకును సరిచేసుకున్నాడు. అసలు మైకు లేకున్నా సభ చివర మూలన కూచున్న ముసలమ్మకు కూడా వినపడేంత ఘాటుగా ఉంటుంది రాంబాబు మాట. సభ అంటే మైకే కాబట్టి మైకును పెట్టక తప్పలేదు. సభాసదులందరూ వచ్చిన తరువాత ‘పరదా’ కార్యదర్శి వేదిక మీదకొచ్చి ‘పరదా’ సంస్థకి రెండు జీవితకాలాల అధ్యక్షుడు, ఈనాటి సభాధ్యక్షుడు, అనితర సాధ్యుడు, డు, డు, డు, డూ... లాంటివి అనేకం చెప్పి, రాంబాబును వేదిక మీదికి ఆహ్వానించి సభను నిర్వహించాలని వేదిక దిగిపోయాడు.
 
రాంబాబు తన వెంట తెచ్చుకున్న కార్డులెస్ మైకును స్టేజీమీద మెల్లగా... గుడ్డును బల్లమీద పెట్టినంత జాగ్రత్తగా పెట్టాడు. తన ఎడమ జేబులో ఉన్న బొట్టు డబ్బా తీసి మైకుకు కుంకుమ బొట్టు పెట్టాడు. ప్యాంటు కుడి జేబులో నుండి అగరుబత్తులు తీసి వెలిగించాడు. ‘పరదా’ సభ్యుడు పరుగెత్తుకుంటూ తెచ్చిన కొబ్బరికాయను కొట్టి, నీళ్లు తలమీద చల్లుకొని, తనను తాను దీవించుకున్నాడు. స్టేజీమీద సాష్టాంగపడి మైకుకు మొక్కి, లేచి నిలబడి మైకును తీసి కళ్లకు అద్దుకొని, ఉఫ్ ఉఫ్ అని ఊదాడు. చాలా గంభీరంగా ఉపన్యాసం మొదలుపెట్టాడు.
 
సభాసదులందరికీ ధన్యవాదాలు అన్నాడు. దీనికంతటికీ కారణం మీరే అని ధ్వనించేలాగా. ముందుగా రంగయ్యగారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం, వారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రమణయ్యను కోరుతున్నాను అనగానే ఈలలు, చప్పట్లు మారుమోగిపోయాయి. బొకే తీసుకున్న రంగయ్య నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇచ్చి, రాంబాబుతో కరచాలనం చేశాడు. జనం వైపు తిరిగి పాప్ సింగర్‌లాగ రెండు చేతులూ ఎత్తి కుడికీ ఎడమకీ బాగా వంగి వంగి ఐదారుసార్లు చేతులు వూపి తన సీటులో ఆసీనుడయ్యాడు. తరువాత సాయికుమార్, రమణమూర్తి, బ్రహ్మానందు, వేలుమాధవ్, సుశీల్, కోవై సరిత కూడా తమకు ఇచ్చిన బొకేను తీసుకొని, ఫొటోకు ఫోజు ఇచ్చి, తమ తమ సీట్లలో ఆసీనులు అయ్యారు.
 
రాంబాబు కొనసాగించాడు. ఈ కార్యక్రమ విశిష్టత ఏంటో మీకు తెలుసు. ‘తాటిచెట్టును మోకు లేకుండా ఎక్కి పక్కనే ఉన్న ఈతచెట్టు మీద నుండి దిగడం’ అనే సాహసోపేతమైన త్యాగ చర్యను చేసిన రంగయ్యకు ఈ సంవత్సరం ‘పర్సన్ ఆఫ్ ది పరదా’ అవార్డుతో గౌరవించడం చంద్రునికో కాదు, కాదు, దుప్పటికో నూలు పోగు లాంటిది. ‘తాడును ఎక్కి ఈదును దిగడం’ అనే చర్యను సాధించడానికి వారు పడిన తపన, ఆవేదన, కష్టం, నష్టం వర్ణనాతీతం. ‘‘గతంలో ఎవరైనా తాటిచెట్టు ఎక్కితే తాటిచెట్టు మీది నుంచే దిగారు.

