బ్రహ్మాండ నాయకుని వైభవం నాడు నేడు

28 Sep, 2014 01:23 IST|Sakshi

నాడు ఎందరెందరో రాజులు తమ విజయ పరంపరలో భాగంగా స్వామికి ఎన్నెన్నో ఉత్సవాలు జరిపించారు. తిరుమలలో నెలకో బ్రహ్మోత్సవం జరిగిన సందర్భాలూ ఉన్నాయని శాసనాధారం. కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులకు అనుగుణంగా కొన్ని దశాబ్దాలుగా ఏడాదికి ఒకసారి, అధికమాసంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమలకొండకు కనీసం కాలిబాట కూడా లేని రోజుల్లోనూ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరిగేవి. ఇందుకోసం భక్త జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. కాలినడకన కొందరు, డోలీల్లో మరికొందరు తిరుమలకొండకు చేరుకుని, ఉత్సవాలను తిలకించేవారు.
 
 నేడు తిరుమలలో రెండు ఘాట్‌రోడ్లు ఏర్పడ్డాక జనం పెరిగారు. కనీస వసతులు పెరిగాయి. కాఫీ, టీ కూడా లభించని రోజులు పోయి హైటెక్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అలనాటి రాజుల తరహాలోనే నేడు కోట్లకు పడగలెత్తిన దాతలు దేవదేవునికి భూరి విరాళాలు సమర్పించుకునేందుకు బారులు తీరుతున్నారు. దాంతో ఆలయ ఆదాయం పెరిగింది. హైటెక్ హంగులు సంతరించుకున్నాయి. ఉత్సవాల నిర్వహణలో ఆధునికత సంతరించుకుంది. పురాతన సంప్రదాయాలను కొనసాగిస్తూనే కొత్తకొత్త ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది దేవస్థానం.
 
  నాడు మహంతుల పాలన
 తిరుమల ఆలయానికి రెండు వేల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. ఆలయ పాలన బాధ్యతలను రాజులు, మహరాజులు, ఆర్కాటు నవాబులు, ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్ ప్రభువులు ఆయా కాలాల్లో చూసారు. రామానంద సంప్రదాయానికి చెందిన హథీరాం మహంతుల కాలం (1843 -1933)లో ఆలయ పోషణ, పరిపాలన నిరాటంకంగా సాగింది.
 
 నేడు ఆలయ పాలన
 1933లో టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కమిటీలో నియమించేది. 1951 తర్వాత ట్రస్టు బోర్డు పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. ఆలయ పాలనకు నేడు ఈవో నేతృత్వంలో జేఈవో (తిరుపతిలో ఒకరు, తిరుమలకు మరొకరు)లుగా ఐఏఎస్ అధికారులు ఉంటారు. ట్రస్టుబోర్డు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అధికారులపైనే ఉంటుంది. ఆలయ నిర్వహణ బాధ్యత, భక్తుల క నీస మౌలిక సదుపాయాల కల్పన వీరి నేతృత్వంలోనే సాగుతుంది.
 
 నాడు స్వామికి కంటి నిండా కునుకు
 అప్పట్లో తిరుమలకొండపై కేవలం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, పుష్కరిణి గట్టుపై చిన్నపాటి శ్రీ భూ వరాహస్వామి ఆలయం మాత్రమే ఉండేది. తినేందుకు ఆహారం, ఉండేందుకు నీడకు కూడా కరువే. దీనికి తోడు క్రూర మృగాలు, జంతువుల భయమెక్కువ. సూర్యోదయం తర్వాత ఆలయ మహద్వార తలుపులు తెరుచుకునేవి. తిరిగి సూర్యాస్తమయం లోపే మూసేయాల్సి వచ్చేది. కొండమీద ఆలయం పక్కనే హథీరాం మఠం, వేయికాళ్ల మండపం తప్ప మరే భవనాలూ ఉండేవి కావు. ఆలయంలో స్వామి కైంకర్య విధులు నిర్వహించే అర్చకులు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం శుద్ధి చేసి పూజా నైవేద్యాలు సమర్పించేవారు. ఆ ఆర్వాతే యాత్రికులకు దర్శనం కల్పించేవారు. ఆలయంలో పూజా కైంకర్యాలన్నీ పగటి పూటే జరగటం వల్ల భక్త రక్షకుడైన స్వామి హాయిగా నిద్రించే అవకాశం ఉండేది.
 
 జగాలనేలే స్వామికి నేడు కునుకే కరవు
 జగాన్ని రక్షించే జగత్కల్యాణ చక్రవర్తి శ్రీవేంకటేశ్వర స్వామికి నేటి పరిస్థితుల్లో గంటంటే గంట పాటే కునుకు తీసే అవకాశం లభిస్తోంది. వేకువజాము 2.30 గంటలకు సుప్రభాత సేవ మేల్కొలుపు పాటతో నిద్రలేచే స్వామి తిరిగి ఆ రోజు రాత్రి 1 గంటకు ఏకాంత సేవలో నిద్రకు ఉపక్రమిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నిత్యం ఆ రోజు విశేషాలను బట్టి రకరకాల పూజలు, సేవలు అందుకుంటూ 22 గంటలకుపైగా ఏకధాటిగా భక్తులకు దర్శనమిస్తారు.
 
 నాడు దండోరాతో ఆహ్వానం
 మహరాజులు, మహంతుల కాలాలలో తిరుమలేశుని ఉత్సవాలు అంగరంగవైభవంగా సాగేవి. ఆలయ పాలనతోపాటు భక్తులకు ఏ లోటూ లేకుండా అవసరాలు తీరేవని రికార్డులు చెబుతున్నాయి. 1843లో మహంతుల కాలం నుంచి, 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మోత్సవాల సమాచారాన్ని దండోరాలతో ఊరూవాడా తెలియజేసేవారు. ‘‘ఇందుమూలంగా యావన్మంది పుర పెజలకు తెలియసేయటం ఏమనగా! ఫలానా.... తేదీల్లో తిరపతి ఏడు కొండల ఎంకన్న సామి బ్రొమోత్సోలు జరగతాయట. సామి ఉత్సవాలను కళ్లారా చూసేందుకు ముసలీముతకా, చిన్నపెద్దా అందరూ రావాలని దేవస్థానం ఆపీసర్లు ఇగ్నప్తి చేస్తున్నారు. తరలి రారండహో..!’’ అంటూ చిత్తూరుజిల్లా, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో డప్పులతో దండోరా వేయించేవారు. ఆ తర్వాత కరపత్రాలు, గోడ పత్రికలు, దినపత్రికలతో బాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ ప్రసారాలు అందుబాటులోకి వచ్చాక ఉత్సవాల ప్రచారం మెరుగు పడింది.
 
 నేడు మీడియా ద్వారా నేరుగానే...
 మీడియా విస్తరణతో తిరుమలలో జరిగే ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వేల కిలోమీటర్ల దూరం నుంచే వీక్షించే అవకాశం కలిగింది. ఒకవైపు ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్, ప్రభుత్వ మీడియా సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ కూడా ‘శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్’ పేరుతో సొంత టీవీ సంస్థను ఏర్పాటు చేసుకుంది. ఈ ఛానల్ ద్వారా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు మూలమూర్తి (నమూనా ఆలయంలో చిత్రీకరించిన పూజాకైంకర్యాల ప్రసారాలు), ఉత్సవమూర్తులకు జరిగే పూజలు, సేవలన్నీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తుల ఇళ్లవద్దకే చేరుతున్నాయి.
 
 నాడు వెండివాహనాలపైనే ఊరేగింపు
 అప్పట్లో అన్ని వాహనాలూ వెండివే. పగలు సూర్యకాంతిలో, రాత్రి చంద్రుని వెన్నెల్లో వెండివాహనాలు అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించేవి. బ్రహ్మోత్సవాలకు ముందు వాహనాలకు మెరుగులద్దేవారు. ఆలయంలో ఆర్జిత సేవలతోపాటు అలంకార ప్రాయంగా ఉత్సవాలు నిర్వహించటం కోసం కాలానుగుణంగా వెండిరథం కూడా ఉండేది. వెండి రథాన్ని రెండోబ్రహ్మోత్సవంలోనూ, వార్షిక వసంతోత్సవాల్లోనూ ఊరేగించేవారు.
 
 నేడు స్వర్ణ రథాలపై స్వామి దర్శనం
 కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులకు అనుగుణంగా నాటి వెండివాహనాలన్నీ కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో కాంతులీనే బంగారు వాహనాలపై మలయప్ప స్వామి తన ఉభయ దేవేరులతో కలసి ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిస్తున్నాడు. వెండి రథం స్థానంలో 1992లో తొలిసారిగా బంగారు రథం వచ్చి చేరింది. సరిగ్గా 21 ఏళ్లపాటు సేవలందించిన ఆ స్వర్ణరథాన్ని తిరుపతిలోని శ్రీనివాసమంగాపురానికి తరలించారు. దాని స్థానంలో 2013లో రూ.30 కోట్లతో మరొక కొత్త స్వర్ణరథాన్ని టీటీడీ సిద్ధం చేసింది. ప్రస్తుత ఊరేగింపుల్లో కొత్త స్వర్ణరథానిదే ప్రత్యేక ఆకర్షణ.
 
