ఒక వర్షపు రాత్రి

15 May, 2016 16:57 IST|Sakshi
ఒక వర్షపు రాత్రి

పట్టుకోండి చూద్దాం
అజాతశత్రువు అనే మాట వినడమేగానీ చూడని వాళ్లు ఆనంద్ కుమార్‌ను  ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అరవై అయిదు సంవత్సరాల ఆనంద్‌కుమార్ బ్రహ్మచారి. ‘‘ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’’ అని అడిగితే- ‘‘బాగా డబ్బు గడించాలనే ఆశతో ఏవోవో వ్యాపారాలు చేశాను. కోట్లు గడించాను. డబ్బు గురించి తప్ప వేరే ఆలోచనేదీ లేకుండా జీవించాను. పెళ్లి చేసుకోవాలనే విషయమే మరిచిపోయాను. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది. కానీ మనశ్శాంతి లేదు’’ అంటాడు సిగెరెట్ వెలిగిస్తూ ఆనంద్ కుమార్.
 
ఆనంద్‌కు తన అక్కయ్య కొడుకు, చెల్లి కొడుకు, తమ్ముడి కొడుకు అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లాలో ఒంటరిగా నివసించే ఆనంద్ ప్రతి వేసవిలో పిల్లల్ని తన ఇంటికి పిలిపించుకొని నెలరోజులు సరదాగా గడుపుతాడు. ఈసారి కూడా అదే జరిగింది. కాకినాడ నుంచి తన అక్కయ్య అన్నపూర్ణ కొడుకు అంకిత్ వచ్చాడు. పెద్దగా ఎవరితోనూ కలిసిపోడు. ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే సన్నిహితులతో మాత్రం బాగా కలిసిపోతాడు.

అనంతపురం నుంచి తమ్ముడు అనంత్ కుమారుడు హరీశ్ వచ్చాడు. హరీశ్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. కబుర్ల పుట్ట! వైజాగ్ నుంచి చెల్లి రజని కుమారుడు తరుణ్ వచ్చాడు. తరుణ్ విపరీతంగా నవలలు చదువుతాడు. తాను చదివిన వాటిని ఇతరులతో చెప్పుకొని తెగ ఆనందిస్తుంటాడు. ‘‘మామయ్యా... ఈ రూమ్‌కు నో స్మోకింగ్ రూమ్ అని బోర్డ్ తగిలించావేమిటి?’’ అని అంకిత్ అడిగాడు.

 ‘‘నా వరకు ఇది పవిత్రమైన రూమ్. ఇక్కడ నేను రోజూ ధ్యానం చేస్తాను. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను. కొన్నిసార్లు మౌనంగా కూర్చుంటాను’’ అన్నాడు ఆనంద్ కుమార్.
ఆరాత్రి... ఉన్నట్టుండి వర్షం మొదలైంది. వాతావరణం చల్లగా ఉంది. ఆ చల్లని రాత్రి అంకిత్, తరుణ్, హరీశ్‌లతో కబుర్లు చెబుతున్నాడు ఆనంద్ కుమార్. ఆ కబుర్ల మధ్యలోనే ఒకసారి ఆనంద్ స్వరం కాస్త గరంగా మారింది.

‘‘జీవితాన్ని ఎంజాయ్ చేయడం ముఖ్యమే కానీ అదే జీవితం కాకూడదు. మీలో ఎవరూ చదువులపై, కెరీర్‌పై శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతుంది. ఇది మంచిది కాదు...’’ ఇలా చాలాసేపే మాట్లాడాడు ఆనంద్ కుమార్. ఆయన మాటలకు కోపం తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ‘‘పెద్దాయన చెప్పింది నిజమే కదా’’ అనుకున్నవాళ్లు ఉన్నారు.
   
మరుసటి రోజు పని మనిషి సుందరం ఆనంద్‌కుమార్ ఇంట్లోకి వచ్చాడు. కాఫీ చేసి ఆయనకు అందించడానికి బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అంతే... ఆనంద్ కుమార్ శవం కనిపించింది. ‘హత్య...’ గట్టిగా అరిచాడు సుందరం. ఇంతకీ ఆనంద్‌కుమార్‌ని ఎవరు హత్య చేశారు? ఆ ముగ్గురా?(అంకిత్, తరుణ్, హరీశ్), ఆ ముగ్గురిలో ఒకరా? దొంగలా? సుందరమా? ఎన్నో జటిలమైన కేసులను చేధించిన నరసింహ ఈ కేసులో కూడా హంతకుడెవరో సులభంగానే కనిపెట్టాడు.
 
క్లూ: టాయిలెట్‌రూమ్, ఆర్ట్‌రూమ్, రెస్ట్‌రూమ్, అండర్ వాటర్ రూమ్, నో స్మోకింగ్ రూమ్‌లో హంతకుడు ఒక్కొక్క వస్తువును వదిలివెళ్లాడు.

జవాబు: హంతకుడి పేరు తరుణ్.
తరుణ్‌కు క్రైమ్ నవలలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఆ కథల్లోనే జీవిస్తుంటాడు. తరుణ్ ముక్కోపి. ఆ రాత్రి తనను ఆనంద్‌కుమార్ మందలించడం నచ్చలేదు. ఆ కోపంతో ఆనంద్‌కుమార్‌ని హత్య చేశాడు. క్రెమ్‌నవలలు చదివిన ప్రభావంతో తన పేరులోని అక్షరాలు వచ్చేలా ఒక్కో గదిలో  ఆనంద్‌కుమార్‌కి సంబంధించిన వస్తువును పెట్టాడు. ఈ విపరీత బుద్దే  అతడిని పట్టించింది.
టాయిలెట్ రూమ్(T), ఆర్ట్ రూమ్ (A), రెస్ట్ రూమ్(R), అండర్ వాటర్ రూమ్(U), నో స్మోకింగ్ రూమ్(N)

మరిన్ని వార్తలు