జీవితం

12 May, 2019 05:48 IST|Sakshi

‘‘అరవింద్‌.. ఆగు’’  వెనకనుంచి అతని చేయి పట్టుకొని ఆపింది. వెనక్కి తిరిగి చూశాడు అతను. ‘‘ఎవరు మీరు?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు. ‘‘రా.. అలా కూర్చుని మాట్లాడుకుందాం...’’ అంటూ ఇంకో వ్యక్తి అతని భుజాల చుట్టూ చేయివేస్తూ మందుకు నడిపించాడు. ఆ ఇద్దరి వెనక ఆమెతోపాటు ఇంకో ముగ్గురు.. ఓ పదిహేడేళ్ల అబ్బాయి సహా!ఆ సముద్రాన్ని అనుకొని ఉన్న ఆ కొండ మీదే... బల్లపరుపుగా ఉన్న రాతి మీద కూర్చుంటూ ‘‘చెప్పు.. ’’ అన్నాడు అరవింద్‌ను నడిపించిన పెద్దాయన. అతని పక్కనే కూర్చుంటూ ‘‘ఏం చెప్పాలి?’’ అన్నాడు అరవింద్‌ విస్తుపోతూనే. ‘‘అదే ఈ పని ఎందుకు చేస్తున్నావ్‌ అని?’’  అతనిని ఆపిన మహిళ.‘‘ఇంతకీ మీరంతా ఎవరు?’’ చిరాగ్గా అరవింద్‌. ‘‘నీ ఫ్రెండ్స్‌మనుకో అన్నా.. ’’అన్నాడు పదిహేడేళ్ల అబ్బాయి. ‘‘ఇప్పుడు చెప్పు... ఈ పనెందుకు చేస్తున్నావో?’’ ఇంకో వ్యక్తి.‘‘బతకాలనిలేక’’ చిరాకు కంటిన్యూ అయింది అరవింద్‌ గొంతులో. ‘‘అప్పులా?’’ నాలుగో వ్యక్తి‘‘అప్పులా? పదుల కోట్లలో ఆస్తిని మొత్తం చారిటీస్‌కి రాసిచ్చేశాను. వారం కిందటే!’’ అరవింద్‌.

‘‘ ఒంటరితనమా?’’‘‘హు... ఒంటరితనం నా బెస్ట్‌ ఫ్రెండ్‌. పొటెన్షియల్‌ సాలిట్యూడ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ చేయడానికే సింగిల్‌గానే ఉండిపోయా.. పెళ్లి విషయంలో మా పేరెంట్స్‌ ఎంత ప్రెషర్‌ పెట్టినా!’’‘‘మరింకే?’’ ఓ అమ్మాయి అడిగింది.‘‘అరే..నా ఇష్టం.. బతకడం.. చావడం! మీకు చెప్పి తీరాలా?’’ ఇందాకటి చిరాకు కోపంగా మారింది. ‘‘చెప్పడం ఇష్టంలేకపోతే.. విను.. మేం చెప్పేది’’ అన్నాడు అరవింద్‌ భుజాల చుట్టూ చేయివేసి ముందుకు నడిపించిన వ్యక్తి. ‘‘నాకంత టైమ్‌ లే...’’ అరవింద్‌ అనబోతుండగానే ఇందాకటి వ్యక్తి మొదలుపెట్టాడు... ‘‘నేనూ నీలాగ ధనవంతుణ్ణే. మా నాన్న వ్యాపారం నా చేతిలోకి వచ్చాక.. మూడింతలు పెంచా. మామూలు గర్వం కాదు నాది. ఒక్క దెబ్బతో అణిగింది లాభాల వరుసలో నష్టం వచ్చి. అప్పుల్లో కూరుకుపోయా. ఇంట్లో వాళ్లతో మాటైనా చెప్పకుండా నా నిర్ణయం నేను తీసేసుకున్నా. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందో చూపిస్తా పద..’’ అంటూ రయ్యిన అరవింద్‌ను వాళ్లింటి ముంగిట్లోకి తీసుకెళ్లాడు అతను. ఉన్న ఆస్తినంతా తండ్రి చేసిన అప్పులకు జమ కట్టేసి.. కొడుకు మళ్లీ కొత్త వ్యాపారం మొదలుపెట్టినట్టున్నాడు.