 నాడు కొయ్య చక్రాలపైనే తేరు ఊరేగింపు
 బ్రహ్మోత్సవాల్లో కొయ్యతేరుకు చాలా ప్రాధాన్యత ఉంది. స్వామిని దర్శించినా, లేకపోయినా ఉత్సవాల్లో కొయ్య తేరు లాగితే చాలు మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అప్పట్లో సాంకేతికత అంతగా అందుబాటులోకి లేదు. తేరు కొయ్య చక్రాలపైనే తిరిగేది. ఆలయం చుట్టూ తొలిరోజుల్లో మట్టిరోడ్డే ఉండేది. తర్వాత బండలు పరిచారు. ఆ తర్వాత తారు రోడ్డు వచ్చింది. దానిపై తేరు కొయ్య చక్రాలు నిలిపినా నిలిచేవి కావు.
 లోతట్టు ప్రాంతానికి తేరు వేగంగా దూసుకెళ్లేది. దాంతో కేవలం తేరు నిర్వహణ కోసమే తిరుపతిలోని బండ్లవీధికి చెందిన కొన్ని కుటుంబాలు మిరాశీ పద్ధతిలో సేవలందించేవి. వారే అతికష్టం మీద తేరు ఊరేగింపును ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేవారు. ఒక్కోసారి ఇరుకైన మలుపుల వద్ద తేరు అర్ధంతరంగా ఆగేది. తిరిగి మరమ్మతులు చేసి ముందుకు సాగాలంటే కనీసం రెండు మూడు గంటలు పట్టేది.
 
 నేడు హైడ్రాలిక్ చక్రాలపై తేరు చక చకా
 తేరు (మహారథం)కు వాడే కొయ్యచక్రాలకు బదులు హైడ్రాలిక్ చక్రాలు అమర్చారు. అది కూడా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఇనుము, ఉక్కుతో కూడి హైడ్రాలిక్ బ్రే క్ సిస్టమ్స్ కలిగిన నాలుగు చక్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిసారి బ్రహ్మోత్సవాలకు ముందు బెల్ సంస్థ నుంచి ప్రత్యేక ప్రతినిధులు తిరుమలకు చేరుకుంటారు. చక్రాలను పరిశీలించి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తారు. తేరు ఊరేగింపు పూర్తిగానే తిరిగి వెళతారు. అధునాతన సౌకర్యాలు, హైడ్రాలిక్ చక్రాల వల్ల తేరు ఊరేగింపు నేడు సులువుగా మారింది. ఇరుకైన మలుపుల్లో కూడా రెండు గంటల్లోనే తేరు ఊరేగింపు పూర్తవుతోందంటే ఆశ్చర్యమే!
 
 నాడు ఊరి జనమే భద్రత!
 గతంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం ఊరి జనమే సేవలందించేవారు. ఎంతమంది జనం పోగైతే వాహనాలకు అంత భద్రత ఉండేది.
 
 నేడు సీసీ కెమెరాల నిఘాలో...
 దేశంలో ఉగ్రవాద దుశ్చర్యలు పెరిగాయి. దాంతో తిరుమలలో సీసీ కెమెరా, భద్రతా వ్యవస్థల నిఘా పెరిగింది. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరినిండా నిఘా (సీసీ కెమెరా) కళ్లే కనిపిస్తాయి. ఉత్సవాల నిర్వహణ కోసం పోలీసు భద్రత ఉంటుంది. తిరుమలకు వచ్చి వెళ్లే వాహనాల తనిఖీ కోసం ప్రత్యేక వ్యవస్థే ఉంది.
 
 నాటి చలికి కుంపటి సెగ ఉండాల్సిందే!
 నాడు వాతావరణ పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. చలి ఎక్కువ. వర్షాలు వస్తే నాలుగైదు రోజుల విడిచేవి కావు. చలి నుంచి కాపాడుకునేందుకు కుంపటి సెగ కాచుకునేవారు. ఆలయంలో పనిచేసే అర్చకులు, సిబ్బంది కూడా ఆలయం పక్కనే కట్టెలు కాలేసి, చలి కాచుకునే వారు. సిబ్బంది, స్థానికులతోపాటు యాత్రికులూ ఉపశమనం పొందేవారు.
 
