మైండ్ మ్యూజిక్

19 Jun, 2016 01:09 IST|Sakshi
మైండ్ మ్యూజిక్

‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి’ అన్నారు పెద్దలు. జోలపాటల సంగీతానికి శిశువులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. చక్కని సంగీతానికి పశువులు పరవశిస్తాయి. అంతేనా..? శ్రావ్యమైన సంగీతానికి పాములు కూడా తలలూపుతాయట! మాటల పుట్టుకకు ముందు నుంచే నాదం ఉంది. ఏ భాషా ఎరుగని పశుపక్ష్యాదుల ధ్వనులే సప్తస్వరాలకు మూలం అంటారు. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో రకరకాల సంప్రదాయాలు ఉన్నా, వాటన్నింటికీ సప్తస్వరాలే ఆధారం.

సంగీతానికి స్పందించని మనుషులు ఉండరు. మనుషులే కాదు, లోకంలో సంగీతానికి స్పందించని జీవులే ఉండవు. కర్ణపేయమైన సంగీతాన్ని ఆలపించినా, ఆలకించినా కలిగే లాభాలు లెక్కలేనన్ని ఉన్నాయి. మచ్చుకు వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.
 
1. జ్ఞాపకశక్తికి దివ్యౌషధం
జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఎన్ని మందులు, మూలికలు అందుబాటులో ఉన్నా, అవన్నీ వీనులవిందు చేసే సంగీతం ముందు బలాదూర్. మతిమరపు జబ్బు బారిన పడిన వయోవృద్ధుల్లో సైతం జ్ఞాపకాల తేనెతుట్టెను కదిలించడం సంగీతానికి మాత్రమే సాధ్యం. కుటుంబ సభ్యుల పేర్లు సైతం గుర్తులేని స్థితికి చేరుకున్న వారు కూడా తమ చిన్ననాటి పాటలకు వెంటనే స్పందిస్తారు. మరుగునపడిన జ్ఞాపకాలను వెలికి తీయడంలో సంగీతానికి మించిన సాధనమేదీ లేదని పలు ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
 
2. ఏకాగ్రతకు సాధనం
మనసు కళ్లెంలేని గుర్రంలాంటిది. అదుపు చేసే సాధనమేదీ లేకపోతే పరుగులు తీస్తూనే ఉంటుంది. కాస్త కూడా కుదురుగా ఉండదు. దేని మీదా ఏకాగ్రత ఉండదు. చదువు సంధ్యలు సజావుగా సాగాలంటే ఏకాగ్రత తప్పదు. కాని ఒకపట్టాన కుదిరి చావదే! అలాంటి పరిస్థితుల్లో జ్ఞాన సముపార్జనపై గురి కుదరాలంటే ‘సంగీత జ్ఞానము’ వినా శరణ్యం లేదు. ఆహ్లాదభరితమైన సంగీతం వింటూ కాసేపు సేదదీరితే మనసు తేలిక పడుతుంది. మనోవీధిలో దౌడుతీసే ఆలోచనల గుర్రాల దూకుడు క్రమంగా నెమ్మదిస్తుంది. వీనులను సోకే స్వర తాళాలపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఏమాత్రం శ్రమ లేకుండానే, చెమట చిందించకుండానే తిరుగులేని ఏకాగ్రత తప్పకుండా కుదురుతుంది.
 
3. సాంత్వనామృతం
కష్టాల్ నష్టాల్ వస్తే రానీ అనేంత దమ్ము ధైర్యం మనుషుల్లో చాలామందికి ఉండదు. చిన్నా చితకా కష్టాలకు కూడా కుంగి కుదేలైపోతూ ఉంటారు. బతుకుపోరులో ఓటమి ఎదురైనప్పుడల్లా జీవితం మీద బెంగటిల్లిపోతుంటారు. మనసుకు తగిలిన గాయాలకు విలవిలలాడి విలపిస్తూ ఉంటారు. అలాంటి వారికి సాంత్వన కలిగించే శక్తి సంగీతానికే ఉంది.
 
4. ఉత్సాహానికి ఊపిరి
నిదానంగా వినిపించేటప్పుడు లాలనగా ఊరట కలిగిస్తుంది స్వరమాధురి. అయితే, వేగం పుంజుకుని ఉరకలేసే స్వరఝరి ఉత్సాహానికి ఊపిరిపోస్తుంది. నీరవ నిశ్శబ్దంలో కఠిన వ్యాయామాలు చేస్తే త్వరగా అలసిసొలసి నీరసిస్తారు. ‘జిమ్మంది’నాదం అంటూ జోరైన సంగీతం వినిపిస్తే ఉత్సాహంగా వ్యాయామం చేసేస్తారు.
 
5. సృజనకు పునాది
ఎవరికైనా అమ్మపాడే జోలపాటలతో సంగీతంతో పరిచయం మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ రకరకాల పాటలు చెవినపడుతూ ఉంటాయి. కొన్ని అప్పటికప్పుడు ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని అదేపనిగా వెంటాడుతూ ఉంటాయి. మరికొన్ని మనోఫలకంలో చెరగని ముద్రవేస్తాయి. సంగీత సాహిత్యాల మేలిమి సమ్మేళనమైన పాటలు శ్రోతల స్మృతిపథంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. స్మృతిపథంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు సృజనకు పునాదిగా నిలుస్తాయి. వీనుల విందు చేసే ఒక పాట చూడచక్కని ఒక చిత్రానికి ప్రేరణనిస్తుంది. ఉరకలేయించే ఒక పాట సరికొత్త కవనకుతూహలానికి ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. అబ్బురపరచే స్వరకల్పనలు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ఆలంబనగా నిలుస్తాయి.
 
6. ఆరోగ్య సిద్ధికి సోపానం
‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము’ అని శంకరశాస్త్రి చేత అనిపించారు వేటూరి. సంగీతంతో అద్వైత సిద్ధి, అమరత్వ లబ్ధి కలుగుతాయో లేదో చెప్పలేం గాని, ఆరోగ్య సిద్ధి మాత్రం తథ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడైతే దీనికి ‘మ్యూజిక్ థెరపీ’ అని పేరు పెట్టారు గాని, అప్పట్లో ముత్తుస్వామి దీక్షితార్ సంగీతానికి గల ఈ మహిమను స్వయంగా నిరూపించారు. ముత్తుస్వామి దీక్షితార్ శిష్యుల్లో ఒకరు కడుపునొప్పితో విలవిలలాడుతూ ఉండేవాడు.

ఎన్ని మందులు వాడినా అతడి కడుపునొప్పి నయం కాలేదు. జ్యోతిషవేత్త కూడా అయిన దీక్షితార్ అతడి జాతకాన్ని పరిశీలించారు. గురుగ్రహ దోషం వల్లనే తన శిష్యుడికి కడుపునొప్పి వచ్చిందని గ్రహించారు. అతడికి ఉపశమనం కలిగించాలనుకున్నారు. అంతే... ‘బృహస్పతే తారాపతే’ అంటూ అఠాణారాగంలో ఆశువుగా కీర్తన అందుకున్నారు. శిష్యుడికి బాధా విముక్తి కలిగించారు. ఆ తర్వాత మిగిలిన గ్రహాలపైనా కీర్తనలు రచించారు.
 
7. అధ్యయన శక్తికి ఆలంబన
సుస్వరభరితమైన సంగీతం అధ్యయన శక్తికి ఆలంబనగా నిలుస్తుంది. వీనుల విందైన స్వరఝరిని కొన్ని నిమిషాలే ఆలకించినా, మెదడుపై ఆ ప్రభావం చాలాకాలమే ఉంటుంది. అద్భుతమైన స్వరకల్పనలు, లయ విన్యాసాలు జిజ్ఞాసను రేకెత్తిస్తాయని, ఫలితంగా అధ్యయన శక్తిని మెరుగుపరుస్తాయని పలు ఆధునిక పరిశోధనలు  చెబుతున్నాయి. తరచుగా సంగీతం వినే విద్యార్థులు త్వరగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారని, ప్రయోగాలపై ఆసక్తి కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంగీతం నేర్చుకునే పిల్లలు మిగిలిన వారి కంటే నిలకడగా, క్రమశిక్షణతో ఉంటారని కూడా అంటున్నారు.
 
8. ప్రగతికి ప్రేరణ
ఎగుడుదిగుడు జీవితంలో ఎదగడానికి తగిన ప్రేరణ ఇచ్చే శక్తి సంగీతానికి మాత్రమే ఉంది. పరాభవాలు, పరాజయాలు ఎదురైనా, నిర్దేశించుకున్న లక్ష్యం వైపు పట్టువీడకుండా ముందుకు సాగడానికి తగిన బలం ఇవ్వడానికి ఒక స్ఫూర్తిమంతమైన పాట చాలు. ఎవరేమన్నను... తోడు రాకున్నను... గమ్యం చేరుకునే దాకా ముందుకు సాగడానికి... బతుకుబాటలో పురోగతి సాధించడానికి...
 
9. శ్రమైక జీవనానికి సౌందర్యం
శ్రమైక జీవనానికి సౌందర్యం ఇచ్చేది సంగీతమే. పనితో పాటే పుట్టిన పాట జానపదుల నోట దిద్దుకున్న సొబగులెన్నెన్నో! కాయకష్టాన్ని మరపించే శక్తి హుషారైన పాటలకు మాత్రమే ఉంది. అందుకే, ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది...’ అన్నాడు సినీకవి. అలసట తెలియనివ్వని జీవామృతం కదా సంగీతం!
 
10. ఉత్పాదకతకు ఉత్ప్రేరకం
సంగీతం ఉత్పాదకతకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. మౌనం మంచిదే కావచ్చు గాని, నిశ్శబ్ద వాతావరణంలో గంటల తరబడి పనిచేస్తూ ఉంటే, ఉత్సాహం అడుగంటుతుంది. ఉత్సాహం అడుగంటినప్పుడు ఉత్పాదకత పడిపోతుంది. అలాగని రణగొణ ధ్వనులు వినిపిస్తుంటే ఏకాగ్రత కుదరదు. కర్ణకఠోరమైన శబ్దకాలుష్యం కూడా ఉత్పాదకతకు చేటు చేస్తుంది. అటు నిశ్శబ్దం, ఇటు రణగొణలు కాకుండా, శ్రావ్యమైన సంగీతం వింటూ పనిచేస్తుంటే ఉత్సాహం ఉరకలేస్తుంది. పని వేగంగా సాగుతుంది. మంచి సంగీతాన్ని వినిపిస్తే పశువులు కూడా ఎక్కువ పాలిస్తాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. మ్యూజిక్ చేసే మ్యాజిక్ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ!

మరిన్ని వార్తలు