పాకిస్తానీ పాత సారా!

14 Dec, 2014 01:42 IST|Sakshi
పాకిస్తానీ పాత సారా!

మన దగ్గర ఓ వస్తువు దొరుకుతోందనుకోండి. దాన్నే వాడుకుంటే సరిపోతుంది కదా! బోలెడు చార్జీలు పెట్టుకుని పక్క దేశానికి పోయి, అక్కడ్నుంచి అదే వస్తువుని కొనుక్కుని తెచ్చుకోవడం ఎందుకు? ‘బడీ ఆపా’ సీరియల్‌ని చూసినప్పుడల్లా జిందగీ చానెల్ వారిని ఈ ప్రశ్నే అడగాలనిపిస్తుంది. ఓ మహిళ... కంటిచూపుతోనే అందరినీ శాసించేస్తుంది. భయపడి భర్త నోరెత్తడు. కూతురు తల్లి జోలికి పోదు. దాంతో ఆమెదే రాజ్యం. అయితే అన్ని సినిమాలు, సీరియళ్లలో మాదిరిగానే కూతురు ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. దానికి తల్లి ఒప్పుకోదు.

తనకు తెలిసినవారి కొడుకుతో పెళ్లి కుదిర్చేస్తుంది. దాంతో గొడవ మొదలు. కూతురు ఏం చేస్తుంది, తల్లిని ఒప్పించి నచ్చినవాడిని పెళ్లాడుతుందా లేదా అన్నది కథ. కఠినాత్మురాలైన భార్యగా, తల్లిగా సవేరా నదీమ్ నటన తప్ప ఇందులో చూడాల్సిందేమీ లేదు. అయినా కూడా ఈ పాకిస్థానీ సీరియల్‌ని తెచ్చుకుని ప్రసారం చేస్తున్నారు జిందగీ చానెల్‌వారు.

అక్కడి హమ్ చానెల్లో 22 ఎపిసోడ్లు ప్రసారమయ్యాక ఆగిపోయిన ఈ సీరియల్‌ని ఎందుకు తెచ్చారో తెలియదు కానీ... ఈ పాత సారా సేవించే ఓపిక మన ప్రేక్షకులకు మాత్రం కచ్చితంగా ఉండదు. నిజానికి విదేశీ సీరియళ్లను ప్రసారం చేసేందుకే జిందగీ చానెల్‌ను పెట్టారు జీ టీవీ వారు. అలాంటప్పుడు కాస్త మంచివి తేవొచ్చుగా!

మరిన్ని వార్తలు