 నేడు ఏసీ లేని భవనమే లేదు..!
 తిరుమలలో వాతావరణ పరిస్థితులు బాగా మారిపోయాయి. వాహనాల కాలుష్యం, శబ్దకాలుష్యం పెరిగి, తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో వాతావరణం బాగా వేడెక్కింది. ఒకప్పుడు కాటేజీలకు ఫ్యాను పెట్టేందుకే భయపడ్డ టీటీడీ అధికారులు ప్రస్తుతం ఏసీలు అమర్చకుండా భవనాలే నిర్మించటం లేదు.
 
 నాడు మేళ తాళాలతో సాగనంపేవారు
 శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఆలయ మర్యాదలు ఉండేవి. రంగనాయక మండపంలో కల్యాణోత్సవం పూర్తికాగానే స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన గృహస్థ భక్తులను వారు బస చేసిన గ్రామ చావడి (సత్రం) వరకు మేళతాళాలతో సాగనంపే ఆచారం ఉండేది. పెద్ద లడ్డూలు, అన్నప్రసాదాలు భక్తులకు బహుమానంగా అందేవి.
 
 నేడు కనీస మర్యాదలూ కరవే!
 మర్యాదల మాటెలా ఉన్నా కల్యాణోత్సవం టికెట్లు దక్కించుకునేందుకు భక్తులు ఎన్నెన్ని సిఫారసులు చేయాల్సి వస్తుందో ఆ ఏడుకొండలవాడికే ఎరుక.
 
 బ్రహ్మోత్సవాలంటే ఊరంతా పండగే
 శ్రీవారి బ్రహ్మోత్సవాలను స్థానికులు తమ ఇంటి పండువలా నిర్వహించుకునేవారు. తమ పూరి గుడిసెలు, పక్కా ఇళ్లకు వెల్ల వేసేవారు. ఇళ్లకు, కాలనీ సందుల్లో మామిడి తోరణాలు, అరటి మొక్కలు కట్టేవారు. ఉత్సవాలను దర్శించుకునేందుకు వచ్చే బంధువుల కోసం ఇంటిలో కిరాణా సామగ్రిని ముందుగానే సమకూర్చుకునేవారు. స్థానికుల్లో ఉన్నతులైనవారు, ఆలయాల్లో పనిచేసే అర్చకులుపిండివంటలు చేసి బంధువులతోపాటు యాత్రికులకూ విరివిగా వితరణ చేసేవారు. నేడు ఆ పరిస్థితులే కానరావడం లేదు. ఉరుకులు పరుగుల జీవితంలో స్థానికులకు అంత తీరుబడి ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా, వచ్చిన భక్తులు సేదతీరేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి భవనాలకు కొదవేలేదు.
 
 నాడు డోలీలే శరణ్యం!
 అప్పట్లో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలంటే భక్తులు అష్టకష్టాలు పడేవారు. అడవి జంతువుల భయం ఎక్కువ. దానికితోడు అడవి దారిలో కాచుకునే దోపిడీ దొంగల బెడద ఎక్కువ. అందుకే పదీ పదిహేను కుటుంబాలు కలసికట్టుగానూ, భక్త బృందాలుగానూ వెళ్లేవారు. నడవలేని వృద్ధులు, వికలాంగులను కూలీలు డోలీలపై మోసుకెళ్లేవారు. పొడవాటి కట్టెకు ఊయల ఏర్పాటు చేసి అందులో వ్యక్తిని కూర్చోబెట్టుకుని సునాయాసంగా కొండెక్కేవారు. అలిపిరి నుంచి కాలిబాట మీదుగా తిరుమలలోని పాత కల్యాణ మండపానికి సమీపంలోని డోలీ మండపం బ్లాక్ (డీఎంబీ) వరకు మోసుకె ళ్లేవారు.
 
 నేడు విరివిగా వాహనాలు...
 మద్రాసు ఉమ్మడి రాష్ర్ట బ్రిటీషు గవర్నర్ సర్ ఆర్థర్ హూప్ నేతృత్వంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి ఘాట్‌రోడ్డుకు పక్కగా సర్వే చేసి తారు రోడ్డు నిర్మించారు. 1945 ఏప్రిల్ 10 న తిరుమల-తిరుపతి మధ్య మొదటి ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. తొలుత ఎడ్లబండ్లు, ఆ తర్వాత నల్లరంగు మినీ బస్సులు ఒకే మార్గంలోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. తర్వాత 1973లో రెండో ఘాట్‌రోడ్డు ఏర్పడింది. రాకపోకలు వేర్వేరు రోడ్లపై సాగే సౌకర్యం కలిగింది. వాహనాల రాక పెరిగింది. భక్తులు రోజుకు పది వేలకు చేరారు. బ్రహ్మోత్సవాలు, పండుగలు, పర్వదినాల్లో లక్షలాదిగా తరలివస్తున్నారు.
 
 నాడు నాలుగు రేకుల షెడ్ల కిందే నిరీక్షణ
 రెండో ఘాట్‌రోడ్డు ఏర్పడే వరకు మహద్వార గోపురం నుంచే భక్తులు ఆలయంలోకి వెళ్లేవారు. పదినిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చేవారు. రెండో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చి తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు వేరుపడ్డాక జనం రాక రెట్టింపైంది. దీంతో స్వామి దర్శనం కోసం బారులు తీరే భక్తులు ఎండా, వాన, చలి, వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించిన అధికారులు పుష్కరిణి గట్టుపై పాత పుష్కరిణి కాంప్లెక్స్ (పీపీసీ) పేరుతో సిమెంట్ రేకులతో నాలుగు షెడ్లు నిర్మించారు. ఒక్కో షెడ్డులో 500 మంది చొప్పున నాలుగు షెడ్లలో 2 వేలమంది వేచి ఉండేవారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, జనవరి 1 వంటి ప్రత్యేక పర్వదినాల్లో .. ఆ పీపీసీ షెడ్లు కూడా నిండి క్యూలైను వరాహస్వామి ఆలయం మీదుగా ఉత్తరమాడ వీధి, పెరుందేవమ్మ తోట నుంచి పాపవినాశనం రోడ్డు, సురాపురం తోట నుంచి పాత అన్నదానం కాంప్లెక్స్ వరకు సాగేది.
 
 
 నేడు రెండు భారీ క్యూకాంప్లెక్స్‌లలో...
 1980 నాటికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో రద్దీని తట్టుకునే విధంగా 1985లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రారంభించారు. దాంతో ఏకంగా 20 వేల మంది భక్తులు అన్ని మౌలిక వసతుల మధ్య నిరీక్షించే సౌకర్యం కలిగింది. అది కూడా చాలకపోవడంతో ఆలయ నాలుగు మాడ వీధుల్లోని స్థానిక నివాసాలను ఖాళీ చేయించి 2003లో రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను నిర్మించారు. దీనివల్ల మరో 20వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం కలిగింది. ప్రస్తుతం ఈ రెండు క్యూ కాంప్లెక్స్‌లు కూడా సరిపోక వెలుపల నిరీక్షించాల్సి వస్తోంది!
 
 నాడు వేల నుంచి లక్షల్లోకి బడ్జెట్
 అప్పట్లో వేలల్లో మాత్రమే బడ్జెట్ ఉండేది. మొదటి ఘాట్‌రోడ్డు రావడంతో క్రమంగా భక్తులు పెరిగారు. ఆలయానికి వచ్చే ఆదాయం కూడా పెరిగింది. సత్రాల నిర్మాణం కోసం వేల నుంచి ఖర్చు లక్ష ల్లోకి పెరిగింది. తిరుమల, తిరుపతిలో అనేక సత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
 
 నేడు రూ.2401 వేల కోట్లకు పెరిగిన టీటీడీ బడ్జెట్
 టీటీడీ పాలనంతా చిన్న రాష్ట్ర ప్రభుత్వ తరహాలోనే సాగుతుంది. 1933 ప్రారంభంలో టీటీడీ బడ్జెట్ లక్షల్లో ఉంటూ వేళ్లపై లెక్క పెట్టగలిగేంత ఉండేది. ప్రస్తుతం 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రూ.2401 కోట్లతో దేవస్థానం బడ్జెట్‌ను ఆమోదించింది. రూ.లక్షల్లో ఉండే టీటీడీ ఆస్తులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. రెండు లక్షల కోట్లకు పైబడ్డాయి. శ్రీవారి హుండీ ఆదాయం నేడు రోజుకు రూ. 2కోట్ల నుంచి రూ.3 కోట్లు దాటుతుండడంతో భక్తులకు వైద్యం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
 
 భక్తుల కోసమే పుట్టిన తిరుమలకొండ
 భక్తులను ఉద్ధరించేందుకు శ్రీనివాసుడు వైకుంఠాన్ని వీడి ఇల వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువైనాడు. తన భక్తులకు ఎటువంటి కష్టం రానీయకుండా తిరుమల కొండపై ఊరు పుట్టించారని పూర్వం నుంచే స్థానికులు చెబుతుండేవారు. 1843 నుండి ఆలయ పాలన మహంతుల చేతుల్లోకి వె ళ్లింది. ఆలయం అభివృద్ధి చెందాలంటే భక్తులు రావాలి. వారి సంఖ్య క్రమంగా పెరగాలి. వచ్చేవారికి కూడు, గూడు వంటి వసతులు కల్పించాలంటే ఆలయం చుట్టూ ఊరుండాలని మహంతులు భావించారు. దాంతో తిరుపతి, తిరుచానూరు, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం, పెరుమాళ్‌పల్ల్లి, తిరుచానూ రు, శ్రీకాళహస్తి, తమిళనాడులోని వేలూ రు, కంచితోపాటు అనేక గ్రామాలోన్లి జనాన్ని రప్పించారు. మఠం భూములు లీజుకు ఇచ్చారు. నివాసాలు ఏర్పరచుకునేందుకు అనుమతి ఇచ్చారు. 1910లో ధర్మకర్తగా ఆలయ పాలన బాధ్యతలు చేపట్టిన అప్పటి మహంతు ప్రయాగ్‌దాస్ తిరుమలకొండ మీద నివాసాలు కల్పించేందుకు చొరవ చూపారు.
 
  స్థానికులనే స్వామి ఆలయంలోనూ, హథీరాం మఠంలోనూ ఉద్యోగులుగా నియమించుకున్నారు. అలా ఆలయానికి దక్షిణ దిశలో గజేంద్రమోక్షం కొలను (ప్రస్తుతం మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్), పడమర దిశలో చంద్రబాబుతోట (నారాయణగిరి ఉద్యానవనం), గొల్లకృష్ణయ్య సందు (రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్), ఉత్తర దిశలో పెరిందేవమ్మతోట ( రామ్‌భగీచా గెస్ట్‌హౌస్), ఈశాన్య దిశలో మూలమఠంతోట, సింగమాలవీధి (తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం) సురాపురంతోట (సురాపురంతోట కాటేజి), తూర్పు దిశలో బొమ్మల గోపురం, మొండిగోపురం (ఆస్థాన మండపం, కల్యాణకట్టలు), మాధవ నిలయం (రెండో యాత్రిసదన్) వద్ద స్థానికుల సంఖ్య పెరిగింది. వేళ్లమీద లెక్కపెట్టే గుడిసెల నుంచి వీధులు, ఆ తర్వాత కాలనీలు వెలిసాయి.
 
 ఆలయం చుట్టూ ఊరు తయారైంది. మహంతుల కాలంలో 300 లోపే ఉన్న తిరుమల జనాభా 1970 నాటికి దాదాపు 25 వేలకు పైబడింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పదిరోజుల పాటు స్థానికులు నిర్వహించే పూటకూళ్ల ద్వారా యాత్రికులకు కూడు, గూడు సమకూర్చేవారు. హథీరాం మఠం, సాథూరాం మఠాల పక్కన పూటకూళ్ల మిట్ట ఉండేది. అక్కడ ముందుగానే ఇంతమందికి భోజనం కావాలి? ఇన్ని రోజులు ఉంటాము... అన్న వివరాలు తెలియజేస్తేనే అవసరమైన ఆహార పదార్థాలు సిద్ధం చేస్తారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల కోసం రాగిరోటి, సజ్జ రోటి, జొన్నరొట్టెలు, దుంపలతో పులుసు సిద్ధం చే సేవారు.
 
 ఇక ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటకకు చెందిన యాత్రికుల కోసం వరి అన్నం, పప్పు, సాంబారు, పులుసు వడ్డించేవారు. పిల్లాపాపలతో కాపురాలు సాగించే స్థానికులు మాత్రం ఎక్కువగా రాగి, సజ్జ సంగటితో కడుపు నింపుకునేవారు. ఇక బస విషయానికి కొస్తే ఆలయం వద్ద హథీరాం మఠం, వేయికాళ్ల మండపం తప్ప మరొక పక్కా భవనం కనిపించదు. అందుకే పూటకూళ్లు నిర్వహించేవారి పూరి గుడిసెలపైనే యాత్రికులు ఆధారపడాల్సి వచ్చేది. పూరి గుడిసెల్లోనే పరదాలు కట్టి విభజించుకుని ఉత్సవాలకు వచ్చిన యాత్రికులు, స్థానికులు ఉండేవారు. మహంతుల చొరవ వల్ల స్థానికుల సంఖ్య ఏడాదికేడాదికి రెట్టింపయ్యింది. భోజనం, బస వసతులు పెరిగాయి. దీనివల్ల బ్రహ్మోత్సవాల పది రోజులే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల నుంచి యాత్రికుల రాక పెరిగింది.
 
 అంతరించే దశలో తిరుమల ఊరు
 ప్రస్తుతం తిరుమలకొండ మీద ఊరు అంతరించే దశకు చేరుకుంది. కాలంతోపాటు కదిలొచ్చిన మార్పులు, సౌకర్యాల వల్ల పెరిగిన రద్దీ కారణంగా బలవంతంగా స్థానికులను తిరుపతికి దించేందుకు 1975లో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. తొలుత 1985లో ఆలయానికి దక్షిణ దిశలోని పూటకూళ్లమిట్ట, సాథూరాం మఠం, గజేంద్రమోక్షం, ఆ పక్కనే చంద్రబాబుతోటను ఖాళీ చేయించి మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిర్మించారు. అప్పటి నుంచి 2003 వరకు దాదాపుగా ఊరు ఖాళీ అయింది. మాస్టర్‌ప్లాన్‌పేరుతో ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించిన టీటీడీ భూమిపై హక్కు ఉన్న పదిశాతం స్థానికులకు మాత్రమే తిరుమలలో తిరిగి పునరావాసం కల్పించింది. ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బాలాజీనగర్‌లో 1060, మ్యూజియం వద్ద రిహాబిలిటేషన్ సెంటర్ (ఆర్‌బీసెంటర్) వద్ద మరో వందదాకా నివాస గృహాలున్నాయి. తిరుమలలో మరో 25 ఏళ్లకు భక్తుల సౌకర్యాల కల్పన కోసం టీటీడీ రెండోమాస్టర్‌ప్లాన్ రూపొందిస్తోంది. ప్రస్తుతం రెండు లక్షల మంది భక్తులు కూర్చుని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులను దర్శించుకునే విధంగా టీటీడీ అభివృద్ధి పనులు పూర్తి చేసింది.
 
 మాస్టర్ ప్లాన్‌తోనే మార్పులు
 అప్పట్లోనే ఉత్సవాల్లో కోలాటాలు, చెక్కభజనలు ప్రారంభించాం. అయితే  వాటిని చూడాలంటే భక్తులు వాహనాలతో పాటు ముందూ వెనుక వస్తూ ఉత్సవ దేవుణ్ణి, భజనల్ని చూడాల్సి వచ్చేది. అందుకే మాస్టర్‌ప్లాన్ అమలు ప్రారంభించాం. దాంతో మాడ వీధులు, ఆలయ ప్రాంతం బాగా విస్తరించింది. ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పడ్డాయి. లక్షలాది మంది భక్తులు ఎక్కడికక్కడ కూర్చుని ఉత్సవ వైభవాన్ని హాయిగా దర్శించే అవకాశం కలిగింది. అలాగే, మీడియా బాగా విస్తరించటం వల్ల కూడా భక్తులకు ఉత్సవాలు దగ్గరయ్యాయి.  
 - పీవీఆర్‌కే ప్రసాద్, టీటీడీ మాజీ ఈవో (03.11.1978-08.07.1982)
 
 నాడు తొక్కిసలాటలు.. నేడు హాయిగా ఉత్సవాలు
 ఆలయ నాలుగు మాడ వీధుల విస్తరణకు ముందు ఉత్సవాల్లో తొక్కిసలాటలు జరిగేవి. ప్రతి సంవత్సరం పది, పదిహేను మందికి కాళ్లు, చేతులు విరిగేవి. ఇప్పుడా పరిస్థితులు లేవు. నాడు పీవీఆర్‌కే ప్రసాద్ వంటి ఎందరో పెద్దలు క్యూ కాంప్లెక్స్‌ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను దశలవారీగా చేస్తూ వచ్చారు. వాళ్లల్లో నేనూ ఒకడిని కావడం నా అదృష్టం. స్థానికులు ఆయా పరిస్థితులకు అనుగుణంగా టీటీడీకి సంపూర్ణ సహకారం అందించడం వల్ల లక్షలాది జనం ఉత్సవాలను సంతృప్తిగా వీక్షించగలుగుతున్నారు.
 - అజేయకల్లం, టీటీడీ మాజీ ఈవో (08.12.2002-10.02.2005)
 
