ఎదగనీ నవతరం చెట్టై, తల్లిభాషే తల్లివేరై !!

2 Nov, 2014 00:40 IST|Sakshi
ఎదగనీ నవతరం చెట్టై, తల్లిభాషే తల్లివేరై !!

పద్యానవనం: చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ
 బంగారు మొలతాడు పట్టు దట్టి
 సందెతాయెతలును సరిమువ్వ గజ్టెలు
 చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు!
 
ఎప్పుడో చిన్నప్పటి పద్యం. ఇంకా గుర్తుందంటే, దాని బలం అలాంటిది. తరాల తరబడి ఈ పద్యం జనం నాలుకల మీద నాట్యమాడుతోందంటే ఏదో మంత్రశక్తి ఈ పద్యంలో దాగుంది. చాలా చిన్నపుడు మా అక్కలో, కానిగిబడి పంతులో... సర్కారు పంతులో... సరిగ్గా గర్తులేదు కానీ, ఎవరో నేర్పించారు. ఇంకా చాలా నేర్పించారు. అందులో కొన్ని గట్టిగా స్థిరపడిపోయాయి. కొన్ని కాలక్రమంలో ఎగిరిపోయాయి. ‘ఛుక్ ఛుక్ రైలూ వస్తుంది... అందరు పక్కకు జరగండి... ఆగీనాక ఎక్కండి.... జోజో పాపా ఏడవకు.... లడ్డూ మిఠాయి తినిపిస్తా....హోటల్ కాఫీ తాగిపిస్తా!’ అని కూడా నేర్పించారు. ఇది నాతో పాడించినపుడు, నాకెంత ఆనందమో! నేర్పించిన వాళ్ల ముఖాలూ వెలిగిపోయేవి. నాకన్నా ఎక్కువ ఆనందం నాకు నేర్పించిన వాళ్లకు కలిగిందని, నేను పెద్దయి పిల్లలకి నేర్పినపుడు అర్థమైంది.
 
 చిన్ని కృష్ణుడ్ని చేరి కొలిచే సంగతెలా ఉన్నా, చిన్న చిన్న పిల్లల్ని మాత్రం చాలా మందికి ఇటువంటి పాటలు, పద్యాలతో నే చేరువైన మాట మాత్రం నిజం. ‘పాటలు, పద్యాలు పాడుకుందాం రండి’ అని ఓ జనరల్ కాల్ ఇస్తే, కొందరొచ్చేవారు. ఇంకొందరు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దూరంగా ఉండి గమనించే వారు. చిన్న పిల్లల్ని మచ్ఛిక చేసుకొని ఒక్కో పదం పలికిస్తూ పాటలు, పద్యాలు పాడిస్తుంటే, అంతవరకు రామని మొరాయించిన వాళ్లు కూడ ఒక్కరొక్కరే వచ్చి చేరేది. వాళ్లలో వాళ్లకు పోటీ పెడితే ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఆ వాతావరణం! మాతృ భాష మాధుర్యమది. మెదడు వికసించే బాల్య దశలో తల్లి భాషలో చెప్పే అంశాలు బలంగా నాటుకొని జీవితకాలం పాటు వార్ని ప్రభావితం చేస్తాయి.
 
 ‘చందమామ రావే! జాబిల్లి రావే! కొండలెక్కి రావే! గోగుపూలు తేవే!’ అని కౌసల్య పాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంటే, ముద్దలు మింగుతూ రాముడు కేరింతలు కొట్టేవాడని చదువుకున్నాం. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, రష్యా, జపాన్ ఇలా అభివృద్ధి చెందిన ఏ దేశం తీసుకున్నా... శైశవ దశలో వారికి విద్యా బోధన జరిపించేది మాతృభాషలోనే! ప్రతి ప్రగతికాముక దేశంలోనూ బాల్యంలో బలమైన, ప్రభావవంతమైన ముద్ర వేసేది తల్లి భాష, ఆ భాషలో చెప్పే తేలికపాటి విషయాలే అన్నది సశాస్త్రీయంగా దృవపడిన విషయం. తెలుసో? తెలియదో? చాలా మంది తెలిసీ తెలియనట్టు నటిస్తున్నారో? ఇంగ్లీషు చదువుల మోజులో పడి తెలుగుభాషను నిరాదరణకు గురి చేస్తున్నారు. ‘మా వాడికి తెలుగు ముక్క రాదు, తెలుసా!’ అని గర్వంగా చెప్పుకునే తలిదండ్రులున్నారు.  ‘జానీ జానీ....? ఎస్ పప్పా! ఈటింగ్ షుగర్....? నో పప్పా! టెల్లింగ్ లైస్...? నో పప్పా! ఓపెన్ యువర్ మౌత్....? హ్హ హ్హ హ్హ!!’ చక్కటి ఇంగ్లీష్ రైమ్.
 
 అలతి అలతి పదాలవటం వల్లో, విషయపరంగా తండ్రీకొడుకుల నడుమ సాగే సున్నితమైన దోబూచులాట అవటం వల్లో... ఇంగ్లీషు భాష  చలామణిలో ఉన్న ప్రతిచోటా ఇదొక హిట్! అలాంటి సాహితీ సృజన తెలుగులోనూ విరివిగా జరగాలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్ని బట్టి పిల్లల అభిరుచుల్ని పరిగణనలోకి తీసుకొని చిన్న చిన్న మాటలు, పదాలతో... పాటలు, పద్యాలు కోకొల్లలుగా పుట్టుకురావాలి. భాష కొంత గ్రాంథికమైనపుడు ‘చేతవెన్న ముద్ద....’ పుట్టి ఉంటుంది. తర్వాత్తర్వాత పిల్లల కోసం చక్కటి తెలుగు గేయాలు, పాటలు రాలేదని కాదు. ‘‘బాలు బాలు- పెద్ద బాలు, కాళ్లు లేవు చేతులు లేవు, పొట్టనిండ తిను ఎగురు దుంకు!’’ లాంటి తేలిక మాటల గేయాలు, పద్యాలు కూడా వచ్చాయి.

‘‘బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెడితివి? రాజుగారి తోటలోన తిరగ వెళ్తిని, రాజుగారి తోటలోన ఏమి చేస్తివి? తోటలోని మంచి పూల సొగసు చూస్తిని, సొగసు చూస్తే రాజు గారు ఊరకుండిరా? తోటమాలి కొట్టవస్తె తుర్రుమంటిని’’ లాంటి గేయాలు ఏ ఇంగ్లీషు రైమ్స్‌కి తీసిపోనివిగా పిల్లల్ని ఆకట్టుకున్నాయి. ఉద్యోగ-ఉపాధి అవకాశాల కోసం, విశ్వనరులుగా ఎదగడం కోసం పిల్లలకు ఇంగ్లీషు నేర్పండి, తప్పులేదు. మంచి విద్యావకాశాల కోసం ఇంగ్లీషు మాధ్యమంగానే కోర్సులు చదివించండి అభ్యంతరం లేదు. అదే సమయంలో, మేధో-వ్యక్తిత్వ వికాసానికి తల్లి భాషనూ నేర్పించండి. అంటే, విధిగా రాయడం, చదవటం వచ్చేలా చేసే ప్రక్రియ ఓ ఉద్యమంలా సాగాలి. అందుకు బాల్యమే మంచి సమయం. తల్లిదండ్రులారా కొంచెం చొరవ చూపండి.
 - దిలీప్‌రెడ్డి

మరిన్ని వార్తలు