మన జాతీయాలు

22 Aug, 2015 23:38 IST|Sakshi

నోరు బెల్లంగాళ్లు!
కొందరు తమ పనులు  చక్కబెట్టుకోవడానికి, తాము కోరుకున్నది దక్కించుకోడానికి ఎదుటి వాళ్లతో తీయగా మాట్లాడతారు. ఎప్పుడైతే పని పూర్తవుతుందో ఇక అప్పటి నుంచి కంటికి కూడా కనిపించరు! మాటల్లో ‘ఆకర్షణ’ ఉండి చేతల్లో శూన్యం, అవకాశవాదం  కనిపించేవారి విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
 
ఊరు ఉసిరికాయంత... తగాదా తాటికాయంత!
పరిమాణం, ఆకారం, ఎత్తు... ఇలాంటి కొన్నిటి ఆధారంగా కొన్ని విషయాల్లో ఒక నిర్ణయానికి రాలేం.
 పూర్వం ఒక రాజ్యంలో చిన్న గ్రామం ఉండేదట. సాధారణంగా చిన్న ఊళ్లలో  జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ చిన్న ఊళ్లో అడుగుపెట్టిన ఒక  కొత్తాయనకు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా అరుపులు, కేకలు వినిపించాయట. ‘విషయమేమిటి?’ అని  ఆరా తీస్తే ఎవరో చెప్పారట...

‘ఊరు  ఉసిరికాయంత... తగాదా తాటికాయంత’ అని. అలా ఎందుకు అన్నాడంటే... ఆ ఊళ్లోవాళ్లకు అట్టే పని లేకపోవడంతో, కాలక్షేపం కోసం చిన్న చిన్న  విషయాలపై రోజంతా తగాదా పడేవాళ్లట!
 అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోనికి వచ్చింది. ప్రాధాన్యత లేని అంశాలపై తగాగా పడేవాళ్ల విషయంలో, చూడడానికి ఒక రకంగా చేతల్లో మరోకరంగా కనిపించే సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం మొదలైంది.
 
మిడతంభొట్లు శకునం!
కొందరు పాండిత్యం లేకపోయినా అదృష్టవశాత్తూ పండితులుగా చలామణీ అవుతుంటారు. పూర్వం ఒకాయనను ఎవరో- ‘‘నా గుప్పెట్లో ఏముంది చెప్పండి?’’ అని అడిగాడట.
 ‘‘ ఆ... ఏముంటుంది? మిడత తప్ప’’ అని నోటికి వచ్చింది అన్నాడట.
 
చిత్రమేమిటంటే, ఆ వ్యక్తి గుప్పెట్లో నిజంగానే మిడత ఉంది. దాంతో ఆ మిడతాయన ఎగిరి గంతేసి-
 ‘‘మీ అంతటి గొప్ప జ్యోతిష్యుణ్ని నేను ఇప్పటి వరకు చూడలేదు’’ అన్నాడట. అనడమేమిటి? ఊరంతా టాంటాం చేశాడట. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి ‘మిడతంభొట్లు’ పేరుతో గొప్ప జ్యోతిష్యుడిగా చలామణీ అయ్యాడట. జ్యోతిష్యులకు  పుట్టుమచ్చశాస్త్రం, జాతకచక్రాలు... ఇలా రకరకాల అంశాలపై పట్టు ఉండాలి. అలాంటివేం లేక పోయినా జ్యోతిష్యం చెబు తుంటారు కొందరు. యాదృచ్ఛికంగానో, అదృష్టవశాత్తో వారు చెప్పిన జోస్యం నిజమై కూర్చుంటుంది. ఇలాంటి సంద ర్భాల్లో ఉపయో గించే జాతీయం మిడతంభొట్లు శకునం!
 
ఆహా...అప్పు లేని గంజి!
మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. మొదటి కోవకు చెందిన వాళ్లు... ఉన్నంతలో సర్దుకు పోతారు. ఆడంబరాలకు పోరు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. తమ స్థాయికి మించిన పనులు ఎప్పుడూ చేయరు. రెండో కోవకు చెందినవాళ్లు... ఉన్నంతలో  పొరపాటున కూడా సర్దుకుపోరు. ‘స్థాయి’తో పనిలేకుండా ఆడంబరాలకు  పోయి అష్టకష్టాలు పడుతుంటారు. మరోవైపు చూస్తే, ఆడంబరాలకు పోనివాళ్లు, తమ స్థాయి గురించి స్పృహ ఉన్నవాళ్లు మాత్రం ఎలాంటి టెన్షన్, కష్టాలు లేకుండా హాయిగా ఉంటారు.
 
అప్పు చేసి పంచభక్ష్య పరమాన్నాలు భుజించేవారికి అందులో రుచి తెలియదు. చేసిన అప్పే గుర్తుకు వస్తుంటుంది. తమ స్థోమతకు తగినట్లు గంజి తాగేవాళ్లకు మాత్రం ఎలాంటి ముందస్తు భయాలూ ఉండవు. గంజైనా సరే... ఆ రుచిని హాయిగా ఆస్వాదిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ‘అప్పు లేని గంజి అమృతంతో సమానం’ అనే జాతీయాన్ని వాడుతారు.

మరిన్ని వార్తలు