తొలియత్నం: ఆ సినిమా తరువాత... ఏడేళ్లు ఖాళీగా ఉన్నా!

10 Aug, 2013 23:01 IST|Sakshi
తొలియత్నం: ఆ సినిమా తరువాత... ఏడేళ్లు ఖాళీగా ఉన్నా!

కర్తవ్యం, మౌనపోరాటం...  ఈ రెండు సినిమాలు చాలు డెరైక్టర్‌గా ఆయనేంటో చెప్పడానికి! పేరులో పీస్, థాట్స్‌లో ఫైర్ నింపుకున్న మోస్ట్ పవర్‌ఫుల్ డెరైక్టర్ మోహనగాంధీ! రియాలిటీ, ఫిక్షన్ కలగలిసి ఒక ఎమోషనల్ ప్యాక్డ్ ఫిలిం తీయడంలో ఆయన మాస్టర్. మోహనగాంధీ దర్శకుడిగా పరిచయం కావడానికీ ఒక సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా నిలబడటానికీ మధ్య జరిగిన ప్రయాణానికి సాక్షి... అతని మొదటి సినిమా. తన తొలియత్నం ‘అర్ధాంగి’ నేపథ్యం ఇది.
 
 ‘నా మనసే ఒక తెల్లకాగితం’ పాటలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, ఆప్యాయతను చాలా అందంగా చూపించాలి. ఇది డ్యాన్స్‌మాస్టర్‌తో చేసే పాట కాదు. దానికోసం నేను చాలా శ్రమించాల్సింది. నా ప్రయత్నానికి కెమెరామెన్ సుందరం చాలా సహకరించారు. మురళీమోహన్, జయసుధలు తమ నటనతో పాటకు ప్రాణం పోశారు.అసలు అవకాశం రాకపోతే ఎప్పుడో ఒకప్పుడు వస్తుందనే ఆశతో ఉండొచ్చు. ఒక అవకాశం వచ్చిన తరువాత మళ్లీ చాలాకాలం పాటు అవకాశం రాకపోతే... అది నిజంగా నరకం.కారణాలేవైనా కావచ్చు. నా మొదటి సినిమా చేసిన తరువాత మళ్లీ ఏడేళ్లు అవకాశం రాలేదు. నా మొదటి సినిమా నాకు తియ్యనైన చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అయితే అవకాశం రానప్పుడు, దారి దొరకనప్పుడు నా గుండె ధైర్యం జారకుండా, నా ఉత్సాహం ఆవిరవకుండా నన్ను కంటికి రెప్పలా కాచుకుంది పీఏపీ (ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్) సంస్థ.
    
 నేను పీఏపీలో అసిస్టెంట్‌గా చేస్తున్న రోజులవి. మహాబలిపురంలో ‘అల్లుడొచ్చాడు’ షూటింగ్ జరుగుతోంది. ఆరోజు నిర్మాత సుబ్బారావుగారి బర్త్‌డే. ఆ పార్టీలో నన్ను తమ బ్యానర్‌లో కాబోయే డెరైక్టర్‌గా అనౌన్స్ చేశారు సుబ్బారావుగారు. ఆ తరువాత అదే బ్యానర్‌లో ‘అత్తవారిల్లు’ సినిమాకు పనిచేశాను. ‘ఆలుమగలు’ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మేం షూటింగ్‌కు వెళ్లేటప్పుడు సుబ్బారావుగారు నన్ను పిలిచి, ‘నీ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకో. ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లకు’ అన్నారు. వెంటనే మా గురువు ప్రత్యగాత్మగారు ‘నీ సినిమాకు నేను సబ్జెక్ట్ రెడీ చేస్తా’నని అభయమిచ్చారు. అన్నట్టుగానే ఆయన ఒక మంచి కథ ఇచ్చారు.
 
 ఇక నేను, సత్యానంద్‌గారు, ప్రత్యగాత్మగారు డిస్కషన్స్‌లో కూర్చున్నాం. చాలా సమయం దొరికింది కాబట్టి స్క్రిప్ట్ దశలోనే మార్పులు చేసే అవకాశం లభించింది. మొదట ప్రత్యగాత్మగారికీ, నాకూ ఓ సీన్ విషయంలో చాలా చర్చ జరిగింది. అదేంటంటే, సినిమా కోర్టు సీన్‌తో ఓపెన్ అవుతుంది. మనస్పర్ధలతో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు. విడాకుల తరువాత భార్య తన పుట్టింటికి వస్తుంది. అప్పుడు ఆమె మానసిక పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకు ప్రత్యగాత్మగారు ఒక ఆలోచన చెప్పారు. ప్రత్యగాత్మ వెర్షన్: ఆ అమ్మాయి ఇంటి బయట నిలబడి లోపలికి అడుగుపెట్టగానే ఇంట్లోవాళ్లు తనను ఆదరిస్తారు అనుకున్నప్పుడు ఇల్లు తనకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆదరించరు అనుకున్నప్పుడు ఇల్లు దూరమవుతుంది.
 
 నా వెర్షన్: ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగుపెట్టగానే మూడు దశలు గుర్తుకొస్తాయి. తనకు పెళ్లికాక ముందు, పెళ్లవుతున్నప్పుడు, పెళ్లి తరువాత పుట్టింటి నుంచి వెళుతున్నప్పుడు... ముఖ్యంగా అప్పగింతలప్పుడు అన్న చెప్పిన మాటలు పదేపదే గుర్తుకొస్తుంటాయి. చదువుకునేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే చెరిపేసి మళ్లీ దిద్దుకోవచ్చు. కానీ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దిద్దుకోవడం కష్టం అంటాడు. కానీ ఇప్పుడు అదే తప్పు చేసి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ గుర్తుకుతెచ్చుకోవడం అనే పద్ధతిలో ఆమె ఆలోచనల సంఘర్షణను, సందిగ్ధతను బలంగా ఎస్టాబ్లిష్ చేయవచ్చని చెప్పాను. ప్రత్యగాత్మ శభాష్ అని మెచ్చుకున్నారు. అప్పట్లో స్క్రిప్ట్ దశలో అందరూ ఇన్‌వాల్వ్ అయి, తమ అభిప్రాయాలు పంచుకునేవాళ్లు. పీఏపీ ఆస్థాన విద్వాంసుడు చలపతిరావు డిస్కషన్‌లో మొదటి రీల్ అవగానే ఒక సాంగ్ పెడితే బావుంటుందన్నారు.
 
 చలపతిరావు వెర్షన్: విడాకుల తరువాత ఒక సాంగ్ సీక్వెన్స్ పెడితే, ఆ అమ్మాయి మానసిక పరిస్థితిని వివరిస్తూ ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఉండాలి.
 నా వెర్షన్: ఆ అమ్మాయి కష్టనష్టాలు, జెన్యూనిటీ ప్రేక్షకులకు ఏమీ తెలియకుండా ఓపెనింగ్‌లోనే సాంగ్ పెట్టడం కరెక్ట్ కాదు. రెండు మూడు సీన్లలో ఆ అమ్మాయి సమస్యలు తెలిసిన తరువాత పాట పెట్టడం సరైంది అన్నాను.
 నా ఆలోచన ఎందుకు సరైందో చెప్పిన తరువాత ఆయన కన్విన్స్ అయ్యారు.
 
 అలా మా మధ్య జరిగిన ఈ చర్చలన్నీ స్క్రిప్ట్‌కు మరింత బలాన్నిచ్చాయి. ఇక సినిమా షూటింగ్‌కు ఏర్పాట్లు ప్రారంభించాం. 1977 మే 1న షూటింగ్ మొదలైంది. జయసుధ మీద మొదటి షాట్. ప్రత్యగాత్మగారు స్విచాన్, తాతినేని రామారావుగారు క్లాప్. సూర్యకాంతం, రాజబాబు, నాగభూషణం లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. అందరూ అనుభవజ్ఞుల మధ్య ఉండటం, మార్పులన్నీ దాదాపు స్క్రిప్ట్ దశలోనే చేశాం కాబట్టి, షూటింగ్ చాలా ప్రశాంతంగా సాగిపోయింది. మధ్యలో ఎప్పుడైనా రష్ చూడమని నేనంటే ప్రత్యగాత్మగారు బానే ఉంటుందిలే అనేవారు. ఆయనకు నామీద అంత నమ్మకం.
 
 ఒకరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. అది భర్త, భార్య విషయంలో ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండే సీన్. అతని డిస్ట్రబింగ్ మూడ్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు మ్యూజిక్ మీద కొన్ని షాట్స్ తీయాలనుకున్నాను. ఒక షాట్ స్టడీగా ఉన్న సైకిల్ చక్రంలోంచి తీయాలనుకున్నాను. కెమెరామెన్‌తో చెబితే ఎందుకలా ప్లెయిన్‌గా తీయవచ్చుగా అన్నాడు. అతను అవుటాఫ్ మూడ్‌లో ఉన్నాడని అర్థమైంది. ఆ షాట్ అలా ఎందుకు తీయాలో అతనికి వివరిస్తే, అప్పుడు కన్విన్స్ అయ్యాడు. ఇందులో డెరైక్టర్‌గా నా ప్రతిభకు ఒక పాట సవాల్‌గా నిలిచింది.
 
 ‘నా మనసే ఒక తెల్లకాగితం’ పాటలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, ఆప్యాయతను చాలా అందంగా చూపించాలి. ఇది డ్యాన్స్‌మాస్టర్‌తో చేసే పాట కాదు. దానికోసం నేను చాలా శ్రమించాల్సింది. నా ప్రయత్నానికి కెమెరామెన్ సుందరం చాలా సహకరించారు. మురళీమోహన్, జయసుధలు తమ నటనతో పాటకు ప్రాణం పోశారు. నా అనుభవం మేరకు బాగానే తీశాననిపించింది. ఇదే సాంగ్ సెకండ్ హాఫ్‌లో పాథటిక్‌గా వస్తుంది. దీన్ని ఇంకా బాగా తీయవచ్చు అని తరువాత చాలాసార్లు ఫీలయ్యాను.
 
 ఏకధాటిగా 28 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని ప్రివ్యూ వేసినప్పుడు ఒక సీన్ విషయంలో కొంతమంది నాతో విభేదించారు. అది ప్రీ క్లయిమాక్స్ సీన్. భర్త అనుమానాన్ని పోగొట్టేందుకు భార్య ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు అక్కడ ఉండటం ఎందుకని భార్య వెళ్లిపోవడానికి రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. ఈలోపు తన తప్పు తెలుసుకున్న భర్త రైల్వేస్టేషన్‌కు వెళతాడు. ఆమె కనిపించకపోవడంతో అన్నిచోట్లా వెదికి అలిసి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసరికి భార్య ఉంటుంది. ఆమెను చూసి పట్టరాని ఉద్వేగంలో వెళ్లి కాళ్లమీద పడబోతాడు.
 
 అతని ప్రయత్నానికి ఆమె అడ్డుపడి దగ్గరకు తీసుకుంటుంది. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు నేను చాలా థ్రిల్ ఫీలయ్యాను. కానీ ప్రివ్యూలో సీన్ రివర్స్ అయింది. మగవాడు ఆడదాని కాళ్లమీద పడితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరని అన్నారు. కానీ ప్రొడ్యూసర్, నా గురువులు నా ఆలోచనను బలపరిచారు.
 టైటిల్ విషయంలో కూడా కొంతమంది అబ్జెక్ట్ చేశారు. నాగేశ్వరరావుగారి ‘అర్ధాంగి’ ప్రభావం ఉంటుందని వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. మరికొంతమంది దానితో దీనికేం పోలిక ఉండదన్నారు. నేను మాత్రం కథకు తగ్గట్టు అదే టైటిల్ బాగుందని ఫీలయ్యాను.
 
 అంతా అయ్యాక అక్టోబర్ 27న సినిమా విడుదలైంది. కానీ విచిత్రమేమిటంటే, దాదాపు అదే సమయంలో మరో మూడు సినిమాలు విడుదలయ్యాయి. అమరదీపం, ప్రేమలేఖలు, గోరంతదీపం. మరోవైపు మా సినిమా విడుదలకు ముందే పక్క థియేటర్లో నాగేశ్వరరావుగారి ‘అర్ధాంగి’ విడుదలైంది. వీటన్నిటిమధ్యా మా అర్ధాంగి ఏవరేజ్‌గా నడిచింది. అయితే నాకు ఆనందాన్ని కలిగించిన విషయం, పాత ‘అర్ధాంగి’ డెరైక్టర్ పి.పుల్లయ్యగారు మా సినిమా చూసి బాగుందని మెచ్చుకోవడం.
 నన్ను తీవ్రంగా కలిచివేసిన విషయం ఏమిటంటే, ఈ సినిమా తరువాత ఏడేళ్లపాటు నాకు అవకాశాలు రాలేదు. 1984లో కృష్ణంరాజుతో ‘రౌడీ’ సినిమా చేసేదాకా మళ్లీ నా మాతృసంస్థ పీఏపీ నాకు అండగా నిలిచింది.
 -  కె.క్రాంతికుమార్‌రెడ్డి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు