మాస్టర్‌ సైంటిస్ట్‌

23 Feb, 2019 23:55 IST|Sakshi

అవసరాలే ఆవిష్కరణలకు మూలం అనేది అనాది సత్యం. ఆవిష్కరణలు చేయాలంటే ఏళ్ల తరబడి పరిశోధనల్లో తలలు పండిన శాస్త్రవేత్తలే ప్రతిసారీ దిగిరానక్కర్లేదు. ఒక్కోసారి చిన్న వయసులోనే కొందరు చిచ్చర పిడుగులు వినూత్న ఆవిష్కరణలతో, అద్భుత విజయాలతో అబ్బురపరుస్తుంటారు. చాలా చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలలో ప్రతిభ చూపిన కొందరు తర్వాతి కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక విజయాలు సాధించిన దాఖలాలు ఉన్నాయి.

అలా చిన్న వయసులోనే ప్రతిభ చూపిన వారు కొద్దిమంది మాత్రమే. ఏళ్ల తరబడి అకుంఠిత దీక్షతో పరిశోధనలు సాగించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిన వారే ఎక్కువ మంది. చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో ఇటీవలి కాలంలో ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకున్న వారిలో కొందరు మన దేశంలోనూ ఉన్నారు. వారిలో కొందరి విజయగాథలు ఫిబ్రవరి 28 ‘నేషనల్‌ సైన్స్‌ డే’ సందర్భంగా..

చిన్నారి శస్త్రవైద్యుడు
ఏడేళ్ల వయసులోనే ఆ పసివాడు విజయవంతంగా తొలి శస్త్రచికిత్స చేశాడు. తన కంటే ఏడాది పెద్ద అయిన బాలిక అగ్ని ప్రమాదానికి గురైంది. చర్మం బాగా కాలిపోవడంతో చేతి వేళ్లు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. ఆమె తల్లిదండ్రులు నిరుపేదలు. శస్త్రచికిత్స చేయించే స్తోమత లేనివారు. తోటి బాలిక పరిస్థితిని గమనించిన ఆ బాలుడు చలించిపోయి, శస్త్రచికిత్స చేయడానికి ముందుకొచ్చాడు. దాదాపు గంటసేపు శ్రమించి, చాకచక్యంగా శస్త్రచికిత్స చేసి, అతుక్కుపోయిన వేళ్లను వేరు చేశాడు. ఆ బాలుడి పేరు ఆకృత్‌ జస్వాల్‌. ఆకృత్‌ శస్త్రచికిత్స చేస్తుండగా, అతడి తల్లిదండ్రులు ఆ దృశ్యాలను వీడియో తీశారు. తర్వాత ఆన్‌లైన్‌లో పెట్టారు.

ఆకృత్‌ పేరు ప్రపంచమంతా మార్మోగింది. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆకృత్‌ పేరు రికార్డులకెక్కింది. తొలి శస్త్రచికిత్స చేసిన నాలుగేళ్లకు ఆకృత్‌ తన పదకొండేళ్ల వయసులోనే పంజాబ్‌ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. అక్కడ చదువుకుంటున్న కాలంలోనే ప్రత్యేక ప్రసంగం కోసం లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ నుంచి ఆహ్వానం పొందాడు. శరీర నిర్మాణ శాస్త్రంపైన, శస్త్రచికిత్సలపైన ఆకృత్‌ ఆసక్తిని గమనించిన చండీగఢ్‌ స్థానిక వైద్యులు తాము శస్త్రచికిత్సలు చేసే సమయంలో దగ్గర ఉంటూ పరిశీలించేందుకు అతడిని అనుమతించేవారు. వారు చేసే శస్త్రచికిత్సలను చూస్తూ ఆకృత్‌ తన బాల్యంలోనే శస్త్రచికిత్సల్లోని మెలకువలను వంటబట్టించుకున్నాడు.

వైద్య పరిశోధనల్లోని అధునాతన పరిణామాలపై అతడు చేసిన ప్రసంగానికి లండన్‌ మేధావులు మంత్రముగ్ధులయ్యారు. ఓప్రా విన్‌ఫ్రే షోలో కూడా మాట్లాడాడు. ఓప్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్యాన్సర్‌ను నయం చేసే మార్గం కనుగొనడమే తన లక్ష్యమని చెప్పాడు. జన్యులోపాలను సరిదిద్దేందుకు నోటి ద్వారా తీసుకునే మందులను తయారు చేయడం సాధ్యమవుతుందని, దీనికి తన వద్ద ఒక సిద్ధాంతం ఉందని, ఏదో ఒకనాటికి తాను దీనిని సాధిస్తానని ఆత్మవిశ్వాసం ప్రకటించాడు. ఇదే గనుక నిజమైతే వైద్యరంగంలో ఆకృత్‌ ఒక ఘనమైన మైలురాయిని చేరుకున్నట్లే అవుతుంది. ఆకృత్‌ ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో బయో ఇంజనీరింగ్‌ చదువుకుంటున్నాడు.

తేనెటీగలను కాపాడే రోబో
ప్రకృతిని, పర్యావరణాన్ని బాగా అర్థం చేసుకున్నవారికి తేనెటీగల ప్రాధాన్యం తెలిసినంతగా మామూలు జనాలకు తెలియదు. అందుకే ఇళ్లల్లో ఎక్కడ తేనెపట్టు కనిపించినా, అర్జంటుగా పురుగుమందులు చల్లి వాటిని అక్కడికక్కడే నాశనం చేసేస్తారు. తేనెపట్టులు కనిపించినప్పుడల్లా పురుగు మందులు చల్లి వాటిని నాశనం చేస్తూ పోతే భవిష్యత్తులో మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లగలదని, వాటిని కాపాడటానికి ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా ఆలోచించింది కావ్యా విఘ్నేశ్‌. న్యూఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఇప్పుడామె ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. తేనెటీగలను కాపాడటానికి గత ఏడాది ఆమె రూపొందించిన రోబో అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంది. డెన్మార్క్‌లో జరిగిన బాలల రోబోటిక్స్‌ పోటీలో బహుమతిని సాధించింది. ఆ పోటీలో అరవై దేశాల నుంచి దాదాపు రెండు లక్షల మంది బాల శాస్త్రవేత్తలు పాల్గొనడం విశేషం.

కావ్యా విఘ్నేశ్‌ పూర్తిగా పర్యావరణ అనుకూలంగా, మట్టిలో కలిసిపోయే పదార్థాలతో ఈ రోబోను రూపొందించింది. ఈ రోబో నిజానికి ఒక ద్రోన్‌. ఇందులో త్రీడీ కెమెరా, సాఫ్ట్‌వేర్, భుజాల్లా పనిచేసే నాలుగు రెక్కలు ఉంటాయి. ఇళ్లలో ఉండే తేనెపట్టులను త్రీడీ కెమెరా ఫొటో తీస్తుంది. ఇందులోని సాఫ్ట్‌వేర్‌ తేనెపట్టు కొలతలను కచ్చితంగా అంచనా వేస్తుంది. ఆ అంచనా ప్రకారం ద్రోన్‌లోని రెండు భుజాలు తేనెపట్టును పూర్తిగా కప్పివేసేలా జాగ్రత్తగా చేజిక్కించుకుంటాయి. మూడో భుజానికి ఉన్న బ్లేడ్‌ తేనెపట్టును అది అంటిపెట్టుకుని ఉన్న గోడ నుంచి సురక్షితంగా వేరు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో తేనెపట్టుకు గాని, అందులోని తేనెటీగలకు గాని ఎలాంటి హాని జరగదు.

