నా కథ

28 Jan, 2018 00:40 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఎప్పట్లాగే ఈరోజు కూడా గడిచిపోతుంది అనుకున్నా. సమాధిలా దాచిన జ్ఞాపకాలు  తవ్వడం నాకెప్పుడూ ఇష్టం ఉండదు. కానీ ఈరోజు కొంచెం కష్టంగానే వుంది. నిన్న ‘‘క్లాస్‌రూమ్‌లో అలా కన్నీళ్లు పెట్టుకున్నారేంటీ?’’ అని సంగీత అడిగినప్పట్నుంచీ ఇలాగే ఉంది. ‘‘దేవుడు అందరికీ పరీక్షలు పెడతాడు కానీ, కచ్చితంగా పరీక్షలకి తట్టుకొని నిలబడతారు అనే వాళ్లని మాత్రం పరీక్షిస్తూనే ఉంటాడు. వాటన్నింటికీ తట్టుకొని నిలబడ్డ వాళ్లే గొప్పోళ్లు’’ అమ్మ చెప్పిన ఈమాట నా మట్టి బుర్రకి అప్పుడు ఎక్కలేదు కానీ, ఇప్పుడు అది తలచుకోని రోజంటూ ఉండదు.ఇన్ని ఆలోచనల మధ్య కిందకి చూస్తే బకెట్లో నీళ్లు అయిపోయాయి. ‘అసలు మొహానికి సబ్బు రుద్దుకున్నానా?’ అనుమానమొచ్చింది. ఎందుకైనా మంచిదని ఇంకొన్ని నీళ్లు పట్టుకుని మొహం కడుక్కున్నా. దేవుడిని నమ్మను కాబట్టి పూజా కార్యక్రమాలు లేవు. హ్యాంగర్‌కి ఆల్రెడీ నిన్ననే తగిలించుకున్న నలుపు రంగు కుర్తా వేసుకున్నా. అద్దంలో చూసుకుంటే క్రాపుకి, బంగారు అంచు ఉన్న కుర్తా వింతగా ఉన్నట్టు అనిపించింది. చేతుల దగ్గర పైకి మడిచి అప్పుడు జుట్టు సర్దుకున్నా. చిన్నప్పట్నుంచీ ఓణీలు తప్ప ప్యాంటు చొక్కాల జోలికి పోలేదు. ఇప్పుడు ఈ టామ్‌బాయ్‌ లుక్‌ నాకే ఆశ్చర్యం అనిపించింది. నెక్‌ దగ్గర మొదటి గుండీ లేకపోవడం చివరిసారి వేసుకున్నప్పుడే గమనించాను. పిన్నీసు పెట్టుకుని అలాగే వెళ్ళిపోయా కానీ ఆరోజు స్టాఫ్‌ మీటింగ్లో ఆ వెధవ చూపులు ఇంకా గుర్తున్నాయి. బట్టలు మార్చుకుందామనుకున్నా. గడియారం తొమ్మిది గంటలు కొడుతోంది. ‘ఈరోజు రాగానే కుట్టుకుంటా’ అని గట్టిగా అనుకున్నా. ఆ వెధవ కళ్ల ముందు కదిలాడు. ‘చూడనీ.. ఈసారి అలాగే చూస్తే పిన్నీసు తీసి వాడి కళ్లలో పొడుస్తా!’ అనుకుని బండి కీ  తీస్కొని బయల్దేరా.

దారంతా రణగొణధ్వనులు. నాలో నాకు నచ్చే విషయం ఏంటంటే.. ఎన్ని ఆలోచించినా, మనసెంత బాగోకపోయినా బండి నడిపేటప్పుడు మాత్రం మరేం ఆలోచించను. చిన్న చిన్న చిరాకులకు జీవితాన్ని రిస్కులో పెట్టడం నాకు నచ్చదు. పక్కన ఒకడు నా బండి రాసుకుంటూ పోయాడు. అప్పటికీ అరుస్తూనే ఉన్నా ఇయర్‌ఫోన్లో పాటలు వింటూ ప్రపంచాన్నే మర్చిపోయాడు పిల్ల వెధవ. తర్వాత వాడికోసం బండి కొంచెం స్పీడ్‌ పెంచా. సిగ్నల్‌ దగ్గర దొరికాడు. వాడి పక్కనే వెళ్లి బండి ఆపి చూద్దును కదా.. నా క్లాస్‌ కుర్రోడే! వాడి భుజం మీద తట్టాను. చెవిలోంచి ఆ ఇయర్‌ఫోన్‌ తీసి నా వంక చూసి భయంతో తలదించుకున్నాడు.‘‘ఏంట్రా ఆ స్పీడు?’’ అడిగాను. ‘‘శాంతి మేడం క్లాస్‌ మేడం!’’ అన్నాడు.‘‘అయితే ఇలా రోడ్డుమీదా హడావిడి చేసేది? ముందు చెవిలో అది తీయ్‌. మెల్లగా వెళ్లు..’’. ఆ వైర్లు తీసేసి బ్యాగ్‌లో పెట్టి ‘‘సారీ మేడం!’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌లో సంతకం చేసి టైం చూశా. సరిగ్గా పావు తక్కువ పది. హమ్మయ్య అనుకుని క్లాస్‌లోకి రిజిస్టర్‌ పట్టుకొని వెళ్లి కూర్చున్నా. నిన్న నేను క్లాస్‌లో కంటతడి పెట్టడం పిల్లలు అంత సులభంగా మర్చిపోరని తెలుసు. గట్టిగా గాలి పీల్చుకొని పాఠం మొదలుపెట్టా. ఒక్కసారి పాఠం మొదలెట్టగానే నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. మనసు తేలికపడింది. క్లాస్‌ అయిపోయాక వెళ్లి నా గదిలో కూర్చున్నా. కొంతసేపటికి సంగీత వచ్చి ‘‘మీతో మాట్లాడాలి!’’ అంది. ‘‘చెప్పమ్మా!’’ అన్నాను. ‘‘మీ గురించి తెలుసుకోవాలని ఉంది.’’

నాకు నా గతం తల్చుకోడం ఇష్టం లేదు. కానీ ఈరోజెందుకో సంగీతకి  చెప్పాలనిపించింది. టీచర్‌ని కదా.. ప్రశ్నలకు బదులివ్వకుండా ఉండలేను. ‘‘మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేనొక్కదానినే కూతుర్ని. చిన్నప్పట్నుంచి నేను కొంచెం ముభావస్తురాలిని. బాగా సిగ్గు. బస్టాండ్‌కి ఎలా వెళ్లాలో కూడా తెలీదు. పెళ్లి దాకా ఏ కష్టం లేకుండా పెరిగా. వాడు మనిషికి ఎక్కువ. మృగానికి తక్కువ. జీవితం అంటే అంత సులువైంది కాదు అని తెలిసేలా చేశాడు. దీనికి నేనెప్పుడూ వాడికి ఋణపడివుంటా. పెళ్లైన మొదటి రోజున సిగ్గుపడటం తప్ప, తర్వాత నవ్విన సందర్భాలు నాకు మొహమాటానికి కూడా గుర్తులేవు. నేనెప్పుడూ ఒకటి నమ్ముతాను. పెద్దలు కుదిర్చిన సంబంధంలో పెళ్లైన కొత్తలోనే మొదటిరాత్రి జరుపుకోవడం ఏ వ్యభిచారానికీ తక్కువ కాదు. సరిగ్గా ఒకరినొకరు తెలుసుకోకుండానే, ప్రేమ కలగకుండానే   శరీరాన్ని తృప్తి పరచటం అంటే.. అదికాక మరేమిటి? కానీ ఆ రోజుల్లో ఈ మాట బయటకి చెప్పేంత ధైర్యం నాకు లేకపోయింది. తను ఏ రోజూ ప్రేమగా మాట్లాడటం నాకు కనిపించలేదు. రాత్రి పట్టుకున్నప్పుడు కూడా వాడి అవసరం, ఆనందం తప్ప అందులో ఆత్మీయత నాకెప్పుడూ కనిపించలేదు. ఇంట్లో అంత ముద్దుగా పెరిగిన నేను, ప్రతి కష్టం పంటిబిగువనే పెట్టుకున్నా. ఎవరికీ ఏం తెలియనివ్వలేదు. తర్వాత అద్భుతం జరిగింది. ఒకరోజు లెగిసి చూసేసరికి వాడు కనపడలా. వాడి బట్టలు కూడా మాయం. నాకు కొంతసేపు అసలేం అర్థం కాలేదు. బీరువాలో నా నగలు కూడా కనపడలా. పిచ్చిదానిలా ఇంటిచుట్టూ చూశా. ఇంట్లో ఉత్తరం లాంటిదేదైనా ఉందేమోనని వెతికాను కానీ వాడికి అంత ఆలోచనా? అదీ నా గురించి. ఛ ఛ! నా ఊహ కాక మరేమిటి కానీ, వాడు చేసిన పనుల్లోకల్లా గొప్ప పని ఏంటంటే నన్ను తల్లిని చెయ్యలేదు. లేదంటే నా బంగారు తండ్రి అన్యాయం అయిపోయి వుండేవాడేమో. 

ఇంట్లో వాళ్లకి అంతా చెప్పినప్పుడు వాళ్లకి ఏం చెయ్యాలో తెలియలేదు. తర్వాత వాడి మీద కేసు పెట్టి విడాకులు తీసుకున్నా నాకు ఆ నగలు వద్దని చెప్పా. పాతిక సంవత్సరాల కిందటి మాట ఇదంతా. ఇప్పుడున్న తెలివి అప్పుడుంటే కచ్చితంగా ఆ నగలు తీసుకొనేదాన్నేమో!’’ ఆ చివరిమాటకు సంగీత నవ్వింది. నేనూ నవ్వేశా. ‘‘తర్వాత ఏమైంది మేడం?’’ అని అడిగింది. ‘‘ఏముంది.. అప్పటినుంచి మా అమ్మా నాన్నల దగ్గరే ఉండిపోయా. ఇప్పుడు నేను మహారాణిని కాదు కానీ బాధ్యతలతో, బాధలతో నా రాజ్యాన్ని  చూసుకుంటున్నా. నా వస్త్రధారణ అంతా మార్చేశా. హెయిర్‌కట్‌ చేసి ఈ టామ్‌బాయ్‌ లుక్‌లోకి వచ్చేశా. ‘నేను ఆడపిల్లని. అందుకే ఈ అడ్డంకులన్నీ’ అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు అనుకున్నా. అలాగే ఉంటున్నా. ఐదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. చాలా కష్టంగా అనిపించింది. తర్వాత నా జీవితం మొత్తం నాన్నే. నెలక్రితం ఆయనా చనిపోయాడు. అందుకే నిన్న అలా..’’. సంగీత కళ్లలో ఒకలాంటి భావన కనిపించింది. దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలీలేదు.     ‘‘మేడం! మీరు కథలు రాస్తారు కదా.. మీకు బాగా ఇష్టమైన కథ ఏంటి?’’ అని అడిగింది. అవును! నా అన్ని కథల్లో నాకు నచ్చిన కథేంటీ? ఆ.. నా కథ. నా కథే!!
రిషిత గాలంకి  (పాండిచ్చేరి) 

మరిన్ని వార్తలు