'సాంగ్‌'రే బంగారు రాజా

19 Jun, 2016 00:44 IST|Sakshi
'సాంగ్‌'రే బంగారు రాజా

సంగీత ప్రపంచంలో ‘భారతరత్న’ అందుకున్న తొలి వ్యక్తి కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి. ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. తమిళంలో ‘సేవాసదనం’ (1938) ఆమె తొలిచిత్రం కాగా, హిందీలో ‘మీరాబాయి’ (1947) ఆమెను యావద్దేశానికీ చేరువ చేసిన చిత్రం.
 
పట్నంలో శాలిబండ... పేరైనా గోలకొండ...
చూపించు చూపునిండా పిసల్ పిసల్... బండ...
పట్నంలో శాలిబండ... పేరైనా గోలకొండ...

 
‘చికిలింత చిగురు సంపెంగె గుబురు చినదాని మనసు చినదాని మీద మనసు’ అని రాశారు మల్లాది రామకృష్ణశాస్త్రి. ‘మనసున మల్లెల మాలలూగెనె’ అన్నారు కృష్ణశాస్త్రి. ‘పడుచుదనం రైలు బండి పోతున్నది’ అన్నారు ఆరుద్ర. ప్రాంతాన్నిబట్టి భాష. భాషను బట్టి నుడి వస్తాయి. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కలం తాలూకు సౌరభం తెలియాలంటే దాశరథి రావాల్సి వచ్చింది.

‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’ హైదరాబాదీ ఉర్దూ ప్రభావాన్ని ఆయన చూపించాడు. ‘రిమ్‌జిమ్ రిమ్‌జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్’ అని రాయాలంటే ఆ ప్రాంతంలో పెరిగిన సినారెకు తప్ప వేరెవరికి సాధ్యమైంది.? అన్ని ప్రాంతాల కవులూ తెలుగు పాటనూ తెలుగు సినీ బాటనూ ప్రభావితం చేశారు.

ఈ ప్రయాణంలో ఒక సర్‌ప్రైజ్ ‘పట్నంలో శాలిబండ’. శాలిబండ, పిసల్‌బండ, బోరబండ... ఇవి హైదరాబాద్ వారికే తెలుస్తాయి.  దక్కన్ ప్రాంతానికి చెందిన వేణుగోపాలాచార్యులు ఈ పాట రాసే అవకాశం రావడంతోటే ఆ పేర్లను గమ్మత్తుగా పరిచారు. సంగీతం అందించిన బి.శంకర్ కూడా హైదరాబాదీనే కావడంతో ట్యూన్ బ్రహ్మాండంగా కుదిరింది. ఎల్.ఆర్.ఈశ్వరి గొంతు యథావిధి. ఇలా ఇప్పటికీ చిటికెలు వేయించే పాటల్లో ఒకటిగా నిలిచింది.చిత్రం: అమాయకుడు (1968)
సంగీతం: బి.శంకర్
రచన: వేణుగోపాలాచార్యులు
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

 
ఓ నాన్నా... నీ మనసే వెన్న
అమృతం కన్నా... అది ఎంతో మిన్నా...

 
అమ్మ మీద పాటలకు దిగులు లేదు కాని నాన్న మీద పాటలు తక్కువ. నాన్నంటే అధికారం, దర్పం, పెత్తనం, అజమాయిషీ... అమ్మతో ముడిపడ్డ సెంటిమెంట్, అమ్మ అనగానే వచ్చే ఎమోషన్ నాన్న విషయంలో రాదు. కాని నాన్న ఏం పాపం చేశాడు కనుక? కష్టపడతాడు. మాటలు పడతాడు. సంపాదన కోసం ఆందోళన చెందుతాడు. చివరకు ఎలాగోలా తన కుటుంబాన్ని రెక్కల కింద సాదుకుంటాడు.

అయినప్పటికీ పిల్లల చేతిలో భంగపడ్డ తండ్రులు అప్పుడూ ఉన్నారు ఇప్పుడూ ఉన్నారు. ‘ధర్మదాత’లో ఉండేది అలాంటి తండ్రే. ఇది తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘ఎంగ ఊర్ రాజా’కు రీమేక్. అక్కినేని ఆ పాత్ర పోషించారు. అన్నీ బాగుంటే తండ్రిని పొగిడి కాస్త చెడితే తండ్రిని వదిలిపెట్టి అప్పుడూ తండ్రే ఇప్పుడూ తండ్రే... తేడా వచ్చింది పిల్లల్లో తప్ప తండ్రిలో కాదు.

నాన్నను పొగిడే ఈ పాటను సినారె రాశారు. అంత్యప్రాసలతో పాటను రాయడం ఆయనకు వచ్చు. నాన్న.. వెన్న... మిన్న... పల్లవి కంటే చరణం బాగుంటుంది. ‘ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో పరమాణ్ణం మాకు దాచి ఉంచావు’.... నాన్న కష్టం మీద ఇంకా వందల పాటలు రాయాల్సి ఉంది. వేల భారతాలు రచించాల్సి ఉంది. అసలు సిసలు వెన్నమనిషి నాన్న. ఎన్నదగిన మనిషి నాన్న.చిత్రం: ధర్మదాత (1970)
సంగీతం: టి.చలపతి రావు
రచన: డా.సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

 
మాయదారి సిన్నోడు... నా మనసే లాగేసిండు...
లగ్గమెప్పుడురా మావా అంటే... మాఘమాసం యెల్లేదాక మంచిరోజు లేదన్నాడే...
ఆగేదెట్టాగా... అందాకా ఏగేదెట్టగా...

 
హిట్ పెయిర్ అంటే అక్కినేని, సావిత్రి అనంటారు. ఎన్టీఆర్, జయలలిత అని కూడా అంటారు. హిట్ పెయిర్ అంటే జ్యోతిలక్ష్మి, ఎల్.ఆర్.ఈశ్వరి కూడా. స్క్రీన్ మీద స్ట్రిప్ టీజ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. గళంలో వలువలు వదిలేయాంటే ఎంతో దమ్ము కావాలి. ఈ పని వీళ్లిద్దరూ చేశారు. ఒకరికి మరొకరు భుక్తిగా మిగిలారు.

ఇద్దరు స్త్రీల విజయం ఇది. మనుగడలో మునిగిపోకుండా నిలబడగలిగిన విజయం. ‘మరి లగ్గమెప్పుడ్రా మామా’ అని ఎల్.ఆర్.ఈశ్వరి కవ్విస్తే జ్యోతిలక్షి అందమైన కొప్పు పెట్టుకొని వేదిక మీద చకాలున లంఘిస్తుంది. తప్పెట మోగి జానపదం ఝల్లుమంటుంది. ‘అమ్మ మాట’ సినిమా కోసం గీత రచయిత సి.నారాయణరెడ్డి, సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు కూర్చునప్పుడు ఎంతకీ పాట సెట్ కాలేదట.

లంచ్ కోసం సినారె బయటకెళితే రమేశ్ నాయుడు ఏం చేయాలో తోచక సినారె ప్యాడ్ మీద ఆయన రాసుకున్న రఫ్ నోట్స్‌నే పల్లవి అనుకుని ఈ పాట కట్టారట. సినారె అది విని అబ్బురపడి చరణాలు రాశారు. ‘సింతచెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజుల్లు తాళం యేస్తుంటే’...

చూసేవాడు చెలరేగి ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి లగ్గం చేసుకోవాలి. కాని వీడేమిట్రా బాబూ మొద్దులా ఉన్నాడు బుద్ధావతారంలా వంకలు పెడుతున్నాడు అని కంప్లయింట్ చేసే ఈ పాట మగవాళ్లకు ఆడవాళ్ల దూకుడు తెలియజేసే  హైడోస్ శాంపిల్. వాళ్ల కవ్వింపుకు రిటన్ ఎగ్జాంపుల్. కావాలంటే మల్లమ్మనడగండి... కావమ్మనడగండి... రత్తమ్మనడగండి... అదే మాట చెప్తారు.చిత్రం: అమ్మమాట (1972)
సంగీతం: రమేశ్‌నాయుడు
రచన: సినారె
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

మరిన్ని వార్తలు