కార్పొరేట్ వదాన్యుడు

4 Jun, 2016 23:22 IST|Sakshi
కార్పొరేట్ వదాన్యుడు

మన దిగ్గజాలు
సబ్బుల నుంచి సాఫ్ట్‌వేర్ రంగం వరకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యానికి రారాజు ఆయన. వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయాలు మాత్రమే కాదు, వితరణశీలిగా ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు కూడా ఆయన ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.
 భారత ఐటీ రంగంలో మకుటం లేని మహారాజుగా గుర్తింపు పొందిన
అజీమ్ ప్రేమ్‌జీ దేశప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడు. ఐటీ రంగంలో భారత్ సాధించిన పురోగతిలో ఆయన పాత్ర కీలకం.
 
వేల కోట్ల ఆస్తులు ఉన్నా, ‘విప్రో’ సంస్థల్లో సింహభాగం వాటాలు ఉన్నా, ఇదంతా సమాజం నుంచి తనకు దక్కిందేనని, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే తనకు సంతృప్తి ఉందని అంటారు అజీమ్ ప్రేమ్‌జీ.
 
అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ 1945 జూలై 24న మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా అమల్నేర్ పట్టణంలో పుట్టారు. తండ్రి మహమ్మద్ ప్రేమ్‌జీ వ్యాపారవేత్త. బియ్యం వ్యాపారంలో ఆరితేరిన ఆయన ‘రైస్ కింగ్ ఆఫ్ బర్మా’గా పేరుపొందారు. అజీమ్ పుట్టిన కొద్ది నెలల్లోనే ఆయన ‘వెస్టర్న్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఇదే ‘విప్రో’గా రూపాంతరం చెందింది. తొలినాళ్లలో ఈ కంపెనీ ముంబైలో కర్మాగారాన్ని ఏర్పరచుకుని, శాకాహార నూనెలను, రిఫైన్డ్ నూనెలను ఉత్పత్తి చేసేది.

కొంతకాలం తర్వాత వనస్పతి, డిటర్జెంట్ సోప్‌ల తయారీ కూడా ప్రారంభించింది.  దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వచ్చేయాల్సిందిగా మహమ్మద్ ప్రేమ్‌జీని జిన్నా ఆహ్వానించారు. అయితే, ఆయన సున్నితంగా తోసిపుచ్చి, భారత్‌లోనే ఉండిపోయారు. ఒకవైపు వ్యాపార విస్తరణను కొనసాగిస్తూనే, కొడుకు అజీమ్‌ను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు అజీమ్. అయితే, 1966లో మహమ్మద్ ప్రేమ్‌జీ ఆకస్మికంగా మరణించారు. తండ్రి మరణంతో అజీమ్ చదువును అర్ధంతరంగానే వదిలేసి భారత్‌కు రావాల్సి వచ్చింది.
 
‘విప్రో’ విస్తరణ పర్వం
తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా ‘విప్రో’ పగ్గాలు చేపట్టారు అజీమ్. అప్పటికి ఆయన వయస్సు కేవలం 21 ఏళ్లే. స్వతహాగా తెలివైన అజీమ్ త్వరగానే వ్యాపార మెలకువలను ఆకళింపు చేసుకున్నారు. ‘విప్రో’ విస్తరణను వేగవంతం చేశారు. సబ్బులు, షాంపూలు, బేబీ ప్రోడక్ట్స్, బల్బులు వంటి వాటి ఉత్పత్తి మొదలుపెట్టారు. అనతికాలంలోనే ‘విప్రో’ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నాయి.

ఇలా సాగుతుండగా, 1980లలో దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేయడం మొదలైంది. ఈ తరుణంలోనే ‘విప్రో’ ఐటీ రంగంలోనూ అడుగు పెట్టింది. అమెరికన్ కంపెనీ ‘సెంటినెల్’తో ఒప్పందం కుదుర్చుకుని కంప్యూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో, అజీమ్ ప్రేమ్‌జీ తన దృష్టిని ఎక్కువగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై సారించారు.

ఐటీ రంగంలో ‘విప్రో’ ఘనవిజయాలతో రెండు దశాబ్దాలు గడిచేలోగానే దేశంలోని అపర కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. ఈ ప్రస్థానంలో అజీమ్ ప్రేమ్‌జీని ‘పద్మవిభూషణ్’ సహా లెక్కలేనన్ని పురస్కారాలు వరించాయి. పలు వర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.
 
ఇవ్వడంలోనే సంతృప్తి
వేల కోట్ల ఆస్తులు ఉన్నా, ‘విప్రో’ సంస్థల్లో సింహభాగం వాటాలు ఉన్నా, ఇదంతా సమాజం నుంచి తనకు దక్కిందేనని, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే తనకు సంతృప్తి ఉందని అంటారు అజీమ్ ప్రేమ్‌జీ. ఏదో మాట వరుసకు అలా అనడం కాదు, వివిధ సేవా కార్యక్రమాలకు విరివిగా ఖర్చు చేయడం ద్వారా తాను చేతల మనిషినని నిరూపించుకుంటున్నారు ఆయన. సేవా కార్యక్రమాల కోసం 2001లో ‘అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్’ను స్థాపించారు. కర్ణాటక శాసనసభ చట్టం కింద బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీని కూడా నెలకొల్పారు.

పాశ్చాత్య వ్యాపార దిగ్గజాలు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ మొదలుపెట్టిన ‘ది గివింగ్ ప్లెడ్జ్’పై సంతకం చేసిన తొలి భారతీయుడు అజీమ్ ప్రేమ్‌జీనే కావడం విశేషం. ఇందులో భాగంగానే ఆయన సేవా కార్యక్రమాల కోసం తన వ్యక్తిగత సంపదలో 25 శాతం మొత్తాన్ని ఇచ్చేశారు. 2018 నాటికి మరో 25 శాతం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్పొరేట్ ప్రపంచంలో సంపాదించడం ఒక్కటే లక్ష్యం కాదని, సంపాదించిన సంపాదనను సామాజిక ప్రయోజనాల కోసం ఖర్చుపెట్టడం కూడా అవసరమని తన చర్యలతో చాటి చెబుతున్న అజీమ్ ప్రేమ్‌జీ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తారు.  

మరిన్ని వార్తలు