కొత్త కొత్త ఆవకాయ్

22 May, 2016 20:53 IST|Sakshi
కొత్త కొత్త ఆవకాయ్

ఆవకాయ అంటే తెలుగువాళ్లకు ఎంత ప్రీతి ఉన్నా, ఆవకాయను తెలుగువాళ్ల జాతిసంపద అనుకున్నా... దేశంలోని మిగిలిన ప్రాంతాల వాళ్లు కూడా వాళ్ల వాళ్ల పద్ధతుల్లో ఆవకాయలు తయారు చేసుకుంటారు.
మన ఆవకాయ కాని ఆవకాయ కూడా ఆవకాయే!
అయితే ఏ ప్రాంతపు పరిమళం ఆ ప్రాంతానిది. దక్షిణాది ఆవకాయలు ఘాటుఘాటుగా ఉంటాయి. నోట్లోనే కాదు, కళ్ల వెంబడి కూడా నీళ్లూరేలా చేస్తాయి. ఉత్తరాది ఆవకాయల్లో తీపి పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి.
 
ఉత్తర దక్షిణాలే కాదు,
తూర్పు పడమర రాష్ట్రాల్లోనూ ఆవకాయల తయారీలో ఎక్కడి వైవిధ్యం అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దేశం నలు చెరగులా విస్తరించిన ఆవకాయ రుచుల విభిన్నతను, విలక్షణతను పాఠకులకు పరిచయం చేయడానికే ఈ ప్రయత్నం...
ఆవకాయ రుచులను ఆస్వాదించండి మరి!
 
పంజాబీ ఆమ్ కా అచార్
పంజాబీ రుచుల్లో సోంపు, ఇంగువ పరిమళాలు గుబాళిస్తుంటాయి. చివరకు వాళ్లు తయారు చేసే ఆవకాయల్లో కూడా...

కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు - 3 కప్పులు, పసుపు - 1 టీ స్పూన్, సోంపుపొడి - పావుకప్పు, మెంతిపొడి - 1 టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర - అర టీ స్పూన్, ఇంగువ - పావు టీ స్పూన్, కారం పొడి - 2 టేబుల్ స్పూన్లు, ఆవనూనె - పావుకప్పు, ఉప్పు - 4 టేబుల్ స్పూన్లు
 
తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత వాటికి ఉప్పు, పసుపును బాగా పట్టించాలి. ఇప్పుడు ఆ ముక్కలను పెద్దసైజు జల్లెడలోకి తీసుకొని, వాటిపై మూతపెట్టి 4-6 గంటల పాటు ఎండలో పెట్టాలి. ఆపైన వాటిని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో సోంపుపొడి, మెంతిపొడి, నల్ల జీలకర్ర, ఇంగువ, కారంపొడి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మందంగా ఉన్న గాజు సీసాల్లోకి తీసుకొని నాలుగైదు రోజుల పాటు ఎండలో పెట్టాలి. అలా చేస్తే ఈ ఆవకాయ ఏడాదికాలం పాటు తాజాగా, రుచిగా ఉంటుంది.
 
కర్ణాటక మ్యాంగో పికిల్
తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటక రుచులు దాదాపు తెలుగు రుచుల్లానే ఉంటాయి. అయితే, ఆవకాయలో పచ్చిమిర్చి ముద్ద కలపడం కన్నడిగుల స్పెషల్.

కావలసినవి: మామిడికాయ ముక్కలు - 5 కప్పులు, ఉప్పు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ - పావుకప్పు, ఆవపిండి - అరకప్పు , మెంతిపొడి - అరకప్పు, పసుపు - 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె - 2 కప్పులు, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఇంగువ - పావు టీ స్పూన్
 
తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని ముక్కలుగా చేసుకోవాలి. మరోవైపు ఆవాలు, మెంతులను కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిని మామిడికాయ ముక్కలపై వేయాలి. దాంతోపాటు ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి, మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి.  తర్వాత  ఆ మిశ్రమానికి పచ్చిమిర్చి ముద్దను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ పైన బాణలి పెట్టి నూనె పోసి, అది వేడెక్కాక అందులో ఆవాలు, ఇంగువ వేసి రెండు నిమిషాల తర్వాత దింపేయాలి. అది కొద్దిగా చల్లారాక, అందులో మామిడికాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆవకాయను ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని బయట పెడితే 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఏడాది వరకూ ఉంటుంది.
 
