కాయల్లోన ఆవకాయ వేరయా!

22 May, 2016 02:55 IST|Sakshi
కాయల్లోన ఆవకాయ వేరయా!

చిల్లీ సిల్లీగా...
‘‘ఆవకాయ అనే మాటనో, పచ్చడినో సినిమాలో ఎక్కడైనా పెట్టేశామనుకో... అది సూపర్‌హిట్టు అవుతుందిరా’’ అన్నాడు రాంబాబు.
 ‘‘ఎందుకురా అనవసరంగా ఇలా రెండు వేర్వేరు అంశాలను ముడేస్తావు’’ అన్నాను.
 ‘‘నీకు విషయం తెలియదు. నేను సోదాహరణంగా చెబితే గానీ అర్థం కాదు. ఇప్పుడు మనం వెళ్లొస్తున్న మూవీ ఏమిటి? సూపర్‌స్టార్ మహేశ్ బాబు దూకుడు. అందులోని పాట ఇప్పుడే విన్నావు కదా... ఏమని పాడతాడు మహేశ్ బాబు... ‘ఇటురాయే ఇటు రాయే / నీ మీదే మనసాయే / గొడవ గొడవాయే / హే ధడక్ ధడక్ అని దేత్తడి దేత్తడి / ధడక్ ధడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశా’ అని పాడాడా లేదా.

అది చాలు. సినిమా సూపర్ డూపర్ హిట్టు. ఇందులో పచ్చడి అంటే ఏమిటనుకుంటున్నావు? మన ఆవకాయేరా. ఆవకాయ సినిమాలో ఉందంటేఅది సూపర్ హిట్టే’’ అంటూ మళ్లీ అదే పల్లవి అందుకున్నాడు.
 
‘‘నవ్వు ఎన్ని చెప్పినా నమ్మను రా’’ అన్నాన్నేను.
‘‘యమగోల సినిమా చూశావా? అసలు ఆ సినిమా సక్సెస్ అంతా ఆవకాయ మీదే ఆధారపడి ఉంటుంది. అందులో ఆవకాయను చూసి రక్తమాంసాలనుకుంటారు యముడు సత్యనారాయణ, చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య. అప్పుడు సాక్షాత్తూ ఎన్టీఆర్ ఆవకాయ ప్రాశస్త్యం గురించి అద్భుతంగా వివరిస్తాడు. అంతే యముడు ఆవకాయ తిని, దాంతో లవ్వులో పడిపోతాడు. అలా పడిపోవడం వల్లనే జయప్రదను ‘కళ్యాణమస్తు అనీ, దీర్ఘసుమంగళీభవ’ అని దీవించి, మరోసారి బోల్తా పడిపోతాడు. ఇద్దిగ్గో... ఈ పాయింట్ మీదే సినిమా సక్సెస్ అంతా ఆధారపడి ఉంది. అలా దీవించడానికి కారణం ఆవకాయే.

అలా దీవించబట్టే ఎన్టీఆర్‌ను తనతో తీసుకెళ్లలేకపోయాడు యముడు. అంతేకాదు దగ్గరుండి పెళ్లి కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఆయకాయ సినిమాకు టర్నింగ్ పాయింట్ అన్నమాట. అంతెందుకు ‘ఆహ నా పెళ్లంట’  సినిమాలో కోట శ్రీనివాసరావు ఇంటికి పెళ్లికొడుకు శుభలేఖ సుధాకర్‌తో పాటు ఇద్దరు బకాసురులు వస్తారు. ఇంట్లో తినడానికి ఏవీ లేవని కోట శ్రీనివాసరావు అంటే మామిడికాయ పచ్చడి ఉంటే చాలు అని ఆవకాయ బద్దల్ని కడుక్కుతినేస్తారు. దీన్ని బట్టి నీకు తెలిసేదేమిటీ... ఇప్పుడు పాటలో పచ్చడి పచ్చడి అని ఉన్నా... సన్నివేశంలో ఆవకాయ ఉన్నా సినిమా సూపర్‌హిట్టే’’ అని వివరించాడు.
 ‘‘నువ్వు చెప్పిన రెండూ కరెక్టే గానీ నాకెందుకో నువ్వు మోకాలికీ, బోడిగుండుకూ ముడేస్తున్నట్టు అనిపిస్తోంది రా’’ అన్నాను.
 