ఈతచెట్టు మీదుగా దిగడం అనే దుస్సాహసానికి ఎవరూ ఒడిగట్టలేదు. అలాంటి త్యాగమూర్తి, ఆదర్శమూర్తిని సన్మానించుకోవడం మనందరి అదృష్టం. మన గడ్డమీద ఉన్న గట్టోణ్ణి మనం గట్టిగానే సన్మానించుకుందాం. మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి’’ అని రంగయ్యను సింహాసనం మీద కూర్చుండబెట్టి గజమాల వేసి, శాలువా కప్పి, వేదిక మీదున్న ఆహ్వానితులు ఫొటోలో సరిగా పడేలాగా సర్దుకొని, గ్రూపు ఫొటో దిగారు. మేం సన్మానించకపోతే రంగయ్యకు దిక్కూ దివాణం లేదు అన్న ఫీలింగు వేదిక మీదున్న అందరి మొహాల్లో ప్రతిఫలించింది. బ్రేకింగ్ న్యూస్ కోసం విలేకరులు ఆ ఫొటో తీసుకొని తమ పత్రికలకు, చానళ్లకు పంపారు.
 
రాంబాబు నాలుగు అడుగుల పొడవున్న ఫొటోని తీసుకొని సభాసదులకు చూపిస్తూ, ‘‘ఈ సన్మాన పత్రాన్ని నేను స్వయంగా రాశాను. అక్షరాలను గుదిగుచ్చి రాసిన ఈ సన్మాన పత్రం నేను చదివితేనే మీకు అర్థం అవుతుంది. సమయాభావం వల్ల, ఈ సన్మాన పత్రం అంతా చదవలేను. కాని, కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రం మీ ముందుంచే ప్రయత్నం చేస్తానని’’ అబద్ధం చెప్పి, ఆ సన్మాన పత్రం ఆసాంతం చదవడమే గాక, ప్రతి లైను కవితాత్మకంగా రెండు రెండుసార్లు చదివి, రంగయ్యగారి మీదున్న అపార గౌరవాన్ని మరోమారు చాటుకున్నాడు.
 
సన్మానం తరువాత వేదిక మీద ముఖ్యులంతా వెనక్కి వెళ్లి, తమ సీట్లలో సర్దుకొని కూర్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు రంగయ్య గురించి లయాత్మకంగా మాట్లాడటం కోసం తయారుచేసుకున్న ఉపన్యాసాన్ని నెమరువేసుకుంటున్నారు. పక్కన ఉన్నవాళ్లతో గుసగుసగా మాట్లాడి రంగయ్య గురించి కొత్త సమాచారం సేకరించి తమ ఉపన్యాస పాఠంలో జోడిస్తున్నారు. చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యం గుర్తొస్తే కలిగే ఫీలింగు వాళ్ల ముఖాల్లో ప్రతిఫలిస్తోంది.
 
సభాధ్యక్షులు రాంబాబు వేదిక మధ్యకు వచ్చి ఐ.డి. కార్డులాగా మెడలో వేలాడుతున్న మైకు అందుకొని, ‘‘రంగయ్యగారి గొప్పతనం ఏమిటో ఈపాటికే మీకు తెలిసి ఉంటుంది’’. ఈనాటి ముఖ్య అతిథి, సాయికుమార్‌గారు రంగయ్య గురించి, పనిలో పనిగా నా గురించి ఏం మాట్లాడతారో మీకు తెలుసా? తెలీదు. నాకు తెలుసు. ‘ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా తాటిచెట్టును ఎక్కి, ఈతచెట్టు మీదుగా దిగే సాహసానికి ఒడిగట్టిన రంగయ్యకు భారత ప్రభుత్వం శౌర్య పథకాన్ని ప్రదానం చేయాల’ని గట్టిగా డిమాండు చేస్తాడు.

ఎన్నో రంగాల్లో రికార్డు సృష్టించిన మొనగాళ్లు ఉండగా, తాటిచెట్టు రంగాన్నే ఎంచుకున్నాడంటే, రాంబాబుకు కల్లు అంటే ఇష్టమని, కార్మిక పక్షపాతి అని అర్థం అవుతుంది’ అని అంటాడు. ఇక నటుడు, దర్శకుడు, రచయిత, విప్లవకారుడు రమణమూర్తిగారి అభిప్రాయం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘‘రంగయ్యగారు ఒక కీర్తి కిరీటం. ఈ జిల్లా మణిదీపం. ప్రభుత్వం ‘తాటి అకాడమీని స్థాపించి, దానికి రంగయ్యగారిని చైర్మన్ చేయాల’ని డిమాండ్ చేయదలుచుకున్నారు.
 
