నోబెల్‌కే నిండుదనం

22 Dec, 2013 02:25 IST|Sakshi
నోబెల్‌కే నిండుదనం

పురస్కారం
  అమర్త్యసేన్, రామకృష్ణన్, అబ్దుస్ సలామ్, నైపాల్, యూనస్
 
 నోబెల్‌కే నిండుదనం   నోబెల్ ఇండియా
 సామాజిక అర్థికవేత్త
 
 అమర్త్యసేన్‌కు 1998లోఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. అమర్త్యసేన్ 1933 నవంబర్ 3న ఢాకా నగరంలో పుట్టారు. అమర్త్యసేన్ తల్లిదండ్రులు అసుతోష్ సేన్, అమితాసేన్. అమర్త్యసేన్ తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర అధ్యాపకులు, తల్లి శాంతినికేతన్‌లో పనిచేసేవారు. ‘అమర్త్యసేన్’కు రవీంద్రనాథ్ ఠాగూర్ నామకరణం చేశారు.
 
 శాంతినికేతన్ నుంచి కేంబ్రిడ్జి వరకు...
 అమర్త్యసేన్ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన ఆర్థికశాస్త్రంలో చేసిన అధ్యయనాలకు గుర్తింపుగా అత్యున్నతమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. అమర్త్యసేన్ హైస్కూల్ విద్య శాంతినికేతన్‌లో, గ్రాడ్యుయేషన్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తిచేశారు. ఉన్నత విద్యభ్యాసం కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, ట్రినిటీ కళాశాలలో చేరారు.
 
 అర్థశాస్త్రానికి కొత్త అర్థం!
 అమర్త్యసేన్ ఆర్థిక శాస్త్రంలో పాతవిధానాలకు స్వస్తి చెప్పి సామాజిక దృక్పథంలోను, సమాజంలో ఉండే ఆర్థిక అసమానతల పరంగా ప్రజలను మనస్తత్వాల ఆధారంగాను అర్థశాస్త్రాన్ని అభ్యసించాలని ప్రతిపాదించారు.
 జీవరసాయన వైతాళికుడు
 
వేంకటరామన్ రామకృష్ణన్ 2009లో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రజ్ఞుడు. ఆయన తమిళనాడు, కడలూర్ జిల్లా చిదంబరంలో 1952వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు సి.వి.రామకృష్ణన్, తల్లి శ్రీమతి రాజ్యలక్ష్మి. తల్లిదండ్రులిద్దరూ శాస్త్రవేత్తలే. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా వేంకటరామన్ రామకృష్ణన్ విద్యాభ్యాసమంతా వడోదరలోనే జరిగింది. ఆయన 1971లో బరోడా విశ్వవిద్యాలయంల నుంచి బీఎస్ పట్టా పొందారు. భారతదేశంలో ఆయనకు పైచదువులకు ప్రవేశం లభించలేదు. అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో 1976లో పీహెచ్‌డీ పొందారు. రామకృష్ణన్‌కు డాక్టరేట్ వచ్చేనాటికి వయస్సు 24.
 
 1976లో రామకృష్ణన్ తన పరిశోధనలను భౌతిక శాస్త్రం నుంచి బయో కెమిస్ట్రీలోకి మార్చుకున్నారు. డాన్ ఎంగెల్‌మన్, పీటర్ మూర్‌లు ప్రచురించిన రైబోజోమ్‌లపై పరిశోధన పత్రం ప్రభావంతో రైబోజోమ్‌ల నిర్మాణంపై పరిశోధనలు ప్రారంభించారు. రైబోజోమ్‌ల నిర్మాణంపై జరిపిన పరిశోధనలకు గాను రామకృష్ణన్ 2009లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.
 
 దైవకణ ఉనికి నిర్ధారకుడు
 
 అబ్దుస్ సలామ్‌కు 1979లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ఆయన అవిభక్త భారతదేశంలోని పంజాబ్‌లో 1926, జనవరి 29న జన్మించారు. ఈయన తండ్రి చౌదరి మహమ్మద్ హుస్సేన్ తల్లి హజీరా హుస్సేన్. అబ్దుస్ సలామ్ 1944లో గణితశాస్త్రంలో బీఏ, 1946లో ఎం.ఎ. పట్టా సాధించారు. ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండ్ వెళ్లారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణితం, భౌతిక శాస్త్రాలు ప్రధానంగా 1949లో ఉత్తీర్ణత చెందారు. అదే విశ్వవిద్యాలయంలో థీరిటికల్ ఫిజిక్స్‌లో క్వాంటమ్ ఎలక్ట్రో డైనమిక్ అంశంలో 1951లో పీహెచ్‌డీ పట్టా సాధించారు. అబ్దుస్ సలామ్ పార్టికిల్ ఫిజిక్స్‌లో గణనీయమైన పరిశోధనలు జరిపి పరమాణువులోని వివిధ కణాలు ఏ విధంగా సంయుక్తంగా ఉండగలుగుతాయో సిద్ధాంతీకరించారు. అబ్దుస్ సలామ్ జరిపిన నాలుగు దశాబ్దాల పరిశోధనల ఫలితంగానే ఇటీవలి కాలంలో ఆవిష్కృతమైన బోసాన్ అనబడే దైవకణం యొక్క ఉనికి నిర్ధారించబడింది. పార్టికిల్ భౌతిక శాస్త్ర పరిశోధనలకు గుర్తింపుగా 1979వ సంవత్సరపు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
 
