మాన్‌సూన్ స్పాట్

3 Jul, 2016 00:00 IST|Sakshi
మాన్‌సూన్ స్పాట్

మాల్‌షేజ్ ఘాట్ : టూర్‌దర్శన్
పడమటి కనుమల మిట్టపల్లాలు నిండిన కొండలు, గుట్టలు... కొండల మీదుగా వడివడిగా దూకే జలపాతాలు...  కొండల మీద కట్టిన పురాతన కోటలు... కొండలెక్కి చూస్తే కనుచూపు మేరలో అంతా ఆకుపచ్చని లోకంగా కనిపించే దట్టమైన అడవులు... అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే అరుదైన పక్షులు, వన్యమృగాలకు ఆలవాలం మాల్‌షేజ్ ఘాట్... ప్రకృతి సౌందర్యానికి ఇది కేరాఫ్ అడ్రస్. చాలా పర్యాటక ప్రదేశాలు వేసవిలో లేదా శీతాకాలంలో మాత్రమే పర్యటనలకు అనుకూలంగా ఉంటాయి. వానాకాలంలో సైతం పర్యాటకులకు అనుకూలంగా ఉండటం మాల్‌షేజ్ ఘాట్ విశేషం.
 
ఏం చూడాలి?
మహారాష్ట్రలోని మాల్‌షేజ్ ఘాట్‌లో కొండలు కోనల అందాలను చూసి తీరాల్సిందే. కొండల మీదుగా దూకే జలపాతాల సవ్వడిని, ఇక్కడ సంచరించే అరుదైన విహంగాల కిలకిలరావాలను ఆలకించాల్సిందే. ప్రకృతి సౌందర్యానికే కాదు, చారిత్రక నేపథ్యానికీ, పౌరాణిక ప్రాశస్త్యానికీ కూడా ఆలవాలమైన మాల్‌షేజ్ ఘాట్‌లో తప్పనిసరిగా చూడాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి.
 
ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన శివనేరి కోట మాల్‌షేజ్ ఘాట్‌లోనే పుణే జిల్లాలోని జున్నార్ సమీపంలో ఉంది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దిలో ఈ ప్రదేశం బౌద్ధుల అధీనంలో ఉండేది. ఇక్కడి రాతి గుహల్లోని రాతి నిర్మాణాలు, శిల్పకళా చాతుర్యం బౌద్ధుల వైభవానికి అద్దం పడుతుంది. కోట లోపల శివాయిదేవి ఆలయం ఉంది. ఈ దేవత పేరిటే జిజియాబాయి తన తనయుడికి శివాజీ అనే పేరు పెట్టారట!
 
అహ్మద్‌నగర్ జిల్లాలోని కొథాలే గ్రామంలో ఉన్న హరిశ్చంద్రగడ్ మరో పురాతనమైన కోట. పలు పురాణాల్లో ప్రస్తావించిన ఈ కోట క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందనదని భావిస్తారు. కొండపై నిర్మించిన ఈ రాతి కోటలో సప్తతీర్థ పుష్కరిణి, ఈ పుష్కరిణి ఒడ్డునే విష్ణువాలయం ఉంటాయి. హరిశ్చంద్రేశ్వరాలయం, దానికి చేరువలోనే కేదారేశ్వర ఆలయంలోని భారీ శివలింగం సందర్శకులను ఆకట్టుకుంటాయి.
 
మాల్‌షేజ్ ఘాట్ మీదుగా ఉరకలు వేసే మాల్‌షేజ్ జలపాతం వంటి ఉధృత జలపాతాలతో పాటు పలు చిన్నా పెద్దా జలపాతాలు కనువిందు చేస్తాయి. ఎత్తై కొండ మీదుగా సన్నని ధారలా కురిసే చిన్న చిన్న జలపాతాల దిగువన పర్యాటకులు స్నానాలు కూడా చేస్తుంటారు.
 
