జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!

19 Feb, 2017 00:06 IST|Sakshi
జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!

నర్మదానది నీటి పరవళ్లలో అల్లనల్లన తేలియాడుతూ వచ్చే చల్లని గాలి ఓంకార నాదం చేస్తూ హృదయంలో భక్తిరసాన్ని తట్టిలేపుతుంది. వింధ్య పర్వత సోయగాల వీక్షణతోనే మనసు శివపంచాక్షరి స్తోత్రాన్ని జపించడంలో మునిగిపోతుంది.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న కారాయ నమఃశివాయ... అంటూ స్వామిని స్తుతిస్తూ ఓంకారేశ్వరుని ఆలయానికి చేరుకుందాం.


నర్మద, కావేరీ సంగమ క్షేత్రం ఓంకారేశ్వర్‌. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన రెండు జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్‌లోనే ఉండటం ఈ ప్రాంత విశిష్టత. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. కాషాయ దుస్తులు ధరించిన సాధువులు, గంభీరంగా సాగే నర్మదానది, అక్కడి ఘాట్లలో భక్తుల సందడి.. చూడగానే మనసుకు కాశీ క్షేత్రం తలపుకు రాకుండా ఉండదు. అందుకే ఈ పట్టణాన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. నర్మదానది ఒడ్డునే ఓంకార రూపంలో వింధ్యపర్వతం ఉంది. ఈ పర్వతం ఓంకార రూపంలో ఉండటంతో స్వామికి ఓంకారేశ్వరుడు అని, స్వామి పేరుమీదుగానే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్‌ అని పేరు వచ్చింది.   

గిరి పరిక్రమ ఫలితం ఎంతెంతో!
ఇక్కడ నర్మదా నది స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉండటం విశేషం. అందుకే భక్తులు కూడా నదికి, స్వామికి పరిక్రమను పూర్తి చేసి, స్వామి కృపకు పాత్రులవుతారు. ఓంకారగిరి ప్రదక్షిణ కైలాసపర్వతాన్ని చుట్టి వచ్చిన ఫలితం ఇస్తుందని, జన్మజన్మల సుకృతంగా భావిస్తారు భక్తులు. ఏడు కిలోమీటర్ల ఈ గిరి పరిక్రమకు మొత్తం నాల్గు గంటల సమయం పడుతుంది.  ఈ పరిక్రమలో ముందుగా ‘పంచముఖ గణనా«థుడి’ని దర్శించుకుంటాం. ఈ గణనాథుడిని మాంధాత మహర్షి ప్రతిష్టించాడని ఐతిహ్యం. ఇక్కడ నుంచి మార్గమధ్యంలో అతిపురాతనమైన ‘ఖేరాపతి హనుమాన్‌’ ఆలయం చేరుకుంటాం.

దీనికి సమీపంలోనే కేదారేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ స్వామి లింగరూపంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రదేశంలోనే నర్మదా నదిలో రాళ్ల మీద రాళ్లు అంతస్తులుగా పేర్చి కనిపిస్తాయి. సొంతంటి ఇల్లు కల నెరవేరాలని భక్తులు ఈ రాళ్లు పేర్చి మొక్కుకుంటారు. అక్కడ నుంచి మరికొంత ముందుకు వెళితే ‘రుణముక్తేశ్వర స్వామి’ని ఆలయాన్ని చేరుకుంటాం. ఇక్కడ స్వామి వారికి శనగలు సమర్పిస్తే రుణ విముక్తులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే సుందర రాధాకృష్ణుల మందిరం, గౌరీ సోమనాథుల ఆలయాలు ఉన్నాయి. ‘లాలాహనుమాన్‌ దేవాలయం’లో స్వామి శయనరూపంలో కనిపించడం విశేషం.

అనంతరం భక్తులు ఆశాదేవి ఆలయం చేరుకుంటారు. ఈ మార్గంలోనే ఆఖరుగా గౌరీనా«ద్‌ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి అత్యంత సమీపంలో ఓంకారేశ్వర్‌ మందిరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసిన భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటారు. దర్శనమాత్రం చేతనే భక్తులకు అషై్టర్యాలను ప్రసాదించే పరమేశ్వరుడు నాగాభరణ ధారిగా దర్శనమిస్తాడు. ఈ ప్రధాన ఆలయంలోనే త్రిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాలేశ్వర్, కేదారినాథ్, గుప్తనాథ్‌ అనే ఐదు ఉప ఆలయాలూ ఉన్నాయి. ఈ ఐదు ఆలయాలను పంచలింగ ధామాలుగా వ్యవహరిస్తారు.

వింధ్య తపస్సు మెచ్చిన ఈశ్వరుడు
దేశంలోని పర్వతాలలో మేరు పర్వతం, వింధ్య పర్వతం అత్యంత ఎల్తైనవిగా పేరుపొందాయి. కలహభోజనుడైన నారదుడు ఒక రోజు వింధ్య పర్వతం వద్దకు వచ్చి మేరు పర్వతాన్ని విశేషంగా ప్రశింసించాడట. దీంతో  వింధ్యకు కోపం, అసూయ కలిగి తాను మేరు పర్వతం కంటే మించి పోవాలనే సంకల్పంతో శివుని ప్రార్థిస్తూ తపస్సు చేసిందట. శివుడు  ప్రత్యక్షమై, నీ మనసులోని కోరిక సిద్ధిస్తుందని పలికాడట. శివుడు వింధ్యకు దర్శనం ఇచ్చినప్పుడు పలువురు మహర్షులు అక్కడికి వచ్చి శివుని దర్శించి, అతడు ఇదే స్థలంలో నిలిచిపోవాలని కోరారట. దీంతో శివుడు వింధ్య పర్వతం మీదనే కొలువుదీరాడట.

