స్నేహం విలువ!

10 Nov, 2019 05:28 IST|Sakshi

‘‘మీకందరికీ శుభవార్త. కొన్ని రోజుల కిందట మన కుందేలును చంపిన ఆ సింహానికి తగిన శాస్తి జరిగింది. ఆవును చంపి తింటున్నప్పుడు ఒక పెద్ద ఎముక నోటిలో గుచ్చుకొంది. తన కాళ్లతో తీయలేక చాలా ఇబ్బంది పడుతోంది. చూస్తుంటే అలాగే చనిపోయేలా ఉంది’’ గట్టిగా అంటూ ఆ చిట్టి కుందేలు సంతోషంతో అటూ ఇటూ పరుగెత్తసాగింది.  
‘‘అయ్యో పాపం’’ అంది వయసు మళ్లిన కుందేలు.
‘‘ఏమిటి జాలి చూపిస్తున్నావు’’.
‘‘ఆపదలో ఉన్న జంతువుకు సహాయం చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది’’
‘‘మార్పు రావడం కాదు నిన్ను మింగుతుంది’’ కోపంగా అంది మరో కుందేలు.
‘‘ఆ సింహాన్ని కాపాడి, ఆ సింహంతో స్నేహం చేసుకొని స్నేహం విలువలను మీకు చూపిస్తాను’’ అంటూ వెళ్ళింది వయసు మళ్లిన కుందేలు.
బాధతో మూలుగుతున్న ఆ సింహంవైపు చూస్తూ ‘‘సింహం మిత్రమా, నిన్ను కాపాడాలంటే నీ నోటిలో దూరి ఎముక తీయాలి. ఆ తరువాత నన్ను చంపి తినవుగా...’’ అంది  కుందేలు.
కన్నీళ్ళతో లేదన్నట్టుగా తల ఆడించింది.
కుందేలు సింహం నోటిలోనికి వెళ్లి ఆ ఎముకను తీసి ఒక్కసారిగా బయటకు దుమికి చెట్టు పైకి ఎక్కింది.
‘‘కుందేలు మిత్రమా ఎందుకు భయపడతావు. నా ప్రాణాన్ని కాపాడిన నీకు నేను ఆపద కలిగించితే మా సింహం జాతికే అవమానం. ఇక మీదట నీవు నా ప్రాణ స్నేహితుడివి నీవేమి చెప్పినా చేస్తాను’’ అంది సింహం.  
‘‘నేను నిన్ను కాపాడటానికి వెళ్తుంటే మా కుందేళ్లు అన్నీ కోపడ్డాయి.’’ 
‘‘ఎందుకు కోప్పడ్డాయి. నేను ఇంత వరకు కుందేలును వేటాడలేదు’’ 
‘‘కుందేలును వేటాడలేదా?’’ అనుమానంగా అడిగింది కుందేలు.
‘‘తెలివైన కుందేలు వల్ల మా తాత బావిలో దూకి చనిపోయాడంట. ‘కుందేళ్లు చాలా తెలివైనవి. వాటిని మాత్రం వేటాడవద్దు. వాటితో స్నేహంగా ఉండు’ అని మా అమ్మ చెప్పింది. మా అమ్మకిచ్చిన మాట ప్రకారం కుందేలును వేటాడటం మానుకున్నాను. కానీ కుందేళ్లు నాతో స్నేçహానికి ముందుకు రాలేదు’’
‘‘మిత్రమా, నీవు అప్పుడప్పుడు మా కుందేళ్ళను చంపి తింటున్నందుకు అందరూ నీపైన కోపంగా ఉన్నారు.’’
‘‘కుందేలు మిత్రమా అప్పుడప్పుడు నాకు ఆ నక్క కుందేలు మాంసం తెచ్చిస్తుంది. ఇంతవరకు నేను ఒక్కటీ వేటాడలేదు. ఒట్టు’’ అంది 
‘‘మా కుందేళ్లతో నీవు చంపినట్లు నక్క చెప్పింది.’’
‘‘ఈ సాయంత్రం వస్తే అడుగుతాను’’ అంది సింహం. 
సాయంత్రం నక్క రాగానే అక్కడున్న జింక మాంసం చూసి లొట్టలేసింది.
‘‘ఏంటి నక్కా, జింక  మాంసం ఏమీ రుచిగా లేదు. నీవు తెచ్చే కుందేలు మాంసం చాలా బాగుంది. దొరికితే తీసుకునిరా. కావాలంటే ఈ మాంసం అంతా నీవు తీసుకో’’ అంది సింహం.
‘‘ఎలాగైనా తీసుకొని వస్తాను’’ అంటూ జింక  మాంసం తినడానికి వెళ్తున్న సమయాన చెట్టు చాటున  ఉండి జరిగిందంతా విన్న  కుందేళ్ల గుంపు ఒక్కసారిగా బయటకు వచ్చి సింహం ముందు నిలబడగానే, నక్కకు తాను ఆడిన నాటకం తెలిసిపోయిందనుకొంది. 
‘‘సింహం గారూ! నన్ను క్షమించండి. కుందేలును నేను చంపినా వీళ్లతో నీవు చంపినట్లు చెప్పాను. అప్పుడే మీరు చంపిన పెద్ద జంతువుల మాంసాన్ని నాకు ఇస్తారన్న ఆశతో అలా చేశాను’’ అంది. సింహం కోపంతో ఆ నక్కను ఒక్క దెబ్బతో చంపింది.
కుందేళ్లు అన్నీ ఆ సింహంతో స్నేహితులుగా కలిసి పోయాయి. సింహంలాంటి స్నేహితుడు అండగా ఉండటం వల్ల కుందేళ్ళకు అడవిలోని జంతువుల వల్ల ఎటువంటి ఆపద కలుగలేదు. సింహం కుందేళ్ళ స్నేహాన్ని చూసిన జంతువులు స్నేహానికి ఎల్లలు లేవన్న నిజాన్ని గ్రహించాయి.

మరిన్ని వార్తలు