పింపల్‌గావ్ వద్ద పుష్పావతి నదిపై నిర్మించిన జోగా డ్యామ్ వద్దకు వచ్చే వలసపక్షుల సందడిని ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. ఇక్కడకు సైబీరియా నుంచి పెలికాన్ కొంగలతో పాటు పలు అరుదైన విదేశీ పక్షులు వస్తుంటాయి.
 
మాల్‌షేజ్ ఘాట్ కొండలపైనే నిర్మించిన అజోబా కోటకు పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది. ఆదికవి వాల్మీకి ఈ ప్రదేశంలోనే తపస్సు చేసుకున్నాడని ప్రతీతి. ఈ కోటలో వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి సమాధి సందర్శకులను ఆకట్టుకుంటాయి.
 
మాల్‌షేజ్ ఘాట్ కొండలు సముద్ర మట్టానికి దాదాపు 700 మీటర్ల ఎత్తున ఉండటంతో వేసవిలో సైతం ఇక్కడ వాతావరణం చల్లగానే ఉంటుంది. అయితే వర్షాకాలంలో ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇక్కడకు పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే ఇక్కడకు వలస పక్షుల రాక మొదలవుతుంది.
 
 
ఏం చేయాలి?
* మాల్‌షేజ్ ఘాట్ కొండలు పర్వతారోహణపై ఆసక్తిగల ఔత్సాహిక ట్రెక్కర్లకు అనుకూలంగా ఉంటాయి. అడుగడుగునా తారసపడే శిఖరాలపైకి ఎక్కి చూస్తే పచ్చదనంతో నిండిన పరిసరాలు కనువిందు చేస్తాయి.
* ఇక్కడి వాల్మీకి ఆశ్రమం, హరిశ్చంద్రేశ్వరాలయం, కేదారేశ్వర ఆలయం, విష్ణు మందిరం వంటి పురాతన దేవాలయాలు ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆకట్టుకుంటాయి. చరిత్ర, పురాతత్వ పరిశోధనలపై మక్కువ గలవారు ఇక్కడి కోటలను, వాటిలోని విశేషాలను చూసి తీరాల్సిందే.
* ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారు ఇక్కడి జలపాతాల ఒడ్డున లేదా జోగా డ్యామ్ వద్ద పిక్నిక్‌లు చేసుకోవచ్చు. ఇక్కడ సంచరించే వన్యప్రాణులను, సీజన్‌లో వచ్చే వలసపక్షులను తిలకించవచ్చు. స్వేచ్ఛగా వన విహారాలు చేయవచ్చు.
 
ఏం కొనాలి?
* కొండలు, కోనలతో నిండిన మాల్‌షేజ్ ఘాట్‌లో అక్కడక్కడా చిన్న గ్రామాలు తప్ప షాపింగ్ చేయడానికి అనువైన బజారులేవీ ఉండవు.
* ఘాట్‌పై సాగే ప్రయాణంలో తోవలో అక్కడక్కడా దొరికే మల్బరీ పండ్లు, సీతాఫలాలు వంటివి కొనుక్కోవచ్చు.
* కరక్కాయలు, వనమూలికలు, తేనె వంటివి కూడా ఇక్కడి గిరిజనుల వద్ద చౌకగా దొరుకుతాయి.
 
ఎలా చేరుకోవాలి?
* దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు ముంబై, లేదా పుణే చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాల్‌షేజ్ ఘాట్ చేరుకోవచ్చు. ముంబై నుంచి అయితే 154 కిలోమీటర్లు, పుణే నుంచి అయితే 130 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
* ఇక్కడకు సమీప రైల్వేస్టేషన్ కల్యాణ్‌లో ఉంది. కల్యాణ్ నుంచి మాల్‌షేజ్ ఘాట్‌కు బస్సులు, ట్యాక్సీలు విరివిగా దొరుకుతాయి. కల్యాణ్ నుంచి మాల్‌షేజ్ ఘాట్‌కు 84 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

మరిన్ని వార్తలు