ఇక బ్రహ్మానందుగారు రంగయ్య గురించి చెప్పే ఒక్కటే మాట ఏంటంటే, ‘రంగయ్యగారు విదూషకత్వానికి వారసుడని, సినిమాల్లోకొస్తే నా స్థానం ఊడుతుంద’ని అంటాడు. యస్... అందులో ఎలాంటి అనుమానం, అతిశయోక్తి లేవు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇక వేలుమాధవ్‌గారు రంగయ్యగారి పట్ల చాలా ఉత్కృష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ‘రంగయ్యగారు ఒక గంధర్వుడని, ఒక జ్ఞాని’ అని వారు గాఢంగా నమ్ముతున్నారు అని వేలుమాధవ్ వైపు చూడగా, వేలుమాధవ్ అవునన్నట్లుగా చిరునవ్వుతో తల ఊపాడు.

ఇక సుశీల్ అభిప్రాయం ప్రకారం ‘‘రంగయ్యగారు రాజకీయాల్లోకి వస్తే మాత్రం, ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అనేది వారి అభిప్రాయం. ఇక ప్రముఖ సంఘ సేవిక కోవై సరిత అభిప్రాయం ప్రకారం, ‘‘బిడ్డడు ఎంతో కష్టపడ్డాడని, ఏమైనా డేక్కుపోయిన గాయాలుంటే ప్రభుత్వ ఖర్చులతో రంగయ్యగారికి చికిత్స చేయించాల’ని డిమాండ్ చేయాలనుకుంటుంది. అంతే కదా మరి. ఆవిడ తల్లి మనసుతో ఆలోచించింది.
 నేను బహుముఖ ప్రజ్ఞాశాలిని అని మీకు తెలుసు.

అసలు వక్తలు వారే స్వయంగా మాట్లాడినా ఇంత అర్థవంతంగా చెప్పలేరు అని నాకు తెలుసు, మీకూ తెలుసు. వేదిక మీదున్న గొప్ప వ్యక్తుల మీద ఉన్న గౌరవం కొద్దీ వారి అభిప్రాయాన్ని నేనే చెప్పినందున, ఇక వారు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు సన్మాన గ్రహీత రంగయ్యగారి అభిప్రాయం ప్రకారం, ‘ఎంతో శ్రమ, ఖర్చును భరించి ఈ సమావేశం ఏర్పాటు చేసి, వారిని సన్మానించడం వారు జీవితంలో మర్చిపోలేరు. ఈ మట్టికి రుణపడి ఉంటారు, నేను ఏం చెబితే అది రంగయ్యగారు చేస్తారు. తన కృతజ్ఞత తెలియజేస్తూ, కన్నీటి పర్యంతం అవుతారు. అంతే. ఈ సభ ఇంతటితో ముగిసింది’ అన్నాడు రాంబాబు.
 
వెంటనే ‘‘ఆ... ఆ... ఆ...గు రాంబాబూ...’’ అని ఆవేశంగా అరుస్తూ వేలుమాధవ్ లేచి, సభాసదులనుద్దేశించి, ‘‘ఏం... మేం చేతగానివాళ్లమా? రంగయ్య గురించి వారం రోజులుగా ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించి, ఇంట్లో అద్దం ముందు ఉపన్యాసం ప్రాక్టీసు చేసి వస్తే, మీరు మాకిచ్చే మర్యాద ఇదా అధ్యక్షా. వచ్చే ఏడాది మీటింగుకి మా మైకులు మేమే తెచ్చుకొని వీరంగం ఆడిస్తాం’’ అని మీసాలు మెలేసి, ‘‘ఆ... న...’’ అని చేయి ముందుకు చాపాడు. మిగతా అతిథులు కూడా మీసాలు ఉన్నా లేకున్నా మెలేసి, ‘‘ఆ... న...’’ అని చేతులు ముందుకు చాపి, ప్రమాణం చేయగానే కరెంటు పోయింది. సభా ప్రాంగణం అంతా చీకటిమయం అయింది.
 
కొంత విరామం తరువాత కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు వచ్చింది. భగవద్గీతలో కృష్ణుడి అవతారంతో మన రాంబాబు వేదిక మీద ప్రత్యక్షమయ్యాడు. కుడిచేతితో చక్రాన్ని సరసరా తిప్పుతూ, ఎడమ చేతితో మైకు అందుకొని, ఉఫ్ ఉఫ్ అని ఊదాడు. జనం అంతా హాహాకారాలు చేస్తూ, ఎక్కడివారు అక్కడ సాష్టాంగపడి, ‘రాంబాబూ... నీకు దండంరా బాబూ’ అన్నారు. పరదా జారింది. సభ ముగిసింది.

మరిన్ని వార్తలు