నారాజు గాకుర మా అన్నయా...

22 Jan, 2017 01:24 IST|Sakshi
నారాజు గాకుర మా అన్నయా...

సినీ గీత రచయితగా ‘జానీ’ చిత్రంతో ప్రవేశించే అవకాశం కలిగించారు పవన్‌కల్యాణ్‌. నేనప్పటికే చాలా సామాజిక ఉద్యమ గీతాలు రాశాను. హైదరాబాద్‌ స్లాంగ్‌తో మంచి పాటలు రాసే వారెవరైనా వుంటే చెప్పమని ప్రముఖ చిత్రకారులు ఏలే లక్ష్మణ్‌ గారిని అడిగారు పవన్‌కల్యాణ్‌. ఆయన నా పేరు సూచించారు. అలా మొట్టమొదటి సారిగా ‘జానీ’ సినిమాలో సన్నివేశానికి అనుగుణంగా రాసిన పాటే ‘నారాజుగాకుర మా అన్నయ్య’ పాట.  
హిందువుల దీపావళి పండుగకు వచ్చిన ముస్లిం యువకుల్ని అవమానపరచి వెళ్లగొట్టినప్పుడు హీరో ఆయనను ఓదార్చే పాట ఇది.

ఈ పాటను నేను మూడు రోజులలో పూర్తి చేసి పవన్‌కల్యాణ్‌కు, సంగీత దర్శకులు రమణ గోగులకు వినిపించాను. పాటలోని ఒక్క అక్షరం కూడా మార్చకుండా, అలాగే అంగీకరించారు. అంతకుముందు అనుకున్న ముస్లిం యువకుడి పాత్ర పేరు వేరుగా ఉంది. ఆ పేరును నేను యతిప్రాసలకనుగుణంగా ‘నారాజు గాకురా మా అన్నయ్య – నజీరు అన్నయ్య’ అంటూ ‘నారాజు’ ‘నజీరు’ పద బంధాలతో పాట అల్లాను.

మనిషి పుట్టినాక పుట్టింది మతము
పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము
తల్లి కడుపులో నుండి ఎళ్లినట్టి మనిషీ
తలచకురా ఈ చెడ్డ గతము ఈ చెడ్డ గతము / నారాజు గాకురా మా అన్నయ్యా/ నజీర్‌ అన్నయ్యా ముద్దుల కన్నయ్యా / అరేయ్‌ మన రోజు మనకుంది మా అన్నయా
మనిషి పుట్టినప్పుడు లేని కులమతాలు మధ్యలో వచ్చి, మనుషుల్ని వేరు చేస్తున్నాయి. అంతమాత్రం చేత నువ్వు బాధపడవద్దు, చిన్నపుచ్చుకోవద్దు... అని వస్తుంది.

అనువుగాని చోట నువ్వు అధికుడన్నమాట అనవద్దునంట అన్న
వేమన్నగారి మాట వినలేదా నువ్వు బేటా
బంగారు పలుకు మాట హోయ్‌
నారాజు గాకురా మా అన్నయ్యా
నజీర్‌ అన్నయ్యా ముద్దుల కన్నయ్యా
అరే మన రోజు మనకుంది మన్నయో
అక్కన్నలను మాదన్నలు తానీషా మంత్రులుగా
ఉన్ననాడే రామదాసు రాముడి గుడి కట్టెనుగా
కులీ కుతుబ్‌షా ప్రేమ ప్రేయసికి చిహ్నంగా
భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనురా
నవాబులు నిర్మించిన నగరములుంటూ
కులమతాల గొడవలు మనకెందుకురన్నా
ఇంకెందుకురన్నా
నారాజు గాకురా మా అన్నయ్యా

మనకు అనువు కాని చోట, అధికులమంటూ మాట్లాడద్దని వేమన చెప్పిన మాటలు బంగారు పలుకులు అని ఈ చరణంలో పొందుపరిచాను. అలాగే ముస్లిం పరిపాలకుడు అయిన తానీషా దగ్గర పనిచేసిన అక్కన్న మాదన్న అనే హిందూ మంత్రుల సమయంలో రామదాసు గుడి కట్టిన విషయాన్ని వివరించాను. ఓ హిందూ స్త్రీ పేరున ముస్లిం రాజు నిర్మించిన  భాగ్యనగరంలో కులమతాల గొడవెందుకని కులమతాలకు అతీతంగా ఉండాలంటూ ఈ చరణంలో సమైక్యత గురించి చెప్పాను.

విన్నావా సోదరుడా మొన్న నిమ్స్‌ దవాఖానలో
జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చుతునక
తన చావుతో ముస్లిం మన హిందు సోదరులకి
ప్రాణదానం ఇచ్చిండు తన కిడ్నీలను తీసి
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్న
మనుషుల్లో సైతానులకు పట్టదన్నా ఇది పట్టదన్నా/ నారాజు గాకురా మా అన్నయ్యా
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి కిడ్నీలను ఇద్దరు హిందూ పేషెంట్లకు అమర్చగా వారు బతికిన ఉదంతాన్ని తీసుకుని, ముస్లిం యువకుడి కిడ్నీలతో హిందువులు బతికాక, ఇంకా కులం మతం అంటూ మూర్ఖంగా ప్రవర్తించడంలో ఔచిత్యం లేదు అని చెప్పాను.
పీర్ల పండగొచ్చిందా ఊళ్లల్లో మనవాళ్లు
డప్పుల దరువేసుకుంటూ కోలాటాలు ఆడతారు
సదరు పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు
దున్నపోతునాడిస్తూ దిల్‌ ఖుషీలు చేస్తుంటరు
ఎవడేమి అనుకుంటే మనకేమిటన్నా
జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా ఎప్పుడూ నువ్వేరన్నా / నారాజుగాకురా మా అన్నయ్యా
నజీరు అన్నయ్యా ముద్దుల కన్నయ్యా
మన రోజు మనకుంది మన్నయ్యా
హైదరాబాద్‌ నగరంలో పీర్ల పండగొస్తే హిందువులు, దీపావళి అనంతర రోజు యాదవులు నిర్వహించే సదర్‌ పండుగలో ముస్లింలు పొల్గొనే సంస్కృతి మనది... అంటూ హైదరాబాద్‌ సాంస్కృతిక చారిత్రక సత్యాలను ఈ పాటలో చెప్పాను.

నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ని
గుమ్మానికి ఉరి తీస్తాడోయ్‌ నమ్మినోణ్ని
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు
మా ధర్మం భేష్‌ అంటాడమ్మో నాయకుడు
మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు
మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు
దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు
దేవుళ్లను దోచేస్తాడమ్మో నాయకుడు
అధికారం తన పదవి కొరకు నాయకుడు
మతకలహం అంటేస్తాడమ్మో నాయకుడు
నాయకులు ఏ విధంగా ప్రజలను మోసగిస్తారో, నమ్మినవారిని సైతం ఏ విధంగా ఉరి తీస్తారో ఈ చరణంలో వివరించాను. లబ్ధప్రతిష్టులైన వేమన, జాషువా అనే ఇద్దరు ప్రజా కవుల పేర్లను సందర్భోచితంగా ఈ పాటలో చేర్చాను. ఇది నాకు బాగా నచ్చిన పాట. సమైక్యతను, సమసమాజాన్ని చాటే పాట.
– సంభాషణ: వైజయంతి

మరిన్ని వార్తలు