దేశీయ సూపర్ హీరోలు మిస్సయ్యారు!

20 Dec, 2014 23:01 IST|Sakshi
దేశీయ సూపర్ హీరోలు మిస్సయ్యారు!

సూపర్‌హీరోలు శాశ్వతమైనవారు. ఫిక్షనల్ ప్రపంచంలో తరతరాల పాటు భువిని దుష్టశక్తుల బారి నుంచి వారు కాపాడుతూ ఉంటారు. నవల, సినిమాల ద్వారా వీరు ప్రేక్షకులను, ప్రత్యేకించి పిల్లలను ఎంతగా అలరిస్తున్నారో సీరియళ్ల ద్వారా కూడా అంతేస్థాయిలో ఆకట్టుకొంటూ వచ్చారు. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మన్... తదితర రూపాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సూపర్‌హీరోలు ఉండగా... మనదేశానికే ప్రత్యేకమైన అతీంద్రియశక్తులు కూడా ఉన్నాయి! ‘శక్తిమాన్’ ‘ఆర్యమాన్’ తరహా అనమాట. అయితే ఇలాంటి దేశీయ సూపర్‌మ్యాన్‌ల జాడ ఈ మధ్యకాలంలో కనపడటం లేదు. దాదాపు దశాబ్దం కిందటి వరకూ దూరదర్శన్‌లో ‘శక్తిమాన్’ శకం నడిచింది. ప్రత్యేకించి ఈ దేశీయ సూపర్‌హీరో పిల్లలను అమితంగా ఆకట్టుకొన్నాడు.
 
ఆ తర్వాత శక్తిమాన్‌గా కనిపించిన  ముఖేష్ ఖన్నానే పెట్టి ‘ఆర్యమాన్’ అనే మరో ఫిక్షనల్ సూపర్‌హీరోని తయారు చేశారు. అయితే ఈ ఆర్యమాన్‌కు శక్తిమాన్ అంతటి గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత మాత్రం ఏ నెట్‌వర్క్ వాళ్లు, ఏ చానల్ వాళ్లూ కూడా దేశీయంగా ఒక సూపర్‌హీరో సృష్టి పట్ల ఆసక్తిని చూపించలేదు. దేశీయ టెలివిజన్‌లలో, చిన్నారుల కోసం ప్రసారమయ్యే చానళ్లలో కూడా కార్టూన్ల రూపంలోని విదేశీ సూపర్‌మ్యాన్‌ల హవానే కొనసాగుతోంది.  సినిమాల వరకూ ‘క్రిష్’ రూపంలోని ఒక దేశీయసూపర్ హీరో ఉన్నా బుల్లితెరపై మాత్రం ఆ లోటు ఉంది. పిల్లలను అమితంగా ఆకట్టుకొనేందుకు దేశీయ సూపర్‌హీరో సృష్టి అయితే జరగాల్సి ఉంది!

మరిన్ని వార్తలు