వీళ్లు డ్రాపౌట్స్..!

12 Oct, 2014 00:37 IST|Sakshi
వీళ్లు డ్రాపౌట్స్..!

పంచామృతం: చదువు మానేయడం... జీవితాన్నే మార్చేస్తుంది. సాధారణంగా చదువు మానేయడం అనేది జీవితాలను నాశనం చేసే పని. అయితే మరికొంద రికి మాత్రం చదువుకు స్వస్తి పలికాకే ఉన్నత మార్గాలు చేరడానికి దారి దొరికింది. స్కూల్ దశలోనే బడికి నామం పెట్టిన వాళ్లు కొందరు... కాలేజీకి చుట్టపుచూపుగా వెళ్లిన వారు కొందరు... అయినప్పటికీ వాళ్లు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటారు. చదువుతో వచ్చే గుర్తింపునకు మించి సాధించారు. అలాంటి వారిలో కొందరు.

బ్రాడ్‌పిట్
ఈ హాలీవుడ్ హీరో కొంచెం చిత్రమైన పరిస్థితుల్లో చదువు వదిలేశాడు. సినిమాల్లోకి రాకముందు జర్నలిస్టుగా చేసిన బ్రాడ్ ఆ ఉద్యోగం కోసం చదువు మానేశాడట. జర్నలిస్టు కావడానికి గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేకపోవడంతో బ్రాడ్ ఆ జాబ్‌లో చేరిపోయాడు. ఆ తర్వాత సినిమాలవైపు అడుగేశాడు. ఆ రంగంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.
 
డేవిడ్ కార్ప్
టీనేజ్‌లోనే బిలియనీర్‌గా పేరు సంపాదించుకోవడంతో పాటు... టంబ్లర్ బ్లాగ్ సృష్టికర్తగా కూడా గుర్తింపు ఉన్న  కార్ప్ హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయకుండా చదువుకు స్వస్తిపలికాడు. తల్లిమాట మేరకు చదువు మానేసి కంప్యూటర్స్ మీద దృష్టి పెట్టాడు. ఆ రంగంలో అద్భుతాలు సాధించాడు. అందుకే అమ్మ మాట వినాలి.
 
దీపికా పదుకొనె
మోడలింగ్ కెరీర్‌తో బిజీ అయిపోయినప్పుడే దీపిక చదువు వదిలేసింది. హై స్కూల్ పూర్తికాగానే ఈమె గ్లామరస్ ఫీల్డ్‌వైపు వెళ్లాలని ఫిక్సయ్యిందట. మోడలింగ్ చేస్తున్న దశలో దీపిక దూరవిద్యద్వారా బీఏ పూర్తి చేయడానికి ప్రయత్నించింది. కానీ వృత్తిలో బిజీ అయిపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. అయితేనేం దీపిక ఇప్పుడు బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో ఒకరు!
 
ఆలియా భట్

ఇప్పుడు నీకున్న డ్రీమ్ ఏమిటి? అంటే.. గ్రాడ్యుయేషన్ పూర్తి  చేయడం అని అంటుంది ఆలియా. ప్లస్‌టూ కూడా సరిగా పూర్తి చేయకుండానే సినిమాలవైపు వచ్చేసిన ఆలియాకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అనేది సాధ్యం అవుతుందో లేదో కానీ సినిమాల్లో అయితే దూసుకుపోతోంది. తండ్రి మహేశ్‌భట్ ప్రసిద్ధ దర్శకుడు కావడంతో సినీ పరిశ్రమతో ఏర్పడిన పరిచయాలు ఆలియాను ఈ రంగాన్ని ఎంచుకొనేలా చేశాయి. చదువును పక్కనపెట్టేలా చేశాయి.
 
స్టీవెన్ స్పీల్‌బర్గ్
అకాడ మిక్ చదువు విషయంలో స్పీల్‌బర్గ్ ట్రాక్ రికార్డ్ ఏ మాత్రం బాగుండదు. చదువు వంటపట్టించుకోలేకపోయిన స్పీల్‌బర్గ్‌కు స్కూళ్లలో, కాలేజీల్లో అడ్మిషన్ లు దక్కించుకోవడమే కష్టం అయ్యింది. అంత కష్టం ఎందుకని ఇష్టమైన రంగంవైపు వచ్చాడు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు.

మరిన్ని వార్తలు