'సాంగ్‌'రే బంగారు రాజా

19 Jun, 2016 00:54 IST|Sakshi
'సాంగ్‌'రే బంగారు రాజా

‘సిరివెన్నెల’ సినిమాలో పాటలన్నీ సంగీత ప్రియులను ఓలలాడించేవే. ఇందులో అంధుడైన కథానాయకుడు వేణువు వాయిస్తూ ఉంటాడు. సుప్రసిద్ధ హిందుస్తానీ వేణువాద్య విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా తెరవెనుక వినిపించిన వేణువే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.
 
కురిసింది వానా... నా గుండెలోనా... నీ చూపులే జల్లుగా...
ముసిరే మేఘాలు... కొసరే రాగాలు... కురిసింది వానా... నా గుండెలోనా

 
వాన అనగానే తెలుగులో రెండు పాటలు ఫేమస్. ఒకటి చిటపట చినుకులు పడుతూ ఉంటే. దానిని రాసింది ఆత్రేయ. పాట కట్టింది మహదేవన్. మహామహులు. మంచిదే. కాని ఆపిల్ పండు వీలుగాని చోట సలీసుగా దొరికిన సీతాఫలం కూడా మేజిక్ చేస్తుంది. బుల్లెమ్మ-బుల్లోడు కోసం సత్యం, రాజశ్రీ అలా మేజిక్ చేసినవారే. తెర మీద కూడా సూపర్‌స్టార్స్ ఏమీ కాదు.

చలం, విజయలలిత. కాని పాట నిలబడింది. అమీర్‌పేట్ మీద కొంచెం మబ్బు పట్టినా సీతమ్మధారలో జల్లు కురిసినా రాయల చెరువు మీద కుమ్మరించి పోసినా ఈ పాటే గుర్తుకొస్తుంది. ‘కురిసింది వాన.. నా గుండెలోన... నీ చూపులే జల్లుగా’.... పెద్ద వాన కాదు. అలాగని జల్లు కూడా కాదు. స్థిరంగా నెమ్మదిగా తడవబుద్ధేసే వాన ఎలా ఉంటుందో అలా ఉంటుంది పల్లవి. సత్యం కన్నడ, తెలుగు రంగాలలో స్టార్‌గా ఉన్నాడు. రాజశ్రీ మంచి పాటలు, మాటలు రాయగలిగినా డబ్బింగ్ కింగ్‌గా కొనసాగాడు. చలం మట్టిలో మాణిక్యం. వీళ్లందరూ కలిసి ప్రతివానలో ఈ గొడుగును అందించేసి వెళ్లారు.చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం: సత్యం
రచన: రాజశ్రీ
గానం: బాలు, సుశీల

 
బూచాడమ్మా బూచాడు... బుల్లిపెట్టెలో ఉన్నాడు...
కళ్లకెపుడు కనపడడు... కబురులెన్నో చెబుతాడు...
బూచాడమ్మా బూచాడు... బుల్లిపెట్టెలో ఉన్నాడు...

 
‘మేడ మీద చూడమంట... ఒక లవ్ జంట లవ్ జంట’ అని ముదిరిపోయిన మణిరత్నం పిల్లలు ఇంకా సినిమాల్లోకి రాని రోజులు అవి. పిల్లలు ఎంత తెలివి కలిగి ఉండాలో అంత తెలివితోటి ఎంత అమాయకత్వం నిండి ఉండాలో అంత అమాయకత్వం తోటి తెలుగు సినిమాల్లో పాడారు. ‘పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే’, ‘తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే’...

వాళ్లు ఇలాంటి పాటలే పాడారు. పాత్రౌచిత్యం అని ఒకటుంటుంది. దానిని పాటించేవారు కవులు, రచయితలు. ఆత్రేయ ఈ విషయంలో ఇంకా నిష్ఠను పాటించేవారు. బడిపంతులు సినిమాలో బేబీ శ్రీదేవిగా నేటి శ్రీదేవి ఒక పాట పాడాలంటే టెలిఫోన్‌కు మించిన సాధనం ఏముంది? పిల్లలందరూ అందులో బూచాడున్నాడనే అనుకుంటారు. అందుకే ఆత్రేయ ‘బూచాడమ్మా బూచాడు’ అని చాలా సులభమైన పల్లవితో మొదలెడతారు.

‘గురుగురుమని సొద పెడతాడు... హల్లో అని మొదలెడతాడు’ అని అంటుందా చిన్నారి కంప్లయినింగ్‌గా. కాని పిల్లలకు బోధించాల్సిన మంచిమాట ఆత్రేయ ఆ పొన్నారి నోటి నుంచి చెప్పిస్తాడు. ‘ఢిల్లీ మద్రాస్ హైదరాబాద్ రష్యా లండన్ జపాన్... ఎక్కడికైనా వెళుతుంటాడు.. ఎల్లలు మనసుకు లేవంటాడు... ఒకే తీగపై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు’.... ఈ పాటలు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు. ఏ పిల్లలు ఇప్పుడు వింటున్నారు?చిత్రం: బడి పంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్
రచన: ఆత్రేయ
గానం: పి.సుశీల

 
ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో... / ఎవరికి ఎవరు సొంతము... ఎంత వరకీ బంధము...
 కడుపు చించుకు పుట్టిందొకరు... కాటికి నిన్ను మోసేదొకరు...
 తలకు కొరివి పెట్టేదొకరు... ఆపై నీతో వచ్చేదెవరు..?

 
భవ సాగరం అన్నారు పండితులు. బతుకు సంద్రం అన్నారు పల్లీయులు. జీవన తరంగాలు అన్నది ఒక రచయిత్రి. దేవుని చదరంగం అన్నాడొక కవి. ఎవరు ఎన్ని చెప్పినా అనూహ్యమైన మలుపులను దాచుకుని మెలికలు తిరుగుతూ పోయే జీవన రహదారిని చూసి ప్రతి ఒక్కరూ జాగురూకత చెప్పినవారే.

భద్రం భద్రం... అంటూ హెచ్చరికలు చేసినవారే. అన్నీ సజావుగా ఉంటేనే జీవితం కూడా సజావుగా ఉంటుంది. చదరంగంలో గడి మారితే విధి ఒక ఎత్తు పన్నితే అది అతలాకుతలం అవుతుంది. మళ్లీ గడులన్నీ సర్దుకోవడానికి సమయం పడుతుంది. సహనం కావాల్సి వస్తుంది. యద్దనపూడి సులోచనరాణి రాసిన జీవన తరంగాలు నవల పెద్ద హిట్. దాని ఆధారంగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద హిట్.

కన్నతల్లి చనిపోతే కన్నకొడుకు దొంగలా పారిపోతుండగా ఆమె శవయాత్రలో ఈ పాట వస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొడుకు ఆ శవయాత్రలో కలుస్తాడు. ఆ పాడె తన తల్లిదే అని తెలియక భుజం ఇస్తాడు. ‘తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది’... అని ఆత్రేయ ఆ సన్నివేశాన్ని తన పాటలో వెలిగిస్తాడు. జె.వి.రాఘవులు విద్వత్తు ఉన్న సంగీతకారుడు. ఘంటసాలకు శిష్యుడు. ఆయన కెరీర్‌లో ది బెస్ట్.... మన జీవన తరంగాలలో తారసపడే ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో...చిత్రం: జీవనతరంగాలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
రచన: ఆత్రేయ
గానం: ఘంటసాల

మరిన్ని వార్తలు