బోలో భారత్‌ మాతాకీ జై

22 Jul, 2017 23:25 IST|Sakshi
బోలో భారత్‌ మాతాకీ జై

యుద్ధం.. మొదలవుతూనే సైనికుడి ప్రాణాన్ని కోరుతుంది.ముగిసే రోజొచ్చేసరికి శాంతిని కోరుతుంది.ఈ మధ్యన జరిగేదంతా ఒక పోరాటం. శాంతి కోరని ఓ పోరాటం.ఎన్నెన్ని ముగిసిన యుద్ధాలో.. ఎన్నెన్ని ప్రాణాలో.. ఎన్నెన్ని మొదలవ్వని యుద్ధాలో.. ఎన్నెన్ని ఆగిపోని యుద్ధాలో.. ఒక సైనికుడు ఎప్పుడూ నిలబడే ఉన్నాడక్కడ! ఆ సైనికుడికి ఎప్పుడూ కొడుతూనే ఉందామొక సలామ్‌!!కార్గిల్‌ విజయ్‌ దివస్‌ ఏంటి? 1999లో ఇండియా–పాకిస్థాన్‌ మధ్యన రెండు నెలల పాటు జరిగిన కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌ చొరబాటుదారుల నుంచి కార్గిల్‌ ప్రాంతాన్ని భారత దళాలు జూలై 26న పూర్తిగా అదుపులోకి  తెచ్చుకొని విజయ పతాకం ఎగరవేశాయి. ఈ యుద్ధంలో 500లకు పైగా భారత జవానులు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ  కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను భారత ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది.

మంచును లెక్క చేయకుండా...
నైనితాల్‌కు చెందిన మేజర్‌ రాజేశ్‌ సింగ్‌ అధికారి కార్గిల్‌ యుద్ధంలో బ్యాటిల్‌ ఆఫ్‌ టోలోనింగ్‌లో కీలకపాత్ర పోషించారు. 15000 అడుగుల ఎత్తున ఉన్న కొండపై ఉన్న పాకిస్థాన్‌ సైన్యాన్ని అంతమొందించే బాధ్యతను రాజేశ్‌ చేపట్టారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నా, పరిస్థితులను ఎదిరించి మరీ శత్రు సైన్యం ట్యాంకులను ధ్వంసం చేస్తూ వెళ్లారాయన. కాల్పుల్లో గాయపడినా కూడా తన టీమ్‌ను లీడ్‌ చేస్తూ ముందుకు వెళ్లి ఆ పాయింట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో బుల్లెట్‌ గాయాల వల్ల ఆయన ఈలోకాన్ని విడిచి వెళ్లారు. ప్రభుత్వం రాజేశ్‌ సాహసాన్ని గుర్తిస్తూ మహావీర చక్ర అవార్డుతో గౌరవించింది.

రాకెట్‌ లాంచర్‌తో...
తమిళనాడు రామేశ్వరంలో పుట్టి పెరిగిన మేజర్‌ మరియప్పన్‌ శరవణన్, దేశ సేవ చేయాలన్న ఆలోచనతో ఆర్మీలో చేరారు. కార్గిల్‌ యుద్ధంలో బాటలిక్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌ సైనికుడు చొరబడ్డ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే బాధ్యతను చేపట్టిన శరవణన్, రాకెట్‌ లాంచర్‌తో శత్రు సైన్యాన్ని బెదరగొడుతూ ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఇదే సమయంలో ఆయనపై వరుసగా బుల్లెట్ల దాడి జరిగింది. అప్పటికీ పోరాడుతూనే తుదిశ్వాస విడిచారు. ఆయన సాహసాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో గౌరవించింది.

19 ఏళ్లకే  పరమవీర చక్ర
16ఏళ్ల వయసులోనే దేశం కోసం పోరాడాలన్న సంకల్పంతో ఆర్మీలో చేరారు యోగేంద్ర సింగ్‌ యాదవ్‌. ఆయనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు కార్గిల్‌ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో టైగర్‌ హిల్‌  ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 16వేల అడుగులున్న కొండను, కాల్పులు ఎదురైనా ఎక్కారాయన. టైగర్‌ హిల్‌ వద్దనున్న నలుగురు పాకిస్థాన్‌ సైనికులను అక్కడికక్కడే కాల్చేశారు. యుద్ధంలో ఆయన చూపిన సాహసానికి గానూ ప్రభుత్వం పరమ వీరచక్ర అవార్డును అందించింది. 19 ఏళ్లకే పరమ వీరచక్ర అవార్డును అందుకున్న యోగేంద్ర సింగ్‌ యాదవ్, అతిచిన్న వయసులో ఈ గౌరవాన్ని దక్కించుకున్నవారిలో మొదటి స్థానంలో ఉన్నారు.