నిరాశనిస్పృహలేమీ లేకుండా  ఆనందంతో ఆ ఇల్లు కళకళలాడుతూ కనిపించింది అరవింద్‌కు. ‘‘అదేంటి మిమ్మల్ని కనీసం గుర్తు కూడా చేసుకోవట్లేదు.. మీ భార్య కూడా’’ విచారంగా అడిగాడు అరవింద్‌. ‘‘అర్థమైంది కదా.. నా స్థానం? నా కొడుకు చేసిన ధైర్యం నేను చేసి ఉంటే.. నువ్వు అనుకున్నట్టుగా నాకు రెస్పెక్ట్‌ ఉండేది. ఇప్పుడు వాళ్ల దృష్టిలో నేను.. వాళ్లను రోడ్డుపాలు చేసిన పిరికివెధవను’’ అంటూ అరవింద్‌ను మళ్లీ సాగరతీరాన్నానుకుని ఉన్న కొండమీదకు తీసుకొచ్చాడతను. ‘‘ఇప్పుడు మా ఇంటికెళ్దాం రా’’ అంటూ ఆ అయిదుగురి గ్రూప్‌లోని అమ్మాయి.. అరవింద్‌ చేయి పట్టుకుని వాళ్లింటికి తీసుకెళ్లింది. ఆమె భర్తను అరవింద్‌కు చూపించింది. ‘‘అయ్యో.. మీ ఆయన పక్కన ఇంకో ఆవిడ ఉంది.. ఆమె చంకలో ఓ బిడ్డా ఉన్నాడు. నీకంత అన్యాయం జరిగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి?’’ ఆందోళనపడ్డాడు అరవింద్‌. ‘‘హు.. ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? కట్నం కోసం వేధించారు. పోలీస్‌ కంప్లయింట్‌తో .. కోర్టుకు వెళ్లి న్యాయం పొందొచ్చని తెలియలా.

అమ్మానాన్నకు మళ్లీ గుదిబండలా అవుతానేమోనని తెలివిలేని పనిచేశా. ఫలితం చూస్తున్నావ్‌గా’’ అంటూ అంతే వేగంగా అరవింద్‌ను మళ్లీ కొండమీదికి చేర్చింది. అందులోంచి అరవింద్‌ తేరుకునేలోపే అతణ్ణి ఆ పదిహేడేళ్ల అబ్బాయి తనింటికి తీసుకెళ్లాడు. ‘‘ఎక్కడున్నావ్‌ నాన్నా... మాకెందుకురా ఈ బాధ? నీకు నచ్చంది మేం చేయమని బలవంత పెడితే నేను చేయను అని మొండికేయాల్సింది.. అలగాల్సింది. నువ్వు పరీక్ష తప్పినా పల్లెత్తు మాటన్నమా? నిన్ను వెదకని చోటు లేదురా.. బంగారం.. ఎక్కడున్నావ్‌ తండ్రీ.. కనిపించరా?’’ అంటూ ఆ అబ్బాయి తల్లి దుఃఖం. కళ్లు ఎండిపోయి నీటి చుక్కరాలడం లేదు. దుఃఖమంతా గుండెలోంచి వస్తూన్నట్టుంది. అరవిందు మనసు కకావికలమైంది. ఎన్నాళ్లనుంచో తిండిలేనట్టుంది..చెంపలు గుంటలుపడ్డాయి. ఇక అక్కడ ఉండలేకపోయాడు అతను. కొండమీదకు వచ్చిపడ్డారు ఆ ఇద్దరూ అంతులేని వేదనను మోసుకుంటూ! ఈసారి అరవింద్‌ను చేయిపట్టి ఆపిన ఆవిడ, ఆమె భర్త... అతణ్ణి తమ కుటుంబాన్ని చూపించడానికి తీసుకెళ్లారు. వాళ్ల మట్టి ఇల్లు కూలిపోయి ఉంది.

కూతురు ఎక్కడో పుణెలో.. రెడ్‌ లైట్‌ ఏరియాలో! ఒక కొడుకు దొంగగా జైల్లో. రెండో కొడుకు తాగుడుకి బానిసై.. రోడ్ల మీద. భయంతో అక్కణ్ణించి కొండమీదకు పరిగెత్తుకొచ్చేశాడు అరవింద్‌. అతని వెనకాలే ఆ భార్యాభర్త. ‘‘కూతురు ప్రేమించి పెళ్లిచేసుకుందని.. తలెత్తుకు తిరగలేమని.. పరువు, ప్రతిష్ట అంటూ మూర్ఖంగా ప్రవర్తించాం. బిడ్డ మోసపోయి కామటిపురాలో తేలింది. ఆదుకోవడానికి మేం లేం’’ అంటూ ఆ ఆలుమగలిద్దరూ కుమిలి కుమిలి ఏడ్చారు. అరవింద్‌ మనసు మనసులో లేదు. చీకటి పడింది... చూస్తుండగానే చిక్కగా కమ్ముకుంది. చుట్టూ వాళ్లు. మనుషుల్లా ఆకారాలు తప్ప ఇంకేం కనిపించడంలేదు. ‘‘ఇప్పుటికీ నీ నిర్ణయం అదేనా?’’ ముక్త కంఠంతో అడుగుతున్నారు. ‘‘నేను ఏ పని చేసినా ఫెయిల్యూరే. పదిమందిలో కలవలేను. ఈ ఇంపెర్‌ఫెక్ట్‌ బతుకు బతకలేను’’ చెప్పాడు అరవింద్‌. ‘‘ఆస్తిని వదులుకున్నావ్‌.. ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నావ్‌.. ఇంతకన్న పర్‌ఫెక్షన్‌ ఏం కావాలి?’’ అడిగారంతా!‘‘అన్నీ వదులుకొని ఇప్పుడెలా బతకాలి? బతికీ ఏం లాభం?’’ విసుగ్గా అరవింద్‌.‘‘ధైర్యమే బతుక్కి పెట్టుబడి.

అది చాలదా? ‘‘నచ్చిన చోటికి వెళ్లు.. నచ్చిన పని చేయ్‌.. నువ్వు లేవనుకునే నీ లోటును ఆస్వాదించు’’ చెప్పారు ముక్త కంఠంతో!తలవంచి ఆలోచనల్లోపడ్డాడు అరవింద్‌. ఏదో ఉపాయం మెరిసిన వాడిలా.. ‘‘మీతో కలిసి ఉండనా?’’ అంటూ తలెత్తి చూశాడు. ఆ చీకట్లో కనిపించిన నల్లటి ఆకారాలు లేవు. పిలిచాడు. ఉహూ...!అయోమయంతోనే కొండ దిగాడు. తెల్లవారి..ముందు రోజు ఆ మనుషులు తీసుకెళ్లిన చోట్లకు వెళ్లాడు. శ్మశానం!అవాక్కయ్యాడు అరవింద్‌. నవ్వులు.. ఏడుపులు... పెడబొబ్బలు.. దిక్కులు పిక్కటిల్లేలా.. చెవులు చిల్లులు పడేలా! ఆ గొంతులు .. కిందటి రోజు కలిసిన మనుషులవే!‘‘ఆత్మహత్య చేసుకుంటావా? ఏం సాధిస్తావ్‌? మాలాగా తీరని కోరికలతో.. శరీరాల్లేకుండా గాల్లో తిరుగుదామనే?’’ అంటూ పెద్దగా నవ్వు!చోటులేదిక్కడ... ఏయ్‌.. నీకు చోటులేదిక్కడ.. అంటూ అరవింద్‌ వెంట పడ్డాయి ఆ స్వరాలు.. కళ్లు తెరవలేనంత.. కాలు కదపలేనంత గాలి... అతని చుట్టుముట్టుంది. వెళ్లు.. వెళ్లు.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. అరుస్తున్నాయి వేల గొంతుకలు.. అతన్ని ముందుకు తరుముతూ గాలి...శ్మశానం బయటకొచ్చి పడ్డాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం.. ప్రశాతంగా.. జీవితం అలికిడి!

మరిన్ని వార్తలు