నూటికి సర్దార్!

2 Aug, 2015 04:43 IST|Sakshi
నూటికి సర్దార్!

జనసామాన్యంలో  ప్రచారంలో ఉన్న ఒక కథ నుంచి పుట్టిన జాతీయం ఇది. మాటలకు మాత్రమే పరిమితమై ఆచరణ శూన్యమైన వారి విషయంలో దీన్ని ఉపయోగిస్తారు. అతను ఉత్త బడాయి మనిషి, అతని మాటలను నమ్మవద్దు సుమా, ఉత్త కోతల రాయుడు, మాటలు కోటలు దాటుతాయి చేతలు గుమ్మాలు దాటవు’... ఈ తరహాలోనే ఉపయోగించే జాతీయం ‘నూటికి సర్దార్’.ఈగలు బాగా ముసురుకుంటున్నాయని ఒకడు తన కత్తిని వాటి మీదికి విసిరాడు. ఏడెనిమిది ఈగలు చచ్చాయి. వాటిని చూసి అతనికి చాలా ధైర్యం వచ్చింది.

మరి కొన్నిసార్లు కత్తి విసిరాడు. మొత్తం లెక్కిస్తే... చనిపోయిన ఈగల సంఖ్య వంద అని తేలింది!‘‘నేను వీరుడిని’’ అనుకున్నాడు. తనను తాను సర్దార్‌గా భావించుకున్నాడు. తన కత్తి మీద ‘నూటికి సర్దార్’ అని రాయించుకుని ‘దెబ్బకు ఏడు’ అని అరుస్తూ ఊరూరూ తిరగడం మొదలుపెట్టాడు. అది చూసి జనాలు రకరకాలుగా ఊహించుకునేవాళ్లు. వందమంది శత్రువులను చంపాడని కొందరు, వంద ఊళ్లకు పెద్ద అని కొందరు... ఇలా ఏవేవో ఊహించుకునేవాళ్లు. అసలు విషయం మాత్రం ఎవరికీ తెలియదు!
 
 గగన కుసుమం
 పువ్వులు ఆకాశంలో పూస్తాయా? అనే ప్రశ్నకు, పెద్దగా ఆలోచించకుండానే అవతలి నుంచి ‘అసాధ్యం’ అనే సమాధానం వినిపిస్తుంది. ‘ఏ రకంగా చూసినా అలా జరగడం అసాధ్యం’ అనే మాటను ఉపయోగించే సందర్భంలో ‘అసాధ్యం’ తీవ్రతను తెలియజేయడానికి ‘గగన కుసుమం’ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ‘స్వర్గలోకం అనేది ఆకాశంలో ఉంది, అక్కడ పారిజాత పుష్పాలు పూస్తాయి కదా, ఆ లెక్కన గగనకుసమం ఉన్నట్లే కదా!’ అని కొందరంటారు. ఒకవేళ ఉందనే అనుకుందాం... మరి దాన్ని చూడడం సాధ్యమా? తేవడం సాధ్యమా?!
 
 ధర్మకన్నం!
 కన్నం వేయడమే తప్పు... దీనిలో మళ్లీ ‘ధర్మకన్నం’ అని కూడా ఉంటుందా? అనే డౌటు రావచ్చు. అన్ని కన్నాలలో ధర్మకన్నాలు వేరయా అంటుంది ఈ జాతీయం. కొందరు ఇతరులను దోచుకొని డబ్బు సంపాదిస్తారు. వారి సంపాదనా దాహానికి అంతు ఉండదు. ఇతరులకు మేలు చేయాలనిగానీ, సహాయ పడాలనిగానీ వారికి అనిపించదు. డబ్బు సంపాదన తప్ప లోకానికి మేలు చేసే విషయాల మీద వారికి ఆసక్తి ఉండదు. ఇలాంటి వారు దోపిడీకి గురైనప్పుడు సానుభూతి రాదు సరికదా ‘తగిన శాస్తి జరిగింది. ఇది ధర్మకన్నం’ అనుకుంటారు లోకులు. రాబిన్‌హుడ్ సిద్ధాంతం పెద్దలను దోచుకుని పేదలకు పంచడం. రాబిన్‌హుడ్  చేసేది దోపిడీ అయినప్పటికీ... అతడికి కూడా అభిమానులు ఉన్నారు. ‘‘రాబిన్ హుడ్ కన్నం వేస్తాడు. కానీ అతడిది ధర్మకన్నం’’ అంటారు వాళ్లు.
 
 అరవ ఏడుపు!
 తమిళనాడుతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఒక పద్ధతి ఉంది. ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే, అలా చనిపోయిన వారి కోసం డబ్బు తీసుకొని ఏడ్వడానికి ప్రత్యేకంగా కొందరుంటారు. చనిపోయిన వ్యక్తి గుణ గణాలను పొగుడుతూ అచ్చం సొంత మనుషుల్లాగే ఏడుస్తారు. ఈ సంప్రదాయం తమిళనాడులో పుట్టిందని ఓ నమ్మకం. అందుకే దీన్ని అరవ ఏడుపు అంటుంటారు. జరిగిన విషాదంతో తమకు సంబంధం లేకపోయినా, అతిగా స్పందించేవాళ్ల విషయంలో ఈ జాతీయాన్ని వాడుతారు.
 

మరిన్ని వార్తలు