‘ఈ’ బస్సు చాలా స్పెషల్ !

17 Aug, 2014 01:24 IST|Sakshi
‘ఈ’ బస్సు చాలా స్పెషల్ !

అధునాతనం: మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి!
 
 బైకు మీద రయ్యిన దూసుకెళ్తుంటాం. కాస్త స్లో చెయ్యగానే పక్క నుంచి సిటీ బస్సు ఓవర్‌టేక్ చేస్తుంది. సరిగ్గా మనం బస్సు వెనుకభాగంలో ఉంటాం. డ్రైవర్ మరింత వేగం పెంచుతాడు. అప్పుడు ఆ బస్సు గుప్పుమంటూ వదిలే పొగ మన ముఖాన్ని మాడ్చేసి, ఒక్క నిమిషం ఊపిరిసలపకుండా చేస్తుంది... ఇలాంటి బస్సులు ఒకటా రెండా? వేలల్లో ఉంటాయి. అవన్నీ వదిలే పొగకు నగరం ఏమవ్వాలి? వాతావరణం ఎంతగా కాలుష్యం కావాలి? ఇలాగే ఆందోళన చెందిన బెంగళూరు నగర రోడ్డు రవాణా సంస్థ.. ఎలక్ట్రానిక్ బస్సును రోడ్డుపైకి తెచ్చింది. పొగ లేదు.. శబ్దం లేదు.. కుదుపుల్లేవు.. సుఖవంతమైన ప్రయాణం. డీజిల్ పోయక్కర్లేదు. నిర్వహణ ఖర్చు తక్కువ. ఇలా ఎన్నో ప్రత్యేకతలు.
 
 రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందిపుచ్చుకోవడంలో కర్ణాటక ముందుంటుందన్నది తెలిసి విషయమే. దేశంలో ముందుగా వోల్వో బస్సులను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో అది ఒకటి. సిటీలో ఏసీ బస్సుల్ని నడపడం కూడా కర్ణాటక ముందుగా చేసి చూపించింది. ఇపుడు దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్ బస్సును ప్రవేశపెట్టింది. నగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో బీఎంటీసీ చేసిన కొత్త ఆలోచన ఇది. చైనాకు చెందిన బీవైడీ అనే ఆటోమొబైల్ సంస్థ మూడు నెలల పాటు ట్రయల్ రన్ కోసం ఈ బస్సును ఉచితంగా ఇచ్చింది. అంతేగాక ఓ వ్యక్తిని ఆ బస్సుతో పాటు పరిశీలనకు నియమించింది. బస్సును మెజెస్టిక్-కడుగొడి మధ్య రోజూ ఆరు ట్రిప్పులు నడుపుతున్నారు.
 
 పొగ లేని ఈ బస్సులో ప్రయాణించడానికి బెంగళూరు ప్రజలు సరదా పడుతున్నారు. కొందరు అయితే ప్రయాణ అనుభూతి కోసమే బస్సెక్కుతున్నారట. మరి తొలి ఎలక్ట్రిక్ బస్సు కదా. ఇందులో ఛార్జీ కూడా వోల్వో బస్సు ఛార్జీనే. ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో త్వరలో ఇంకొన్ని బస్సుల్ని దిగుమతి చేసుకుని పూర్తి స్థాయిలో నడపాలని.. భవిష్యత్తులో వాటిని పెంచుతూ పోవాలని బీఎంటీసీ నిర్ణయించింది. బస్సు నడిపే వ్యయం తక్కువే కానీ కొనాలంటే బస్సు బాగా ఖరీదు. ఒక్కోటీ 2.7 కోట్ల రూపాయల విలువైన ఈ బస్సులను కొనడానికి ప్రభుత్వ సాయం కోరుతోంది బీఎంటీసీ.
 
 ఈ-బస్సు సంగతులు
 -    వోల్వో బస్సు ధర ఇందులో మూడోవంతే. అయితే వోల్వో నిర్వహణ ఖర్చు కి.మీ.కు 16 రూపాయలు. ఎలక్ట్రిక్ బస్సు వ్యయం ఏడురూపాయలే.
 -    కాలుష్యం జీరో. పూర్తి ఎయిర్ కండిషన్డ్.
 -    అన్నీ కుషన్ సీట్లే. సామర్థ్యం 41. బస్సు మొత్తం సీసీ కెమెరాలుంటాయి. స్త్రీలకూ రక్షణ.
 -    అగ్నిప్రమాద నివారణ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఒకవేళ జరిగినా ఆర్పే పరికరాలన్నీ ఇన్‌బిల్ట్.
 -    ఆరు గంటలు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పొడవు 40 అడుగులు. బరువు 18 టన్నులు.
 
 లండన్‌లో మొదలయ్యాయి
 మనదేశంలో ఏదైనా కొత్తగా వస్తే అది ప్రపంచంలో బాగా పాపులర్ అనుకుంటాం. నిజానికి చాలా పెద్ద దేశాల్లోనూ ఈ-బస్సు లాంటివి ఇంకా ఇపుడిపుడే మొదలువుతున్నాయి! బ్రిటన్‌లోనూ ఇదే ఏడాది ఈ బస్సులు రోడ్డుపైకి వచ్చాయి. లండన్లో ఒకేసారి నాలుగు ఈ-బస్సులు ప్రారంభించారు. విశేషం ఏంటంటే అక్కడ ఈ ప్రాజెక్టు చేపట్టింది ఇండియాలో మొదలై ప్రస్తుతం లండన్ హెడ్‌క్వార్టర్‌గా నడుస్తున్న హిందుజా గ్రూప్ ఉప సంస్థ ఆప్టేర్. కాలుష్యం ఎక్కువ కావడం వల్లే లండన్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. మరో రెండేళ్లలో 20 శాతం బస్సులు ఇవే ఉండాలని అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
 
 గుజరాత్‌కు రాబోతున్నాయి
 బెంగళూరులో ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ర్టం వీటిపై దృష్టిసారించింది. దేశంలో పర్యావరణంపై ఎక్కువగా దృష్టిపెట్టిన రాష్ర్టం గుజరాత్. అందుకే ఈ-బస్సులను పైలట్ ప్రాజెక్టుగా గాంధీనగర్-అహ్మదాబాద్‌ల మధ్య ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్ పవర్ కార్పొరేషన్ ఇందులో ప్రధాన భాగస్వామి. తొలి దశలో 15-20 బస్సులు తేనున్నారు. సోలార్ పవర్ ద్వారా వీటికి ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుచేస్తారట. ప్రతి 35 కిలోమీటర్లకు ఈ పాయింట్లు ఏర్పాటుచేస్తారు. బ్యాటరీ ఇండికేటర్ సిగ్నల్స్‌ను బట్టి బస్సును మార్గమధ్యలో కూడా ఛార్జి చేసుకోవచ్చు. ఆరు నెలల్లో ఇది అమలు చేస్తారట. మన రాష్ర్టంలో కూడా ముఖ్యంగా నగరాల్లో వీటిని ప్రారంభించి కాస్త కాలుష్యాన్ని తగ్గిస్తే బాగుంటుంది.

మరిన్ని వార్తలు