వాలు జడల కాగితాన!

25 Jun, 2017 02:24 IST|Sakshi
వాలు జడల కాగితాన!

‘నువ్వు లేక నేను లేను’ చిత్రంలోని ‘ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను...’ అనే పాటకు చిన్న నేపథ్యం ఉంది. ఈ పాట రాసిన తరవాతే నేను ట్యూన్‌ చేశాను. ఈ పాట రాసినప్పుడే చంద్రబోస్‌ ఒక ట్యూన్‌తో వినిపించారు. ఆ ట్యూన్‌ నా మనసుకు పట్టేసింది. దాని నుంచి బయటపడటానికి నాకు మూడు రోజుల సమయం పట్టింది. ఆ తరవాత నెమ్మదిగా నా బాణీలో సంగీతం సమకూర్చాను.

ఒక అమ్మాయిలో ఉండే ఆడతనం, సిగ్గు వంటి భావాలను ఈ పాటలో ఎంతో అందంగా నూటికి నూరు శాతం చూపారు చంద్రబోస్‌. విచిత్రం ఏమిటంటే పాట రాసింది, ట్యూన్‌ చేసింది మగవారే. కొరియోగ్రఫీ, గానం మాత్రం ఆడవాళ్లు. మనసులో ప్రేమ నిండిన అమ్మాయి, తనలోని భావాలను తను ప్రేమించిన అబ్బాయికి చెప్పడానికి సిగ్గు,  ఆడతనం అడ్డు వస్తాయి. అటువంటి సందర్భంలో ఆమె చేష్టలు కూడా వింతగా ఉంటాయి. ఆ చేష్టలు వయసులో ఉన్న ఆడవారికి మాత్రమే తెలుస్తాయి. రచయిత అన్ని పాత్రలనూ తనలోకి ఆవాహన చేసుకుంటేనే పాట పండుతుంది. ఈడొచ్చిన అమ్మాయి మనసులోకి చంద్రబోస్‌ ప్రవేశిస్తేనే ఇంత బాగా రాయగలుగుతారు.

ఒక జంట చూడముచ్చటగా ఉంటే ‘చిలుకా గోరింకల్లా ఉన్నారు’ అంటారు పెద్దవాళ్లు. వారిని రాధాకృష్ణులతో పోలుస్తారు. అదే అంశాన్ని చంద్రబోస్‌ ఈ పాటలో ‘రామచిలుక గోరువంక బొమ్మగీసి తెలుపనా... రాధాకృష్ణుల వంక చేయి చూపి తెలుపనా...’ అని వివరించారు.
మరీముఖ్యంగా ప్రేమ అనేది ఎదలో ఉంటుందని, ఆ ప్రేమ అనే మృదువైన మాటను ఎలా తెలపాలో అర్థం కావడం లేదని అంటుంది ఆ అమ్మాయి.

 ఈ పాటలో ‘వాలు జడల కాగితాన, విరజాజుల అక్షరాలు... ’ అనే అందమైన అక్షరాలను ఇందులో పొందు పరిచారు రచయిత. ‘గాలికైన తెలియకుండ మాట చెవిన వేయనా... ’అనే వాక్యాలు చాలా అందంగా రచించారు. ఏ మాటైనా గాలి ద్వారానే అవతలి వారి చెవిలోకి ప్రవేశిస్తుంది. కాని గాలికి కూడా తెలియకుండా తన ప్రేమ మాటను అబ్బాయి చెవిలోకి వేస్తానంటుంది అమ్మాయి.
నాకు చాలా ఇష్టమైన పాట ఇది.

– సంభాషణ: డా. వైజయంతి

మరిన్ని వార్తలు