 ప్రపంచసాహితీ వేత్త
 
 అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో విద్యాధర సూరజ్ ప్రసాద్ నైపాల్ (వి.ఎస్.నైపాల్) ఒకరు. ఆయనకు 2007లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. సర్ విద్యాధర సూరజ్ ప్రసాద్ ట్రినిడాడ్‌కు చెందిన భారత సంతతివారు. ఈయన బ్రిటన్ పౌరసత్వం పొందారు. వీరు ట్రినిడాడ్ టొబాగోలో 1932వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన జన్మించారు. మొదటి నుంచి ఆయనకు ఆంగ్లభాషలో ప్రావీణ్యత ఉండడం చేత అనేక గ్రంథాలు చదివారు. ఆ స్ఫూర్తితో కథలు, వ్యాసాలు రాశారు. తన భావాలను సులభంగా వ్యక్తీకరించారు.  ఆయన రచనలు వలస సంప్రదాయం కలిగిన వెస్ట్ ఇండీస్ దీవులలో ముఖ్యంగా ఆక్రమణలకు గురైన దీవులలో ఎంతో ప్రబోధాత్మకాలై అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి.
 విద్యాధర సూరజ్ నైపాల్ తల్లిదండ్రులు భారత సంతతికి చెందినవారే. ఈయన మొదటి భార్య పాట్రీషియా నైపాల్ 1996లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆ తర్వాత ఆయన 1996లో నాదిరా అనే భారతి సంతతికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు.
 నైపాల్ పురస్కారాలలో కొన్ని:
     1971వ సంవత్సరపు బుకర్ బహుమతి
     2007లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం.
 
 మేధో దార్శనికుడు
 
 మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఈయన అసోమ్ రాష్ట్రం, చిట్టగాంగ్‌లో 1940 జూన్ 28న జన్మించారు. చిట్టగాంగ్ ప్రస్తుత బంగ్లాదేశ్‌కు చెందినది. యూనస్ బాల్యం, విద్యాభ్యాసం చిట్టగాంగ్‌లోనే జరిగింది. ఢాకా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ, ఎమ్‌ఏ డిగ్రీలను పొంది స్కాలర్‌షిప్‌పై వాండర్ బిల్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి 1971లో డాక్టరేట్ సాధించారు. 1969 నుంచి 1972 వరకు మిడిల్ టెన్నిసీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో 1972, 73లో సంభవించిన కరవులో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి ఉద్యోగానికి రాజీనామా చేసి, 1974 నుండి కరవు, పేదరికం నిర్మూలన ఉద్యమాలు, ప్రజాహిత ఆర్థిక సంస్కరణలు చేపట్టి సమాజానికి మేలు చేశారు. గ్రామీణ బ్యాంకులు, జనతా బ్యాంకులు, సూక్ష్మ రుణ పథకాలు, సంక్షేమ ఆర్థిక విధానాలు ఇవన్నీ అబ్దున్ సలామ్ ప్రతిపాదనలే. 2006లో లభించిన నోబెల్ పురస్కారానికి ఆయనకు వచ్చిన సొమ్మునంతా అబ్దున్ సలామ్ ‘చౌక ధరలో అధిక పోషణ విలువలు’ గల ఆహారం తయారు చేసే కర్మాగారానికి, పేదల కోసం కంటి ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించారు.
 
మహాత్ముడికి ఎందుకురాలేదు?
 
 భారత జాతిపిత మోహనదాస్ కరమ్‌చంద్ గాంధీ పేరు నోబెల్ శాంతి పురస్కారానికి 1937, 1938, 1939, 1947, 1948లలో ప్రతిపాదనకు వచ్చింది. అది ప్రతిపాదనలకే పరిమితమైంది తప్ప బహుమతి ప్రదానం జరగలేదు. దలైలామాకు నోబెల్ బహుమతి ఇచ్చినప్పుడు ‘ఈ శాంతి పురస్కారం ఒక విధంగా మహాత్మాగాంధీ అహింసాయుత పోరాటానికి జ్ఞాపిక’ అన్నారు నిర్వహకులు. 1937లో ప్రతిపాదించినప్పుడు నోబెల్ కమిటీకి సలహాదారు ప్రొఫెసర్ జాకబ్ వర్మ్ ముల్లర్ ‘ఆయన  జనబాహుళ్యం మెచ్చిన నాయకుడే కానీ విధాన నిర్ణయంలో నియంత. ఆదర్శవాది అయినప్పటికీ సామాన్య రాజకీయవేత్త. అహింసావాదం గొప్పదే, అయితే అన్ని సందర్భాలలోనూ నిలుస్తుందా?’ అన్నారు. ఐరోపా దేశాలకు చెందిన ‘భారతమిత్రత్వ సంఘ సభ్యులు’ మూడేళ్లు ప్రతిపాదించినా ఫలితం లేకపోవటానికి బ్రిటిష్ ప్రభుత్వ వత్తిళ్లే కారణమని విశ్లేషకుల అభిప్రాయం. 1947లో ‘ఈ అహింసాయుత పోరాటం బ్రిటిష్ వారిపై విజయం అనుకుంటే, భారత్‌లో హిందు, ముస్లిమ్‌ల మధ్య అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయింది’ అన్నారు. 1948లో మహాత్మాగాంధీ హత్య అనంతరం ప్రతిపాదించినప్పుడు మరణించిన వారి పేర్లు నోబెల్ బహుమతికి ప్రతిపాదించలేదని, గాంధీ వారసులను పేర్కొనలేదని సాకులు చెప్పింది.
 
  డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు, విశ్రాంత రసాయనాచార్యులు
 
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు