నవ్వింత: మా పోలీసు బావ పాత కథలూ... కొత్త నీతులూ!

7 Jun, 2014 23:00 IST|Sakshi
నవ్వింత: మా పోలీసు బావ పాత కథలూ... కొత్త నీతులూ!

ఈమధ్య మా పోలీస్ బావను కొత్తగా ట్రాఫిక్ విభాగానికి మార్చారు. అప్పట్నుంచీ... ఎవరు కనిపించినా ట్రాఫిక్ రూల్స్ గురించి గంభీరంగా ఉపన్యాసాలు ఇస్తున్నాడు. పైగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన అవసరాలను మన పూర్వీకులంతా ప్రాచీన బాల సాహిత్య గాథల్లో పొందుపరిచారంటూ ఉద్బోధిస్తున్నాడు. ఆయన చెప్పిన కథల్లో మచ్చుకు కొన్ని...
    
 అప్పట్లో ఓ కుందేలూ, తాబేలూ పరుగుపందెం వేసుకున్నాయట. కుందేలు  వేగంగా పరుగులు పెట్టిందట. తాబేలు  వెనకబడి ఉండటం చూసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుందట. చెట్టుకింద అలా నిద్రలోకి జారిపోయిందట. ఈలోపు తాబేలు మెల్లిమెల్లిగా  గమ్యాన్ని చేరుకుని విజయం సాధించిందట. అవతలివారిని తక్కువగా అంచనా వేయకూడదన్న నీతి మనందరికీ తెలిసిందే కదా. కానీ ఈ కథకు మా బావ చెప్పే భాష్యం వేరే ఉంది. నిజానికి కుందేలు దూకుడుగా పరుగులు తీసిన మాట వాస్తవమే గానీ... వేగం ఎక్కువై దాని తలకు దెబ్బ తగిలిందట. చాలాసేపు స్పృహ కోల్పోయిందట. కానీ తాబేలు తన నేచురల్ డిప్పనే హెల్మెట్‌గా ధరించి ఉండటంవల్లనూ, నిదానమే ప్రధానమని గ్రహించడం వల్లనూ రేసు గెలిచిందన్నది మా బావ ఉవాచ.
    
 మరో కథ...
 అప్పట్లో ఓ చెరువు దగ్గర ఓ తాబేలూ, రెండు హంసలూ చాలా స్నేహంగా ఉండేవట. క్రమంగా చెరువు ఎండిపోతుండటంతో హంసలు రెండూ దూరంగా ఉన్న మరో సరస్సుకు వలసపోదామని నిర్ణయించుకున్నాయట. తానూ వస్తానందట తాబేలు. తాబేలును తమతో తీసుకెళ్లడం ఎలా అని సందేహించిన హంసలు ఓ ప్లానేశాయట. హంసలు రెండూ ఓ కర్రను రెండు చివరలా కరచి పట్టుకున్నాయట. కర్ర మధ్య భాగాన్ని తాబేలు కరచిపట్టుకుందట. ఇలా ఆ మూడూ సమీపంలోని సరస్సుకు ఎగిరి వెళ్తున్న సమయంలో ఓ ఊళ్లోని ప్రజలంతా ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఎందుకు గుమిగూడారంటూ అడగడానికి నోరు తెరచిన తాబేలు కిందపడిందట. ఈ కథ ఇంతవరకూ చెప్పి... ఎప్పుడూ ఎవరూ వినని ట్రాఫిక్ నీతుల్ని వివరించాడు మా పోలీస్ బావ.
 
 మొదటి మాట... తాబేలు కర్రను కరచి పట్టుకోవడం అంటే... ఇప్పుడు మనం కార్ సీటును కరచిపట్టుకుని ఉండేలా సీటుబెల్టు పెట్టుకోవడం లాంటిదట. ఏదో అడగడానికి తాబేలు నోరు తెరచింది. అంటే అది తన సహజ సీట్‌బెల్టును విప్పేయడంతో సమానమట. అందుకే ఈ ప్రమాదం జరిగిందట.  పనిలో పనిగా మరో మాటా చెప్పాడు. రెండు హంసలూ, ఒక తాబేలూ కలిసి ఇలా ప్రయాణం చేయడం త్రిబుల్ రైడింగ్‌తో సమానమట. కాబట్టి త్రిబుల్స్ వెళ్లడం పరమ డేంజర్ అని కూడా ఈ కథ నుంచి అన్యాపదేశంగా గ్రహించవచ్చన్నది ఈ కథలోని ఉపనీతి అట. అసలు నీతితో పాటు ఈ బైప్రాడక్ట్ నీతినీ బైపాస్ చేయకూడదన్నది మా బావ ‘ఉప’దేశం.
 
  ఇంకో కథ...
 ఒక రోజున కొందరు పనివారు ఓ కొయ్యదుంగను చీల్చుతున్నారట. ఇంతలో భోజనాల వేళ అయ్యిందట. చీల్చిన దుంగలు కలిసిపోకుండా ఉండటానికి ఈ రెండు  దుంగల మధ్యన ఒక ఉలిని పిడిలా అమర్చి వెళ్లారట ఆ పనివాళ్లు. ఈలోపు ఒక కొంటె కోతి వచ్చి చీల్చిన దుంగల మధ్యన తన తోకను వేలాడుతుండేలా ఉంచి, పిడిలా అడ్డం పెట్టిన ఉలిని లాగేసిందట. దాంతో చీల్చిన దుంగులు రెండూ దగ్గరగా కలిసిపోయి, వాటి మధ్యన తన తోక నలిగిపోవడంతో కోతికి ఎంతో నొప్పెట్టిందట.  ఇందులోంచి మా బావ వెలికితీసిన నీతి ఏమిటంటే... రెండు దుంగల మధ్యన తోకను వేలాడేలా ఉంచడం అంటే రోడ్డు నడిమధ్యన నిర్లక్ష్యంగా నడవడం  లాంటిదట. ఒకవేళ కోతేగానీ తోకను నేరుగా దుంగల మధ్యన కాకుండా... ఏ ఎడమ పక్కగానో ఉంచి ఉంటే, తోక  గాయపడకుండా ఉండేదట. ఎవరైనా తమ తలాతోకా వంటి శరీర భాగాలను రోడ్డుకు ఎడమపక్కనే ఉండేలా జాగ్రత్తపడాలట.
    
 ఈమధ్య వీలైనంతవరకు మేమంతా మా బావకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాం. పైగా మేమంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ హెల్మెట్ ధారణ మా బావ ఉపదేశాల మూలంగా మాకు జ్ఞానోదయం కలగడం వల్ల మాత్రం కాదు. ఆయన మమ్మల్ని గుర్తుపట్టకుండా తప్పించుకోవడం కోసం! ఈ విషయమూ మా బావకూ తెలిసిపోయింది. కారణం ఏదైతేనేం... ఇన్‌డెరైక్ట్ రీజన్స్ వల్లనైనా తన ఉపదేశాలను పాటిస్తున్నందుకు ఆనందించాడాయన.
 - యాసీన్

మరిన్ని వార్తలు