 బ్రహ్మోత్సవం.. ఉండూరోళ్ల సంబరం
 ‘ఏంకటేశుడి బ్రహ్మోత్సవాలు ఉండూరోళ్ల (తిరుమల స్థానికులు) సంబరం. పాత రోజుల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఉండూరోళ్లదే పెద్ద పాత్ర. ఆ తర్వాత అధికారుల హవా పెరిగిపోయింది. పదిరోజులు యాత్రికులతో ఊరు కిటకిటలాడిపోతోంది. ఉండూరోళ్ల బంధువులు పిల్లాజెల్లాతో వచ్చి వేడుకల్ని చూసి ఆనందించేవారు. ఆ రోజులే వేరు’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో 94 ఏళ్ల నైనప్పగారి సుబ్బయ్య (తిరుమల గాంధీ) తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ పది రోజులు మా పెద్దలు మా ఇంట్లోని సామాన్లు ఓ మూలన సర్దేసేవారు. కొంత స్థలాన్ని పరదాలు కట్టి వాళ్లకిచ్చేవారు. అందులోనే  మేము, వాళ్లు (యాత్రికులు) పదిరోజులుంటూ ఉత్సవాలను చూసేవాళ్లం. వెళ్లేటప్పుడు పదో పరకో ఇచ్చేవారు. నా చిన్నప్పటి ఉత్సవాల్లో జీవం ఉండేది, ప్రస్తుతం అంతా రెడీమెడ్‌గా తయారైపోయింది’’  అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
 నాడు  అన్నకూటోత్సవం
 నాడు శ్రీవారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహించేవారు. ఆ రోజు మూలమూర్తికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధిలో అన్నపురాశితో స్వామికి నైవేద్యం సమర్పించేవారు. ఆ అన్నపు రాశిని భక్తులకు పంచిపెట్టేవారు. అప్పట్లో తిరుమలలో పూటకూళ్లు తప్ప ప్రైవేట్ హోటళ్లు ఉండేవి కావు. అందుకే భక్తులకు ఆలయ అన్నప్రసాదాలే ఆహారం! స్థానికంగా ఉండే కొన్ని కుటుంబాలు ఆలయంలో స్వామికి నైవేద్యంగా సమర్పించే ఈ అన్నపు రాశిపైనే ఆధారపడి జీవించాయి. కరువు కాలాల్లో కూడా ఆహార కొరతను తీర్చుకునేందుకు తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి .. చుట్టుపక్కల గ్రామాల నుంచి పేదజనం తిరుమలకు చేరుకునేవారు.  గంపల్లో అన్నాన్ని తీసుకెళ్లి ఆకలి తీర్చుకునేవారు. అలాగే, నిత్యం శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూ వరాహస్వామికి సమర్పించే ప్రసాదాలపై ఆధార పడి ఎన్నెన్నో కుటుంబాలు జీవించాయి.
 
 నేడు ఉచిత అన్నప్రసాద వితరణ
 తిరుమల కొండకు వచ్చే లక్షలాది భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబ నిత్యాన్న సత్రం ద్వారా రుచికరమైన అన్నప్రసాదాన్ని టిటిడి అధికా రులు అందిస్తున్నారు.
 
 తిరుపతి బాలాజీ లడ్డూ... బహుత్ అచ్చాహై!
 నాణ్యత, రుచి, పరిమాణంలో తిరుగులేని తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలని 1968లో నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధి సంకల్పించారు. అప్పటి మిరాశీదారు ఏ.రామస్వామి దీక్షితులు కల్యాణోత్సవం లడ్డూను ఢిల్లీకి తీసుకెళ్లి స్వయంగా ఇందిరాగాంధికి అందజేశారు. ఆమె భక్తితో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ‘తిరుపతి బాలాజీ లడ్డూ బహుత్ అచ్చాహై’ అంటూ ఆనందంతో పరవశించిపోయారు.
 
 నాడు బూందీ.. నేడు లడ్డూ
 పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర తిరుమల ఆలయంలో పల్లవుల కాలం (క్రీ.శ.830) నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. రెండవ దేవరాయలు కాలం నుండి ఈ ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్య వేళలు) ఖరారయ్యాయట. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత  సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహరపడి(క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. దీన్ని గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది.
 
 అప్పటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీ ప్రసాదం విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 1940 తొలిరోజుల్లో కొండ లడ్డు (అప్పట్లో కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది) రేటు ఎనిమిదణాలే. ఆ తర్వాత రెండు, అయిదు, పది, పదిహేను, ప్రస్తుతం ఇరవై ఐదు రూపాయలకు చేరింది. చాలా కాలంపాటు రూ.2 కే విక్రయించేవారు. తర్వాత నాలుగు, ఐదు, పదికి పెరిగింది. ఆ తర్వాత ఏకంగా రూ.25 కుపెరిగింది. కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూకంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు.

మరిన్ని వార్తలు