జాతీయవాద పారిశ్రామికవేత్త

3 Jul, 2016 11:19 IST|Sakshi
జాతీయవాద పారిశ్రామికవేత్త

మన దిగ్గజాలు
భారత పారిశ్రామిక రంగం మూల పురుషుల్లో ముఖ్యుడు ఆయన. మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడు. స్వాతంత్య్రోద్యమానికి అండగా నిలిచిన జాతీయవాది. పూర్తిగా స్వదేశీ పెట్టుబడితోనే బ్యాంకును స్థాపించిన దార్శనికుడు ఘనశ్యామ్ బిర్లా. టాటాలకు పోటీగా నిలిచిన బిర్లాల పారిశ్రామిక సామ్రాజ్యానికి మూల పురుషుడు ఆయన. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ ప్రవచనాలేవీ వినిపించని రోజుల్లోనే సేవా కార్యక్రమాల కోసం విరివిగా ఖర్చు చేసిన వదాన్యుడు ఆయన.
 
మూలాలు రాజస్థాన్‌లో...
స్వాతంత్య్రానికి ముందే అపర కుబేరులుగా ఎదిగిన వారిలో టాటాలతో పాటు బిర్లాలు కూడా ఉన్నారు. బిర్లాల పారిశ్రామిక సామ్రాజ్యానికి వ్యవస్థాపకుడు ఘనశ్యామ్‌దాస్ బిర్లా. ఆయన పూర్వీకులు రాజస్థాన్‌లోని పిలానీ ప్రాంతానికి చెందినవారు. ఘనశ్యామ్ తాత శివనారాయణ బిర్లా స్వస్థలంలో మిగిలిన మార్వాడీల్లాగానే వడ్డీవ్యాపారం చేసుకునే వారు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంలో 1850లలో బాంబేకు తరలి వచ్చారు.

ఘనశ్యామ్ తండ్రి బలదేవ్‌దాస్ హయాంలో బిర్లా కుటుంబం 1861లో అప్పట్లో దేశ రాజధానిగా ఉన్న కలకత్తాకు వలస వచ్చింది. బలదేవ్‌దాస్‌కు నలుగురు కొడుకులు. పెద్దకొడుకు జుగల్‌కిశోర్ చిన్న వయసులోనే తండ్రికి చేదోడుగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక రెండో కొడుకైన ఘనశ్యామ్‌దాస్ బిర్లా కూడా వ్యాపారంలో చేరారు. వెండి, సుగంధ ద్రవ్యాలు సహా పలు వ్యాపారాలు చేసేవారు. వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో బిర్లా కుటుంబం కలకత్తాలోని సంపన్న కుటుంబాల్లో ఒకటిగా ఎదిగింది.
 
అంచెలంచెల ఎదుగుదల
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలో వస్తువులకు విపరీతంగా కొరత ఏర్పడింది. అప్పటికే వస్తూత్పత్తి రంగంలోకి దిగిన బిర్లాలకు ఈ పరిస్థితి చక్కగా అనుకూలించింది. వస్తూత్పత్తి రంగంలో తమ ఉనికిని విస్తరించుకునేందుకు సోదరులతో కలసి ఘనశ్యామ్‌దాస్ బిర్లా 1919లో బిర్లా బ్రదర్స్ లిమిటెడ్ సంస్థను రూ.50 లక్షలతో ప్రారంభించారు. అప్పట్లో ఆ మొత్తం చాలా భారీ పెట్టుబడి. అదే ఏడాది గ్వాలియర్ కేంద్రంగా ఒక దుస్తుల మిల్లును ప్రారంభించారు.

కలకత్తాలో జ్యూట్ మిల్లును నెలకొల్పారు. ఘనశ్యామ్‌దాస్ బిర్లా ఒకవైపు వ్యాపారాలు సాగిస్తూనే, మరోవైపు జాతీయవాద రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. మహాత్మాగాంధీతో సన్నిహిత సంబంధాలు నెరపేవారు. గాంధీ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఆయన బిర్లా భవన్‌లోనే బస చేసేవారు. బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 1926లో ఎన్నికయ్యారు. మహాత్మాగాంధీ 1932లో స్థాపించిన హరిజన సేవక సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవలందించారు. 1940లలో హిందుస్థాన్ మోటార్స్‌ను స్థాపించారు.

స్వాతంత్య్రానంతరం  తేయాకు, వస్త్రాలు, రసాయనాలు, సిమెంట్, స్టీల్ ట్యూబ్స్ తయారీ రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పూర్తిగా స్వదేశీ పెట్టుబడితోనే బ్యాంకును ప్రారంభించాలని సంకల్పించారు. ఆ సంకల్పంతోనే కలకత్తా కేంద్రంగా 1943లో యునెటైడ్ కమర్షియల్ బ్యాంకును (యూకో బ్యాంకు) స్థాపించారు. ప్రస్తుతం దేశంలోని అగ్రగామి పారిశ్రామిక సంస్థల్లో ఒకటిగా కొనసాగుతున్న ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకు ఆయనే మూల పురుషుడు.
 
విద్యారంగంలో, సేవారంగంలో ముద్ర
ఘనశ్యామ్‌దాస్ బిర్లా విద్యా, సేవా రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. తన పూర్వీకుల పట్టణం పిలానీలో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. అదే బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్). ఐఐటీల తర్వాత దేశంలో అంతటి ప్రతిష్ఠాత్మక సంస్థగా ఇప్పటికీ ఇది వెలుగొందుతోంది. ఇదొక్కటే కాకుండా దేశవ్యాప్తంగా పలుచోట్ల పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పారు.
 
హైదరాబాద్ సహా పలుచోట్ల బిర్లా మందిరాలు నిర్మించారు. ఘనశ్యామ్ బిర్లా సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1957లో ‘పద్మవిభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. తొంభయ్యేళ్ల నిండు జీవితం గడిపిన ఘనశ్యామ్ బిర్లా 1983 జూన్ 11న కన్నుమూశారు.

మరిన్ని వార్తలు