గండభేరుండం

25 Nov, 2018 02:36 IST|Sakshi

ఒక ఊళ్ళో ఒక పేదరైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు. తల్లి, తండ్రి, ఇద్దరన్నలు రెక్కలు ముక్కలు చేసుకుని పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి చేరి ఆరోజు దొరికిన దానితో వండిపెడితే హాయిగా తిని, ఏ చీకూ చింతా లేకుండా ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటూ గడిపేవాడు మూడవవాడు. ఒకరోజు రెండవ వాడికి కోపం వచ్చి ‘‘మనం ముగ్గురం కష్టపడుతుంటే చిన్న సాయం కూడా చేయకుండా తింటున్నాడు. ఇన్నాళ్ళూ చిన్నవాడని వెనకేసుకొచ్చారు. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ పడుచువాడయ్యాడు కదా? వాడ్ని కూడా పనిలో పెట్టండి నాన్నా’’ అని అన్నాడు తండ్రితో. తండ్రి అందుకు సమ్మతించి మూడవ వాడిని ఆ వూరి జమిందారు గారి ఆవులు కాసే పాలేరు దగ్గర పనికి కుదిర్చాడు దినభత్యం కింద. రోజూ పొద్దుటే పెరుగన్నం తిని ఆవుల్ని గుట్టల మీదికి తోలుకెళ్ళేవాడు అతను. ఒకరోజు పేద్ద కొండలాంటి గండభేరుండ పక్షి ఒకటి అతని మందలోని దూడను కాళ్ళతో పట్టుకుని పైకెగిరింది. అది గమనించిన ఆ కుర్రవాడు పాలేరు శిక్షిస్తాడన్న భయంతో దూడను గట్టిగా పట్టుకోవడంతో అతనుకూడా దూడతోసహా గాల్లో వేలాడసాగాడు. గండభేరుండం దూడను అమాంతం నోట్లోకి వేసుకునే సమయానికి అంతవరకూ ఆవుల్ని కాయటానికి తెచ్చుకున్న ముల్లుకర్రను దూడకన్నా ముందుగా చటుక్కున ముక్కుకు అందించేసరికి దానిముక్కు ముళ్ళు గుచ్చుకుని రక్తమోడి భీకరంగా అరిచింది. దూడ ఎత్తయిన గడ్డివాములోకి జారి బ్రతికిపోయింది. పక్షి కొండకొమ్మున ఆగటంతో అతను ఆ కొండమీదే దిగి దానికంటపడకుండా కనిపించిన ఓ గుహలోకెళ్ళి నక్కాడు.

ఆ గుహలో ఎవరిదో ఏడుపు వినిపించి చూడగా ఒక యువతి తాళ్ళతో బంధింపబడి కనిపించింది. వెంటనే ఆమెను బంధ విముక్తురాలిని చేసి వెలుపలికి తీసుకొచ్చాడు. వారి కదలికలకు ఆమెను బంధించి తెచ్చిన కొందరు బందిపోట్లు వెంటపడగా ఆ అలికిడికి బెదిరిన గండభేరుండం ఎగరటానికి సిద్ధమైంది. వెంటనే ఆమెను హెచ్చరించి ఇద్దరూ గండభేరుండం కాళ్ళను పట్టుకుని గాల్లోకి ఎగిరారు. కొంతసేపటికి ముక్కుబాధతో పక్షి రెక్కలు విదల్చగా ఇద్దరూ వెళ్ళి అడవిలోని ఓ కొలనులో పడ్డారు. ఎలాగో ఇద్దరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు చెప్పింది ఆమె తాను ఆ నగరంలోని పేద్ద జమిందారుగారి ఏకైక పుత్రికనని. ఆమెను జాగ్రత్తగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు అతను. గుడికి వెళ్ళిన తమ గారాల పట్టిని బందిపోట్లు ఎత్తుకెళ్ళారని తెలిసి కంటికిమింటికి ఏకధాటిగా దుఃఖిస్తున్న ఆ దంపతులు సంతోషించి తమ కుమార్తె అభీష్టం మేరకు అతనికే ఇచ్చి వివాహం చేశారు. అంతేకాకుండా అతని కోరిక ప్రకారం అతని ఇద్దరన్నలకూ దివాణంలో ఉద్యోగాలిచ్చి, అతని తల్లిదండ్రులను అతని వద్దే వుంచుకోవడానికి ఆనందంగా అంగీకరించారు. పేదరికం వల్ల తమ్ముడిమీద వంతులువేసి పనిచేయించమని చెప్పినా మనసులో పెట్టుకోకుండా ఆదరించినందుకు అన్నలిద్దరూ తమ్ముడి ఔదార్యానికి ఆనందించారు. ఏమైనా కష్టం వచ్చిందని చేతులు ముడుచుకోకుండా సాహసం చేసినందుకు తగిన ఫలితం దక్కిందని నగర ప్రజలు అతన్ని కొనియాడారు. 

డేగల అనితాసూరి
  

మరిన్ని వార్తలు