నీ నవ్వు చెప్పింది నాతో...

4 Dec, 2016 10:38 IST|Sakshi
నీ నవ్వు చెప్పింది నాతో...
పాటతత్వం
 
‘‘అమ్మాయితో పరిచయం..ప్రణయం..పరిణయం.. క్లుప్తంగా ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని అందంగా ఐదు నిమిషాల్లో చెప్పిన గీతమిది’’ అన్నారు రాజ్ మాదిరాజు. నాగార్జున, ఊర్మిళ జంటగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అంతం’. ఈ చిత్రంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘నీ నవ్వు చెప్పింది నాతో..’ అనే పాట రాశారు. ఆర్.డి. బర్మన్ స్వరపరిచిన ఈ పాటతత్వం గురించి ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’ చిత్రాల దర్శకుడు రాజ్ మాదిరాజు మాటల్లో....
 
ఈ పాట సందర్భం ఏంటంటే... చిన్నప్పట్నుంచీ ఓ మారణాయుధంలా పెంచబడ్డ ఓ అనాథ కుర్రాడు తొలిసారి జీవితంలో అమ్మాయి అనే అందం, సున్నితత్వాలకు పరిచయమవుతాడు. అమ్మాయితో అతడి పరిచయం, స్నేహం, ప్రణయం.. ఒక్కో దశను ఈ పాటలో ఆవిష్కరించారు.
 
 పల్లవి: నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
 నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ల లోటేమిటో (2)
 
ఓ జంటకు, ఒంటరి జీవితానికీ మధ్య తేడా ఏంటనేది శాస్త్రిగారు ఈ పల్లవిలో అద్భుతంగా చెప్పారు. పాట సందర్భానికి కూడా తగ్గట్టు.. తన పక్కన నడిచే అమ్మాయి నీడ ఇన్నాళ్ల తన జీవితంలో ఉన్న లోటు, అమ్మాయి నవ్వే తానెవ్వరో చెప్పిందంటూ అందంగా వర్ణించారు. 
 
 చరణం1: నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని (2)
 నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
 పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని 
 ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని
 
అబ్బాయి ఆలోచనలకు, బాధకూ అక్షర రూపం ఈ చరణం. స్నేహంతో అతడికి ఓ అమ్మాయి చేయి అందించింది. అంతకు ముందు ఏ అమ్మాయి తన జీవితంలో లేని విషయాన్ని గుర్తు చేసుకుని ఆ చేతిలో నా గతాన్ని చదివానని చెబుతున్నాడు. అమ్మాయి తన పక్కనే నడుస్తుంటే, ఆ అడుగుల్లో రేపు అనే రోజు ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటాడు. జీవితంలో తోడు లేదంటే నడకలో అలుపు, బతుకులో బరువు తప్పదని ఆ అబ్బాయి తెలుసుకుంటాడు. 
 
 చరణం2: నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2)
 వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ 
 నా పెదవిలో దూరి నాకే చిరునవ్వు పుడుతుందనీ
 నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ.. 
 
ఉదయం పూట అమ్మాయిలు ముగ్గులు వేస్తారు. అటువంటిది అమ్మాయి సిగ్గు అబ్బాయి జీవితంలో ముగ్గు పెట్టడం అంటే.. అమ్మాయి రాకతో తన జీవితం ఉదయించిందని చెబుతున్నాడు. ప్రతి ఉదయం అమ్మాయి కనుపాపలో మొదలవ్వాలని ఆశిస్తున్నాడు. జీవితంలో మార్పును ఆహ్వానిస్తున్నాడు.
 
 చరణం3: ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు 
 బరువెక్కునో (2)
 తనువు మనసు చెరిసగమని పంచాలి 
 అనిపించునో
 సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
 మనమే మరో కొత్త జన్మం పొందేటి 
 బంధాలతో 
 ॥నవ్వు...॥
 
బాధలు, బాధ్యతలతో జీవితం బరువెక్కినప్పుడు మనం ఎవరితోనైనా పంచుకుంటే బరువు తగ్గుతుంది. ఆయుధంలా పెరిగిన ఆ యువకుడి బాధను పంచుకోవడానికి అమ్మాయి వచ్చిందనే విషయాన్నీ చెప్పారు. అదే సమయంలో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారనే అంశాన్ని శృంగారాత్మకంగానూ చెప్పారు. మొదటి చరణంలో అతడు పడిన బాధకు ఇక్కడ ముగింపు పలికారు.
 
ఆర్.డి.బర్మన్ స్వరం, శాస్త్రిగారి సాహిత్యం అద్భుతమైతే... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గానం, ‘ఓ లలాలలా..’ అనే ఆలాపన మహాద్భుతం. ఆయన గానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందమైన ప్రయోగాలు, అద్భుతమైన ప్రతిభావంతుల కలయిక ఈ పాట. దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ పాట నా జీవితంలోనూ మార్పు తీసుకొస్తుందని ఊహించలేదు. (నవ్వుతూ...) అప్పుడు నేను నాగార్జునగారిలా ఉన్నానని గట్టిగా నమ్మేవాణ్ణి. ప్రతి అమ్మాయి దగ్గర ఆగి కళ్లు ఆర్పకుండా చూసేవాణ్ణి. పైగా, అమ్మాయే నన్ను చూసిందని స్నేహితులకు చెప్పేవాణ్ణి. టీనేజ్ నుంచి తలెత్తి ఓ ధిక్కారపు యవ్వనంలోకి వెళ్తున్న సమయం అన్నమాట. టీనేజ్‌లో తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం వలన అమ్మాయిల కాళ్లు తప్ప, నేనెప్పుడూ వాళ్ల ముఖాలు చూసింది లేదు.
 
యవ్వనంలో డెనిమ్ జాకెట్ జేబుల్లో చేతులు పెట్టుకుని నిర్లక్ష్యంగా కాళ్ళను అటోటీ.. ఇటోటీ.. విసిరేస్తూ, నీళ్ళలో నా రోడ్‌స్టార్ షూస్ తడిసేలా నడిచేవాణ్ణి. అప్పుడొచ్చిందీ ‘అంతం’. సినిమా అంతా ఒక ఎత్తయితే.. ఈ పాట ఒక్కటీ మరో ఎత్తు. హాంటింగ్ మెలోడీ అంటే ఏమిటో అప్పుడు నాకు తెలీదు. ఆ ఆలాపన, భావన, సంగీతం మళ్లీ మళ్లీ వినాలని నా మనసులో బలమైన కోరిక. అంతసేపు ఒకే పాట వింటూంటే పిచ్చి ఎక్కాల్సిందిపోయి ఇంకా ఇంకా కావాలని కోరుకునే ఓ అలౌకిక స్థితి. క్యాసెట్‌కి రెండు వైపులా ఈ పాటను రికార్డు చేయించి పెట్టుకున్నాను.

పీయస్: ఈ పాట నాపై అంత ప్రభావం చూపించిందని నాకూ తెలీదు. పాడుకుంటూ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేశాను. ఆ ఏడాది మైథిలి పరిచయమైంది. ఇద్దరమూ ఏడడుగులూ వేసి అప్పుడే పదిహేడేళ్లు అయ్యింది.
 
ఇంటర్వ్యూ: సత్య పులగం 
మరిన్ని వార్తలు