కశ్మీరీ అమెర్ అచార్
యాపిల్ పండ్ల తీయదనానికే కాదు, మిర్చిఘాటుకు కూడా కశ్మీర్ ప్రాంతం పెట్టిందిపేరు. కారం చిరుతిళ్లలో రుచికోసం వాడే నల్లజీలకర్రను తీపి ఆవకాయ తయారీలోనూ వాడటం కశ్మీరీల ప్రత్యేకత.

కావలసినవి: పచ్చి మామిడికాయలు - 8, పంచదార - 1 కిలో, నల్ల జీలకర్ర - అర టీ స్పూన్, ఎండు మిరపకాయల ముక్కలు (గింజలు తీసేయాలి) - 1 టీ స్పూన్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్,  వెనిగర్ - 1 టేబుల్ స్పూన్, నీళ్లు - కావలసినన్ని
 
తయారీ: మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లలో 10-12 గంటలపాటు నానబెట్టాలి. మధ్యమధ్యలో నీళ్లను మారుస్తూ ఉంటే ముక్కలకున్న పులుపుదనం కాస్త తగ్గుతుంది. ఇప్పుడు ఒక కుండలో అరలీటర్ నీళ్లు, పంచదార వేయాలి. దాన్ని స్టౌ పైన పెట్టి పాకం పట్టాలి. అందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేయాలి. కొద్దిగా వేడెక్కాక స్టౌ ఆఫ్ చేసేయాలి. ఇలాగే మరో రెండు రోజులు కాస్త వేడి చేస్తూ ఉంటే మిశ్రమం గట్టిపడుతుంది. ఆపైన ఈ మిశ్రమంలో వెనిగర్ వేసి ఓ రెండుగంటలపాటు వేడి చేయాలి. ఆవకాయ పాడవకుండా వెనిగర్ కాపాడుతుంది.
 
కేరళ ఇన్‌స్టంట్ ఆవకాయ
కేరళ స్టైల్ ఇన్‌స్టంట్ ఆవకాయ తయారీ చాలా తేలిక. దీని తయారీకి అరగంట కంటే ఎక్కువ సేపు పట్టదు. అయితే, ఇది ఏడాది పొడవునా నిల్వ ఉండదు.

కావలసినవి: పచ్చిమామిడికాయ ముక్కలు- 2 కప్పులు (తొక్కతో పాటు కట్ చేసుకోవాలి), ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు, నూనె- పావు కప్పు, ఆవాలు- రెండున్నర టీ స్పూన్లు, మెంతులు-అర టీ స్పూన్, కారం- 3 టీ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, వెనిగర్- 2 టీ స్పూన్లు
 
తయారీ: తరిగిన మామిడికాయ ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకుని, వాటికి ఉప్పు పట్టించాలి. అరగంట సేపు అలాగే వదిలేయాలి. ఆవాలు, మెంతులు మిక్సీలో వేసి పొడిగా తయారు చేసుకోవాలి. స్టౌ వెలిగించి, బాణలిలో నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, మెంతుల పొడి వేయాలి. వెంటనే కారం, కరివేపాకు వేసి గరిటెతో కొద్ది సెకండ్లు  బాగా కలపాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను బాణలిలో వేసి, బాగా కలుపుతూ స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉన్న జాడీలోకి లేదా సీసాలోకి ఈ ఆవకాయను తీసుకుని, గాలి చొరబడకుండా మూత వేయాలి. ఫ్రిజ్‌లో భద్రపరచుకుంటే, దాదాపు రెండు వారాల వరకు నిల్వ ఉంటుంది.
 
ఆమ్‌కా సూఖా ఆచార్
ఉత్తరాది రాష్ట్రాల్లో నూనె ఎక్కువగా వాడకుండా మామిడికాయలతో ఎండు ఆవకాయ కూడా తయారు చేస్తారు. ఉత్తరాది శైలిలో మామిడికాయ ఎండు ఆవకాయ తయారీ పద్ధతి చాలా తేలిక. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ ప్రాంతం ‘ఆమ్‌కా సూఖా ఆచార్’ (ఎండు ఆవకాయ) తయారీకి పెట్టింది పేరు.

కావలసినవి: మామిడి కాయలు - 6 (పెద్ద సైజువి), ఉప్పు - 100 గ్రాములు, పసుపు - 2 టీ స్పూన్లు, మెంతులు - 2 టేబుల్ స్పూన్లు, సోంపు - 2 టేబుల్ స్పూన్లు, పసుపు ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు, వాము - 2 టీ స్పూన్లు, కారంపొడి - 1 టేబుల్ స్పూన్, ఇంగువ - అర టీ స్పూన్, ఆవనూనె - అరకప్పు

తయారీ: మామిడి కాయలను దాదాపు పన్నెండు గంటల సేపు బకెట్ నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటిని బయటకు తీసి, పొడిబట్టతో శుభ్రంగా తుడిచి, ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత కావలసిన సైజులో ముక్కలు తరుక్కోవాలి. ఈ ముక్కలను ప్లాస్టిక్ డబ్బాలో పోసి, ఉప్పు, పసుపు వేసి అవి ముక్కలకు బాగా పట్టేలా కలిపి వదిలేయాలి. ఇలా రోజుకు ఒకసారి చొప్పున వారం రోజుల పాటు ముక్కలను కలుపుతూ ఉండాలి. వారం రోజుల్లో ముక్కలు మెత్తబడతాయి. కాస్త నీరు ఊరుతుంది.

ఇప్పుడు నీటిని వదిలేసి, ముక్కలను ఒక పళ్లెంలోకి తీసుకుని, ఎండలో పెట్టాలి. ఎండిన తర్వాత మామిడి ముక్కలు గోధుమ రంగులోకి మారుతాయి. ఇప్పుడు మెంతులు, పసుపు ఆవాలు, సోంపు, వాము, ఇంగువ మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. బాణలిలో నూనె తీసుకుని, స్టౌపై వేడి చేయాలి. నూనె వేడెక్కుతుండగా ఈ పొడితో పాటు కారం వేసి బాగా కలుపుతూ, స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత మామిడి ముక్కలను బాణలిలోని మిశ్రమంపై వేసి, అంతా పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఎండు ఆవకాయ తయారైనట్లే. దీనిని పొడిగా ఉన్న సీసా లేదా జాడీలో భద్రపరచుకోవాలి.
 
 
మహారాష్ట్ర కైరీ చే లోంచే
మహారాష్ట్రలో మరాఠీలు తయారు చేసుకునే ఆవకాయ దాదాపు తెలుగువారి ఆవకాయ మాదిరిగానే ఉంటుంది. కాకుంటే, వాళ్ల ఆవకాయలో ఇంగువ, ఇతర సుగంధద్రవ్యాల గుబాళింపు కాస్త ఎక్కువగా ఉంటుంది.

కావలసినవి: పచ్చి మామిడికాయలు - 6, ఇంగువ- 1 టేబుల్ స్పూన్, నూనె - అరకప్పు, ఉప్పు - 3 టేబుల్ స్పూన్లు, ఆవపొడి - అరకప్పు, కారం - అరకప్పు, వెల్లుల్లి - పన్నెండు రెబ్బలు, పసుపు ఆవాలు - అరకప్పు, పసుపు - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 3 టేబుల్ స్పూన్లు, జాజికాయ పొడి - 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క -రెండు మూడు చిన్న ముక్కలు, లవంగాలు - నాలుగైదు
 
తయారీ: మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి, అరగంట అలాగే వదిలేయాలి. తర్వాత స్టౌ వెలిగించి, మందపాటి బాణలిలో నూనె పోసి మరిగించాలి. ఇంగువ, జాజికాయ పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, కారం వేసి కలుపుతూ స్టౌ కట్టేయాలి. చల్లారిన తర్వాత ఆవపొడి, ఆవాలు, మెంతులు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి ముక్కలు వేసి, బాగా కలపాలి. దీనిని పొడిగా ఉన్న జాడీలో లేదా సీసాలో భద్రపరచాలి. ఇది దాదాపు ఏడాది పాటు నిల్వ ఉంటుంది.
 
ఆమ్‌కా ఛుందా
గుజరాతీలు ఎక్కువగా తీపి పులుపుల సమ్మేళనాన్ని ఇష్టపడతారు. ‘ఖట్టా... మీఠా’కు కేరాఫ్ గుజరాత్. వాళ్ల ఆవకాయలోనూ ఈ రుచులే ప్రధానంగా కనిపిస్తాయి.

కావలసినవి: పచ్చి మామిడికాయలు - 3 (పెద్దవి), ఉప్పు - 2 టీ స్పూన్లు, పసుపు - 1 టీస్పూన్, పంచదార - 1 కప్పు, కారం - 2 టీ స్పూన్లు, జీలకర్రపొడి - 1 టీ స్పూన్
 
తయారీ: ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటి తొక్క తీసి, తురుముకోవాలి. ఇప్పుడు ఆ మామిడికాయ తురుమును ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార కూడా వేసి కలపాలి. కొద్దిసేపయ్యాక పంచదార కరుగుతుంది. అప్పుడు ఆ మిశ్రమంలో కారం, జీలకర్రపొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ మిశ్రమాన్ని స్టౌ పైన పెట్టి మంట తగ్గించాలి. అలా 10 నిమిషాలు పెట్టి కలుపుతుండాలి. దాంతో మిశ్రమం చిక్కబడుతుంది. స్టౌ ఆఫ్ చేసి, మ్యాంగో ఛుందా ఆవకాయను దింపేయాలి. (ఈ ఆవకాయలో పంచదారకు బదులు బెల్లం కూడా ఉపయోగించొచ్చు)
 
తమిళనాడు వడు మాంగాయ్
సాధారణంగా ఆవకాయల తయారీకి ముదురు కాయలనే ఎంచుకుంటారు. తమిళనాడులో మాత్రం కసురు పిందెలతో కూడా ఆవకాయ తయారు చేస్తారు. ‘వడు మాంగాయ్’గా తమిళులు చాలా ఇష్టంగా తినే ఈ ఆవకాయ తయారీ చాలా తేలిక.

కావలసినవి: మామిడి పిందెలు - పావు కిలో, కారం - 1 టేబుల్ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, ఉప్పు - తగినంత, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 1 టేబుల్ స్పూన్, నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ: మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడవాలి. పిందెలపై తడి పూర్తిగా ఆరాక వాటికి నువ్వులనూనె పట్టించి, ఒక గిన్నెలో వేయాలి. నూనె పట్టించిన మామిడి పిందెలపై ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. వాటినలా ఒక రోజు వదిలేయాలి. మరుసటి రోజు ఆవాలు, మెంతులు పొడిగా చేసుకుని, ఆ పొడిని కారంలో కలపాలి. ఈ కారం పొడిని మామిడి పిందెలపై వేసి, బాగా కలపాలి. తర్వాత గిన్నెపై మూతపెట్టి ఐదారు రోజులు వదిలేయాలి. ఈ ఐదారు రోజుల్లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కలుపుతూ ఉండాలి. ఐదారు రోజుల్లో నీరు ఊరి, మామిడి పిందెలపై తొక్క కాస్త ముడుతలు తేలుతుంది. ఇప్పుడు ‘వడు మాంగాయ్’ సిద్ధమైనట్లే.
 
రాజస్థానీ ఆమ్‌కా మీఠా ఆచార్
రాజస్థానీ రుచులు అక్కడి భోజన రాజసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆవకాయల తయారీలోనూ వాళ్ల రూటే సెపరేటు. తీపి ఆవకాయ తయారీలో బెల్లం, పంచదార రెండింటినీ వాడతారు.

కావలసినవి:  పచ్చిమామిడికాయలు - 2 లేదా మామిడికాయ ముక్కలు - 1 కప్పు, ఉప్పు - చిటికెడు, పసుపు - పావు టీ స్పూన్, పంచదార - అరకప్పు, బెల్లం తురుము - అరకప్పు, వేయించిన ధనియాలపొడి - 2 టేబుల్ స్పూన్లు, ఆవపిండి - 2 టేబుల్ స్పూన్లు, మెంతిపొడి - 2 టేబుల్ స్పూన్లు, కారంపొడి - 1 టేబుల్ స్పూన్, ఇంగువ - 1 టీ స్పూన్, నూనె - 1 టేబుల్ స్పూన్
 
తయారీ: ముందుగా మామిడిపండ్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటి తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఆ ముక్కలకు పసుపు, ఉప్పును పట్టించి ఓ ఎనిమిది గంటల వరకు పక్కన పెట్టేయాలి. అప్పటికి ఆ ముక్కలు కొద్దిగా ఊరతాయి. ఆ మామిడికాయల మిశ్రమంలో పంచదార, బెల్లం తురుమును కొద్దికొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

స్టౌపై బాణలి పెట్టి అందులో మామిడికాయల మిశ్రమాన్ని వేయాలి. సన్నని మంట మీద బెల్లం చిక్కని పాకంగా మారాక దింపేసి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనెను వేడి చేయాలి. అందులో ఆవపిండి, ధనియాలపొడి, మెంతిపొడి, కారం పొడి, ఇంగువలను వేసి రెండు నిమిషాలు కలుపుకొని దింపేయాలి. అది పూర్తిగా చల్లారాక, ముందుగా తయారు చేసిన మామిడికాయల మిశ్రమంలో దీన్ని వేసి బాగా కలుపుకొని జాడీలోకి తీసుకోవాలి. ఈ ఆవకాయను ఏడాదికాలం పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
 
బెంగాలీ గుడొ ఆమ్ ఆచార్
మిఠాయిలను ఇష్టపడే బెంగాలీలు ఎక్కువగా తీపి ఆవకాయలు, ఊరగాయలనే ఇష్టపడతారు. పచ్చి మామిడి ముక్కలతో బెంగాలీలు చేసుకునే తీపి ఆవకాయ తయారీ చాలా సింపుల్‌గా ఉంటుంది.

కావలసినవి: మామిడి కాయలు - నాలుగు (మీడియం సైజులో ఉండేవి కాస్త పండినవైతే మంచిది), బెల్లం - 1 కప్పు (తరిగి ఉంచుకోవాలి), ఉప్పు - 1 టీ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, పాంచ్ ఫొరొన్ - 2 టేబుల్ స్పూన్లు (ఐదురకాల పోపు దినుసులు: ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర), ఎండు మిరపకాయలు - 12, జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, ధనియాలు - అర టేబుల్ స్పూన్, సోంపు - ఒకటిన్నర టీ స్పూన్, ఆవనూనె - అరకప్పు, సున్నం - అర టీ స్పూన్
 
తయారీ: మామిడికాయలను శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడిచి ఆరబెట్టాలి. తర్వాత వాటిని కావలసిన సైజులో తొక్క తీయకుండానే ముక్కలుగా తరగాలి. మామిడి ముక్కలు పట్టే సైజులోని ఒక పెద్దగిన్నెలో నీరు తీసుకుని, సున్నం కలపాలి. సున్నం కలిపిన నీటిలో మామిడి ముక్కలను వేసి, పది నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ఆ నీటిని వంపేసి, మామిడి ముక్కలను పొడిగా ఉన్న పళ్లెంలోకి తీసుకోవాలి. స్టౌ వెలిగించి, మందపాటి బాణలిలో పోపు వేగడానికి తగినంత నూనె పోయాలి.

