'సాంగ్‌'రే బంగారు రాజా

19 Jun, 2016 01:28 IST|Sakshi
'సాంగ్‌'రే బంగారు రాజా

ఆ రోజుల్లో  రైల్వేస్టేషన్‌లలో రైలు ఆగినప్పుడు పెట్టె పెట్టె తిరిగి గ్రాంఫోన్ రికార్డ్‌లు అమ్మేవారు. వాటికి మంచి ఆదరణ ఉండేది. శ్రోతల దగ్గరికే  సంగీతం నడిచివచ్చేదన్నమాట!
 
పాడనా తెనుగు పాట... పాడనా తెనుగు పాట...
పరవశమై మీ ఎదుట మీ పాట... పాడనా తెనుగు పాట...
కోవెల గంటల గణగణలో... గోదావరి తరగల గలగలలో...

 
ఇవాళ్టి పాటల్లో అప్పుడప్పుడు తెలుగు కూడా వాడుతున్నారు. ఒకప్పుడైతే అంతా తెలుగే వాడేవారు. జోరుగా హుషారుగా షికారు పోదమా అనడంలో ఎంతో అందం ఉంది. షాంఘై పిల్లో... స్లీపింగ్ బ్యూటో... థండర్ బుల్లో... వెల్డన్ జిల్లో... అని రాస్తే డోకొస్తుంది తప్ప పాట రాదు. డెబ్బైలలో అందరూ పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులు కావడం మనదేశంలో ఏముందండీ బొంద అనడం ఫ్యాషనైపోయింది. దానిని నిరోధించడానికి హిందీలో మనోజ్ కుమార్‌లాంటివాళ్లు సినిమాలు తీశారు.

తెలుగులో అమెరికా అమ్మాయి, శంకరాభరణం లాంటి సినిమాలు వచ్చాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకమ్మాయి తెలుగింటి కోడలుగా మారి, ఇక్కడి వేష భాషలకు గౌరవం ఇచ్చి, ఇక్కడి తెలుగుకు విలువ ఇచ్చి ఇక్కడి వారి భేషజాన్ని దూరం చేస్తుంది ‘అమెరికా అమ్మాయి’ సినిమాలో. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆలోచనకు జి.కె.వెంకటేశ్ సంగీతం కుదిరింది.

ఇటువంటి సందర్భానికి కృష్ణశాస్త్రి కలం తెలుగు నుడిలో ఈతలు కొట్టి అవలీలగా ఒడ్డుకు చేరుతుంది. ‘ఒక పాట... పాడనా తెనుగు పాట’ అని సుశీల పాడుతుంటే శరీరం రోమాంచితం అవుతుంది. ‘మావుల తోపుల మూపుల పైన మసలే గాలుల గుసగుసలో’ తేలియాడి వచ్చే ఆ తెలుగు పాటకు నమస్కరించిన ఈ సినిమాకు వందనం. ఇద్దరు తల్లుల పెట్టని కోట- తెలుగు రాష్ట్రాల ప్రతినోట- ఒక పాట- పాడనా తెలుగు పాట....చిత్రం: అమెరికా అమ్మాయి (1976)
సంగీతం: జి.కె.వెంకటేశ్
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల

 
చిత్రం భళారే విచిత్రం... చిత్రం అయ్యారే విచిత్రం... / నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం... /పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం
 
సుయోధనుడు ఈర్ష్యాపరుడు. జిత్తులమారి. దుష్టచతుష్టయంలో ఒకడు. ఇది నిజమే కావచ్చు. లేదంటే పాండవుల ప్రచారం కావచ్చు. కాని అతడు ఒక సంపూర్ణమైన పురుషుడు. తన పట్టమహిషికి మానస వల్లభుడు. అతడికీ లతలంటే ఇష్టం ఉండొచ్చు. పుష్పోద్యానవనాలంటే కుతూహలం ఉండొచ్చు. మంచి రసభరితమైన రాత్రి భార్య వేళ్లకు చుట్టిన తమలపాకు చిలకలను మునిపంట కొరకాలనే కోరిక కలిగి ఉండవచ్చు.

అది ఎందుకు చూపించకూడదు అనుకున్నారు ఎన్.టి.రామారావు. అది విని హవ్వ అని నోరు నొక్కుకున్నారు. కవి సి.నారాయణ రెడ్డి మాత్రం భళా అని కలం అందుకున్నారు. పాట సిద్ధమైంది. చిత్రం... అయ్యారే విచిత్రం... భళారే విచిత్రం.... ఎన్.టి.ఆర్, ప్రభల మీద ఆ పాట తెర మీద వస్తూ ఉంటే విమర్శిద్దామనుకున్నవాళ్లు నోళ్లు వెళ్లబట్టారు. అందులోని రాజసంతో నిండిన శృంగారానికి సలాం కొట్టారు. ‘ఎంతటి మహరాజైనా ఎపుడో ఏకాంతంలో...

ఎంతో కొంత తన కాంతను స్మరించడమే సృష్టిలోని చిత్రం’ అనంటే ఆ మాట నిజమే కదా అని చప్పట్లు కొట్టారు. పెండ్యాల ట్యూన్‌ను వింటే ఒరిజినల్ సుయోధనుడు కూడా భేష్ అనాల్సిందే. పాట పాడేటప్పుడు ఎన్టీఆర్ బాలూను పూనడం చూడొచ్చు. ఇక సుశీలమ్మ అంటారా... మాయూరే- కోయిల కూడా ఈర్ష్య పడే గళం.చిత్రం: దాన వీర శూరకర్ణ (1977)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన: సి.నారాయణరెడ్డి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

 
యాతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా... పూరిగుడిసెలోదైనా... గాలి యిసిరికొడితే ఆ దీపముండదు

 
‘ప్రాణం ఖరీదు’ ఎంత అని డెబ్బైలలో నాటక రచయిత సి.ఎస్.రావు ప్రశ్నించారు. దానికి జనం ఇప్పటికీ సమాధానం వింటూనే ఉన్నారు. కల్తీ మద్యం తాగితే ఇంత, గేట్లు లేని క్రాసింగ్ దగ్గర రైలు కింద పడి చచ్చిపోతే ఇంత, వేగం అదుపు చేయకపోవడం వల్ల ప్రైవేటు బస్సు బోల్తా పడితే ఇంత, ఆడపిల్లను అర్ధరాత్రి తోడేళ్ల వలే కమ్మేస్తే ఆ రేటు కొంచెం చూసుకుని మరీ ఇంత, క్వారీలో మనిషి కూలిపోతే

ఇంత, కల్తీ సిమెంటు వంతెన విరిగి పడితే ఇంత... ప్రభుత్వాలు, వ్యవస్థ మనిషి ప్రాణానికి రేటు కడుతూనే ఉన్నాయి. అన్నీ పేదవాళ్ల ప్రాణాలే. నోరు లేని వాళ్ల ప్రాణాలే. అమాయకుల ప్రాణాలే. పెద్ద ధనవంతుడెవరైనా ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్‌లో పోయినట్టుగా వినం. ఎక్స్‌గ్రేషియా తీసుకున్నట్టుగా కూడా వినం. గతిలేని వాళ్లకే ఎక్స్‌గ్రేషియా పడేస్తారు. కాని వీరంతా నిజంగా వేరు వేరా? వీరు ఎక్కువా? వారు తక్కువా? ‘అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీము నెత్తురులు పారే తూము ఒక్కటే’ అని కవి అంటాడు. అది పుట్టుక ఒకటే అయినప్పుడు ఈ హెచ్చుతగ్గులు ఎందుకు.

‘మేడ మిద్దెలో ఉన్నా సెట్టు నీడ తొంగున్నా నిదర ముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే’... వాడూ ఏం పట్టుకెళ్లడు. వీడూ ఏం పట్టుకెళ్లడు. మరి ఎందుకు ఈ పీడన? బీదోడికి దండన? మహాకవి జాలాది రాసిన ఈ పాటకు మరణం లేదు. కనీసం పేదరికం ఉన్నంతకాలమైనా లేదు. నాటకం ఆధారంగా తీసిన ఈ సినిమా చిరంజీవికి పెద్ద గుర్తింపు.చిత్రం: ప్రాణం ఖరీదు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
రచన: జాలాది
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

మరిన్ని వార్తలు