‘‘నో... నో... యూ ఆర్ మిస్టేకెన్. నేను చెట్టు మీది కాయకూ, సముద్రంలోని ఉప్పుకూ ముడేస్తున్నాను. అలా వేస్తే అది ఆవకాయ అవుతుంది. సదరు కాంబినేషన్ సూపర్  హిట్టవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతా విను. సినీకమెడియన్ల తాలూకు అనేకానేక ఊతపదాలు ఆవకాయలోంచే పుట్టాయన్నది అబద్ధం కాదు. ‘తొక్క... టెంకె... పీచు...’ అవన్నీ పచ్చడి మామిడి నుంచి వచ్చాయన్నది మిడిమిడి జ్ఞానం కాదు. పరిశీలన మీద తెలిసే వాస్తవం. కేవలం కామెడీ మాత్రమే కాదురా...  ఆవకాయలో సినిమాలకు సంబంధించిన ఎంతో ఫిలాసఫీ  ఉంది’’ అన్నాడు రాంబాబు.
 
‘‘ఆవకాయలో సినిమా ఫిలాసఫీ ఏమిట్రా బాబు?’’ అంటూ అడిగా.
 ‘‘ఎందుకు లేదూ... విను. కొన్నిసార్లు పెద్ద హీరోను పెట్టుకొని భారీ బడ్జెట్ మూవీ తీస్తాం. అనుకున్నట్టే అది బ్లాక్‌బస్టర్ అవుతుంది. కానీ ఆ సినిమాతో అసలు హీరోకు బదులు ఎవడో చిన్నా చితకా ఆర్టిస్టుకు పెద్ద పేరొస్తుంది. సేమ్ టు సేమ్... ఆవకాయలోనూ అంతే. ఇక్కడ అసలు హీరో మామిడి. ఆవాలు అనేవి పచ్చడి కోసం వాడే అనేకానేక పదార్థాల్లో ఒకటి. అయితేనేం... మామిడికాయ పచ్చడి అనే మహా బ్లాక్‌బస్టర్‌లో మామిడి అనే హీరో మటుమాయమైపోయి ‘కాయ’ మాత్రం మిగిలి... ఆవాలలోని ‘ఆవ‘ అనే మాటే మొదట నిలుస్తుందనే విషయంలో ఆవగింజంతైనా అబద్ధం లేదు’’ అన్నాడు వాడు.
 
‘‘ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి దాన్ని సమస్త సినిమా ఫిలాసఫీ అంటే ఎలా’’ అన్నాను.
 ‘‘చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అసలు... అసలు హీరో మనం అయితే వాడెవడికో పేరు రావడం అన్నది మనకు కారం రాసినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ పొడి కారం అనుకోకూడదు. అది నూనె, కారం మిక్స్. పచ్చడి చేసే ప్రక్రియలో కారం కలిపినప్పుడు నూనె కలిసిన కారం మాత్రమే చేతికి అంటి, మంట ఫీలింగ్ చాలా సేపు ఉంటుంది. కారం రాసినట్లు ఉండటం అనే వాడుక ఇలాగే వచ్చింది. ఇది సినిమా ఫీల్డులో చాలా కామన్. అంతేకాదు... రాంగ్ కాంబినేషన్స్ పెడితే సినిమా పెద్దగా ఆడే అవకాశం ఉండదని కూడా ఆవకాయ చెబుతుందిరా’’ అన్నాడు.

 ‘‘ఆవకాయ ఈ మాట ఎప్పుడు చెప్పింది?’’ అడిగా.
 ‘‘ఆవకాయ బిర్యానీ అన్నది పరమ రాంగ్ కాంబినేషన్ అని సినిమా టైటిల్ పెట్టిన్నాడే తెలిసిపోయింది. అన్నప్రాశన రోజే ఆవకాయ కూడదని ఆ సినిమా ద్వారా సమస్త మూవీ లోకానికి ఒక సందేశం అందింది ’’ అన్నాడు వాడు.
 ‘‘అవున్రోయ్... నువ్వు చెబుతుంటే నాకూ అనిపిస్తోంది... పెళ్లికాకుండానే హీరోయిన్ మామిడికాయ కొరుకుతుండటం చూసి గుమ్మడిలాంటి వారికి గుండెపోటు చాలాసార్లు వస్తుంది’’ అన్నాన్నేను కాస్త కోపంగా.  
 ‘‘వారేవా... ఇప్పుడు కదరా నీకు కాయోదయం అయ్యింది’’ అన్నాడు వాడు మిర్చికోలుగా నన్ను చూస్తూ.
 - యాసీన్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు