కొత్త పుస్తకాలు

31 Aug, 2014 00:07 IST|Sakshi

సమ్మోహన స్వర విపంచి
 
కవిత్వం కావచ్చు, సాహిత్య విమర్శ కావచ్చు...‘మో’ను చదువుకోవడం అంటే ప్రపంచగ్రంథాలయాన్ని ప్రేమగా ఆలింగనం చేసుకోవడం!

‘మో’ వాదులలో నరేష్ నున్నా కూడా ఒకరే‘మో’ తెలియదుగానీ, ముప్పై పేజీల ఈ చిన్ని పుస్తకంలో ‘మో’ విశాల  ప్రపంచాన్ని తనదైన ప్రత్యేక శైలితో మళ్లీ ఒక్కసారి గుర్తుకు తెచ్చారు నున్నా. వివిధ సందర్భాల్లో ‘మో’ మీద గతంలో తాను రాసిన వ్యాసాలను ‘మోహం’ పేరుతో తీసుకువచ్చారు నరేష్.  అభిమానం పొంగి పొర్లగా రాసిన భావోద్వేగభరిత వ్యాసాలు కావు ఇవి. అభిమానంతో పాటు అధ్యయన విస్తృతి కూడా నరేష్ కలంలో కనిపిస్తుంది. ‘మోహం’లాంటి నలుపు, తెలుపు పొత్తాన్ని చూసినప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలేమో, ‘మో’కు ఒక వర్గం పాఠకులకు మధ్య ఉన్న ‘గ్యాప్’ పోవాలేమో అనిపిస్తుంది.
 
‘ఇక నేను గోల చేస్తో బిగ్గరగా మాట్లాడను
నా ప్రభువు ఆజ్ఞ అది రహస్యాలలో చెప్తాను
పాట గుసగుసల్లోనే నా హృదయభాష పలుకుతుంది’ అని రవీంద్రుడికి తెలుగు గొంతుక ఇచ్చారు అప్పుడెప్పుడో మో. మరి ‘మో’ను ఫ్రభువు ఆజ్ఞాపించాడో లేదో తెలియదు కానీ చాలా నిశ్శబ్దంగానే తన హృదయభాషను పంచారు. ఆ భాష మరింత చేరువ కావడానికి ఇలాంటి పుస్తకం ఎప్పుడూ ఒకటి రావాలి.
- యాకూబ్ పాషా
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా