ప్రకృతి మెచ్చిన గిరిజనులు !

22 Jun, 2014 00:54 IST|Sakshi
ప్రకృతి మెచ్చిన గిరిజనులు !

జీవితం: మనిషి మనుగడకు ప్రకృతే ఆధారం. ప్రకృతి కరుణిస్తేనే మన జీవనం.. ప్రకృతి కన్నెర్ర జేస్తే కాక తప్పదు నాశనం.. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ ఏం చేస్తాం? చెట్లు నరుక్కుంటూ పోతాం... పొలాలపై రసాయనాలు చల్లి సారం పోయేలా చేస్తాం... ఉన్న నీటిని కాపాడుకోం. లేని నీటి కోసం భూమిలోతుల్లోకి తవ్వుకుంటూ వెళ్లిపోతాం ! దీనికి భిన్నమైన స్టోరీ ఒకటి చెప్పే అవకాశం వచ్చింది మాకు. అదే ఈ కథనం.
 
 ఓసారి అరుణాచల ప్రదేశ్‌లోని జైరో తండాకు వెళ్లండి. మీకు జీవితాలు స్వచ్ఛంగా కనిపిస్తాయి. ఏముందక్కడ అనే ఒకే ప్రశ్నకు అనేక జవాబులు దొరుకుతాయి. ప్రకృతిపై వారి ప్రేమను, వారిపై ప్రకృతి ఆప్యాయతను చూడాలంటే అదే మంచి చోటు. మన మూలాలు గుర్తుచేసుకునే చోటు. ఈశాన్య భారతంలో అపాతని గిరిజన తెగది ఓ ప్రత్యేక జీవితం. కాలం ఎంత మారినా వాళ్లు మారరు. ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రకృతే దేవుడంటారు. సూర్యచంద్రులనే దేవుళ్లుగా కొలుస్తారు. వారిది గుడ్డి నమ్మకం కాదు, ఎందుకంటే ప్రకృతిని నమ్మి బతుకుతున్న వారికి మనకంటే ఎక్కువే ప్రకృతి నుంచి లభిస్తోంది. వారి వ్యవసాయ విధానం సిరులు పండిస్తోంది. శాస్త్రవేత్తలకు కూడా పాఠాలు నేర్పుతోంది.
 
 జైరో ఓ చిన్న లోయ ప్రాంతం. అక్కడ అపాతని తెగకు చెందిన గిరిజనులు నివసిస్తుంటారు. వీళ్లందరి జీవనాధారం వ్యవసాయమే. అక్కడ ప్రధానంగా పండేది వరి. వాళ్లకు బోర్లు లేవు, బావుల్లేవు. పక్కనే ఉండే అడవిలో కుంటలు, సెలయేళ్ల నుంచి ఓ మోస్తరుగా నీళ్లు వస్తుంటాయి. ఆ తక్కువ నీటితోనే ఏడాది పొడవునా వ్యవసాయం చేస్తారు. ‘తక్కువ నీరు-ఎక్కువ పంట’ వారి నినాదం. ఒక్క నీటి చుక్కను కూడా వృథా చేయరు. వరి పంట మధ్యలో కాలువలు తీసి ఆ కాలువల్లో నిలిచే నీటిలో చేపలు పెంచుతారు. ఇది వీరు నేర్చిన వినూత్న పద్ధతి. పంటలో వచ్చే పురుగులు ఈ చేపలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంటాయి. అంతేకాదు, వరి పొలంలో మడులకు మధ్య గట్లుంటాయి కదా... అలాంటి పెద్ద గట్లపై జొన్నలు వంటి అంతర పంటలు కూడా వేస్తారు.

అంటే ఒకే పంట కాలంలో మూడు ఉత్పత్తులు. మడుల్లో నీరు చేపల కాలువల ద్వారా అటూ ఇటూ మళ్లించడం ద్వారా పంటలోని చాలా క్రిమికీటకాలను చేపల తింటాయి. వారింత వరకు ఎటువంటి రసాయన ఎరువులు వాడలేదు. ట్రాక్టరుతో సహా ఏ యంత్రాన్నీ వాడరు. ఇవేవీ వాడకుండా ఎకరా పొలంలో మన తీసే దిగుబడి కంటే రెండు రెట్ల ఎక్కువ పంట తీస్తారట. ఇది ఐరాస అనుబంధ సంస్థ యునెస్కోను ఆకర్షించింది. వారు వీరి జీవన విధానానికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. సూర్యచంద్రుల్ని, ప్రకృతిని కొలిచే ఆ గిరిజనులు చెట్లను ఎపుడూ దేనికీ నరకరు. అడవి పచ్చగా ఉంటే పొలానికి నీళ్లు వస్తాయన్నది వారి నమ్మకం. ఇంతవరకు అయితే వారి నమ్మకాన్ని అడవి తల్లి ఏనాడూ వమ్ము చేయలేదు.
 
రైస్ బీర్ స్పెషల్:  ‘రైస్ బీర్’ అనే పేరుతో ఇక్కడ ఒక ద్రావకం దొరుకుతుంది. దానిని సొంతంగా గిరిజనులే తయారుచేస్తారు. అది తాగితే..ఆరోజు ఇంకేం తినాల్సిన అవసరం ఉండదు. అంత శక్తినిస్తుందట ఈ పానీయం. ఇందులో వాడే ‘టాప్యో’ అనే సాల్ట్‌లో ఔషధ గుణాలుంటాయి. ఇది గొంతు వాపుతో పాటు కొన్ని వ్యాధులకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈశాన్య ప్రాంతం కావడంతో ఇక్కడ త్వరగా పొద్దు పొడుస్తుంది. సాయంత్రం 4-5 కల్లా చీకటి పడుతుంది. తెల్లవారున ఐదుకే సూర్యుడు వస్తాడు. ఏటా మార్చిలో ఇక్కడ ఓ ఉత్సవం జరుగుతుంది. అపుడు చుట్టుపక్కలున్న అపాతని తెగ ప్రజలంతా ఇక్కడికి వస్తారు. ఆ సమయంలో ఇంటికెవరు వచ్చినా మంచి ఆతిథ్యం ఇస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించదగ్గ, అనుసరించదగ్గ సంస్కృతుల జాబితాలో అపాతని తెగ జీవన శైలిని చేర్చింది!
 
 వినూత్నం... వారి జీవితం
 వ్యవసాయంలో మాత్రమే కాదు.. జీవన శైలిలోనూ వీరిది భిన్నమైన దారే. కొన్ని మైళ్ల దూరంలోనే నాగరిక లోకం అందుబాటులో ఉంది. వారికి టీవీ తెలుసు, ట్రాక్టరు తెలుసు, కొత్త ఉత్పత్తులన్నీ తెలుసు. కానీ దానికి వారెన్నడూ ప్రభావితం కారు. తిండి, వేషధారణ, సంప్రదాయాలు... అన్నింట్లోనూ తమ ఉనికి చాటుకుంటున్నారు. పొలాల మధ్య, అడవిలో ఉండే ఈ జైరో ప్రజలు ఇంటికి ఇటుక వాడరు. మొత్తం వెదురుతోనే కట్టుకుంటారు. ఈ తెగ ఆభరణాలు, ముఖ్యంగా ఆడవారి ముక్కు పుడక ప్రత్యేకం. వస్త్రధారణ కూడా కాస్త భిన్నమే. వీరికి వ్యవసాయంతో పాటు వెదురు బుట్టల అల్లిక కూడా ఓ ఆదాయ వనరు.

మరిన్ని వార్తలు