నూనె కాగాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేయాలి. అవి చిటపటలాడుతుండగా, రెండు ఎండు మిరపకాయలను వేయాలి. తర్వాత స్టౌను మీడియం మంటలో ఉంచి, మామిడి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి నెమ్మదిగా కలపాలి. మామిడి ముక్కలు మెత్తబడగానే స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేరే బాణలిని స్టౌ మీద పెట్టి, అందులో బెల్లం వేసి, పాకానికి సరిపోయేలా కొద్దిగా నీరు పోయాలి. తక్కువ మంటపై ఉడకబెడుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పాకం చిక్కబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. పోపు పెట్టి సిద్ధంగా ఉంచుకున్న మామిడి ముక్కలను ఈ బెల్లం పాకంలో వేసి, బాగా కలపాలి.
 
ఇప్పుడు మరో చిన్నసైజు బాణలిలో మిగిలిన టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ధనియాలు, సోంపు, పది ఎండు మిరపకాయలు వేసి, నూనె లేకుండా పొడిగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఈ దినుసులను మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
 
ఇప్పుడు బెల్లం పాకంలో మామిడి ముక్కల మిశ్రమాన్ని వేసి ఉడికించాలి. అవి ఉడుకుతూ ఉండగా మిగిలిన నూనె పోయాలి. మామిడి ముక్కల్లోని నీరంతా ఇగిరిపోయే వరకు ఇలా ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మిక్సీలో తయారు చేసుకున్న పొడిని వేసి, బాగా కలపాలి. చల్లారిన తర్వాత పొడిగా ఉన్న సీసాలో లేదా జాడీలో భద్రపరచుకోవాలి. ఇది ఏడాది పాటు నిల్వ ఉంటుంది.
 
ఆవకాయ చిట్కాలు
* చాలామంది ఈపాటికే ఆవకాయ పెట్టేసి ఉంటారు. మరికొందరు దానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండుంటారు. పచ్చళ్లు పెట్టే సమయం మించిపోతుందన్న కంగారులో జాగ్రత్తలు తీసుకోకుండా ఆవకాయను పెట్టేస్తుంటారు. అలాంటప్పుడే అవి వారం, రెండు వారాలకే బూజు పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి..
* నిర్లక్ష్యం చేయకుండా ఊరగాయలకు వాడే పాత్రలు, గిన్నెలు, గరిటెలు శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి. లేదంటే ఆ పాత్రలను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి.
* ఇక ఆవకాయను నిల్వ చేసే గాజు సీసాలు, జాడీలను కొద్దిసేపు ఎండలో పెట్టినా మంచిదే.
* ఆవకాయ బూజు పట్టకుండా ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే, వాటిని పెట్టే జాడీల పైభాగంలో వేడినూనెలో ముంచిన వస్త్రంతో తుడిస్తే చాలు.
* ఊరగాయలు జాడీలోకి తీసుకున్నాక, చాలామంది వాటిపై వస్త్రం చుడతారు. అలా చుట్టడం మంచిదే కానీ ప్రస్తుతం మూత గట్టిగా ఉండే సీసాలు విరివిగా దొరుకుతున్నాయి.
* స్టీలు, రాగి పాత్రల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో ఆవకాయను నిల్వ ఉంచకూడదు.
* నూనె, ఉప్పు, కారం వంటి పదార్థాలు కలపడానికి చెక్క గరిటెను ఉపయోగించడం మేలు. వడ్డించుకునేటప్పుడు మాత్రం ఆవకాయను చిన్న సీసాలోకి తీసుకొని స్టీలు చెంచాను వాడొచ్చు.
* ఆవకాయకు వాడే మామిడికాయలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పగిలిన కాయలు, మెత్తబడిన కాయలను ఆవకాయకు వాడకూడదు.
* నూనె విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కొందరు నువ్వుల నూనె వాడితే మరికొందరు వేరుశనగనూనె వాడుతుంటారు. ఏ నూనె వాడినా, అది స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని వార్తలు