గోడ నుంచి వేరు చేసిన తేనెపట్టును తేనె సేకరణ కేంద్రాలకు చెందిన వాహనంలోకి చేరుస్తుంది. మనం తినే ఆహారంలో దాదాపు 85 శాతం ఆహార పదార్థాలను అందించే వృక్షజాతులన్నీ తేనెటీగల సహకారంతో జరిగే పరపరాగ సంపర్కం వల్లనే మనుగడ సాగించగలుగుతున్నాయని, తేనెటీగలను చంపేస్తూ పోతే పాడిపంటల మనుగడకు ముప్పు వాటిల్లి కరువు కాటకాలు ఏర్పడగలవని, చివరకు మానవాళి మనుగడకే ప్రమాదం కలుగుతుందని కావ్యా విఘ్నేశ్‌ చెబుతుంది. మానవాళి మనుగడకు ముప్పు నివారించడానికే తనవంతుగా ఈ రోబోకు రూపకల్పన చేశానని ఆమె వివరిస్తుంది.

తక్కువ ఇంధనం.. ఎక్కువ మైలేజీ
ఇప్పటి ప్రపంచాన్ని చూస్తే ఇం‘ధన’మేరా అన్నిటికీ మూలం అనుకోక తప్పదు. ఆర్థిక వ్యవస్థను చాలా వరకు శాసించేది ఇంధనమే. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్‌ యూనివర్సిటీ ఫర్‌ విమెన్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుకుంటున్న ఇరవైమంది యువతులు ఇంధన సమస్యకు తమదైన శైలిలో ఒక పరిష్కారాన్ని ఆవిష్కరించగలిగారు. ప్రపంచంలోనే అత్యధిక మైలేజీ ఇవ్వగల కారును రూపొందించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎలాంటి కార్లయినా వాటి గరిష్ఠ మైలేజీ ఇరవై, పాతిక కిలోమీటర్లకు మించదు. అలాంటిది వీరు రూపొందించిన కారు ఏకంగా మూడువందల కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

అంటే లీటరు పెట్రోలు పోస్తే, ఏకంగా మూడువందల కిలోమీటర్లు ప్రయాణించగలదు. సింగపూర్‌లో రెండేళ్ల కిందట జరిగిన షెల్‌ ఎకో మారథాన్, ఆసియా ప్రదర్శనలో ‘టీమ్‌ పాంథేరా’ పేరుతో బృందంగా వెళ్లిన ఈ యువతులు తాము రూపొందించిన కారును ప్రదర్శించారు. ఈ వాహనానికి వారు గ్రీకుదేవత పేరిట ‘ఐరిస్‌ 2.0’గా నామకరణం చేశారు. ఇది గంటకు 55 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించగలదు. దీనికంటే ముందు ఈ బృందం ప్రయోగాత్మకంగా తయారు చేసిన కారు లీటరు పెట్రోలుతో 177 కిలోమీటర్లు ప్రయాణించగలిగేది. మరింత మెరుగైన మైలేజీ గల వాహనాన్ని రూపొందించాలనే సంకల్పంతో వారు ‘ఐరిస్‌ 2.0’ కారును రూపొందించారు.

దీని తయారీకి వారు ఉక్కు, అల్యూమినియం, కార్బన్‌ ఫైబర్‌ ఉపయోగించారు. ‘ఐరిస్‌ 2.0’ తయారీలో కీలక పాత్ర పోషించిన వారిలో మృణాలీ పాండే, మోనా, కీర్తి, శివానీ రావల్, ఆంచల్‌ సక్సేనా, అదితి ఝా, శ్రుతి శ్రీవాస్తవ, కౌమోది శిరోహి, వంశిక పుందిర్, ప్రకృతి సైనీ, ఓజస్వినీ సరాఫ్, ఆరుషి సింగ్, కోమల్‌ మోర్, ఆరుషి సింగ్, కశికా త్రిపాఠి తదితరులు ఉన్నారు. ఈ బృందంలోని వివిధ విభాగాలకు మనుప్రియ వత్స్, పన్యా రావత్, దివ్యా ధన్‌ఖార్, శ్రేయా బగౌలీ నాయకత్వం వహించారు.

అంధులకు దారిచూపే కళ్లద్దాలు
అంధుల అవస్థలను చూసినప్పుడల్లా వారికి దారి చూపేందుకు ఏదైనా చేయాలనుకున్నాడు ఆ బాలుడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ఆ దిశగా రకరకాల ప్రయోగాలు సాగించేవాడు. పదకొండో తరగతిలో ఉన్నప్పుడు అంధులకు దారి చూపే కళ్లద్దాలను రూపొందించాడతడు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఆ బాలుడి పేరు అనంగ్‌ టాడర్‌. అంధులకు ఉపయోగపడేలా అతడు రూపొందించిన కళ్లద్దాలకు గబ్బిలాలే స్ఫూర్తి. కారుచీకటిలో పరిసరాలను గబ్బిలాలు ఎలా గుర్తిస్తాయో, దాదాపు అదే తీరులో పనిచేసే ‘ఎకో లొకేషన్‌ టెక్నాలజీ’ పరిజ్ఞానంతో అనంగ్‌ ఈ కళ్లద్దాలను రూపొందించాడు.

వీటిని ధరిస్తే, పరిసరాల్లోని రెండు మీటర్ల దూరంలో ఉన్న అవరోధాలను గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. ఈ కళ్లద్దాల్లో ఉన్న సౌలభ్యం వల్ల వీటిని ధరించే అంధులు ఎక్కడికైనా నిరాటంకంగా నడిచి వెళ్లేందుకు వీలవుతుంది. ఈ కళ్లద్దాలు రూపొందించినందుకు అనంగ్‌కు ‘దీనానాథ్‌ పాండే స్మార్ట్‌ ఐడియా ఇన్నోవేషన్‌’ అవార్డు లభించింది. అంతేకాదు, అనంగ్‌ రూపొందించిన ఈ కళ్లద్దాలను నమూనాకు మరింత మెరుగులు దిద్ది, మార్కెట్‌లోకి విడుదల చేసేలా రూపొందించడానికి యూనిసెఫ్‌ సంసిద్ధత ప్రకటించడం విశేషం.

‘నాసా’కెక్కిన ఘనత
అంతరిక్ష పరిశోధనల్లో అమెరికాలోని నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలంతా కొమ్ములు తిరిగిన మేధావులు. తమిళనాడుకు చెందిన పద్దెనిమిదేళ్ల రిఫత్‌ షారుక్‌ సాధించిన ఘనతకు ‘నాసా’ శాస్త్రవేత్తలే ప్రశంసలు కురిపించారు. ఇంతకీ రిఫత్‌ ఏం సాధించాడంటారా? ప్రపంచంలోనే అత్యంత చిన్న ఉపగ్రహానికి రూపకల్పన చేశాడు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయిన అబ్దుల్‌ కలాం గౌరవార్థం దీనికి ‘కలామ్‌శాట్‌’ అని నామకరణం చేశాడు. ఎంత చిన్న ఉపగ్రహమైనా కనీసం ఒక గ్లోబ్‌ సైజులోనైనా ఉండదా అనుకుంటారా? అంత కూడా ఉండదు. కేవలం మునివేళ్ల మధ్య ఈజీగా ఇమిడిపోతుంది. దీని బరువు కేవలం 64 గ్రాములు, ఘన పరిమాణం 3.8 ఘనపు సెంటీమీటర్లు మాత్రమే. ‘నాసా’ రిఫత్‌ ఘనతను గుర్తించింది.

అందుకే వాలప్స్‌ ఐలాండ్‌లోని ‘నాసా’ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి అతడు రూపొందించిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు ముందుకొచ్చింది. ఒక భారతీయ విద్యార్థి రూపొందించిన ఉపగ్రహాన్ని ‘నాసా’ ప్రయోగించడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘స్పేస్‌ కిడ్స్‌ ఇండియా’ సౌజన్యంతో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా రిఫత్‌ దీనికి రూపకల్పన చేశాడు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ద్వారా రీఇన్‌ఫోర్స్‌డ్‌ కార్బన్‌ ఫైబర్‌ పాలిమర్‌ను ఉపయోగించి, అరచేతిలో ఇమిడిపోయే ఈ ఉపగ్రహాన్ని తయారు చేశాడు. రిఫత్‌ రూపొందించిన ‘కలామ్‌శాట్‌’ ఉపగ్రహం ప్రపంచంలోనే అత్యంత తేలికైన, అత్యంత చిన్నదైన ఉపగ్రహంగా రికార్డులకెక్కింది. నానో టెక్నాలజీతో రూపొందించిన ‘కలామ్‌శాట్‌’ అంతరిక్షంలోని రేడియేషన్‌ పరిమాణాన్ని కొలవగలుగుతుంది.

గుండెపోటు గుర్తించే స్కిన్‌ప్యాచ్‌
ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు దారితీసే కారణాల్లో గుండెపోటుదే మొదటి స్థానం. గుండెపోటు లక్షణాలు బయటకు కనిపిస్తే, తగిన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కొంత వీలు ఉంటుంది. కొన్నిసార్లు బయటకు ఎలాంటి లక్షణాలు లేకుండానే, అకస్మాత్తుగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించి, నివారించే మార్గమేదీ ఇంతవరకు అందుబాటులో లేకపోవడం ఆ పన్నెండో తరగతి కుర్రాడిని కుదురుగా ఉండనివ్వలేదు. గుండెపోటును ముందుగానే గుర్తించే అవకాశం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్ని మరణాలనో నివారించవచ్చు కదా అని ఆలోచించాడు. తమిళనాడుకు చెందిన ఆకాశ్‌ మనోజ్‌ ఇదే దిశగా ప్రయోగాలు సాగించి, ముందస్తు సూచనలు లేకుండా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించగల స్కిన్‌ప్యాచ్‌కు రూపకల్పన చేశాడు.

దీనిని అమర్చుకోవడంలో ఎలాంటి నొప్పి, ఇబ్బంది ఉండదు. ఈ ప్యాచ్‌ను మణికట్టుకు లేదా చెవితమ్మ వెనుక వైపు అతికించుకుంటే చాలు. గుండెపోటుకు కారణమయ్యే ‘ఎఫ్‌ఏబీపీ3’ ప్రొటీన్‌ మోతాదుకు మించి ఉన్నట్లయితే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అలాంటప్పుడు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లి వైద్య సహాయం పొందినట్లయితే ప్రాణాలు దక్కించుకోవడానికి వీలు ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగా తన తాత కుటుంబ సభ్యుల కళ్లెదుటే పోయారని, అందుకే గుండెపోటు కారణంగా సంభవించే ఆకస్మిక మరణాలను వీలైనంత మేరకు నివారించడానికి ఏదైనా చేయాలనుకున్నానని చెబుతాడు ఆకాశ్‌ మనోజ్‌.

తాను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుంచే కార్డియాలజీ అధ్యయనం ప్రారంభించానని, ఇందుకోసం బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) లైబ్రరీలో గంటల కొద్దీ గడిపేవాడినని చెబుతాడు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో చదువుకుని, అక్కడ పరిశోధనలు సాగించాలనేదే తన ఆశయమని చెబుతాడు ఆకాశ్‌. అతడు రూపొందించిన ఈ స్కిన్‌ ప్యాచ్‌పై వైద్య నిపుణులు క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల్లో ఆమోదం పొందితే ఇది త్వరలోనే అందుబాటులోకి రాగలదు. దీని ధర దాదాపు రూ.900 వరకు మాత్రమే ఉంటుంది. అంటే, సుగర్‌ టెస్ట్‌ కోసం ఉపయోగించే గ్లూకోమీటర్‌ కంటే చాలా చౌక. 

– పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు