నాన్న పంచె

16 Nov, 2014 01:00 IST|Sakshi
నాన్న పంచె

 కథ
 తమిళ మూలం: ప్రభంజన్
 అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

 
నాన్న దగ్గర ఒక పంచె ఉండేది. నాన్న దగ్గర పట్టు పంచెలు ఎన్నో ఉన్నప్పటికీ, చిన్న పిల్లలమైన మాకు ఆయన కట్టుకునే ఎరుపు రంగులోని పంచె అంటేనే అద్భుతంగా అనిపించేది.
 
ఎరుపంటే అంత చిక్కటి ఎరుపేమీ కాదు. అలాగని కుంకుమ రంగేమీ కాదు. ఉదయకాలంలోని సూర్యకిరణాలు అరుణవర్ణంలో కనిపిస్తాయే, అలాంటి రంగులో ఉండే పంచె అది!
 
పంచె అంతా పూర్తిగా అదే వర్ణం కాదు. అంచు మాత్రం పచ్చ రంగు. నాలుగు వేళ్ల వెడల్పున్న సరిగతో ఉంటుంది. అంచున ఒకదాని వెంట ఒకటి నడిచి వెళ్లే బాతుల బొమ్మలు. అవి బాతులు కావు, హంసలని చెప్పేది అమ్మ. మేము హంసల్ని నిజంగా చూడలేదు. ఆ పంచెలోని అంచులోనే చూడగలిగాం. ఏదైతే ఏం? ప్రాణమున్న జీవరాశులేగా?!
 
ఆ పంచె మామూలు రోజుల్లో చూద్దామంటే కనిపించదు. నాన్న దాన్ని తన అల్మైరాలో భద్రపరిచి ఉంచేవారు. అలాంటి అల్మైరాలన్నీ ఇప్పుడు దొరకటం లేదు. ఇప్పుడన్నీ చిన్న చిన్నవేగా!
 
నాన్న అల్మైరా నుండి దాన్ని బయటికి తీసే సందర్భం మాకు తెలుసు నాకూ మా చెల్లెలు రాజేశ్వరికీ! పండగ దినాలు లేక తాతయ్య ఆబ్దికం మొదలైన రోజుల్లోనే అది బయటికొస్తుంది. ఆ రోజుల్లో మాత్రం మాకు ముందే చెబుతారుగా! నాన్న స్నానం చేసొచ్చి ఆ పంచెను తీసి కట్టుకునేవారు. నాన్న ఎప్పుడు స్నానం చేసొస్తారా అని ఎదురుచూసేవాళ్లం, అల్మైరా ముందు నిలబడి.
 
నాన్నకు స్నానం చేయటానికి గంట సమయం పట్టేది. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారనిపించేది. అది పసిప్రాయం. ప్రశ్నలు మాత్రమే వేసే వయస్సు. ఇప్పుడు అర్థమవుతోంది. స్నానం చెయ్యటం మురికి పోవటానికా? మురికిపోవటానికా స్నానం చేసేది? స్నానం చెయ్యటమన్నది ఒక సుఖం. నడినెత్తిన పడ్డ చల్లదనంపాకుతూ పాదాల దాకా వచ్చే సుఖం కోసమేగా స్నానం చెయ్యటం. స్నానం చేశాక ఏర్పడే నూతనోత్తేజం కోసమేగా స్నానం చెయ్యటం! నాన్న ఒక గంటసేపు స్నానం చెయ్యటం న్యాయమేననిపించింది.
 
సరే! స్నానం పూర్తయ్యాక గబగబ పంచెను తీసి కట్టుకుంటారని అనుకుంటున్నారా? అదేం కాదు! స్నానం చేశాక, కౌపీనంతో (గోచీ) గుమ్మం దగ్గరకొచ్చి నిలబడేవారు. సగం తడిని ఆయనా, మిగతా సగాన్ని సూర్యభగవానుడూ తుడవాలి. మేము నాన్ననే చూస్తుండేవాళ్లం. నీటిబొట్లు ఆయన వీపుమీద గీతలు గీస్తూండటం చూడ్డానికి అబ్బురంగా ఉండేది. ఆయన వీపే ఒక పెద్ద తామరాకులాగానూ, నీళ్లు ముత్యాల్లాగానూ అనిపించేది. నిదానంగానూ, అంగుళం అంగుళంగానూ తుడుస్తూంటే తడి దూరమయ్యేది. నాన్న ఒళ్లంతా బాగా కందిపోయేది. అసలే ఆయన ఒళ్లు ఎరుపు! స్నానమయ్యాక శరీరం పండిపోయినట్టు అయిపోయేది.
 
‘‘సమయమౌతోంది. తొందరగా వచ్చి కట్టుకుంటే ఏంటట?’’ అనేది అమ్మ. దీన్ని కోపంగానూ, నేరారోపణ చేస్తున్నట్టుగానూ చెప్పేదనుకుంటున్నారా? కానే కాదు! ఇంకాసేపు ఆలస్యమైనా పర్లేదు అన్నట్టూ, ఆయన్ను ప్రోత్సహించే విధంగానూ ఉండేది. గుడిసె చూరు మీద ఒక చెయ్యి వేసి ఒంగొని, గుమ్మం బయట నిలబడున్న నాన్నను చూసి నవ్వుతూ అమ్మ ఆ మాటల్ని అనగానే మాకు కోపం ముంచుకొచ్చేది.
 
అమ్మయ్య, అయింది! ఒక రకంగా స్నానం పూర్తిచేసి పై పంచెను నడుముకు చుట్టుకుని, గోచీని తీసి, పిండి, పదిసార్లు విదిలించి, బయటున్న దండెం మీద ఆరేసేవారు. విదిలించినప్పుడు ఎగిరే నీటిబొట్లు సన్నని దోమల గుంపుల్లా ఉండేవి. తర్వాత లోపలికొచ్చేవారు నాన్న! గబగబ వస్తే పరవాలేదుగా! అలా రారు. అరికాలికి అంటుకున్న మట్టిని మెట్టుకు అటు ఇటు రాస్తూ తుడిచేవారు. కాలికి ఒక్క రవ్వ కూడా మట్టి ఉండేది కాదు. మట్టి, మసి ఆయన ఆజన్మ శత్రువులు కదా! మాకు తెలుసుగా! ఆ తర్వాతే అల్మైరాను తెరిచేవారు.
 
ఆ వాసన ఓ అపూర్వమైన సువాసన! తలుపు తియ్యగానే పచ్చకర్పూరం వాసన గుప్పుమని వీచేది. ఒళ్లంతా తుళ్లిపడేలా చేసేది ఆ సువాసన. అందుకోసమేగా ఎదురుచూస్తున్నాం. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాం. ముక్కూ, నోరూ రెంటినీ... ఒడ్డునపడ్డ చేపలా తెరుస్తూ మూస్తూ ఆ సువాసనను అనుభవించేవాళ్లం. అల్మైరాలో ఒక చిన్న జాజికాయ పెట్టె భద్రపరిచేవాడు. ఆ పెట్టెలో ఏముంది?
 
ఒకరోజు, ‘నాన్నా... నాన్నా... ఆ పెట్టెను నాకివ్వు నాన్నా!’ అన్నాను. నాన్న నవ్వుతూ నన్ను పెకైత్తి పట్టుకుని పెట్టెలోకి చూపించారు. ఒక తెల్లటి వస్త్రంలో చుట్టిన పంచె, బొత్తుగా పేర్చిన కాగితాలు (అవి దస్తావేజులని తర్వాత తెలుసుకున్నాను), రాజా రాణీ బొమ్మలు గీసిన నోట్లూ, బంగారు కాసులూ, నాన్నగారి ఎర్ర తెల్లరాళ్లతో చేసిన ఉంగరాలూ అన్నీ ఉన్నాయి. రాజీ ఊరుకుంటుందా, ఏం? ‘నేనూ చూస్తాను నాన్నా’ అంది. నాన్నగారు దానికీ పెట్టె దర్శనం చేయించారు.
 
నాన్నగారు ఇప్పుడు ఆ పెట్టెను తెరిచారు. జాగ్రత్తగా ఆ ఎర్ర పంచెను తీసుకుని గదిలోకి వెళ్లారు. ఉతికి ఆరబెట్టిన అండర్ డ్రాయర్లు నాన్న గదిలో దారం మీద వేలాడుతుండేవి. అవన్నీ ఎంతో పెద్దవిగా ఉండేవి. ఒకదాన్ని చించి రాజీకి పావడ, జాకెట్టు కుట్టీయచ్చు అనేట్టుండేవి. నాన్నగారికి మోకాళ్లదాకా వచ్చేవి. ఒక అండర్ డ్రాయర్‌ను తొడుక్కుని, దానిమీద పంచెను కట్టుకుంటేనే నాన్నగారికి నిలుస్తుంది.
 
నాన్నగారు పంచెను కట్టుకుని బయటికొచ్చేవారు. అబ్బబ్బా... నిప్పును కట్టుకుని వచ్చినట్టేగా ఉండేది. ఆ పంచెలో నాన్నగారు ఎంతో అందంగా ఉండేవారు. ఆయన వల్ల ఆ పంచెకు గొప్పతనమా? లేక ఆ పంచె వల్ల నాన్నగారికి గొప్పతనమా? అప్పుడు నాన్నగారిని గట్టిగా కౌగిలించుకోవాలనిపించేది. కౌగిలించుకునేవాణ్ని. పచ్చ కర్పూరం వాసనతో, ఆ ‘పట్టు’ చల్లగా, వెచ్చగా, పాపాయి చెక్కిలిలా మెత్తగా, మృదువుగా ఉండేది. దాన్ని తడిమి తడిమి చూస్తూ సంతోషించేవాణ్ని.
 
ఆ పంచెతోనే పండగ దినాల్లోనూ, ఆబ్దికం చేసేటప్పుడూ నాన్నగారు పూజలన్నీ చేసేవారు. పూజలంటే నాకు గుర్తుండేవి రెండు విషయాలే! ఒకటి భోజనం. ఆ రోజు తొందరగా కాదు. రెండవది, ఆ దినాల్లో తీపి పదార్థాలు తప్పకుండా చేస్తారు. అంతేకాక బంధువులు చాలామంది వస్తారు.
 
బాల్యంలో నాకు ఓ లక్ష్యం ఉండేది. పెద్దవాళ్లు... ‘నువ్వు పెద్దవాడివయ్యాక ఏం చెయ్యాలనుకుంటున్నావ్?’ అని అడిగేవాళ్లు. అమ్మా, నాన్నా నాకు ముందుగానే చెప్పి ఉంచారు. ఠక్కున బదులిచ్చేవాణ్ని. ‘నేను డాక్టరునవుతాను’ - లేదంటే ‘ఇంజనీరునవుతాను’ అని చెప్పేవాణ్ని. విన్నవాళ్లు ఆశ్చర్యంతో కనుబొమల్ని పైకి లేపి నన్ను చూసేవాళ్లు. నాన్నకు, అమ్మకు గొప్పగా అనిపించేది. అయితే, ఈ డాక్టరు, ఇంజనీరు గొప్పతనం నా మనసులో లేదు. పెద్దవాళ్ల ముందు నేను అబద్ధం చెప్పాను. ఈ అబద్ధం ఆస్వాదించే అబద్ధం. పెద్దవాళ్లు చెప్పిచ్చినదాన్ని వాళ్లకే మళ్లీ అప్పగించేశాను. ఆనందంగా తోకనూపుతూ వాళ్లు దాన్ని దిగమింగారు.
 
దీన్ని చెప్పటానికి సిగ్గెందుకు? నేను పెద్దవాణ్నయ్యాక నాన్నగారి పంచెను కట్టుకోవాలి. ఇదీ నా లక్ష్యంగా ఉండేది. నేను పెద్దవాడయ్యాక ఆశపడ్డది దీనికోసమే! పెద్దవాడైతే నాన్నగారిలా మీసాలు మొలుస్తాయిగా. ముఖ్యమైన రోజుల్లో ఆ ఎర్రని పట్టు పంచెను కట్టుకుని నేను దేవుడికి మొక్కుతానుగా... నేను పెద్దవాణ్ని కావాలిగా!
 
మడిచి పెట్టే ఉంటే, ఆ పంచె ఎప్పటికీ మడత నలగకుండా ఉంటుంది. మడతలు విప్పలేనట్టుగా ఉంటుంది. సరిగ ఊడిపోదు. నేత అలాంటిది. ఆనాటి చేనేత ప్రత్యేకత అలాంటిది. ‘దీన్నెక్కడ కొన్నారు?’ అని నాన్నగారిని నేను అడిగి తెలుసుకోలేదు. మాయవరం, కూరైనాడు, తిరుభువనం అంటూ ఏదో ఒక ఊరిదై ఉండొచ్చు!
 