 శివుని వరంతో వింధ్య రెచ్చిపోయి విపరీతంగా పెరగసాగిందట. వింధ్య ఎత్తు సూర్యచంద్రులకు కూడా ఆటంకం కలిగించిందట. వింధ్య ఎత్తు వల్ల కలిగిన ఉపద్రవాన్ని అరికట్టాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు దేవతల మొర విని వింధ్య సమస్య పరిష్కారానికి అగస్త్యమునిని ప్రార్థించమని సూచించాడట. కాశీలో ఉన్న అగస్త్యుని దేవతలు కలుసుకొని వింధ్య వల్ల ఎదురవుతున్న సమస్యను వివరించి కాపాడమని అర్థించడంతో అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించి తాను దక్షిణాదికి వెడుతున్నానని,

నీ ఎత్తు ఎక్కువగా ఉన్నందున ఎక్కజాలనని, ఇదివరకటి ఎత్తుకు చేరుకోమని కోరడంతో మహర్షి మాట కాదనడానికి వీలులేదు కనుక వింధ్య సాధారణ ఎత్తుకు తగ్గిపోయిందట. అగస్త్యుడు పర్వతం దాటి వెడుతూ తాను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండాలని కోరి ముందుకు వెళ్లాడట. అయితే అతడు తిరిగి ఉత్తరాదికి రాకుండా శ్రీశైలంలో నిలిచిపోయాడట. మహర్షులు దేవతల ప్రార్థనపై వెలసిన శివలింగాన్ని రెండు భాగాలుగా విభజించగా వాటిలో ఒక భాగం ఓంకారేశ్వరుడుగా మరో భాగం అమలేశ్వరుడిగా వెలిశారు. ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శించినంతనే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు.

అలంకారంగా శయనహారతి
ఓంకారేశ్వర్‌లో స్వామికి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజూ శయన అలంకార హారతి కనులారా వీక్షించాల్సిందే. శ్రావణమాసంలో తిరునాళ్లు, కార్తికమాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగు తాయి. ఇక శ్రావణమాసంలో జరిగే శ్రావణ మేళా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకో దగింది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు నర్మదానదిలో మేళ తాళాల నడుమన జలవిహారం చేస్తారు. నది మధ్యలో ఒక చోట కలిసి, ఒకరి చుట్టూ ఒకరు ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.

ఆధునికత అంటని వాతావరణం
ఓంకారేశ్వర్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్థానిక సంస్కృతికి ఏమాత్రం విఘాతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఇక్కడి గిరిపుత్రుల అమాయకత్వం, ప్రశాంత వాతావరణం, ప్రజల సామాన్య జీవనస్థితిగతులను చూస్తే నాగరికత ఇక్కడి మనిషినీ, ప్రకృతిని ఇంకా స్పృశించలేదని స్పష్టం అవుతుంది. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ పట్టణంలో మహిళలు కొండల మీద పూచే పువ్వులను కోసుకొచ్చి శివారాధనకు తెచ్చి అమ్ముతుంటారు. విభిన్నరకాలుగా ఉండే ఆ పువ్వుల పరిమళం మన మనసులో ఆధ్యాత్మిక పరమళాలను వెదజల్లుతుంది. హనుమాన్‌ మూర్తి రంగు వస్త్రధారణలో సాధువులు కనిపిస్తారు. నిలువ నీడలేని భిక్షకులు దేశం అంతటా కనిపిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం దారికి అడ్డం పడకుండా ఒక సేవకు ఎదురుచూపులా కనిపిస్తారు భిక్షకులు. మౌనంగా అతిథులు ఇచ్చిన దానిని కళ్లకు అద్దుకుని భగవద్‌కృపగా తీసుకుంటారు. తీర్థయాత్రలు చేయడం అంటే ఆపన్నులకు సాయం చేయడమే అనేది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

స్వామి దర్శనం
ప్రతి రోజు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. ఈ పట్టణంలో బస చేయడానికి ధర్మశాలలు, సత్రాలు, వివిధ ట్రస్ట్‌ల గెస్ట్‌ హౌస్‌లు ఉన్నాయి.

ఓంకారేశ్వర్‌కు దారి
ఇండోర్‌ నుంచి ఓంకారేశ్వర్‌ 77 కిలోమీటర్లు. ఇండోర్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉజ్జయిని నుంచి 133, హైదరాబాద్‌ నుంచి 772 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. హైదరాబాద్‌ నుంచి ఓంకారేశ్వర్‌కు నేరుగా రైలు మార్గం లేదు. భోపాల్‌ లేదా ఇండోర్‌ వెళ్లి అక్కడ నుంచి ఓంకారేశ్వర్‌ చేరుకోవాలి.

మరిన్ని వార్తలు