మీ ఒంటరితనం... వారికి శాపం కాకూడదు!

6 Sep, 2014 23:25 IST|Sakshi
మీ ఒంటరితనం... వారికి శాపం కాకూడదు!

వాయనం: ఇటీవలి కాలంలో సింగిల్ మదర్‌‌స పెరుగుతున్నారు. పెళ్లి ఇష్టం లేని కొందరు మహిళలు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. భర్తకు దూరమైనా బిడ్డలను వదులుకోలేక వారి పెంపకపు బాధ్యతను తామే తీసుకుంటున్నారు ఇంకొందరు మహిళలు. అయితే తండ్రి లేని లోటును భరించడం, సహించడం పిల్లలకు అంత తేలిక కాదు. తల్లి ఒంటరితనం వారిని కొన్నిసార్లు ఇబ్బందికి గురి చేయవచ్చు. తల్లీబిడ్డల మధ్య ఆగాధాన్ని సృష్టించవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే... కొన్ని గుర్తుంచుకోవాలి!
 
 -    ఒకవేళ మీరు భర్త నుండి విడిపోయినా లేక వారు మరణించినా... ఆ బాధను మనసులోనే ఉంచుకోవడం మంచిది. మీరు దిగులుపడితే పిల్లలు అభద్రతా భావానికి లోనవుతారు.
 -    మీరు విడాకులు తీసుకుంటే... మీ భాగస్వామి గురించి పిల్లల ముందు ఎక్కువగా మాట్లాడకండి. దానివల్ల అతని గురించి పిల్లలు ఆలోచించడం మొదలుపెడతారు!
 -    ఒక వయసు వచ్చాక మీ ఒంటరితనం గురించి పిల్లల మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వారికి నిజమే చెప్పండి. ఏ పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో/ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సి వచ్చిందో వివరించండి. నిజాలు వేరే వారి ద్వారా తెలిసినా లేక నిజాలు నిజాలుగా కాక వేరే విధంగా అర్థమైనా పిల్లలు మిమ్మల్ని గౌరవించకపోవచ్చు.
 - ఎవరైనా తండ్రి గురించి ప్రశ్నిస్తే ఏం చెప్పాలో ముందే చెప్పండి. లేదంటే వాళ్లు కన్‌ఫ్యూజ్ అవుతారు. పైగా ఎవరైనా నెగిటివ్‌గా కామెంట్ చేస్తే హర్ట్ అవుతారు!
  పనిని, ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు పడుతోన్న అవస్థను పిల్లలకు మొదట్నుంచీ అర్థమయ్యేలా చేయండి. కొన్ని పనులు చక్కబెట్టడం వారికి అలవాటు చేయండి. ఎందుకంటే వాళ్లు మీ మీద అతిగా ఆధారపడితే ఇబ్బందే!
 -    ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయితే... మొదట్నుంచీ లో ప్రొఫైల్‌లో ఉండటం అలవాటు చేయండి. లేదంటే మిగతా పిల్లలను చూసి... నాకూ నాన్న ఉంటే బాగుండేది కదా అని ఫీలయ్యే ప్రమాదం ఉంది!
 -    మీకున్న తోడు కేవలం పిల్లలే కదా అని వారి విషయంలో మితిమీరి జాగ్రత్త పడకండి. క్షేమం చూసుకోవాలి. కానీ దాని కోసం కఠినంగా వ్యవహరించడం, క్రమశిక్షణ పేరుతో ఎక్కువ హద్దులు పెట్టడం చేయవద్దు. వారి మనసులు గాయపడితే మాన్పడం చాలా కష్టం. పైగా మీకు భయపడి చాటుగా చేయడం మొదలుపెడితే వారి భవిష్యత్తు దెబ్బ తింటుంది!
 -    అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... పిల్లల్ని పిల్లల్లానే చూడండి. వాళ్లకు మీ పరిస్థితులు, ఇబ్బందులు వివరించండి గానీ... వాళ్లు మిమ్మల్ని అర్థం చేసేసుకోవాలని తాపత్రయ పడకండి. వాళ్లు చిన్నవాళ్లు. అన్నీ అర్థం కావు. అర్థమయ్యేవరకూ ఎదురు చూడాలి తప్ప బలవంత పెట్టకూడదు. కోప్పడనూ కూడదు.

మరిన్ని వార్తలు