నాకు పెండ్లిండ్లకు పోవటమంటే ఆ రోజుల్లో మహా సరదాగా ఉండేది. కారణం ఇదే! పెండ్లికొడుకు పట్టు పంచె కట్టుకుని ఉండేవాడు. పట్టు పంచెను చూడ్డమే ఒక అందమైన అనుభవంగా ఉండేది. ఎన్నో రకాల పట్టు చీరలు కట్టుకుని ఆడవాళ్లు పెండ్లిండ్లకు వచ్చేవాళ్లు. పట్టు చీరలు ఇంట్లో దాచుకుని పెండ్లిండ్లకు వెళ్లటానికి తపించేవారు ఆడవాళ్లు. పెండ్లిండ్లే ఈ ప్రపంచంలో లేకపోతే, ఈ ఆడవాళ్లు కన్నీళ్లు కార్చేవాళ్లు. పట్టు చీరలు ధరించి ఎవరికి చూపించి పారవశ్యం పొందగలరు?
 
నా కలలు కూడా ఆ రోజుల్లో పట్టు బట్టలపైనే ఉండేవి. కలల్లో హంసలు గుంపులు గుంపులుగా వచ్చేవి. ఆకాశం అరుణ వర్ణంలో, కత్తిలా మెరిసేది. ఆ ఎర్రనైన ఆకాశంలో పచ్చని రంగులో ఒక పొడవైన ఏరు, ఆ ఏట్లో ఆ హంసలు ఈదులాడేవి. ఆ పంచెను నాన్న ఉతకటం నేను రెండుసార్లు చూశాను. పసిపాపకు స్నానం చేయించేలా ఉండేది. దానికి వేణ్నీళ్లు సరిపడవు. చన్నీళ్లతోటే దానికి స్నానం చేయించేవారు. మామూలు సబ్బు దానికి పడదట! అందుకని చందనం సబ్బునే నాన్న వాడేవారు. నాన్న స్నానం చేసేది మైసూర్ చందనం సోపుతో. దానికి? కదంబం సోపుతో! ఫ్రాన్స్ నుండి వచ్చిన కదంబం సోపు. మేము కదంబం సోపు అనేవాళ్లం. దిగుమతులు ఆగిపోయాక మైసూరు చందనం సోపు. దాన్నే దానికి వాడేవారు. సోపు వేయటం అంటే మృదువుగా రాస్తున్నట్టుగా ఉండేది. అమ్మ మాకు కొబ్బరినూనె రాస్తున్నంత మొరటుగా ఉండేది కాదు. అంత మృదుత్వం. గట్టిగా నొక్కేవారు కారు. మృదువుగా నీటిలో, పంచె కొసలను పట్టుకుని పిండేవారు. తర్వాత నీటిబొట్లు మాపైన పడేలా జాడించేవారు. కానీ ఎక్కువ జాడించేవారు కారు. పాతబడ్డ వస్త్రం చిరిగిపోవచ్చు. జాడిస్తున్నప్పుడు వర్షపు చినుకుల్లో తడుస్తున్నట్టుగా ఉండేది మాకు! తర్వాత నీడ పట్టున ఆరేసేవారు. ఎండ తగిలితే, రంగు వెలిసిపోతుంది. ఆరాక, నాన్నకు చెప్పటం నా బాధ్యత.
 
మేము ఒకరి తర్వాత ఒకరం ఐదు నిమిషాలకో మారు బట్టను తాకి చూస్తుండేవాళ్లం. ఆరిందో లేదో చూడ్డానికే! మాకు అదొక సాకు. ఆ సాకులో పంచెను తాకి చూస్తూ ఉండొచ్చు! సాయంత్రం కావస్తుండగా పంచె ఆరిపోయి ఉంటుంది. నాన్నతో చెప్పటానికి పరుగెత్తేవాళ్లం. నాన్నే వచ్చి నిదానంగా దాన్ని దండెం మీద నుండి తీసి, అంచుల్లో ముడతలు లేకుండా సాగదీసి, మడిచి, మళ్లీ ఆ పెట్టెలో పెట్టేవారు. ఇక దాని ఉపయోగం మరొక శుభప్రదమైన రోజే!
 
కాలక్రమంలో నాకూ మీసాలు మొలిచాయి. ఒక స్నేహితుడి సోదరికి ప్రేమలేఖ రాశాను. దెబ్బలు తిన్నాను. న్యాయమేగా? తర్వాత కాలేజీలో చేరాను. ఏమేమో చదివాను. నా బుర్రను ఆక్రమించుకోవటానికి ఎన్నో విషయాలున్నాయి. నా దృష్టిని ఆకర్షించటానికి ఎన్నో సంఘటనలు. అన్నిటికన్నా మిన్నగా వకీలు జగన్నాథయ్యర్ కుమార్తె ఉమామహేశ్వరి నన్ను పూర్తిగా మార్చేసింది. మధ్యమధ్యలో ఆ ఎర్రని పంచె నాకు గుర్తొచ్చేది. ‘‘నువ్వెక్కడ, ఎలా ఉన్నావ్?’’
 
దాన్ని కట్టుకుని ఆనందించి, ఉతికి, ఆరబెట్టి దాచుకోవటానికి నాన్న లేరు. పెట్టెలో ఉండే పాములా పడగెత్తి ఉంటుందని నాకు తెలుసు. ఎన్నో ఏళ్లు గడిచాక, ఒకసారి సొంత ఊరికి వచ్చినప్పుడు, ఒక సంఘటన జరిగింది.
 
అప్పుడు వినాయక చవితి పండగొచ్చింది. బాగా గుర్తుంది. రాజీ, పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నేనే గణపతి ప్రతిమను తీసుకొచ్చాను. అచ్చుపోసిన గణపతే! ముక్కూ, కళ్లూ అన్నీ బావున్నాయి. ఈ స్వామి ఎంత అందమైన కల్పన. నన్నే పూజచెయ్యమంది అమ్మ. మనసులో ఒక గుబులు ఏర్పడింది. ఆ పెట్టెలో ఉన్న పంచెను గుర్తుచేసుకునే! పరాకుగానే స్నానం చేశాను. తడి పోకుండా తుడుచుకుని నాన్న అల్మైరాను తెరిచాను. ఆ పచ్చ కర్పూరం వాసన ఇంకా అలాగే ఉంది. వాసన పోదేమో?! అనుభవించాను. తోడు రాజీ లేదే అని బాధగా అనిపించింది. జాగ్రత్తగా పెట్టెను తెరిచాను. నాన్న ఉంగరాలు తప్ప మిగతావన్నీ ఎక్కడికెళ్లాయి? ఉంగరాలు నా కాలేజీ ఫీజులుగానూ, హాస్టల్ భోజనాల ఖర్చులుగానూ అప్పటికే అవి మారిపోయాయి.
 
పంచెను బయటికి తీశాను. దానిమీద చుట్టిన గుడ్డను విప్పదీశాను. అదే పసిదాని మృదుత్వం. అదే కత్తిలోని మెరుపు. అదే వాసన. కొంచెం కూడా రంగు వెలిసిపోలేదు. నడుముకు చుట్టుకున్నాను. మనసు నాన్నను గుర్తుచేసుకుంది. కాళ్లు తిన్నగా నిలబడ్డాయి. అరటి ఆకును చుట్టుకున్నట్టుగా ఉంది. అంతటి మెత్తదనం.
 
పీటను ముందేసుకుని వినాయకుడి ముందు కూర్చున్నాను. ఒక శబ్దం, సణుగుడుతో పంచె ప్రాణం విడిచింది. నా వెనుక వైపున మడత పూర్తిగా పొడవుగా చిరిగిపోయింది. లేచి నిలబడ్డాను. చీకట్లో పసిబిడ్డ చేతిని తొక్కినట్టు అనిపించింది.
 
వంటింట్లో నుండి అమ్మ కుడుముల పాత్రతో వచ్చింది. ‘‘ఏమిట్రా! చిరిగిపోయిందా? పోతే పోనీ! నాన్న కాలపు పంచె! నీకెలా ఉపయోగపడుతుంది! వెళ్లి నీ పంచెను కట్టుకుని వచ్చి పూజ పని చూడూ!’’ అంది అమ్మ.
 
నా టెరికాటన్ పంచెను తీసి కట్టుకుని, వినాయకుడి ముందు కూర్చున్నాను. టెరికాటన్ పంచె నాకు సరిపోయిందనిపించింది. అయినా మనసులో ఎక్కడో బాధగానే ఉంది.
 

మరిన్ని వార్తలు