ఈయనెంతో నేనూ అంతే!

19 Nov, 2016 22:48 IST|Sakshi
ఈయనెంతో నేనూ అంతే!

విడ్డూరం

అనగనగా ఒక యజమాని. ఆ యజమానికి అనగనగా ఒక శునకం... ఇదేమి వింత కాదు. ఇక్కడ కూడా అనగనగా ఒక యజమాని ఉన్నాడు. పేరు టోపెర్ బ్రోడీ. అనగనగా ఒక శునకం కూడా ఉంది. పేరు రోసెన్‌బెర్గ్. వీరి గురించి చెప్పుకోవడానికి ఎంతో కొంత ‘వింత’ ఉంది. యజమాని బ్రోడీ, శునకానికి తన ప్రేమను మాత్రమే పంచలేదు. తాను ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడో అచ్చు... అలాంటి డ్రెస్ శునకానికి వేసి మురిసిపోతాడు. మురిసిపోవడం మాత్రమే ఏమిటి... అటువంటి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి మరింత మురిసిపోతున్నాడు.

‘‘ఇది శునకం కాదు... నా కుమారుడు’’ అని డప్పు కొట్టి మరీ ప్రచారం చేశాడు న్యూయార్క్‌కు చెందిన బ్రోడీ.ఈ జోడీకి అభిమానులు కూడా ఏర్పడ్డారు. ‘ఇద్దరూ ముద్దొచ్చేలా ఉన్నారు’  ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’... ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. కౌబాయ్ కాస్ట్యూమ్స్ నుంచి పోలీసు యూనిఫాం వరకు... అనేక వేషాలు వేశారు ఇద్దరు. వేషాలు వేయడమే కాదు... మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఓటు విలువ’ గురించి ప్రచారం కూడా చేశారు. ఇలాంటి పనులు తండ్రి-కొడుకులు మరిన్ని చేయాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు