నా కాలికి తల్లుంది...

13 Jul, 2014 00:24 IST|Sakshi

తపాల

 మా ముద్దుల మనవడి పేరు డోను.
 మొన్నొకరోజు వాడి వీపుమీద దెబ్బ తగిలి, మంట పుట్టింది.
 దానికి వాడు, ‘నాకు కారమయ్యింది, నాకు కారమయ్యిం’దని ఆ ఘోరాన్ని మమ్మల్ని చూడమని ఒకటే ఏడుపు.
 తీరా చూస్తే, వాడి వీపుపైన చిన్న గాయమైంది!
 అలాగే మరోరోజు మా ఇంటి ముందుకు ట్రాక్టరు వచ్చి ఆగింది.
 అది చూసి వాడు ‘మన ఇంటికి తాకట్టు వచ్చింది, మన ఇంటికి తాకట్టు వచ్చిం’దని ఒకటే అరుపు.
 ఇదేందిరా బాబూ! మన ఇంటికి తాకట్టు ఎందుకొచ్చిందని తీరా చూస్తే, ఇంటి ముందర ట్రాక్టరు నిలబడి ఉంది.
 ఇంకోరోజు వాడికి ఇంటి బయట ఆడుకొంటుంటే, కాలికి రాయి తగిలి గాయమైంది.
 అంతే, వాడు ‘నాకు తల్లుంది, నాకు తల్లుంది’ అని ఏడుపు.
 ‘తల్లి ఎక్కడ ఉందిరా?’ అంటే, ‘బయట తల్లుంది, బయట తల్లుంది’ అని మళ్లీ ఏడుపు.
 వాళ్లమ్మ బయట ఉందని చూశాం కానీ లేదు.
 మళ్లీ అడిగితే, ‘నా కాలికి తల్లుంది, నా కాలికి తల్లుంది’ అని ఏడుస్తున్నాడు.
 తీరా చూస్తే దెబ్బతగిలింది.
 ఇలా మా డోను ప్రతిరోజూ మమ్మల్ని ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ, మా బాధల్ని మరిపిస్తూ, మా మనసుల్ని మైమరపిస్తూ ఉంటాడు.
 - ఇ.ఆనందయ్య కుప్పం, చిత్తూరు

మరిన్ని వార్తలు