జగన్నాథుడు అందరివాడు

3 Jul, 2016 00:48 IST|Sakshi
జగన్నాథుడు అందరివాడు

జూలై 6 జగన్నాథ రథయాత్ర
పూరీ శ్రీక్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథుడు అందరివాడు. ఎక్కడో అల్లంత దూరాన కొండలపై కాకుండా, భక్తులకు చేరువగా సముద్ర తీరానికి కూతవేటు దూరంలో వెలసిన దేవదేవుడు జగన్నాథుడు. ఆలయానికి రాలేని భక్తులకు కన్నుల పండుగ చేసేందుకు ఏడాదికి ఒకసారి సోదరీ సోదర సమేతంగా రథమెక్కి పూరీ పురవీధుల్లో ఊరేగుతాడు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాలు పూరీ బొడొదండొలో (పెద్దవీధి) ముందుకు సాగుతూ ఉంటే, ఆలయాలే కదలి వస్తున్నాయా అనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఈ రథాల పైభాగం ఆలయ గోపురాల్లానే గోచరిస్తాయి.
 
స్నానపూర్ణిమతో ప్రారంభం

పూరీ శ్రీక్షేత్రంలో నిత్యం వేడుకలు, తరచు పండుగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ ‘బారొ మాసొ తేరొ పొర్బొ’ (పన్నెండు నెలలు... పదమూడు పండుగలు) అనే నానుడి స్థిరపడింది. జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథుడికి స్నానం చేయిస్తారు. దీనినే స్నానపూర్ణిమ అంటారు. స్నానపూర్ణిమ రోజు నుంచే రథయాత్ర వేడుకలకు సన్నాహాలు మొదలవుతాయి. స్నానపూర్ణిమ రోజున గర్భగుడిలోని మూలవిరాట్టులైన దారువిగ్రహాలను బయటకు తెచ్చి, ఆలయం తూర్పువైపు ప్రహారీగోడ వద్ద స్నానం చేయిస్తారు. ఈ స్నానానికి ఆలయంలోని ‘సునా కువా’ (బంగారుబావి) నుంచి తోడితెచ్చిన 108 కుండల నీటిని వినియోగిస్తారు.

ఈ స్నానం తర్వాత జగన్నాథుడు జలుబు, జ్వరంతో బాధపడతాడంటారు. అందుకే రెండు వారాల పాటు చీకటి గదిలో ఉంచేసి, దైతాపతులు పసర్లు, మూలికలతో చికిత్స చేస్తారు. ఈ తతంగం జరిగే రెండు వారాల్లో ఆలయ గర్భగుడిలో మూలవిరాట్టుల దర్శనం లభించదు. మూలవిరాట్టుల పీఠంపై జగన్నాథ, బలభద్ర, సుభద్రల పటచిత్రాన్ని ఉంచి పూజలు చేస్తారు. రెండు వారాల చికిత్స తర్వాత తేరుకున్న జగన్నాథుడు రథారూఢుడై గుండిచా మందిరానికి బయలుదేరుతాడు.
 
నయనానందకరం రథయాత్ర వేడుక
పూరీలో అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర వేడుక నయనానందకరంగా సాగుతుంది. ఆషాఢ శుద్ధి విదియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు రథాలపై తమ పిన్నిగారి ఇల్లయిన గుండిచా మందిరానికి బయలుదేరుతారు. జగన్నాథుడి రథం పేరు ‘నందిఘోష్’ కాగా, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. నందిఘోష్ అన్నిటి కంటే ఎత్తుగా ఉంటుంది. దీని ఎత్తు 44.2 అడుగులు. ‘తాళధ్వజ’ ఎత్తు 43.3 అడుగులు, ‘దర్పదళన్’ ఎత్తు 42.3 అడుగులు. రథయాత్ర రోజున జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. ముందే సిద్ధం చేసిన రథాలను పూరీ రాజు స్వయంగా చీపురుపట్టి శుభ్రపరుస్తారు.

రథాలను శుభ్రపరచడం పూర్తయ్యాక భారీ దారువిగ్రహాలను మోసుకుంటూ రథాలపైకి తరలిస్తారు. విగ్రహాలను రథాలపైకి తరలించే కార్యక్రమాన్ని ‘పొహాండి’ (పాండోజనం) అంటారు. రథాలపైకి చేరిన విగ్రహాలకు పూజారులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. రథాలకు కట్టిన పొడవాటి మోకులను భక్తులు లాగుతారు. భక్తులు రథాలు లాగుతుండగా రథాలపై పూజారులతో పాటే ఉండే ‘డకువా’లు జేగంటలు మోగిస్తూ జగన్నాథుడిపై నిందాస్తుతులతో కీర్తనలు అందుకుంటారు. రథయాత్ర సాగుతున్నంత సేపు పూరీ బొడొదండొ (పెద్దవీధి) లక్షలాది మంది భక్తజనసందోహంతో కిటకిటలాడుతుంది.

దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర మరునాటికి మూడు రథాలూ గుండిచా మందిరానికి చేరుకుంటాయి. గుండిచా మందిరంలో సుభద్రా బలభద్రుల సమేతంగా జగన్నాథుడు ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువు దీరుతాడు. గుండిచా మందిరంలో ఉన్నన్నాళ్లూ జగన్నాథుడు దశావతారాల వేషాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. ఆషాఢ శుద్ధ దశమి రోజున జగన్నాథుడు శ్రీక్షేత్రం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు.

ఈ తిరుగు ప్రయాణాన్ని ‘బాహుడా’ (మారు రథయాత్ర) అంటారు. ఆషాఢ పూర్ణిమ నాటికి శ్రీక్షేత్రానికి చేరుకుంటాడు. ఆ రోజున జగన్నాథుడు స్వర్ణాలంకార వేషంతో (సునా బెసొ) భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడి స్వర్ణాలంకార దర్శనంతో రథయాత్ర వేడుకలు పరిసమాప్తమవుతాయి.
 
ఊరూవాడా రథాల వేడుక
పూరీలోనే కాదు, ఒడిశా రాష్ట్రంలో ఊరూరా రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆలయాల పరిధిలో జరిగే రథయాత్ర వేడుకలు సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. అయితే, ఊళ్లల్లో చిన్నారులు సైతం చిన్న చిన్న రథాలపై జగన్నాథుడిని వీధుల్లో ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటారు. జేగంటలు, తప్పెట్లు మోగిస్తూ తమకు తోచిన రీతిలో పూజలు చేసేస్తూ ఉంటారు. నచ్చిన చిరుతిళ్లను నైవేద్యంగా పెడుతూ ఉంటారు.

ఇతర దేవతలను ఇలా ఇష్టమొచ్చిన రీతిలో పూజించడానికి పిల్లలకు అనుమతి ఉండదు. అయితే, అందరివాడైన జగన్నాథుడి విషయంలో ఎలాంటి ఆంక్షలు, నియమ నిబంధనలు ఉండవు. జగన్నాథుడిని ఎవరైనా పూజించవచ్చు, ఎలాగైనా పూజించవచ్చు. అందుకే ‘సర్వం శ్రీజగన్నాథం’ అనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది.
 
ఛప్పన్న భోగాల నైవేద్యం
జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. అనుదినం స్వామికి ఛప్పన్న (యాభయ్యారు) భోగాలను నివేదిస్తారు. ఈ నైవేద్యాల కోసం పూరీ శ్రీమందిరంలో అనునిత్యం వంటలు సాగుతూనే ఉంటాయి. కట్టెల పొయ్యలపై కుండలలో వంటకాలు వండుతారు. దివ్యధామమైన పూరీలో నివేదించే ప్రసాదాన్ని ‘ఒభొడా’ అంటారు. వడ్డించడాన్ని ఒరియాలో ‘భొడా’ అంటారు. మహాప్రసాదాన్ని వడ్డించరు. అందుకే దీనికి ‘ఒభొడా’ అనే పేరు వచ్చింది. పూరీ ఆలయంలో ఈ నైవేద్యాల తయారీ కోసం 752 కట్టెపొయ్యలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి.

నాలుగు వందల మంది పాకప్రవీణలు అలుపెరగకుండా గరిటెలు తిప్పుతూనే ఉంటారు. పూరీ ఆలయ ప్రాంగణంలోని ఆనంద్‌బజార్‌లో ఈ ప్రసాదాలను కుండల్లో పెట్టి భక్తులకు విక్రయిస్తారు. ఛప్పన్న భోగాలను ఎందుకు నివేదిస్తారనే దానిపై ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణుడు రోజుకు ఎనిమిదిసార్లు తినేవాడట. ఇంద్రుడు రాళ్లవాన కురిపించినప్పుడు గోవులు, యాదవుల రక్షణ కోసం గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుడు ఏడురోజులు భోజనం చేయకుండా ఉండిపోయాడట. ఇంద్రుడికి బుద్ధి చెప్పి గోవర్ధనగిరిని కిందకు దించిన కృష్ణుడికి యాదవులందరూ 56 పదార్థాలను సమర్పించారట. అందుకే కృష్ణుడి రూపమే అయిన జగన్నాథుడికి పూరీలో 56 పదార్థాలను నివేదించడం ఆచారంగా వస్తోందని చెబుతారు.

మరిన్ని వార్తలు