మరణానికి దగ్గరైనా కూడా...
ఢిల్లీలో పుట్టి పెరిగిన కెప్టెన్‌ అనుజ్‌ నయ్యర్‌ కుటుంబంలో అంతా చదువుకున్నవారే! దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆర్మీలో చేరారాయన. కార్గిల్‌ యుద్ధ సమయంలో పాకిస్థాన్‌ సైన్యం చొరబడిన పాయింట్‌ 4875ని స్వాధీనం చేసుకునే బాధ్యతను అనుజ్‌ నయ్యర్‌కు అప్పగించారు. తన ట్రూప్‌తో కలిసి ఆ పాయింట్‌ను చేరుకున్న ఆయన తొమ్మిది మంది శత్రు సైనికులను అంతమొందించడమే కాక, మూడు యుద్ధ ట్యాంకర్‌లను ధ్వంసం చేశారు. ఈ సమయంలోనే ఎదురుకాల్పుల్లో తీవ్ర గాయాలపాలై తుది శ్వాస విడిచారు. మరణానికి చేరువైన క్షణంలోనే మరో ట్యాంకర్‌ను ధ్వంసం చేసి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాకే అమరుడయ్యారు. అనుజ్‌ పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రభుత్వం ఆయనను మహవీర చక్ర అవార్డుతో గౌరవించింది.

శ్రత్రు సైన్యాన్ని అంతమొందించి...
హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కెప్టెన్‌ విక్రమ్‌ భాట్రా కార్గిల్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. విక్రమ్‌ జమ్మూ కశ్మీర్‌ సోపోర్‌ ప్రాంతంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే కార్గిల్‌ యుద్ధం మొదలైంది. దీంతో ఆయనను యుద్ధంలో బాధ్యతలు నెరవేర్చమని ప్రభుత్వం కార్గిల్‌కు పంపింది. తన ట్రూప్‌తో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, విజయవంతంగా పాకిస్థాన్‌ క్యాంప్‌లను కొల్లగొట్టిన విక్రమ్, మెషిన్‌ గన్‌లతో కాల్పులు ఎదురైనా ఎందరో పాకిస్థాన్‌ సైనికులను అంతమొందించారు. ఇదే యుద్ధంలో ఆయన అమరుడయ్యారు. ప్రభుత్వం ఆయన సాహస చర్యను స్మరించుకుంటూ పరమ వీర చక్ర అవార్డుతో ఆయనను గౌరవించింది.

ఆట నుంచి పోరాటం వైపుకు...
ఉత్తర ప్రదేశ్‌ సీతాపూర్‌లో పుట్టిన కెప్టెన్‌ మనోజ్‌ కుమార్‌ పాండే క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కలలుగన్నారు. అయితే కాలం ఆయనను ఆర్మీ వైపుకు అడుగులు వేయించి దేశం కోసం పోరాడేలా చేసింది. కార్గిల్‌ యుద్ధంలో శత్రు సైన్యంపై తిరగబడి ఎంతోమందిని అంతమొందించిన ఆయన, చివరకు అదే యుద్ధంలో అమరులయ్యారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 25 సంవత్సరాలు. కార్గిల్‌ యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ప్రభుత్వం పరమ వీర చక్ర అవార్డుతో గౌరవించింది.

ఛాతీలోకి బుల్లెట్లు దిగినా...
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కలొల్‌ బకైన్‌ ప్రాంతానికి చెందిన రైఫిల్‌మ్యాన్‌ సంజయ్‌ కుమార్‌కు ఆర్మీకి పనిచేయాలన్న కలలు కంటూ ఉండేవారు. మూడు సార్లు రిజెక్ట్‌ అయినా మళ్లీ ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం విజయవంతమై అర్మీలో ఉద్యోగం వచ్చింది. కార్గిల్‌ యుద్ధంలో ఒక ట్రూప్‌ను లీడ్‌ చేసే స్థాయికి కూడా వచ్చేశారు. యుద్ధం సమయంలో ఓ కొండపై ఉన్న పాకిస్థాన్‌ సైనికులను అంతమొందించాలన్న ప్లాన్‌లో భాగంగా పైకి చేరుకుంటున్న సంజయ్‌ కుమార్‌ టీమ్‌కు ఎదురుకాల్పులు ఎదురయ్యాయి.

పాకిస్థాన్‌ సైనికులు ట్యాంకర్స్‌తో దాడికి పాల్పడుతూ వచ్చారు. ఇవేవీ లెక్కచేయకుండా కొండ ఎక్కి, శత్రు సైనికులను కాల్చేశారు. అప్పటికే ఆయన ఛాతీలోకి రెండు బుల్లెట్‌లు దిగినా, ధైర్య సాహసాలతో శత్రు సైనికులను ఎదిరించి ఆ ప్రాంతాన్నంతా స్వాధీనం చేసుకున్నారు. సంజయ్‌ కుమార్‌ సాహసోపేత చర్యను గుర్తిస్తూ ప్రభుత్వం ఆయనకు పరమ వీర చక్ర అవార్డును ప్రదానం చేసింది.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా