మన జాతీయాలు

8 Aug, 2015 23:15 IST|Sakshi

పేడకుప్పకు దిష్టి మంత్రమా?
దిష్టి ఎప్పుడు తీస్తారు? ఎందుకు తీస్తారు?
 అందం, ఐశ్వర్యం, విజయం కలిగిన వారికి నరదిష్టి తగులుతుందని ఒక నమ్మకం. అందుకే దిష్టి తీస్తుంటారు. ఒక కొత్త భవనానికో, అందమైన భవనానికో దిష్టిబొమ్మ తగిలిస్తే అదేమీ వింత కాదు. అదే ఒక పాడుబడిన భవంతికి దిష్టిబొమ్మ కడితే అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ పాడుబడిన భవంతికి దిష్టి తీయాల్సిన అవసరం ఏముంటుంది అని!
 
కొందరు అవసరం లేని పనులు చేసి నలుగురూ నవ్వుకునేలా చేస్తారు. ‘‘మావాడు  కార్యశూరుడు. ఎంత పెద్ద కార్యశూర్యుడు అంటే పేడకుప్పకు దిష్టి మంత్రం వేసే రకం’’ అని ఒకరు అంటారు. ‘‘చేయక చేయక ఒక పని చేస్తాడు. తీరా చూస్తే ఆ పని పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లుగా ఉంటుంది’’ అని ఇంకొకరు అంటారు. ఇలా రకరకాల సందర్భాల్లో  ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పేడకుప్పను చూడగానే ముక్కు మూసుకోవా లనుకుంటాంగానీ,  ‘ఆహా ఏమి సౌందర్యం’ అని అనుకోము కదా! మరి పేడకుప్పకు దిష్టి మంత్రం వేస్తే ఎంత నవ్వులాటగా ఉంటుంది! ఈ నేపథ్యంలో నుంచి పుట్టిన జాతీయమే ‘పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లు’ అన్నది!
 
కాక స్నానం
‘‘పనైతే చేస్తాడుగానీ... అది కాక స్నానంలా ఉంటుంది’’ అన్నమాట చాలాసార్లు వింటుంటాం.
 పనులు చేసేవాళ్లు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు చిత్తశుద్ధితో చేస్తారు. సంపూర్ణంగా చేస్తారు. రెండో రకం వారు నామమాత్రంగా చేస్తారు. అందులో లోపాలు, పరిమితులు బోలెడు కనిపిస్తాయి. ఈ రెండో కోవకు చెందిన వారి విషయంలోనే పై జాతీయాన్ని ఉపయోగిస్తారు.
 
కాకి స్నానం ఎలా చేస్తుందో ఎప్పుడైనా చూశారా? తన రెండు రెక్కలనూ నీళ్లలో ఆడించి స్నానం పూర్తి చేశాను అనుకుంటుంది. మనుషుల్లో కూడా కొందరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదో చేశాం అన్న పేరుకి చేసేసి, అద్భుతంగా చేసేశాం అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలాంటివారి పనిని కాకస్నానంతో పోలుస్తారన్నమాట!
 
శనివారపు జడి వాన!
శనివారం ఏ పని చేయాలన్నా వెనకడుగు వేస్తుంటారు. కారణం మంచి పనులు చేయడానికి శనివారాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదన్న నమ్మకం. ఇక వాన గురించి. వాన పడితే చేయాల్సిన పనులు చేయలేము. ఆ జల్లులో, బురదలో పనికి రకరకాల ఆటంకాలు కలుగుతాయి. పని వాయిదా పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇక జడివాన మొదలైతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.

ఇక ఈ రెండూ కలిస్తే?! శనివారం పూట పని చేయడానికే సంకోచిస్తుంటే ఇక వాన కూడా పడిందనుకోండి, ఇక అంతే సంగతులు కదా! అందుకే శనివారపు జడివాన అన్న జాతీయం పుట్టుకొచ్చింది. కొందరు మాట్లాడ్డం మొదలు పెడితే ఆపరు. అలాంటి ‘ఆగని నస’ని శనివారపు జడివాన అంటారు. ‘అయ్యబాబోయ్... అతను ఉపన్యాసం మొదలు పెట్టాడు... ఇక శనివారపు జడివానే!’ అని చమత్కరిస్తారు.
 
ఎలుక చావుకు పిల్లి మూర్ఛ పోయిందట!
అసమంజసమైన, పొంతన లేని, అసంబద్ధమైన విషయాలను విన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరిలో ఒకడికి ఏమైనా అయితే, రెండోవాడు బాధ పడుతున్నట్లు నటించినా, సానుభూతి చూపించినా... జనాలు నమ్మకపోగా ‘వీడి వాలకం చూస్తే ఎలుక చావుకు పిల్లి మూర్ఛపోయినట్లుగా ఉంది’ అంటారు.
 
ఎలుక, పిల్లుల మధ్య జాతివైరం ఉంటుంది. పిల్లి నుంచి ఎలా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవాలా అని ఎలుక ఆలోచిస్తుంది. ఎలుక ప్రాణాలు ఎలా తీయాలా అని పిల్లి ఆలోచిస్తుంది. కాబట్టి వాటి మధ్య స్నేహానికి, బంధుత్వానికి చాన్సే లేదు కదా!  ఈ వాస్తవంలో నుంచి పుట్టిన జాతీయమే ఇది.

మరిన్ని వార్తలు