బంగారు తల్లి!

28 May, 2017 01:57 IST|Sakshi
బంగారు తల్లి!

‘తల్లిపాలు అమృతంతో సమానం’ అంటారు. ఆ అమృతానికి కొరత ఏర్పడింది. మన దేశంలో తక్కువ సంఖ్యలో ‘తల్లిపాల కేంద్రాలు’ ఉన్నాయి. వీటి గురించి కూడా తక్కువ మందికే తెలుసు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తల్లిపాల గొప్పదనం  గురించి ప్రచారం చేయడమే కాదు... స్వయంగా బ్రెస్ట్‌ మిల్క్‌ డొనేట్‌ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చెన్నైకి చెందిన శరణ్య గోవిందరాజులు.
తాను గర్భవతిగా ఉన్న సమయంలో  ‘నేచురల్‌ పేరెంటింగ్‌’ అనే ఫేస్‌బుక్‌ కమ్యూనిటీలో చేరారు శరణ్య, ఈ కమ్యూనిటీ ద్వారా ‘బ్రెస్ట్‌మిల్క్‌ డొనేషన్‌’తో  పాటు  ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోగలిగారు.‘బ్రెస్ట్‌మిల్క్‌ డొనేషన్‌’  శరణ్యను  ఆకట్టుకుంది. తాను కూడా చేయాలనుకున్నారు.

 ఈ సమయంలోనే వాహిదాలాంటి బ్రెస్ట్‌మిల్క్‌ డోనర్లు శరణ్యకు మార్గదర్శకంగా నిలిచారు. ప్రోత్సహించారు. పాలను దానం చేయడానికి ‘కంచి కామకోఠి చైల్డ్స్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌’ను ఎంచుకున్నారు శరణ్య. పాలదానం చేసే క్రమంలో హాస్పిటల్‌కు వెళుతున్నప్పుడు  ‘బ్రెస్ట్‌ మిల్క్‌బ్యాంక్‌లు’ ‘బ్రెస్ట్‌మిల్క్‌ డొనేషన్‌’ అనేవి ఎంత ప్రాధాన్యత కలిగిన విషయాలో  మరింత బాగా తెలిసింది.‘‘పాలదానం విషయంలో నా కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఆనందాన్ని ఇస్తుంది’’ అంటున్నారు శరణ్య.ఒకసారి శరణ్య హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ఒక తల్లి... ‘‘ఏమ్మా... పాలను ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకుంటావు?’’ అని అడిగింది. ఆశ్చర్యపోవడం శరణ్య వంతైంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని తాను ఉచితంగా పాలదానం చేస్తున్నానని చెప్పారు.

ఆ సమయంలో ఆ తల్లి కంట్లో వెలుగు కనిపించింది.‘బ్రెస్ట్‌ మిల్క్‌ డొనేషన్‌’ గురించి కొందరికి అపోహలు ఉండవచ్చు. కొందరికి అవగాహన లేకపోవచ్చు.... ఇలాంటి వారికి శరణ్య గోవిందరాజులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శరణ్యతో ఒక్కసారి మాట్లాడితే చాలు... ‘బ్రెస్ట్‌మిల్క్‌ డొనేషన్‌’ అనేది మనసుకు ఎంత తృప్తిని ఇచ్చే పనో తెలుసుకోగలుగుతున్నారు.‘బ్రెస్ట్‌ మిల్క్‌ డొనేషన్‌’ గురించి ఎంత అవగాహన కలిగిస్తే...అన్ని ‘మిల్క్‌బ్యాంకు’లు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. శరణ్యలాంటి వాళ్లు మరింత మంది పూనుకుంటే ఆ అవగాహన విస్తృతి మరింత వేగంగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.

 

మరిన్ని వార్తలు