అనంతరం: మిగిలింది అనుబంధమే!

10 Nov, 2013 03:40 IST|Sakshi
అనంతరం: మిగిలింది అనుబంధమే!

అనంతరం: సోనాక్షిసిన్హా, సోనమ్‌కపూర్, శృతీహాసన్... ఆడపిల్లకు సెక్యూరిటీ ఉండదు అని అంతా ఫీలయ్యే సినీ పరిశ్రమలోకి, హీరోలైన తమ తండ్రుల ప్రోత్సాహంతో అడుగుపెట్టిన కూతుళ్లు వీళ్లు. నిజానికి ఈ పేర్ల పక్కన త్రిశల అనే మరో పేరు కూడా ఉండాల్సి ఉంది. కానీ బాలీవుడ్ టాప్ హీరో కూతురయిన ఆమె పేరు యువతారల లిస్టులో ఇంతవరకూ చేరలేదు. మరి త్రిశల ఏం చేస్తోంది? ఆమె ప్రయాణం ఎటువైపు సాగుతోంది?
 
 తల్లి లేదు. తండ్రి ఉన్నా... అతడికీ తనకూ మధ్య తరగని దూరం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ఎలా ఆలోచిస్తుంది? ఎంత బాధపడుతుంది? సంజయ్‌దత్ కూతురు త్రిశలను అడిగితే తెలుస్తుంది... ఆ బాధ ఎలా ఉంటుందో. తల్లి రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయాక, తండ్రి ఒడిలో ఆడుకోవచ్చనుకుంది ఆ చిన్నారి. కానీ తండ్రి తన బాధ్యతలను నెరవేర్చేందుకు సిద్ధపడ్డాడే తప్ప, ఆమెను తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు (అలా అని త్రిశలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది). దాంతో అమ్మమ్మ ఇల్లే ఆమె ఇల్లయ్యింది. సప్త సముద్రాలకు ఆవలే ఆమె ఉండిపోయింది.
 
 తల్లిదండ్రులు లేని పిల్లలు పెంకివాళ్లవుతారని, చెడు సావాసాలకు చేరువవుతారని కూడా చెబుతారు. కానీ త్రిశలలో అలాంటి లక్షణాలు మచ్చుకు కూడా ఉండవంటారామె సన్నిహితులు. సౌమ్యంగా ఉంటుంది. సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకుంటుంది. అందరితో సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది త్రిశల. ఇది ఎలా సాధ్యమయ్యిందని అడిగితే... ‘‘నాన్నా నాకిది కావాలి అంటే క్షణాల్లో నా ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు. పేరుకే సెలెబ్రిటీ కూతురిని. కానీ సెలెబ్రిటీల పిల్లలకుండే ఏ హక్కుల్నీ సంతోషాల్నీ నేను అనుభవించలేదు. అయినా నా మీద నాకు నమ్మకముంది. అందుకే సమస్యలను ఎదుర్కొంటూ ఎదగడం నేర్చుకున్నాను’ అంటుంది త్రిశల.
 
 తన తల్లి చనిపోవడంతోనే రియా పిళ్లై అనే మోడల్/నటిని పెళ్లాడాడు తండ్రి. ఆమెతో విడిపోయాక మాన్యతను మూడో భార్యగా చేసుకున్నాడు. ఇవన్నీ త్రిశల మనసుపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే, ఆమె ఎవరికీ తెలియనివ్వలేదు. తండ్రితో ఎప్పుడూ మంచి అనుబంధమే ఉందామెకి. అప్పుడప్పుడూ ఇండియా వస్తుంది. నాన్నతో గడుపుతుంది. మాన్యతతో స్నేహంగా ఉంటుంది. వారి పిల్లలైన షహ్రాన్, ఇక్రాలతో ఆడిపాడుతుంది. ఉన్నన్ని రోజులూ సరదాగా, సంతోషంగా గడిపి అమెరికా వెళ్లిపోతుంది... ఒంటరిగా.
 
 ఆ నిర్ణయం తనదా... తండ్రిదా?
 త్రిశల మొదట్లో చాలా లావుగా ఉండేది. విపరీతంగా పెరిగిన ఒళ్లు ఆమెని ఇబ్బంది పెట్టేది. ఆ అవస్థను తగ్గించుకోవాలనుకుంది. కష్టపడి వర్కవుట్లు చేసింది. ఇప్పుడు త్రిశలను చూస్తే, ఈమె ఆ త్రిశలేనా అని అనుమానం రాక మానదు. అయితే త్రిశల స్లిమ్ అవ్వడం చూసినవాళ్లు ఆమె సినిమాల్లోకి వస్తుందేమో అనుకున్నారు. సోనాక్షి, సోనమ్‌ల మాదిరి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తుందేమో అనుకున్నారు. కానీ త్రిశల ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. పెట్టనని చెప్పేసింది కూడా. దానికి కారణం తండ్రికిష్టం లేకపోవడమే అని అందరూ అంటున్నా, ఆమె మాట్లాడదు. నాన్న నో అంటే ఇక అంతే అన్నట్లు ఉండిపోతుంది.
 
 త్రిశల ఫ్యాషన్ ఐకన్‌లా ఉంటుంది. రకరకాల హెయిర్ స్టయిల్స్, సొంతగా డిజైన్ చేసుకునే కాస్ట్యూమ్స్, నడినెత్తి నుంచి పాదాల వరకూ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో! ఆ శ్రద్ధే ఆమెను అటువైపు నడిపించింది. డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను నిలిపేందుకు తహతహలాడుతోంది త్రిశల. ఇండియా వచ్చి సెటిలవ్వాలన్న ఆలోచన ఆమెకి లేదు. బహుశా చిన్ననాటి నుంచీ ఎదుర్కొన్న పరిస్థితులే అందుకు కారణం కావచ్చు. వాటి గురించి అడిగినా తను చెప్పదు. చిన్నగా నవ్వి తప్పుకుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆమె నవ్వు వెనకాల లోతైన భావమేదో కనిపిస్తుంది. ఆ భావాన్ని చదవడంలో... ఈ సమాజం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది!
 - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు